ప్రాచీన సాహిత్య దర్శనం

మాలతీ మాధవీయం భవభూతి రెండవ భాగం

రచన: మువ్వల సుబ్బరామయ్య

శ్మశానం ప్రక్కనే ఉన్న చాముండికాదేవి గుడిలో కరాళ శక్తి ఉన్నది. కాపాలికుడైన అఘోరఘంటుడు ఆ ఆలయంలో తన అభీష్టసిద్దికి క్షుద్రమంత్రాలను సాధన చేస్తున్నాడు. అతను దేవికి బలి ఇవ్వడానికై అందమైన గుణవతియైన కన్యను తీసుకు రమ్మని తన శిష్యురాలైన కపాలకుండలను ఆజ్ఞాపించాడు. కపాలకుండల పట్టణమంతా గాలించి, మేడమీద ఒంటరిగా నిద్రిస్తున్న మాలతిని తన మాయా శక్తితో కరాళశక్తి ఆలయానికి తెచ్చింది.

మాలతికి తెలివి వచ్చి చూచేసరికి అఘోరఘంటుడు తన పూజావిధిని నిర్వర్తిస్తున్నాడు. దేవికి తనను బలి ఇవ్వడానికి జరుగితున్న సన్నాహాలను చూచి రోదించసాగింది. ప్రక్కనే శ్మశానంలో తిరుగుతున్న మాధవుడికి మాలతి రోదన ధ్వనులు వినిపించి, గుడిలోకి వచ్చి, దృశ్యం చూచి, అఘోరఘంటుడి చేత ఉన్న కత్తిని లాగుకొని కపాలికుడితో తలపడ్డాడు.

మాలతి కనిపించక పోయేసరికి మాలతి తల్లిదండ్రులు గోడుగోడున దుఃఖించారు. కామందకి వారిని ఓదార్చి, తన దివ్య దృష్టితో చూచి మాలతి పరిస్థితి భూరివసువుకు తెలిపింది. భూరవసువు ఆజ్ఞాపించగా సాయుధులైన సైనికులు చాముండికాలయాన్ని ముట్టడించారు. పరాక్రమశాలి మాధవుడు అఘోరఘంటుడితో భీకరంగా పోరాడి క్రింద పడేసి కరవాలంతో అతని తల నరికాడు. కపాలకుండల మాయోపాయంతో తప్పించుకుంది. గురువుని చంపిన మాధవుడు పై పగపట్టి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది.

మాధవుడి చేత రక్షింపబడిన మాలతి సుఖంగా ఇల్లు చేరింది. తల్లితండ్రులు చాలా సంతోషించారు. రాజుగారి ఉత్తర్వు ప్రకారం నందనుణ్ణి పెండ్లికుమారునిగా అలంకరించి భూరివసువు గృహానికి తరలి రానున్నారు. కామందకి ఈ వివాహాన్ని తప్పించడానికి ముందుగానే ఉపాయాలన్నీ ఆలోచించి పెట్టింది. మాలతి తలిదంద్రులకు చెప్పి మాలతిని పురదేవతాపూజకై బయలుదేరదీసింది. నగరదేవత గర్భాలయంలో ముందుగా పోయి ఎవరికీ కనపడకుండా దాగి ఉండమని కామందకి మాధవుడికి, మకరందుడికి కబురు పంపింది.

నగరదేవత గుడిలో కామందకి మాలతి చేయి మాధవుడి చేతిలో ఉంచి వారి దాంపత్యం నిరంతరం అన్యోన్యానురాగాలతో వర్ధిల్లుగాక అని ఆశీర్వదించింది. మాలతీ మాధవులు ఆమెకు నమస్కరించారు. వెంటనే మీరిద్దరూ చెట్లచాటునుంచి మా బౌధవిహారం వెనక ఉన్న ఉద్యానవనానికి వెళ్ళండి. అక్కడ మీ పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసి ఉంచాను. మకరందుడికీ మదయంతికి కూడా వివాహం జరిపించే ఏర్పాట్లు చేసాను. వారిద్దరూకూడా వచ్చేవరకూ మీరక్కడ వేచి ఉండండి అని చెప్పింది కామందకి.

మాలతీ మాధవులు వెళ్ళిపోయారు. గర్భగుడిలో ఉన్న మకరందుడిని పిలచి రాజుగారు పంపిన వస్త్రాభరణాలతో అతన్ని అలంకరింపచేసి, అతనికి పెండ్లికూతురు వేషం వేయించింది కామందకి. లవంగికతో కూడ ఆమెను వెంట పెట్టుకుని మంత్రి భూరివసువు ఇంటికి వెళ్ళింది.

