రచన: ఓరుగంటి వేణు గోపాల కృష్ణ
అపర్ణకి చాలా కోపంగా వుంది శ్రీనివాస్ మీద. ఇదివరకు కోపం వచ్చినా తొందరగా తగ్గి పోతూ వుండేది. కానీ ఈఈ ఈ మధ్య వచ్చిన కోపం తగ్గటంలేదు. frustration బాగా పేరుకు పోయింది. తానేమి తప్పు చేసిందని చీటికీ మాటికీ శ్రీనివాస్ తనమీద విరుచుకు పడుతున్నాడు. ఎన్నాళ్ళని సహించి వూరుకోవాలి? ఎదురు తిరిగానని ఇంకొంచెం మండి పడి పోతున్నాడు. పడి వుంటే అన్నీ బాగానే వుంటాయేమో, దెబ్బలాటలు జరగవేమో కానీ తనెందుకు పడి వుండాలి? తనేమి తప్పు చేసిందని భరించేయాలి? ప్రతీ చిన్న సంభాషణా పేద్ద దెబ్బలాటగా మారి పోతోంది. తనకి బొత్తిగా అన్యాయం జరిగిపోతోంది అనిపిస్తోంది అన్న భావనే భరించ లేకపోతోంది.
రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది…
“ఇవ్వాళ 5గంటలకి ఆనంద్ కి soccer game వుంది” అని అంది శ్రీనివాస్ తో.
“నీకు కుదిరితే నువ్వు తీసుకెళ్ళు. లేకపోతే వాడిని ఆ soccer game మానిపించేయి. కాస్త ఆఫీసు నుంచి తొందరగా వస్తూ వుంటే, అందరు ఆడవాళ్ళ లాగా, ఇలాంటి ఫేమిలీ విషయాలు చూసుకోవచ్చు” వెటకారంగా అన్నాడు శ్రీనివాస్.
ఇంకా “నీకు కుదరదేమో కదా నేను తీసుకెళ్తాను” అని చెబుదామనుకుంటున్న వాక్యం నోటీలోనే వుంది పోయింది ఆ విసుపు సమాధానం రావడం తోటి. “ఆ మాత్రం దానికి అలా వెటకారం ఎందుకు? కుదరదని చెప్పొచ్చు కదా?” కొంచెం గట్టిగానే అంది.
“Weekdays లో ఈ వెధవ సాకర్లూ గీకర్లూ నాకు వీలు పడవని వెయ్యి సార్లు చెప్పాను. మళ్ళీ ఎందుకు అడుగుతావు?”
“మరి నేనూ పనిచేస్తున్నాను కదా, నాకూ వీక్డేస్ కుదరదు కదా. అయినా, అడిగానే అనుకో దానికా విసుకూ చిరాకూ ఎందుకు?”
“నా విసుకూ చిరాకే కనిపిస్తాయి నీకు. నువ్వు ప్రతీమాటకీ ఎదురు సమాధానం చెప్పడం కనిపించదు.”
“ఎదురు సమాధానం ఏమిటి? అలా చిరాకు పడ్డం మానేయమని చెప్పాను అంతే”
“ఒహో! నీకిష్టం లేదని నేను మానేయ్యాలి. అన్నింటికీ నువ్వు restrictions పెడుతూ వుండు. నాకు చిరాకు వేయడం తగ్గుతుంది”. వెటకారంగా అన్నాడు శ్రినివాస్.
“నేనేం restrictions పెట్టటంలేదు. మాటిమాటికీ ఆ కోపాలు భరించలేను. నాకిష్టం లేదు”.
“సో నీకిష్టం లేనివి నేను చెయ్యకూడదు. మానేయాలి. నాకిష్టం వున్నవి మాత్రం నువ్వు చెయ్యవు.”
“నేనేం చెయ్యలేదు?”
“short hair చేసుకోమన్నాను. Office నుంచి లేటుగా ఇంటికి రావద్దన్నాను. ఏదైనా చేశావా?”
“మీరు మాత్రం సిగరెట్టు మానమంటే మానారా?”
“ఆ మానానుగా. క్రితం సారి సిగరెట్టు తాగానని గయ్యాళి లాగ పేద్ద దెబ్బలాట పెట్టుకుని నాలుగు నెలలు పక్క మీదకి రాకుండా నాకు deny చేసావు కదా. నీకు కసి కోపం ఎక్కువ. నేను అరుస్తాను నువ్వు blackmail చేసి నీ పంతం నెగ్గించుకుంటావు. అంతే తేడా.
“నేనేం పంతం నెగ్గించుకోడం కోసం చేయలేదు. ఆ సిగరెట్టు వాసన నాకిష్టం లేదని మీకు ముందరే చెప్పాను. మీరే విన్లేదు”
“నాలుగు నెలలు .. 4 months బ్లాక్ మెయిల్. అందుకనే I hate you” శ్రీనివాస్ గట్టిగా అరిచాడు.
