సమష్టి నృత్య కళ- చెక్కభజన సంగీత నృత్యాత్మకం

(మొదటి భాగం)

డా. జోగధేను స్వరూప కృష్ణ గారు కడప జిల్లా, ప్రొద్దటురు ఎస్. సి . ఎన్. అర్. కళాశాల లో తెలుగు శాఖలో రీడర్. నెట్ బ్రౌజింగ్, రేడియొ ప్రసంగాలు, కవితలు రాయడం, వెబ్ డిజైనింగ్ వీరి వ్యాసంగం. యు.జి.సి ఢిల్లి ఆర్థిక సహకారంతో రాయలసీమ జానపద కళారూపలు- సాంఘిక, చారిత్రక నేపథ్యము అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు. వీరు జానపద కళల గూర్చి విశేషమైన పరిశోధన చేసి కనుమరుగువుతున్న మన జన పథాలలోని కళలను వెలికితీసి ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా సుజనరంజని ద్వారా ప్రపంచవ్యాప్త తెలుగువారికి తమ అసలైన సంపదను గురించి తెలియజెప్పే ఊహతో పతినెలా తమ పరిశోధనాత్మక వ్యాసాలను అందిస్తున్నారు. అమూల్యమైన విశేషాలు ప్రతినెలా మీకోసం...


జానపద నృత్య కళల్లో వ్యష్టి నృత్యాలు వైయక్తిక చైతన్యానికి దోహదం చేస్తే సమష్టి నృత్యాలు సాముహిక చైతన్యానికి కారకాలవుతాయి. సమష్టి నృత్యాల్లో సామూహిక స్పృహను ప్రేరేపితం చేస్తాయి. దీనినే Group consciousness అనవచ్చు. కెనెడియన్ గీస్ ఆకాశంలో ఎగురుతున్నాప్పుడు త్రికోణాకారంలో ఎగురుతూ ముందు భాగంలో వెళుతున్న దాన్ని అనుసరిస్తాయి. ముందు వెళుతున్నది ఆ జట్టుకు నాయకుడు. దాన్ని అనుసరించడమే మిగిలిన వాటి కర్తవ్యం. ఈ స్పృహ సమష్టి జానపద నృత్యాల్లో కనిపిస్తుంది. జట్టు నాయకుడు జట్టును నడిపిస్తాడు. జట్టులో ఎవరైన తప్పు చేస్తే నాయకుడు కోప్పడతాడు. జట్టునుంచి అతన్ని తప్పిస్తాడు. ఈ తప్పుకు శిక్షలు కూడా ఉంటాయి.

సమష్టి నృత్య కళల్లో చెక్కభజన, కోలాటం, డప్పునృత్యం, ఊరుములు, కుంచెల నృత్యం వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ నృత్య రూపాలన్ని జానపదుడి నాట్య కౌశలాన్ని ప్రకటించేవే. నిజజీవితంలోని కార్యక్రమాలలో భాగంగా పుట్టుకొచ్చిన ఈ కళలు జానపదుల జీవితాల్లో భాగమయ్యాయి. అందువల్లనే జానపద కళలను జానపదుల జీవితాలను వేరుగా చూడడం కుదరదు. అలా వేరుగా చూస్తే జానపద సంస్కృతి కాని, కళలు కాని అర్థం కావు. పైగా ఈ నృత్య రూపాల్లొ నాట్యం చేస్తున్నవాడే కాదు చూసే ప్రేక్షకులు కూడా పాల్గొంటారు. ప్రదర్శనలో ప్రదర్శకుడు, ప్రేక్షకుడు అనే తేడా తొలగిపోవడమే జనపద కళారూపాల లక్షణం. ఈ విషయమే కపిల వాత్స్యయన గారి మాటల్లో: “And yet , in spite of the great variations and multiplicity of themes, forms and styles, folk art and folk dance continue to be a distinct category characterized by the overwhelming quality of spontaneity, of participation of every one, without an artificial barrier between the creator and the actor, the performer and the audience” ( kapila Vatsyayan- Introduction- Traditions of Indian Folk Dances)

