"డియర్ స్టూడెంట్స్! వైద్యవృత్తిని మీ కెరీర్‌గా ఎంచుకుని ఎం.బి.బి.స్లో చేరిన మీ అందరికీ నా శుభాభినందనలు.ఇదే మన అనాటమీ ల్యాబ్.దీన్ని "డిస్సెక్టన్ ఆల్" అని కూడా అంటారు.అనాటమీ అంటే శరీర నిర్మాణశాస్త్రం.ఈ సృష్టిలోనే అత్యంత సంక్లిష్టమైనది మానవ నిర్మాణం" చెప్పుకుపోతున్నారు అనాటమీ ప్రొఫెసర్ రామనాథం గారు. అది ఉస్మానియా మెడికల్ కళాశాల. ఆ కళాశాలలో ఆ సంవత్సరం ఎం.బి.బి.స్లో చేరిన విధ్యార్థులకి అనాటమీ ల్యాబ్ చూపిస్తూ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు ప్రొఫెసర్. అక్కడ కొద్దిగా ఎత్తుగా ఉన్న బల్లల మీద కొన్ని శవాలు ఉంచబడ్డాయి. విద్యార్థులలో కూర్చున్న రాజుకి ప్రొఫెసర్ చెప్తున్నదేమీ వినిపించట్లేదు. తను ఇంకో ఐదేళ్ళలో డాక్టరై అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు.తనిప్పుడు డాక్టర్ రాజు ఎం.బి.బి.స్ కానీ తనని డాక్టర్‌గా చూడటానికి అమ్మ ఇప్పుడు జీవించిలేదు. రాకు కళ్ళు చెమ్మగిల్లాయి. అతని మనసు అతని ఆలోచలల్తో పాటు వెనక్కి తీసుకెళ్ళింది.
పుట్టగానే తండ్రిని పోగొట్టుకున్న శనిగ్రహం అంటూ నానమ్మ, తాతయ్యలు అమ్మని, నన్ను వాళ్ళ ఇంటికి రానివ్వలేదు. తమ కొడుకుతో పాటే ఈ బంధం కూడా తెగిపోయిందని నీళ్ళొదిలేశారు.కానీ అమ్మ మాత్రం ధైర్యంగా నిలబడి ఇళ్ళలో పనులు చేస్తూ తనని పెంచి చదివించసాగింది.తను పై తరగతులకు వెళ్తున్న కొద్దీ ఫీజులు పెరగటంతో పాటు సరైన పోషణ లేక అమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది.అలాంటి పరిషితులలో తనని చదివించటం అమ్మకి తలకి మించిన భారమే అయ్యింది.ఇక చేసేదిలేక తనని స్కూలు మాంపించవలసి వస్తుందని అమ్మ బాధ పడుతున్న తరుణంలో తమ ఇంటికి రంగారావు మామయ్య వచ్చాడు. రంగారావు మామయ్య అమ్మకి దూరపు చుట్టం.పరిస్థితి తెలుసుకుని తనని వెంటనే ఒక చోటకి తీసుకువెళ్ళాడు.ఏదో అప్లికేషన్ నింపి ఇంటికి తీసుకువచ్చాడు.అది దయానిధి ఫౌండేషన్‌కి సంబంధించిన అప్లికేషన్ అనీ, చదువుకునే స్థోమత లేక చదువుకోలేని పిల్లలని వాళ్ళే చదివిస్తారని చెప్తే అమ్మ సంతోషంగా సంతకం పెట్టింది.మావయ్య ఆ దయానిధి ఫౌండేషన్లోనే మేనేజర్‌గా పనిచేస్తాడట.ఆ రోజు కృతజ్ఞతతో అమ్మ కళ్ళలో తిరిగిన కన్నీళ్ళు తను ఎప్పటికీ మరిచిపోలాఎడు.మరి ఎన్ని బాధల్లో ఉన్నా అమ్మ కళ్ళల్లో నీళ్ళు చూసిందే లేదు ఇంతవరకు.