“అరవొద్దు. Don’t shout at me. I will not tolerate it”
“అవును నువ్వేదీ tolerate చెయ్యవు. నేనే అన్నీ tolerate చెయ్యాలి. నువ్వు మాత్రం ఆడదానివి ఏదీ భరించవు.”
“మీ అరుపులూ విసుపులు భరిస్తున్నానుగా. ప్రతీ విషయానికీ కోపం ఎక్కువ. అరుస్తారు, చేతికొచ్చినది విసిరేస్తారు”
“నాకు కోపం వచ్చేట్టుగా ఎదురు సమాధానం చెప్పి రెచ్చకొడతావు. పైగా నేను కోపగించుకుంటాననీ విసిరేస్తాననీ brand చేస్తావు. You have a problem. “.
“No, you have a problem. You have severe anger problem”
“Shut up. “
You shut up. అదే ఏంగెర్ ప్రొబ్లెం అంటే.”
“SHUT UP!” అని గట్టిగా అరిచి చేతులో వున్న లంచ్ బేగ్, బుక్స్ విసిరి కొట్టి, గబ గబా కారు కీస్ తీసుకుని గరాజ్ తలుపు తీసి కోపంగా విసురుగా కార్ స్టార్టు చేసి విపరీతమైన rageతో వెళ్ళి పోయాడు. శ్రీనివాస్. ఇదివరకు శ్రీనివాస్ అలా కార్ స్పీడుగా తీసుకు వెళ్ళీనప్పుడు accident అవుతుందేమోనని తనకి భయం వేసి ఫోను చేసి మెల్లి గావెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేది. కానీ ఇప్పుడు తనుకూడా ఏదయితే అదవుతుందని, కేర్ చెయ్యడం మానేసింది. సున్నితత్వం తగ్గిపోతోంది.
“My God.. ఎందుకిలా అయిపోయిందీ relationship? పెళ్ళయిన కొత్తల్లో ఎంత సరదాగా వుండే వాడు శ్రీనివాస్? What went wrong between us? and when?” చీటికీ మాటికీ దెబ్బలాటలే. ఏ విషయమైనా క్షణంలో అవధులు దాటిపోయి పక్క దారి పట్టి పెద్ద పెద్ద వాదనలకీ భయంకరమైన దెబ్బలాటలకీ దారి తీస్తోంది. ఒక్కోసారి విసుగెత్తి పోయి ఇంట్లోంచి పారిపోదామనిపిస్తోంది. భరించే ఓపిక బొత్తిగా పోయింది. I can’t take it any more.
ఎవరితో చెప్పుకోవాలి తన బాధని? అమ్మా నాన్నా పెద్ద వాళ్ళయి పోయారు. పాపం తను సుఖంగా వుంటే చాలనుకునే వయసులో వాళ్ళని క్షోభ పెట్టి బెంగ పెట్టుకునేలా చేయడానికి మనసొప్పటంలేదు. అక్కకి చెప్పాలంటే ఇన్నాళ్ళూ శ్రీనివాస్ ని ఊరికే పొగిడేసి వాళ్ళందరిముందూ అతని గురించి గొప్పలు చెప్పేసింది. వాళ్ళంతా తన సంసారం బ్రహ్మాండాంగా వుందనుకోవాలనీ, తన భర్తని వాళ్ళంతా గౌరవంగా చూడాలనీ తపనతో వాళ్ళందరి దగ్గరా ఎంతో పొగిడేసింది. ఇప్పుడేమో ఏం ముఖం పెట్టుకుని చెప్పగలదు, శ్రీనివాస్ కీ తనకీ ఇన్ని దెబ్బలాటలు జరుగుతున్నాయని? అన్నయ్యకి చెబుదామంటే వాడి బాధలు వాడికున్నాయి. వాడికి పైగా ఆవేశం ఎక్కువ. కోపంలో ఏదైనా దుడుసుగా చేసినా ఏమి అవుతుందో. ఎవరితో చెప్పుకోగలదు తను? మౌనంగా భరించే స్థితి దాటి పోయింది. bottle up చేసుకుని తను కూడా తన nature కాని రీతిలో ప్రవర్తిస్తోంది.
అలా అనుకుంటూ వుండగా అనుకోకుండా అపర్ణకి ఒక కొత్త వ్యక్తితో పరిచయం జరిగింది.