మాలతి వేషంలో ఉన్న మకరందుడికీ, నందనుడికీ వైభవంగా వివాహం జరిగింది. కామందకి ఏంతో నేర్పుతోనూ, తెలివిగాను వ్యవహరించినందున అంతా సవ్యంగా జరిగిపోయింది. నూతన వధూవరుల గృహప్రవేశం జరిగింది. ఏమేమి చేయాలో కామందకి బుద్దిరక్ష్తకీ, లవంగకికీ బోధించింది.

శోభనపు గదిలో నందనుడు మాయామాలతి (మకరందుడు)తో ప్రేమకలాపాలు ప్రారంభించాడు. మకరందుడు బెట్టు చేసి నందనుని దగ్గరకు రానివ్వలేదు. బ్రతిమాలుకున్నాడు. చివరకు బలాత్కరించబోవగా నందుని అవతలికి గట్టిగా నెట్టివేసాడు. నందనుడు కోపంతో నానా మాటలు అని గదిలోనుండి వెళ్ళిపోయాడు.

లవంగిక, బుద్దిరక్షితలు ఈ విషయం మదయంతికకు తెలియ చేసారు. మాలతి కొంటె పిల్ల. నేను వచ్చి బుద్ధి చెప్పి దారికి తెస్తానని మదయంతిక బయలుదేరి శోభనపు గదిలోకి వచ్చింది. మాలతి వేషంలో ఉన్నది మకరందుడని తెలుసుకున్న ఆమెకు భయమూ, ఆశ్చర్యమూ, సంతోషమూ కలిగాయి.

తరువాత మకరందుడు, మదయంతిక, లవంగిక, బుద్దిరక్షిత రహస్య మార్గాన మాలతీ మాధవులున్న బౌద్ధవిహార ప్రాంతానికి వెళ్ళారు. మాలతీ మాధవులు బౌధవిహారం వెనక ఉన్న ఉద్యానవనంలో కొలను గట్టుమీద రాతిపై కూర్చున్నారు. అవలోకిత కూడా వారి వద్దనే ఉంది. కలహంసుడు, మదయంతిక, లవంగిక, బుద్దిరక్షిత వచ్చి మాధవా రక్షించు, రక్షించు అని మొర పెట్టుకునారు. "మమ్ములనందరినీ మకరందుడు తీసుకుని వస్తూ ఉండగా త్రోవలో నగర రక్షక భటులు అడ్డుపడి మమ్మల్ని చుట్టు ముట్టారు. ఇంతలో కలహంసుడు మాతో వచ్చి కలసి మమ్మల్ని ఇక్కడకు తీసుకు వచ్చాడు" అని స్త్రీలు జరిగినదంతా చెప్పారు.

మాధవుడు తక్షణమే కలహంసుని తీసుకు నగరంలోకి వెళ్ళాడు. మాలతి ఈ సమాచారం అంతా కామందకికి చెప్పి రమ్మని అవలోకితను, బుద్దిరక్షితను పంపింది. కొంతసేపటికి ఆందోళన పట్టలేక జాగ్రత్తగా వ్యవహరించమని మాధవునితో తాను చెప్పినట్లు చెప్పమని లవంగికను నగరంలోకి పమపింది.

ఎంతసేపు నిరీక్షించినా లవంగిక రాకపోయేసరికి ఆందోళన ఎక్కువై మదయంతికను అక్కడ కూర్చోమని చెప్పి నగర పొలిమేరలలోకి వెళ్ళి చూద్దామని ఒంటరిగా బయలుదేరింది మాలతి. మాధవునిపై పగబట్టి ఉన్న కపాలకుండల ఒంటరిగా వెళుతున్న మాలతిని చూచి తన మంత్ర శక్తితో శ్రీశైల ప్రాంతానికి తీసుకు పోయింది. మాలతిని చంపి మాధవునిపై కసి తీర్చుకోవాలని కపాలకుండల ఆలోచన.

మాలతి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి ఆమెను వెదుకుతూ మదయంతిక బయలుదేరింది. లవంగిక ఎదురైతే మాలతి సంగతి చెప్పింది. వారిద్దరూ కలసి అంతటా వెదికారు. కానీ ఎక్కడా జాడ లేదు.