అప్పటినుంచీ తనకి దయానిధి ఫౌండేషన్ ఇచ్చిన అండతో చదువుకోసాగాడు.ప్రతినెలా ఒకటో
తారీఖున ఠంచనుగా దయానిధి ఫౌండేషన్ వాళ్ళే స్కూల్లో ఫీజు కట్టేసేవాళ్ళు.తనకెంతో
ఆశ్చర్యమేసేది.తను ప్రతీ సంవత్సరం పాసవ్వగానే ఆ ఫౌండేషన్ ఆఫీసులో పనిచేసే
వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చేవాడు.వాళ్ళుకూడా తనంటే ఎంతో అభిమానం చూపించేవాళ్ళు.ఐతే తనకి
ఇంత సహాయం చేస్తున్న ఆ ఫౌండేషన్ ప్రెసిడెంట్ దయానిధిగారిని ఎప్పుడు కలుసుకోవాన్నా
కుదిరేదికాదు.దయానిధిగారు పెద్ద వ్యాపారవేత్త అని, ఎప్పుడూ బిజీగానే ఉంటారనీ మావయ్య
చెప్పేవాడు.కొన్నాళ్ళకి అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించి కాలం చేసింది.చనిపోయే ముందు "నువ్వు బాగా
చదివి డాక్టర్వి కావాలి చిన్నా" అని అమ్మ చెప్పిన మాటలు తన చెవుల్లో ఇంకా
గింగురుమంటున్నాయి.మామయ్య తనని ఫౌండేషన్ హాస్టల్లో చేర్పించాడు.ఇప్పుడు తనకి 'నా' అని
చెప్పుకొటానికి ఎవరూ లేరు మామయ్య, ఫౌండేఅహన్ తప్ప.
'హే యంగ్ మాన్! ఆర్ యూ ఫాలోయింగ్ మీ?' అన్న ప్రొఫెసర్ పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు
రాజు.
"ఎస్ సర్" అని బదులిచ్చాడు.
"ఒకే దెన్.ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు" స్టూడెంట్స్ వంక చూస్తూ చెప్పాడు ప్రొఫెసర్.
లేచి నించున్నాడు రాజు.
"మన కాలేజీకి శవాలు ఎలా వస్తాయి సర్? చుట్టౌన్న సావాల్ని చూస్తూ అడిగాడు.
"చాలా మంచి ప్రశ్న. సీ స్టూడెంత్స్. మెడికల్ కాలేజీలకి శవాలంటే దళారుల దగ్గరనుంచి
కొంటారనీ లేక సమాధులు తవ్వి తీసుకు వ్స్తారనే అపోహ వుంది.అది ఎంత మాత్రం నిజం కాదు.
హైదరాబాద్‌నే తీసుకుంటే ఈ నగరంలో రోజుకి చాలామంది చనిపోతూ ఉంటారు.అయితే వీరిలో
ఎవరినైనా గుర్తించలేకపోయినా లేక వారి శవాన్ని తీసుకువెళ్ళటానికి బంధువులెవరూ
లేకపోయినా పోలీసులు వాటి గురించి పేపర్లో ప్రకటించి మార్చురీకి తరలిస్తారు.వారు ఇచ్చిన
గడువులోపల ఈ శవాలను ఎవ్వరూ క్లెయిం చేసుకోకపోతే వాటిని అనాధశవాలుగా
ప్రకటిస్తారు.అలాంటి శవాలను ప్రభుత్వం వారి అనుమతితో ఏ మెడికల్ కాలేజీ వారైనా
తీసుకోవచ్చు.ఇవేకాక కొంతమంది తమ డెడ్ బాడీలను వాలంటరీగా దానం చేస్తారు.సో మీ డౌట్
క్లారిఫై అయిందా?" రాజు వైపు చూస్తూ అడిగాడు ప్రొఫెసర్.
తలూపి కూర్చున్నాడు రాజు.
ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరినీ ఇద్దరిద్దరున్న టీములుగా చేసి ఆరు టీంస్గా చేసి ఒక శవాన్ని
అసైన్ చేశారు.ఈ ఆరు టీంస్ కలిసి ఆ శవాన్ని డిసెక్ట్ చేసి మానవనిర్మాణాన్ని తెలుసుకోవాలి.
టీంస్ ఆనిటికీ ఇలా శవాలు అసైన్ చెయ్యబడ్డాక ప్రొఫెసర్ అందర్నీ ఉద్దేశించి "మీకు ఈ అనాటమీ
ల్యాబ్ మొదటి రెండేళ్ళు ఉంటుంది. ఈ రెండేళ్ళు మీ టీం ఇదే.రేపట్నుంచీ మీకు ల్యాబ్
మొదలౌతోంది.ఈ రోజుకి మీరెళ్ళచ్చు" అని చెప్పి వెళ్ళిపోయారు.
విద్యార్తులు ఒక్కొక్కరే ల్యాబ్ నుంచీ బయటకి వెళ్ళిపోతున్నారు.
రాజు కూడా వెళ్ళిపోతుండగా అతని మదిలో మెదిలిన ఒక ఆలోచన అతన్ని ముందుకు కదల్నివ్వలేదు.