ప్రతీ శుక్రవారం సాయంత్రం ఆనంద్ ని soccer గేము ప్రాక్టీస్ కి తీసుకు వెళ్ళుతుంది. సాధరణంగా వాడి గేము జరుగుతూ వుంటే అదే సమయంలో తను కూడా అ పార్కు లోనే jogging కి వెళ్ళి వస్తూ వుంటుంది. ఈ hectic schedule లో మళ్ళీ విడిగా తన jogging కి అంటే సమయం దొరకదు కాబట్టి. ఈ రోజు మాత్రం చెయ్యడానికి ఓపిక లేక పోయింది. ఆ రోజే ఈ soccer విషయంగా ఇంట్లో తనకీ శ్రీనివాస్ కీ జరిగిన రాధ్ధాంతం మనసులో ఇంకా పచ్చిగా వుండి, చాలా అసహనంగా రెస్ట్ లెస్ గా వుంది. ఓపిక లేదు కాబట్టి joggingకి బదులు వూరికే నడవసాగింది అన్యమనస్కముగా. ఆ పార్కులోనే ఓ చెట్టుకింద ఒక బెంచి కనిపిస్తే దానిమీద చతికిలబడింది. మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి. అలా శూన్యంలోకి చూస్తూ ఎంతసేపు కూర్చుందో తెలియలేదు.
“ఇవ్వాళ jogging బదులు మెడిటేషన్ చేస్తున్నట్టున్నారే” అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చింది.
ఎవరా అని చూస్తే లలిత గారు. లలిత గారు ఈ మధ్యనే పరిచయం అయ్యారు. ఈ soccer సమయంలో తను ఇలా joggingకి రావడం లలిత గారు వాకింగ్ కి రావడం సమయాలు కలిసి ఇక్కడే పరిచయం జరిగింది. లలితగారికి నలభై అయిదు ఏభయి మధ్యలో వుంటుంది వయసు. ఆవిణ్ణి చూస్తే వెంటనే మర్యాద ఇవ్వాలనిపిస్తుంది ఎవరికైనా. ఒక చక్కటి హుందా తనము, డిగ్నిటీ వుంటాయి ఆవిడలో.
అప్పుడప్పుడు “హలొ” అని పలకరించుకోవడం తప్ప అంతకన్నా ఎక్కువ మాటలు జరగలేదు వాళ్ళిద్దరి మధ్య. ఇలా సడెన్ గా వచ్చి ఆవిడంతటావిడ పలకరించడంతో సమాధానం చెప్పకపోతే మర్యాద కాదని ఎదో అనబోయి నోరు తెరిచింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఒక్కసారి మనసంతా బ్లాంక్ అవుటు అయిపోయింది. నోట్లోంచి ఏమి మాట వచ్చిందో తెలియలేదు. ఇబ్బందిగా గొంతు సవరించుకుంది.
“ఆర్యూ ఆల్ రయిట్?” అని అడిగింది పక్కన కూర్చుంటూ. సాధారణంగా ఆవిడ ఎక్కువ చనువు తీసుకోని వ్యక్తి. ఇలాగ పక్కన కూర్చోవడంతో .. “యా” అని చెప్పి .. “I think so..” అని చేర్చింది.
లలితగారు కొద్ది నిముషాలు మౌనంగా ఆగి అపర్ణ కళ్ళల్లోకి దీర్ఘంగా చూశారు. ఆ తర్వాత నెమ్మదిగా కనులెప్పలార్చి కరుణతో అపర్ణ చెయ్యిని తాకి,
“ఓ.కే, అయితే మరి వెళ్దామా, మీ అబ్బాయి game అయిపోయినట్టుగా వుంది” అంది.
అపర్ణ ఎంతో నిర్లిప్తంగా నిరాసక్తంగా లేచింది. కాసేపు ఇద్దరూ కలిసి నడిచాక లలితగారు అన్నారు “why don’t we get together sometime? మనం ఎప్పుడూ ఇక్కడే ఇలా కలిసి మాటలాడడమే జరుగుతోంది. మేము ఇక్కడికి దగ్గరలోనే వుంటాము, we should really get together sometime.”
“Yeah, we should” అంది. పెద్ద ఎక్కువ ఆశక్తి లేదు ఆ గొంతులో ప్రస్తుతానికి.
“అయితే, ఈ ఆదివారం నేను ఫ్రీగానే వుంటాను. మీరు మా ఇంటికి రండి” అన్నారు లలిత గారు.
అపర్ణకి ఎందుకో ఈవిడ తన మనస్థితి గమనించే తనతో మాట్లాడ్డం కోసం పిలుస్తోందేమో అనిపించింది. తనకలా అందరితోటీ స్వంతవిషయాలు మాట్లాడ్డం ఇష్టం లేదు. ఎవరి పరిధిలో వాళ్ళుండాలంతే. కానీ లలిత గారు చాలా డీసెంట్ వ్యక్తి. చాలా రెస్పెక్టబుల్ గా వుంటారు. ఒక విధమైన వాత్సల్యం , సిన్సియారిటీ వుంటుంది ఆవిడ చూపులోనూ మాటలోను. ఈవిడ ఏదో చీప్ గాసిప్ చెప్పే వ్యక్తిలా అస్సలు వుండదు.