ప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం , సాముహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం. పండుగ, పర్వ దినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు పడితే అప్పుడు , ఎక్కడపడితే అక్కడ జానపదులు చెక్క భజన ప్రదర్శిస్తుంటారు. భారత రామయణాది కధలను పాటలుగా మలచుకుని ఏ కళాకారులు నృత్యం చేస్తారు. గురువు మధ్యలో ఉంటాడు. అతను జట్టును నడిపిస్తుంటాడు. అతని ఆదేసానుసారంగా జట్టు అడుగులు వేస్తుంది. చెక్కభజనలో నృత్యంలో అడుగులు వేస్తారు. మొత్తం గుంపు ఒకే రకంగా అడుగులు వెయడం, చెక్కలు కొట్టడం మధ్యలో గురువు అరుపులు , కేకలు, ఏ ప్రదర్శనను కనులపండువు చేస్తాయి. గురువు ఒక పాటలోని చరణం పాడితే దానిని జట్టులోని వారందరూ తిరిగి పాడతారు. ఈ పునరుక్తి వలన పాటకు అందం వస్తుంది.

చెక్కభజనను ప్రాచుర్యం లోనికి తెచ్చిన వాడు కంచెర్ల గోపన్న. రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. చెక్కభజన మొదటగా రాయలసీమ కడప జిల్లాలో పుట్టి తెలుగు దేశమంతటా విస్తరించిందని డా. చిగిచెర్ల కృష్ణారెడ్డి గారి అభిప్రాయం. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజనలో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది. సమష్టి నృత్యకళల్లో చెక్కభజన విశేష ప్రాధాన్యన్ని కలిగి ఉంది. చెక్క భజన పుట్టుకకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లేవు. కాని చెక్కభజనను ఒక కళారూపంగా గమనిచి ఇందులోని సాహిత్యాన్ని పరిశీలిస్తే ఈ కళారూపం చాలా ప్రాచీనకాలం నాటినుండే ఉందని చెప్పవచ్చు.

జానపదులలోని భక్తి భావానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెక్కభజన రూపు దిద్దుకుంది. భగవంతుని సామూహికంగా ధ్యానించడమే భజన లక్షణం. చెక్కభజనలో రామ దండు, అంటే రామున్ని సేవించే గుంపు ప్రతిగ్రామంలోనూ తిరుగుతూ భజన చేస్తారు.

చెక్క భజననే పలకల భజన, పలకల కోలన్న, చిరతల భజన అనే పేర్లతో పిలుస్తుంటారు.

మధ్యయుగాల్లో భారత దేశంలో వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావం చెక్క భజనలో చూడవచ్చు. వేదాంతాని సామాన్యులకు అందించాలన్న ఉద్దేశ్యం భక్తి ఉద్యమంలో కనిపిస్తుంది. చెక్కభజనలో కూడ వెందాంత పరమైన భారత, రమయణ, భాగవతాది కధలను పాటల రూపంలో పామరులకు కూడ అర్థమయ్యే భాషలో చెప్పడం , అందువల్లనే చెక్కభజన సర్వ జనాదరణీయమైంది. రాముడి గుడిలేని ఊరు లేనట్లే, అంధ్ర దేశంలో చెక్కభజన గుంపు లేని ఊరు లేదు. ప్రతి గ్రామంలోను చెక్కభజన గురువు ఉన్నాడు. చెక్కభజన గుంపు ఉంది.

చెక్కభజనలో కోలాటంలో లాగా కోపులు కాకుండా అడుగులు ఉంటాయి. ఇందులోని అడుగులు ఎన్నున్నాయో చెప్పడం కష్ఠం. ఎందుకంటే ప్రతి గురువు సంధర్భానికి తగినట్టు కొత్త కొత్త అడుగులు, భంగిమలను సృష్టిస్తుంతాడు.

ప్రతి పాట ఆది అడుగుతో ప్రారంభమవుతుంది. గురువు మధ్య్లో నిలబడి కుడిచేత్తో చెక్కలను పట్టుకొని శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటే గుంపు గోవింద కొడతారు. తరువాత దేవతల పేర్లు, గ్రామదేవతల పేర్లు, గ్రామపెద్దలపేర్లు చెప్పి గొవింద కొట్టిన తరువాత చెక్కలన్నీ గలగలమంటాయి. వెంటనే గురువు పాటనెత్తుకొని " ఆది " అంటాడు. అంటే ఆది అడుగు వేయమని అర్థం. ఆది అడుగు ఈ క్రింది విధంగా ఉంటుంది.