ఆ వెన్నెలరాత్రి రాజు తన కోటపైనుండి మాధవ మకరందుల యుద్ధ కౌశలాన్ని చూచి వారిని పిలిపించి గౌరవించి, బహుమతులిచ్చి మర్యాదచేసి పంపించాడు. మాధవ మకరందులు సంతోషంతో ఉద్యానవనానికి వచ్చారు. జరిగినది తెలుసికుని విచారించారు. అంతా వెదికారు. మాధవునికి మాలతి లేని లోపం అధికమైంది. మతి చలించి ఒంటరిగా అడవులలో పిచ్చివాడిలా తిరగసాగాడు. మకరందుడు అతని వెంట ఉండి కనిపెడుతున్నాడు. మాధవుని చూచి మకరందుడు దుఃఖం ఆపుకోలేక పోతున్నాడు. మాధవుడికన్నా తనే ముందు మరణిస్తానని అనుకున్నాడు. వారప్పుడు పాటలావతీ నదీ ప్రాంతంలో ఉన్నారు. ఆ నది ఒక పెద్ద పర్వతం క్రింద ప్రవహిస్తున్నది. మకరందుడు ఆ కొండ ఎక్కి నదిలో దూకి ప్రాణాలు విడవాలని నిశ్చయించుకున్నాడు.

పూర్వం కామందకి శిష్యురాలైన సౌదామిని కపాలకుండల పన్నాగం కనిపెట్టింది. ఆ క్షుద్ర మాంత్రికురాలిని హతమార్చి మాలతిని రక్షించాలనుకుంది. సౌదామిని కపాలకుండలను ఎదిరించింది. మహాశక్తి సంపన్నురాలైన సౌదామిని ముందు కపాలకుండల క్షుద్ర మాయలూ మంత్రాలూ పనిచేయక ప్రాణరక్షణార్ధం పారిపోయింది.

సౌదామిని మాలతిని శ్రీశైలం మీదనే రహస్య స్థలంలో భద్రంగా అట్టేపెట్టి మాలతి ఇచ్చిన పొగడపూల దండను ఆనవాలుగా తీసుకుని మాధవుని వెదకడానికై వెళ్ళింది. సౌదామిని తన దివ్యదృష్టితో మాధవ మకరందులున్న ప్రదేశం కనిపెట్టి, యోగ శక్తితో ఆకాశ మార్గాన వెళ్ళి, నదిలో దూకడానికి సిద్ధంగా ఉన్న మకరందునికి మాలతి క్షేమవార్త చెప్పి, అతని ఆత్మహత్యా ప్రయత్నం విరమింప చేసింది. మకరందుడు సౌదామినిని వెంటపెట్టుకుని మాధవుడు మూర్ఛ పడిఉన్న తావుకు తీసుకు వచ్చాడు. మాధవుడికి వీరి రాక ముందే తెలివి వచ్చింది. సౌదామిని మాధవుడికి పొగడపూల దండ ఇచ్చి, మాలతి క్షేమంగా ఉన్నదని చెప్పి, జరిగినదంతా తెలుయ చేసింది. అతన్ని గగనమార్గాన మాలతి ఉన్న ప్రదేశానికి తీసుకు వెళ్ళింది. మకరందుడు ఈ కధంతా కామందకి, మదయంతికాదులకు చెప్పడానికై అక్కడనుండి బయలు దేరాడు.

అక్కడ మాలతీ మాధవులను తలచుకుంటూ దుఃఖ సముద్రంలో మునిగిన కామందకి, లవంగిక, మదయంతికలు మధుమతి నదిలో మునిగి ప్రాణత్యాగం చేయ సంకల్పించుకున్నారు. ఇంతలో మకరందుడు వారివద్దకు వచ్చి జరిగిన కథంతా వారికి వివరించాడు.

ఇంతలో మరో ఆపద సంభవించింది. మాలతికోసం వెదకి విసిగి వేసారిన ఆమె తల్లిదంద్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. భూరివసువు సువర్ణబిందు దేవాలయంలోని అగ్నిగుండంలో పడి మరణించనున్నాడు. సౌదామిని మాలతీ మాధవులను ఆకాశ మార్గాన శ్రీశైలం నుండి పద్మావతీ నగరానికి తీసుకు వస్తూ పైనిండి ఈ ఘోరమైన దృశ్యం చూచి, మాలతీ మాధవులను ఒకచోట దింపి, భూరివసువు ప్రాణాలు కాపాడడానికి వెళ్ళింది.

ఈ సమాచారం విని మాలతి మూర్ఛపోయింది. మాధవుడు మెల్లగ ఆమెను చేతులమీద ఎత్తుకుని కామందకి మొదలైన వారున్న చోటుకు తీసుకు వచ్చాడు. సౌదామిని భూరివసువుకి మాలతి క్షేమ వార్త చెప్పి, ప్రాణత్యాగం చేయకుండా రక్షించి, కామందకి దగ్గరకు వచ్చింది. ఆ విధంగా అంతా ఒక చోట చేరారు.