“It’s all right, take your time. ఊరికే ఈ ఆదివారం నేను ఫ్రీగానే వున్నాను. anytime పరవాలేదు. అందుకనే అడిగాను”
“అబ్బే అదికాదండీ, చాలా thanks, let me get back to you” అంది అపర్ణ.
అలాగే ఇద్దరూ soccer field వరకూ వచ్చి అక్కడ విడిపోయారు. అమ్మని చూడగానే ఆనంద్ గబగబా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, “అమ్మా అమ్మా, నువ్వు నా గేము చూశావా? మా టీము గెలిచింది, నేను గోలీగా వున్నాను తెలుసా ఇవ్వాళ? I blocked two goals ..” అని సంతోషంగా చెప్పుకుపోతున్నాడు.
“oh that’s great. Congratulations”, అని ఆనంద్ ని కౌగలించుకుంది. వీడికెంత ఆనందమో తనని చూస్తే. ఉత్సాహానికి, సంతోషానికి మారు పేరు వీడు. He is full of life, I hope he will stay that way forever అని మనసులోనే అనుకుంది.
బాల్, వాటర్ బాటిల్, తీసుకుని, వాళ్ళ టీములో ఎవరో అబ్బాయి వాళ్ళ mom తీసుకొచ్చిన స్నాక్స్, కుకీస్, డ్రింక్ తీసుకుని ఆనంద్ అది తింటూ వుంటే ఇద్దరూ బయలుదేరారు. కారు పార్కింగ్ దగ్గరకి వస్తుంటే లలిత గారు అక్కడే ఎదురుచూస్తున్నట్టుగా కనిపించి, “ఇదిగో నా ఫోన్ నుంబరు” అని ఓ చిన్న కాగితం అపర్ణ చేతిలో పెట్టారు.
అపర్ణ ఆ నంబరున్న కాగితం అందుకుని “Thanks అండీ” అని చెప్పి, తన హేండుబేగ్ లో పెట్టుకుంది. ఆనంద్ కారులో కూర్చుని సీటుబెల్టు పెట్టుకుని సెటిల్ అయ్యాక కారు స్టార్ట్ చేసి ఇంటికి బయల్దేరింది.
మర్నాడు శనివారం. మళ్ళీ వీకెండ్ వచ్చిందంటే బెంగేస్తోందీ మధ్య. ఎదో ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోయాయి, వాదోపవాదాలు, దెబ్బలాటలు. రాత్రి ఆనంద్ పడుకున్నాక ఇంకా దెబ్బలాటలు. నిద్రలేకుండా మనశ్శాంతి లేకుండా అయిపోతోంది జీవితం. ఎవరిది తప్పో ఇంక ఎనలైజ్ చేసే ఓపికకూడా పోయింది. ఇంకా వీక్ డేస్ కొంత నయం. ఇద్దరికీ చలాతక్కువ interaction వుండడంతో దెబ్బలాడే సందర్భాలు అవకాశాలు కాస్త తక్కువ. ఇదివరకైతే చిన్న పిల్లాడని ఆనంద్ ఎదురుగుండా దెబ్బలాడుకునేవారు కాదు. ఇప్పుడు ఆ సెన్సిటివిటీ కూడా పోయింది. బాహాటంగా సిగ్గువిడచి వాడిముందరే దెబ్బలాటలు. చీ, ఇవన్నీ తలచుకుంటే అసహ్యంగా వుంది. ఇలాగ అమ్మా, నాన్నా దెబ్బలాడుకుంటే , చిన్నపిల్లాడి మనస్సు మీద ఎలాంటి ముద్ర వేస్తాయో తెలియదు. వాడు పెద్దయ్యాక ఇవన్నీ వాడిలో ఎలాంటి చెడు ప్రభావాలు కలగచేస్తాయో? తలచుకుంటే భయం వేస్తోంది. ఇక్కడ అమెరికన్ కుటుంబాల్లో ఇలాగ దెబ్బలాటలూ, డైవోర్సులూ, ఎబ్యూస్ లూ కారణంగానే ఎన్నెన్నో విపరీతమైన మానసిక వ్యాధులు, depressions కలిగిన వ్యక్తులు తయారవుతున్నారని చదివింది. నా ఇంటిలో అలాంటివి జరగవు జరగకూడదని అనుకుంది. ఇప్పుడు మాత్రం తలచుకుంటే భయం వేస్తోంది.