"రేపు తను శవాన్ని డిసెక్ట్ చేస్తాడు.కానీ డిసెక్ట్ చేసే ముందు ఆ చనిపోయిన వ్యక్తి గురించి
తెలుసుకోవాలి"
ఇలా ఆలోచించి రాజు మెల్లగా తనకు ఇవ్వబడిన శవం దగ్గరికి వెళ్ళాడు.
ఆ శవం మొత్తం ఒక తెల్లని వస్త్రంతో కప్పబడి ఉంది.
ఆ శవం ముఖం చూద్దామని అతను ఆ వస్త్రాన్ని ముఖం దగ్గర తొలగించడానికన్నట్టు చేతులు ముందుకు
జాచాడు.కానీ ధైర్యం చాలలేదు.అతను చేతులు వెనక్కి తీసుకోబోతుండగా ఆ శవానికి కప్పిన
వస్త్రం మీద అస్పష్టంగా ఏదో కనిపించింది.
వెంటనే అదేమిటో తెలుసుకుందామని ఆసక్తిగా ఆ శవానికి మరింత దగ్గరగా వెళ్ళాడు.
రెండు క్షణాల తర్వాత అతను వాటిని ఏవో అంకెలుగా గుర్త్మిచి నోట్ చేసుకున్నాడు.
"ఈ అంకెలేమిటి?వీటికి, ఈ శవానికీ ఉన్న సంబంధం ఏమిటి? బోధపడలేదు రాజుకి.
"ఇందాక ప్రొఫెసర్ మనకి ఉస్మానియా నుండి శవాలు వస్తాయని చెప్పారు కదా.ఇది బహుశా ఈ వ్యక్తికి
సంబంధించిన కేసు నంబరు అయ్యుండచ్చేమో? అతని మస్తిష్కంలో ఓ ఆలోచన తళుక్కున
మెరిసింది.
ఈ ఆలోచన రాగానే అతను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఉస్మానియా వైపు దారి తీశాడు.
ఉస్మానియాలో ఉన్న డ్యూటీ డాక్టర్ని కలిశాడు.
"సార్. నా పేరు రాజు.ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్‌ని.నాకు మా ప్రొఫెసర్ గారు కేస్ స్టడీ
కోసం ఈ కేస్ రిఫర్ చేశారు" అని తను నోట్ చేసుకున్న నంబర్ చూపించాడు.
"మీరు నాకు ఈ కేస్ ఫైల్ ఇవ్వగలిగితే నా కేస్ స్టడీకి చాలా హెల్ప్ అవుతుంది" రిక్వెస్ట్ చేశాడు
రాజు.
డ్యూటీ డాక్టర్ ఏదో హడావిడిలో ఉన్నట్టున్నారు.పెద్దగా ప్రశ్నలు వేయకుండానే ఒక గది వైపు
చూపించి "కేస్ ఫైల్స్ అన్నీ ఆ రూంలో ఉంటాయి.మీరు ఆ రూంలో వెతకండి" అని చెప్పి రౌండ్స్‌కి
వెళ్ళిపోయాడు.
రాజు అతనికి థాంక్స్ చెప్పి ఆ రూం వైపు దారి తీశాడు.
రూంలో ప్రవేశించిన రాజుకి ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది.
అక్కడ ఫైల్స్ అన్నీ చిందర వందరగా పడేసి ఉన్నాయి.
"ఇన్ని ఫైల్స్‌లో తనకి కావాల్సిన ఫైల్ వెదకటం ఎలా?"
అతనికి ఓ క్షణం ఏమీ తోచలేదు.
"ఆ వ్యక్తి చనిపోయి ఒక్కరోజు కంటే ఎక్కువ అయి వుండదు.అంటే ఆ ఫైల్ పైనే ఉండాలి"
ఇలా ఆలోచన వచ్చేసరికి అతను కొత్త ఉత్సాహంతో ఆ ఫైల్స్ వెదకసాగాడు.
గంట..గంటన్నర ....అతనిలో మళ్ళీ నిరాశ మొదలైంది.
ఇక ఆపేసి వెళ్ళిపోదామని అనుకుంటుండగా అతనికి కనపడిందా ఫైల్.
ఆ ఫైల్ మీద ఉన్న నంబర్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాడు.అది తన దగ్గరున్న నంబరే.
అతని చేతులు వణుకుతున్నాయి.అలాగే ఫైల్ తెరిచాడు.
కాని ముందు పేరు చూడకుండా పేరు దగ్గర చెయ్యి అడ్డం పెట్టి మిగతా వివరాలు చూడసాగాడు.
వయసు : 70
వృత్తి:
ఈయన తదనంతరం తన శరీరాన్ని వైద్యప్రయోగాల కోసం వాలంటరీగా దానం చేశారు.