సౌదామిని కామందకి పాదాలకు నమస్కరించింది. కామందకి ఆమెను గుర్తు పట్టి ఆలింగనం చేసుకుని వీరినందరినీ కాపాడిన నీవు నా శిష్యురాలు కావడం నా అదృష్టం అని సముచిత మర్యాదలతో శిష్యురాలిని గౌరవించింది. అందరినీ ఆపదనుండి రక్షించిన సౌదామిని కామందకి శిష్యురాలని తెలిసి మాలతీ మాధవులు, మకరందుడు అంతులేని ఆశ్చర్యమూ ఆనందమూ పొందారు.

పద్మావతీ నగర రాజు ఈ వృత్తాంతమంతా తెలుసుకొని, మంత్రి భూరివసువును రప్పించి మాధవునికి ఒక లేఖ వ్రాసి పరిచారకుని ద్వారా పంపించాడు. పరిచారకుడు తెచ్చి ఇచ్చిన లేఖను మాధవుడు అందుకుని"నాయనా! మాధవా! నీవు ఉత్తముడవు. నీలాంటి వాడు మా మంత్రికి అల్లుడు కావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎన్నో ఆపదలూ కష్టాలూ మీకు సంభవించినా, మీ శక్తిసామర్ధ్యాల వల్ల,భగవంతుని అనుగ్రహం వల్ల మీరు వాటన్నిటినీ అధిగమించగలిగారు. మిమ్మలను ఎంతో ప్రశంసిస్తున్నాము. మా ప్రాణ సఖుడైన నందనుని చెల్లెలు మదయంతిక కూడా ఇదివరకే మీ స్నేహితుడైన మకరందుని ప్రేమించినట్టు తెలుసుకునాము. వారిద్దరి వివాహం చేయాలని సంకల్పించుకున్న్నాము. ఇందుకు నందనుడు కూడా అంగీకరించాడు" అని చదివి వినిపించాడు.

తుదకు ప్రభువులకు కూడా తమపై అనుగ్రహం కలిగినందుకు అందరూ సంతోషించారు. అవలోకిత, బుద్దిరక్షిత, కలహంసుడి ఆనందానికి అవధులు లేవు. ఆనందంపట్టలేక నృత్యం చేసారు, పాటలు పాడారు. కధంతా ఇలా సుఖాంతం కావడానికి సౌదామినే మూలకారణమని అందరూ ఆమెను శ్లాఘించారు. దేవరాతుడూ, భూరివసువు చిన్ననాడు చేసుకున్న బాసలు ఈనాడు తీరినవని పలుకుతూ కామందకి తన సంతోషం వ్యక్తం చేసి, సంగతి వివరంగా చెప్పగా విని అంతా ఆశ్చర్యపోయారు. భూరివసువు మాధవుని తండ్రియైన దేవరాతుని పిలిపించి, మహోన్నతంగా మాలతీ మాధవుల వివాహం జరిపించాడు. మదయంతిక, మకరందుడి వివాహం కూడా అప్పుడే ఘనంగా జరిగింది. మాలతీ మాధవుల ఆనందానికి మేర లేదు. వారి అనురాగం దినదిన ప్రవర్ధమానమై సర్వ సుఖాలూ అనుభవించారు. అలాగే మదయంతికా మకరందులు కూడా అన్యోన్యంగా ఉంటూ దాంపత్యసుఖం అనుభవించారు. బౌధబిక్షుకి అయిన కామందకి తన ఆశ్రమంలో ఉంటూ లోకోపకారమైన పనులు చేస్తూ వచ్చింది.

 

మువ్వల సుబ్బరామయ్యగారు విజయవాడలో జయంతి పబ్లికేషన్స్ అధినేత. గత మూడు దశాబ్దాలుగా వారు వివిధ ప్రాచీన గ్రంధాలను ముద్రించి, ఎన్నోగ్రంధాలకు తెలుగులోకి అనువాదాలు చేయించి అమితమైన సాహితీ సేవలను అందించారు. యువ, మిసిమి, రచన, ఆంధ్ర జ్యోతి, వంటి అనేక పత్రికలలో వారి వ్యాసాలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. వారికున్న ఈ ప్రాచీన సాహిత్య పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఈ సాహిత్యాలను పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో అందించమన్న మా అభ్యర్థనకు వారుచేసిన రూపకల్పన అయిన ఈ శీర్షిక "ప్రాచీన సాహిత్య దర్శనం"గా వెలుగొందగలదు. ప్రతినెలా వారు ఒక ప్రాచీన కావ్యాన్ని తీసుకుని దానిని సరళతరమైన భాషలో అందించడమేకాకుండా అవసరమైన వ్యాఖ్యలను కూడా జతపరుస్తారు.

 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.