ఎదో చెయ్యాలి. తనకోసం కాకపోయినా ఆనంద్ కోసమైనా, వాడి భవిష్యత్తుకోసమైనా, వాడి మానసికారోగ్యంకోసమైనా ఎదో చేయ్యాలి. ఒకవేళ ఇద్దరం కలసి వుండలేకపోతే విడిపోవడమే బెటర్. అస్తమానూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనశ్శాంతిలేని వాతావరణంలో పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యడంకంటే సింగిల్ మదర్ గా వీణ్ణి పెంచడమే నయం.. అలా అనుకుంటూ రోజంతా గడిపింది. మళ్ళీ ఎదో విషయమ్మీద ఎదో ఆర్గ్యుమెంట్ జరిగింది ఆరోజు. ఇంక ఆర్గుమెంట్ కి స్టార్టింగ్ పాయింటేమిటో కూడా అవలోకనంచేసుకునే అవసరం వుండటంలేదీమధ్య.
సాయంత్రం అయ్యింది. శ్రీనివాస్ టీ.వీ. లో ఫుట్ బాల్ గేము చూస్తున్నాడు. ఆనంద్ పైన మేడమీద స్నానం చేస్తున్నాడు. అపర్ణ వంటింట్లో డిష్ వాషర్ లో గిన్నెలు పెడుతోంది. మనసు పరిపరి విధాల పోతోంది. తానొక నిర్ణయానికి వచ్చేసింది. ఇంక విడిపోవడమే సొల్యూషన్. తనకి లాయర్లు కోర్టులూ అంటే అసహ్యం, భయం. somehow, ఇలాంటివి తన జీవితంలో జరగవు జరగకూడదు అనుకుంది. కానీ తప్పేటట్టులేదు. That’s all right. I need to deal with it, ఇన్ని unpleasant సంఘటనలు ఫేస్ చేసింది, one more thing” అనుకుంది. మళ్ళీ అంతలోనే సందిగ్ధం. ఎంత సులభంగా నిర్ణయం తీసేసుకుంది తను, as if it is all my decision అన్నట్టుగా. మరి బాబో.. వాడికీ నాన్న వుండొద్దూ?... నో..
ఎవరైనా శ్రీనివాస్ కి కాస్త నచ్చచెప్పి, బుద్ధిచెప్పి, సరి అయిన దారిలోకి తీసుకెళ్ళ గలిగితే బాగుణ్ణు. తాను ఎంత చెప్పినా ఇంకొంచెం సీరియుస్ అయిపోవడం తప్ప లాభం వుండటంలేదు. ఇద్దరిమధ్య “శ్రీరామా”, అంటే బూతుమాటయిపోతోంది.
తనకి కూడా ఎటూ తేల్చుకోలేని అశక్తత. తను ఎవరితోనైనా మాట్లాడాలి. తనకెవరైనా పెద్దవాళ్ళ మాట సహాయం కావాలి… సడన్ గా గుర్తుకొచ్చింది. లలితగారు.. ఆవిడ చాలా ఆప్యాయంగా పెద్ద తరహాగా మాట్లాడతారు. పోని ఆవిడతోటి చెప్పుకుంటే?.. వెంటనే బేగ్ లోంచి నంబరుతీసి ఫోన్ తీసి కాల్ చేసింది. ఆదివారం మధ్యాహ్నం భోజనాలయ్యాక శ్రీనివాస్ యధాప్రకారంగా సోఫాలో కూర్చుని టీ.వీ చూస్తున్నాడు. ఆనంద్ తనరూంలో ఎదో ఆడుకుంటున్నాడు. అపర్ణ లలిత ఇంటికి బయలుదేరింది.
లలిత గారికి చాలా విషయాలు చెప్పింది. మనసు విప్పి అన్ని సంఘటనలూ ఎలా జరిగేయో చెప్పేసింది. తామిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, అమెరికా రావడం, తన వుద్యోగం, శ్రీనివాస్ ఉద్యోగం, మధ్యలో శ్రీనివాస్ కాంట్రాక్టింగ్ ప్రాజెక్టులు అయిపోవడం, ఆనంద్ పుట్టడం, దెబ్బలాటలు, ఒకరినొకరు నొప్పించడం, ఈటెల్లాంటి మాటలు … అన్నీ చెప్పేసింది. లలిత గారికి ఎందుకు చెప్పిందో ఎలాగ చెప్పిందో తనకే తెలియదు.
లలిత గారు అంత విన్నారు. సమస్యని ఓ కొత్త కోణంలోంచి చూడమని చెప్పారు.