కుడి కాలును ముందుకు చాపి నేలపైమోపి, అదేకాలును ఎడమ కాలు వెనక్కి తెచ్చి వెంటనే ఎడమ కాలును ముందుకు మార్చుకొంటారు. ఆది అడుగు వేసే సమయంలో వలయాకారంగా తిరుగుతారు. రెండు పోట్లు, మూడు మెలిక, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు, డిస్కో వంటివి ఎన్నో అడుగులు చెక్కభజనలో ప్రాచుర్యంలో ఉన్నాయి.

చెక్కభజన చేస్తూ పాడే పాటలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు.

  1. భక్తి పాటలు
  2. పురాణ గేయాలు(భారత-భాగవత-రామాయణ పాటలు)
  3. నీతి పాటలు
  4. వీరగాధలు
  5. జడకోపులు
  6. ప్రభోదాత్మకాలు

వీటిలో రామాయణ, భారత, భాగవత కథల్లోని పాటలు ప్రసిద్దమైనవి. అట్లే నీతి పాటల్లో ప్రత్యేకంగా మట్కా మహమ్మారిని లాంటి వ్యసనాలగురించిన పాటలున్నాయి.

కేవలం పాట, హార్మోనియం, క్యాషియో , డప్పు వంటి వాద్యాలను వాడతారు. కానీ వీటన్నింటికంటే చెక్కల శబ్ధాలు మధురంగా ఉంటాయి. జానపద కళారూపాల్లోని మరో ప్రత్యేకత ఏమిటంటే జానపదుడి అరుపులు. పాట పాడుతున్న గురువు మధ్యలో వేసే అరుపులు, కేకలు, ఉత్సాహాన్ని కలిగించటానికి వేసే ఈలాలు వంటివి వాతావరణాన్ని ఒక సందడిగా చేస్తాయి. ఒక చైతన్య వంతమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది. ఈ వాతావరణంలోని ఊపును చూసి ప్రదర్శకులోతోపాటు ప్రేక్షకులు కూడా చైతన్యవంతులై అడుగులు వేయడం ప్రారంబిస్తారు. ఇదే జానపదకళాల ప్రత్యెకత.

చెక్కభజనకు కడప జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి గ్రామంలోను చెక్కల శబ్ధాలు, గురువుల కేకలు, జట్టులోని కళాకారుల అడుగుల నాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుండి చాలమంది కళాకారులు భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కడప జిల్లలోని గొరిగనూరు వాసి పుల్లయ్య, చెన్నూరు వాసి ఈశ్వర రెడ్డి చెక్కభజనలో ప్రయోగాలు చేస్తున్నారు.

చెక్కభజన కూడ జానపదత్వం కోల్పోయింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు టీ.వి , సినిమాలు చెక్కభజనను దెబ్బ తీస్తున్నాయి. వీటిని తట్టుకొని నిలబడడానికి ఈ కళాకారులు కూడా చెక్కభజనలో ప్రయోగాలూ చేస్తున్నారు. క్యసియో, డ్రంస్ వంటి ఆధునిక సాధనాలు ఉపయోగించడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల సహజమైన జానపదత్వం లోపించి పోయింది. నిజానికి చెక్కభజనలో కేవలం తప్పెట మాత్రమే ఉపయోగిస్తారు. అప్పుడె చెక్కభజనకు అందం వస్తుంది. అంతేకాకుండా సినిమా పాటలు చెక్కభజనలో చోటుచేసుకున్నాయి. దీని వలన సహజత్వం లోపించింది.

మన జానపద కళారూపాలు మన సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు. వాటిని కాపాడుకోకపోతే మనం సంస్కృతీ విధ్వంసకులమవుతాము. తల్లి రోమ్ము గుద్దిన వాళ్ళమవుతాము. కాబట్టి జానపద కళారూపాలు మరుగున పడకుండా కాపాడుకోవలసిని భాద్యత అందరి మీదా ఉంది.

(రెండో భాగంలో భజనపాటలు-సాహిత్యం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)