కథా భారతి

అనాదిగా సాగుతోంది


- డా. అప్పారావు.పంతంగి

(అనాదిగా సాగుతోంది ఈ అనంత సంగ్రామం
అనాధునికి ఆగర్భశ్రీమంతునికి మధ్య ….దాశరధి గారు రచించిన ఓ కవితలోని ఈ వాక్యాలే స్ఫూర్తిగా...)

అనాదిగా సాగుతోంది ఈ అనంత సంగ్రామం
అనాధునికి ఆగర్భశ్రీమంతునికీ మధ్య
అనాదిగా సాగుతోంది ఈ అనంత సంగ్రామం…

నిప్పుల ఉప్పెనతోన, అప్పుల నొప్పులతోన…
కండలు కరిగించి, బండలు కదిలించి, ఎండకు తలవంచి, గండాలకు తనువొంచి
తల్లిరొమ్ము పాలతోన పంచిన నెత్తురునంత చెమటగ మార్చి
తనను నమ్ముకున్న వాళ్ళ ఆకలి తీర్చేందుకు చెమటను సిరులుగ మార్చి
నవరంధ్రాలున్న నెత్తురుముద్దగ నేడు మారినందుకు
ఏమార్పూ లేకుండ ఏమార్చుతూ…
ఎదుగు బొదుగు లేకుండా దిగజార్చుతూ…
ఊపిరిదీపం ఆర్పి చితిపేర్చుతూ…
శ్రమజీవన సౌందర్యంతో, ఆ శ్రమజీవుల ఔదార్యంతో
కళ్ళున్నా చూడరని , నోరున్నా అడగరని, చెయ్యున్నా ఎత్తరని, కాలున్నా కదపరని
అడ్దూ అదుపూలేక, అడిగేవారేలేక, చేసిన తప్పులు అన్నీ ఆరునూరు దాటిన శిశుపాలుళ్ళున్న
ఈ శ్రమజీవన సమాజంలో,అసమ జీవన సమాజంలో
అనాదిగా సాగుతోంది ఈ అనంత సంగ్రామం
అనాధునికి ఆగర్భశ్రీమంతునికి మధ్య…

కత్తులవంతెలపైన , కుత్తుకలెంతగ తెగిన…
మత్త్తుగ కనువాలుతున్న, సత్తువనేరానన్నా, శ్రమశవమై పోతున్నా, చావే ఇక చస్తున్నా
కన్నతల్లి తనను ఎట్టా నవమాసాలు మోసిందనుకుంటూ
వడ్లగింజలేసి పురిటిలోనే ఎందుకు నను చంపలేదనుకుంటూ
పంచేద్రియాలున్న నెత్తురుముద్దగ నేడు ప్రశ్నించుకున్నందుకు
మిన్ను విరిగి మన్నులోకి మముకూర్చు తూ …
కన్నుపొంగి కంటి గంగను కాళ్ళుచేర్చు తూ …
వెన్ను, పన్ను లోలో తన్నుకు చ స్తూ…
శ్రమజీవన సౌందర్యంతో, ఆ శ్రమజీవుల ఔదార్యంతో
కళ్ళున్నా చూడరని, నోరున్నా అడగరని, చెయ్యున్నా ఎత్తరని ,కాలున్నా కదపరని
అడ్దూ అదుపూలేక, అడిగేవారేలేక, చేసిన తప్పులు అన్నీ ఆరునూరు దాటిన శిశుపాలుళ్ళున్న
ఈ శ్రమజీవన సమాజంలో,అసమ జీవన సమాజంలో
అనాదిగా సాగుతోంది ఈ అనంత సంగ్రామం
అనాధునికి ఆగర్భశ్రీమంతునికి మధ్య…

నెత్తురు కన్నీళ్ళు కలసి , కురిసే ఆవానలో తడిచి…
దు:ఖాన్నీ చావునీ , వెళ్ళమని మము విడిచి…
నీచాతి నీచంగా, హీనాతి హీనంగా, ఘోరాతి ఘోరంగా…
పెను నిద్దుర వదిలించేలా… పెను తుఫాను కదిలించేలా…
అనాదిగా సాగుతోంది ఈ అనంత సంగ్రామం,
అనాధునికి ఆగర్భశ్రీమంతునికీ మధ్య,
అనాదిగా సాగుతోంది ఈ అనంత సంగ్రామం...


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)