కాలం .. time.. చాలా శక్తివంతమైన వరం. very powerful resource దాన్ని ఉపయోగించుకోవాలి మనం. కాలం, సమయాసమయ విచక్షణ, అసలు మనుషుల మధ్య పరిధి, giving people their own space అనే విషయాలు చెప్పింది. ఆవిడ చెప్పిన తీరు బాగా నచ్చింది అపర్ణకి. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా భరించేయమని చెప్పలేదు. అలాగని స్త్రీ స్వాతంత్ర్యము అని రెచ్చగొట్టలేదు.
మాటకి మాట సమాధానం వెంటనే చెప్పనవసరంలేదు. ఆర్గ్యుమెంట్స్ లోgive yourself and the other person some time to calm down. విషయాన్ని నెమ్మదిగా ఆలోచించి ఎంత రేజ్ వచ్చినా కాస్త సమయం ఆగాక సమాధానం ఇస్తే నీకే ఆశ్చర్యకరమైన విధంగా ఆ సంఘటన మలుపు తిరుగుతుంది. ఉద్రేకానికీ ప్రతిచర్యకీ మధ్య సమయం ఇవ్వడం చాలా అవసరం. వేసిన ప్రతీ బాలు తిప్పి కొట్టవలసిన పని లేదు అని చెప్పింది.
“స్త్రీ సహనం వహించాలీ, భరించి కూర్చోవాలీ అని పాత పాఠాలు చెప్పటంలేదు, అపర్ణా! మనమంతా తెలివైన వాళ్ళమే. ఎటొచ్చీ ఉద్రేకంలో spur of the moment లో బుఱ్ఱ పనిచెయ్యదు. ఆ సమయంలో అన్న మాటలూ, చేసిన పనులు జీవితాలని విడదీసేస్తాయి. కుటుంబాలు ఛిన్నాభిన్నమయిపోతాయి. అమాయకులైన చిన్న పిల్లల భవిష్యత్తు పాడయిపోతుంది. ఆ తరుణంలో నీకు నువ్వు చేయగలిగిన ఒకే ఒక్క సహాయం .. “సమయం” అన్న శక్తివంతమైన shield అడ్డుపెట్టుకోవడం. “ cliché అనుకోకపోతె ఒకటి చెబుతాను . కాలం గాయాలని మానుస్తుంది.
మీ ఉద్రేకాలు తగ్గి, మీ సెన్సెస్ మళ్ళీ పనిచేస్తున్నప్పుడు, నువ్వు చెప్పదలుచుకున్న విషయం, నువ్వు తీసుకోవలసిన నిర్ణయం తీసుకో. ఫలానా నిర్ణయం తీసుకో అని ఒకళ్ళు చెబితే నిర్ణయాలు తీసుకునే తరం కాదు మనది. అలాంటి సంఘం కాదు మనది. చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసుకుని మనకాళ్ళమీద మనం నిలబడుతున్నాము. నిర్ణయం నీది. కానీ సమయం తీసుకో- take your own time!
ఇదివరకు కాలంలో మన అమ్మానాన్నల తరంలో, పెళ్ళిళ్ళు “అవసరాల ప్రాతిపదిక”మీద జరిగేవి. Need basis అన్న మాట. ఆడవాళ్ళకి చదువులూ, ఉద్యోగాలు, ధనసంపాదన, లోక ద్రుష్టి, ప్రపంచ పరిఙానం వుండేవి కాదు. అందుకని భార్య భర్త మీద ఆధారపడేది. మంచో చెడో ఆ need ఆ అధారం వాళ్ళిద్దరినీ కట్టి పడేసేది. అందుకని కుటుంబాలు కలిసి వుండేవి. కాని మా తరంలో మేము సంధి కాలంలో వున్నాము. కానీ అపర్ణా, మీ తరం వాళ్ళు సంధి కాలంలో లేరు. మీరంతా మీ కాళ్ళ మీద చక్కగా నిలబడగలరు. అవసరాలన్నీ బయట తీర్చుకోగలరు. ఆర్ధికంగాకానీ, కార్యవ్యవహారదక్షతలోకానీ, విఙానంలో కాని ఎందులోనూ భార్యాభర్తలిరువురూ సమానమే. మరి అలాంటప్పుడు, వాళ్ళని దగ్గరగా కట్టి పడేసే విషయం ఏమిటి? .. స్నేహం, ఒక కొత్తరకమైన స్నేహం, క్షమించ గలిగే స్నేహం, గౌరవించగలిగే స్నేహం. అదొక్కటే కలిపి వుంచుతుంది expectations manage చెయ్యగలగడం, compomize అయిపోతున్నానని బాధపడిపోకుండా compomize అవడం..కావాలి.. ప్రతీ మనిషికీ మానసిక, శారీరక, ఆర్ధిక, సామాజిక అవసరాలు వుంటాయి. అవన్నీ తీర్చుకోడానికో తోడు కావాలి. అన్నీ వేర్వేరు వ్యక్తుల ద్వారా తీర్చుకోవచ్చును. కానీ అవన్నీ తీర్చేతోడు ఒక్కడే మన జీవితభాగస్వామే అయితే ఇంకా బాగుంటూంది కదూ?