రాజు అప్పటిదాకా కళ్ళు దానం చేసేవారి గురించి విన్నాడు కాని ఇలా తమ శరీరాన్ని వైద్య
ప్రయోగాలకి దానం చేస్తారని ఊహించనే లేదు.
"ఈ రోజుల్లో కూడా ఇంతటి నిస్వార్థపరులు ఉంటారా?"
అతను వెంటనే పేరు మీద చేతిని తీసేసి ఆత్రంగా ఫైల్లో పేరు చూశాడు.పేరు చూడగానే
లక్ష వోల్టుల విద్యుద్ఘాతం తగిలినట్టు స్థాణువులా నిలబడి పోయాడు.
ఆ ఫైల్లో అతను చూసిన వివరాలు
పేరు : దయానిధి
"ఈయన దయానిధి ఫౌండేషన్ దయానిధి కాదు కదా? మనసు మాత్రం ఆయన కాకూడదని పదే పదే
కొరుకుంటోంది.ఆయన చావకూడదు.బ్రతకాలి.తనలాంతి వారెందరికో విద్యాదానం చెయ్యాలి"
అతనిలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
అతని చేతుల్లో్నుంచి ఫైల్ కింద పడిపోయింది.
ఏదో లోకంలో ఉన్నట్టుగా నడుస్తూ బయటికి వచ్చేశాడు. ఏదో తెలియని బాధ అతని గుండెల్ని
పిండేస్తుంది.
అతను గమ్యం లేని బాటసారిలా రోడ్డు మీద నడుస్తుంటే రంగారావు మామయ్య ఎదురుపడ్డాడు.
"ఏరా రాజూ! ఈ రోజే కదా నీ కాలేజీ స్టార్ట్ అయ్యేది. కాలేజీకి వెళ్ళావా? ఆప్యాయంగా అడిగాడు
మామయ్య.
సమాధానం చెప్పలేదు రాజు.
మామయ్యే మళ్ళీ చెప్పసాగాడు.
"నీకొక విషయం చెప్పాల్రా. మన దయానిధి గారు నిన్ననే చనిపోయార్రా.నువ్వు మొన్న
కలుస్తానన్నపుడు ఆయన ఆరోగ్యం బాగా లేక నిన్ను కలవలేకపోయారు.కానీ నీ గురించి చెప్తే
చాలా సంతోషించారురా. ఈ ఫౌండషన్ స్థాపించిన ఆశయం నెరవేరిందని ఆనందంతో కన్నీళ్ళు
పెట్టుకున్నారు కూడా.అలాంటి గొప్ప మనిషి మళ్ళీ దొరకడురా. చివరకు ఆయన పార్థివ శరీరాన్ని
కూడా వైద్య ప్రయోగాల కోసం దానం చేశార్రా" మావయ్య చెప్పటం ఆపాడు.
మామయ్య ఆ చివరి మాట చెప్పగానే రాజుకి ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది.
ఎదురుగా మామయ్య ఉన్నాడన్న ఆలోచన లేకుండా కాలేజ్ వైపు పరుగెత్తాడు.
మామయ్యకి ఏమీ అర్థం కాలేదు.
ఇప్పుడు టైం పావుతక్కువ ఐదయింది. ఇంకొక పావుగంటలో ల్యాబ్ మూసేస్తారు.శక్తినంతటినీ కాళ్ళలోకి తెచ్చుకుని పరిగెత్తసాగాడు. రాజు ల్యాబ్‌కి చేరుకునేసరికి ఇంకా ఐదు నిముషాలు టైం ఉంది. అలాగే పరిగెత్తుకుంటూ ఆ శవం దగ్గరికి వెళ్ళాడు. ఆ శవం మీద నుండి వస్త్రాన్ని తొలగించాడు.
ఇప్పుడు దయానిధి మొహం రాజుకి స్పష్టంగా కనిపిస్తోంది.ప్రశాంతంగా ఉన్న ఆ మొహంలో ఏదో సాధించానన్న తృప్తి కనిపిస్తోంది. "ఇన్నాళ్ళూ తను చదువుకోడానికి ఆసరాగా నిలిచిన మహామనిషి ఇప్పుడు చనిపోయి కూడా తన చదువుకి సహాయం చేస్తున్నాడు.
రాజు ఇక దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.దయానిధి కాళ్ళ మీద ముఖాన్ని ఆంచి ఏడ్వసాగాడు. దయానిధి కాళ్ళ దగ్గర వస్త్రం తొలగిపోయింది.రాజు కళ్ళ నుంచి కారుతున్న అశ్రుధారలు ఆ కరుణామూర్తి పాదాలను అభిషేకిస్తున్నాయి.

