అప్పుడూ అపర్ణ అంది – “పోనీ నేను ఎదురు సమాధానం వెంటనే ఇవ్వకుండా ఆగినా - మరి అసలు ప్రోబ్లెము అతను అని నేను భావిస్తున్నాను. మీరు ఇన్ని విషయాలు చెబుతుంటే నేను వింటాను. నేను మారవలసిందేనా? మరి అతను మారే ప్రశక్తి లేదా? అన్నింటికీ నేనే compromize అవుతున్నాను కదా? తరతరాలుగా ఆడదే సర్దుకుపోవాలా?”
“అసలు కాదు అపర్ణా. అతనికి కూడా ఎవరో చెప్పాలి. లేకపోతే అతనికే తోచాలి. నువ్వు దూరంగా వుండు అతనికే తెలుస్తుంది ఏమి కోల్పోతున్నాడో! నీకు పని చేసిన “కాలమే” అతనికీ గుణపాఠం నేర్పుతుంది. నిన్ను వదలి అతనుంటే అతనికి వున్న ఎన్నో అవసరాలు తీరవు. రోజు గడవడం కష్టమయి కూర్చుంటుంది అతనికి. వొంట్లో బాగుండక పడుకుంటే నోట్లోకి ముద్ద రాదు. శారీరక అవసరాలు అసలే తీరవు. అవి ఆడవాళ్ళకంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ పాళ్ళులోనే కావాలి. పరిస్థితి అంతవరకూ రాకుండా జాగ్రత్త పడే బుధ్ది అతనికి వుండాలి. అయినా ఒకరు చెబితే వినగలిగేంత దురభిమానం లేని వాళ్ళయితే ఇన్ని గొడవలే జరగవు”
ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు లలితగారు అపర్ణకి. ప్రతీ సారీ soocer గేము సమయంలో jogging బదులు పార్కులో లలితగారితో ఎన్నో సంభాషణలు. ఎన్నో విషయాలమీద. అలాంటి వ్యక్తితో పరిచయం అవడం ఒక అదృష్టం, వరం అయ్యింది అపర్ణకి.
ఆ రోజు మొట్టమొదటగా లలిత గారింటికి వెళ్ళినరోజున అపర్ణ – “విడిపోతామండీ మేము. విడాకులు తీసుకుంటాను” అని అన్న అపర్ణ తో లలితగారన్నారు...
“ఒక పని చెయ్యి. నువ్వు ఆనంద్ ని తీసుకుని, శ్రీనివాస్ ని వదలి విడిగా కొంత కాలం వుండు. కొంత సమయాన్నీ దూరాన్నీ మీ మధ్యన వుంచు. విడాకులంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు “విడాకులు తీసుకుంటే జీవితం ఎలావుంటుందో” కాస్త సిమ్యులేట్ చేసి చూడండి ఇద్దరూ. ఆ సమయంలో విడాకుల్లో వుండే సాధక బాధకాలు తెలుస్తాయి. How your lives will be .. అన్నది ప్రాక్టికల్ గా తెలుస్తుంది. ఒక వేళ మీ ఇద్దరికీ ఆ జీవితమే నచ్చిందనుకో అలాగే వుండండి. కాదనుకో .. కలిసిపోవచ్చును. ఒక సారి విడాకులన్న తరవాత అది point of no return .. అందులో మళ్ళీ పరిస్థితి మారి, మీ అభిప్రాయాలు మారి ఉద్రేకాలు తగ్గితే .. మీ ఇద్దరిమధ్య అనురాగం ఇంకా మిగిలి వుంటే తిరిగి కలుసుకునే అవకాశం వుండదు.
కాబట్టి you make use of the power of time. Think in a different dimension…the 4th dimension” అని చెప్పింది. లలిత గారితో మాటలాడిన తరవాత తన ఆలోచనలకి ఒక దిక్సూచి లభించింది. మొట్టమొదటగా ఆఫీసులో ఇంకో వూర్లో అవకాశాలేమయినా వుంటాయేమో చూసింది. లేకపోతే ఉద్యోగం మానేసయినా వెళదామనుకుంది కానీ, అదృష్టవశాత్తూ Bostonలో ఒక assignment వుంది ఒక సంవత్సరమయినా వుండాలి అని అంటె వెంటనే accept చేసి వెళ్ళింది. ఆనంద్ ని తన వెంటే తీసుకు వెళ్ళింది. ఎలాగూ మనస్పర్ధలు వున్నాయి, relationship అంతంతమాత్రంగా వుండడంతో శ్రీనివాస్ కి కూడా ఆ అవకాశాన్ని కోరుకున్నట్టే అనిపించింది.
వెళ్ళిన వెంటనే కొన్ని వారాలు, నెలలూ ఫోనులు చేసుకోకుండానే గడిపారు. కొంత కాలానికి .. మొదట్లో బిల్లుల గురించీ, ఆ పేపర్లు ఎక్కడు పెట్టావు, ఇదెక్కడ పెట్టావు లాంటి ఫోన్ కాల్స్. తరవాత ఆనంద్ గురించి వాడి చదువు గురించి, స్కూల్లో ప్రొగ్రెస్ గురించీ సంభాషణలు జరిగాయి. ఆ తరువాత మీ వాళ్ళు కాల్ చేశారు, ఆ పార్టీకి వెళ్ళితే నీగురించి అడిగారు అంటూ సంభాషణలు జరిగాయి. ఆ తర్వాత ఆఫీసు విషయాలు, తరవాత మెలమెల్లగా స్వంత విషయాలూ మాటలాడుకోసాగారు.
ఇంచు మించు తొమ్మిది నెలల తర్వాత ఓ రోజున శ్రీనివాస్ అడిగాడు .. “నువ్వేలా వున్నావు?” అని. ఆ ప్రశ్నకోసమే ఎదురుచూస్తున్నానా అనిపించింది అపర్ణకి. “బానే వున్నాను.. ఎందుకో ఈ మధ్య కొంచెం నీర్సంగా వుంది అంది”. ఆ రోజు conversation అంతటితో అయిపోయింది. రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ ఫోన్ చేసి, దేని గురించో మాట్లాడుతూ సడెంగా మధ్యలో.. “వైటమిన్స్ తీసుకో. One-A-Day for Women బ్రాండ్ బాగుంటుంది ఆడవాళ్ళకి అన్నాడు. ఎంతో హాయిగా అనిపించింది తను అలాగ చెబుతుంటే. …
లలిత గార్ ని పరిచయం చేసిన అదృష్టదేవతలకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంది అపర్ణ. చాలా రోజులయ్యక లలిత గారిని అపర్ణ అడిగింది.. జీవితం మీద ఇంత చక్కటి balanced views వున్న మీరు … ఇలాగ వంటరిగా …
“మాది కూడా మీలాగానే ప్రేమ వివాహం. నవ్వులు పువ్వులతో మొదలయిన సంసారం, కలహాలు కలతలతో నాశనం అయింది. జీవితంలో మా సంబంధం తప్ప మిగిలిన petty థింగ్స్ అన్నీ ప్రయారిటీ అయి కూర్చున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇగోలు, పంతాలుతో సంసారాన్ని చేతులారా పాడుచేసుకున్నాము. ఎప్పుడయినా ఎదురుమాట చెప్ఫేటప్పుడు కొద్ది క్షణాలో నిముషాలో ఆగి వుంటే ఒక్కళ్ళనొక్కళ్ళు కొన్ని మాటలు అని వుండే వాళ్ళం కాదు. పెదవి దాటితే మాట వెనక్కి తీసుకెళ్ళలేము. బాణాల్లాంటి మాటాలతో ఒక్కళ్ళని ఇంకొక్కళ్ళం తెలిసి కొన్నిసార్లూ, తెలియక కొన్నిసార్లూ తూట్లు పొడిచాము. We didn’t give each other a wiggling space. చివరికి విడాకులు తీసుకున్నాము. అంతా ఓ పీడకలలాగ పెళ్ళయిన రెండు మూడు సంవత్సరాలకే అయిపోయింది.
వెంటనే క్షమాపణలు చెప్పుకోడానికి వేడి పూర్తిగా చల్లారలేదు.. ఉద్రేకమూ, వేడి చల్లారి చూసుకునేసరికి జరగవలిసిన damage జరిగిపోయింది. ఈ లోపలే తనుకూడా పంతంతో వెంటనే ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసేసుకున్నాడు. వరద తగ్గి, కొట్టుకుపోయినవి కొట్టుకుపోయిన తర్వాత తెలుసుకున్నాను.. నా గుండె కూడా ఆ వరదలో కొట్టుకు పోయిందని. తనని నేనింకా ప్రేమిస్తున్నానని ..”
కన్నుల్లో నిండిన నీరుని తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు లలిత గారు. .. గద్గదమయిన గొంతుని సవరించుకోలేదు .. "point of no return .. కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే" …. ఆ తరవాత పూర్తిగా గొంతు పూడుకుపోయింది.

































