ధారావాహిక

 అంతర్ముఖం - (15 వ భాగం)

- రచన : యండమూరి వీరేంద్రనాథ్     


వారం రోజుల తర్వాత పోలీసుల నామీద హత్యానేరం మోపుతూ ఛార్జిషీటు ఫైల్ చేసారు. నన్ను ఖమ్మం జైలుకి పంపారు.
ఇది నిజంగా జైల్లా వుంది. ఇన్ని రోజులు నేను ఖైదీని అన్న అలోచనే రాలేదు. ఇప్పుడీ సెల్ కలిగిస్తోందా ఆలోచన. మరో ఇద్దరు వున్నారు అదే సెల్ లో.

"ఏమిటి గురూ నేరం. ఏం చేసావు"? అడిగాడొకడు.
"హత్య"అన్నాను. అదెందుకు జరిగిందో వాళ్ళకు చెప్పలేదు.
"బాబోయ్, పెద్ద కేసే. ఎవర్ని చంపావేమిటి?"
"ఒక రౌడీని".
"అంటే నువ్వు రౌడీలను రౌడీవన్నమాట" అంతా నవ్వారు.
"మంచి సినిమా పేరు పెట్టావు గురూ" అన్నాడొకడు.

నేను సినిమా చూచి ఎన్నాళ్ళయిందో? ఆ రోజు మార్నింగ్ షోకి వెళ్ళాను. హాల్లో మల్లికను మరో వ్యక్తితో చూడటం గుర్తొచ్చింది.
"ఏంది గురూ ఆలోచిస్తున్నావ్. ఎందుకు చేశానా అనా. ఫర్వలేదు. అండర్ ట్రయిల్స్ కు కదా. ఇక్కడ బాగానే ఉంటుంది. తిండి మరీ అంత బావుండదనుకో, కానీ ఫర్వాలేదు. మన చేత పనులు చేయించరు" అన్నాడు ఒకడు.
"నువ్వొచ్చి ఎన్ని రోజులైంది"? అడిగాను.
"రోజులా"? పెద్దగా నవ్వాడు. "నెలలు దాటింది. సంవత్సరం కావస్తోంది"అన్నాడు.

వీళ్ళని అరెస్టుచేసి సంవత్సరాల తరబడి తిండిపెట్టి పోషించటం దేనికి?
"నేనన్నాళ్ళుండలేను" పైకే అన్నాననుకుంటాను.
"హత్యకేసు కదా, సంవత్సరాలు పట్టొచ్చు. రెండేళ్ళు కావచ్చు"అన్నాడు.
అన్ని రోజులా! ఆ తర్వాత శిక్ష ఎన్నేళ్ళు వేస్తారో తెలియదు. సంవత్సరం పాటు జైల్లో ఉంటే తర్వాత వేయబోయే శిక్షకి అలవాటుపడి పోతారని ఆలోచనా? ఆలోచనలకు, సిగరెట్లకు మంచి కాంబినేషన్ కుదురుతుంది. జైలుకి తీసుకురాగానే జేబులో వస్తువులన్నీ తీసుకున్నారు సిగరెట్ పెట్టెతో సహ.

"సిగరెట్ కావాలి ఎలా"?అడిగాను.
"ఎలాగనా? మనమేమన్నా క్లాసు ఖైదీలమా? ఏ.సీ.లూ, వి.సి. ఆర్లూ, కలర్ టీవీలూ, సిగరెట్లు, విస్కీలు యివ్వడానికి. అవన్నీ చార్లెస్ శోభరాజ్ లాంటి వాళ్ళకు. మనకు సిగరెట్లు కూడా యివ్వరు"అన్నాడు.
"అదేమిటి? మన సిగరెట్లు మనకివ్వడానికేం?"

"ఇప్పుడిక మనదంటూ ఏమీలేదు. ఇది జైలు. మనం ఇక్కడ నేరస్థులం. నేరస్థుల్ని ఇలాగే చూస్తారు. ఇంతకంటే గొప్పగా జీవితాన్ని అనుభవించే స్వేచ్ఛను మనం పోగొట్టుకున్నాం".
నిజమే. జైలంటే ఏమిటి? స్వేచ్చ లేకుండా బందీ అవ్వడం. అన్నీ అమరిస్తే ఇది శిక్షెలా అవుతుంది? అనుకున్నాను.
ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. కాసేపు పట్టినా పిచ్చి కలలు - సిగరెట్ వెలిగించి రెండు దమ్ములు లాగి, మండుతున్న కొసని నుదుటి మీద అంటించుకున్నట్లు కల.

* * * *

"నీ కోసం ఎవరో వచ్చారు. రమ్మంటున్నారు" సెంట్రీ వచ్చి చెప్పాడు.
ఎవరూ? ప్రణవా? శ్రీనాధ్? వాళ్ళిద్దరూ కాక నా కోసం వచ్చేది మరొకరు లేరు, కానీ, వాళ్ళతో ఏం మాట్లాడాలి? రాకుండా వుంటే బావుండేది. కనీసం ’నా’ అన్న వాళ్ళని కలుగుకోకుండా ఉండటానికి అలవాటు పడేవాడిని.
సెంట్రీ నన్నా గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు. ఆఫీసు గదిలా వుందది. ప్రణవి ఈ గదిలోకి వస్తే ఆమెని తాకటానికి వీలుంటుందనుకుంటాను.

నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. ఈ పరిస్థితిలోనూ అదే ఆలోచనా! నా వయసే ఉన్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. నేనెప్పుడూ అతడిని చూడలేదు గానీ ఆ దుస్తుల్ని బట్టి లాయరని గ్రహించాను.
"నా పేరు రఘవీర్. లాయర్ని, ప్రభుత్వం మీ తరపున వాదించడానికి నన్ను నియమించింది" షేక్ హేండ్ ఇస్తూ అన్నాడు. ’మనిద్దరం ఒకటి’ అన్న భావం కనిపిస్తోందందులో-
"నాకు లాయర్ అవసరం లేదని చెప్పాగా" అనబోయి ఊరుకున్నాను. మొదటిసారి కలవగానే అలా అనడం బాగుండదు. అతడు నా ఎదుట కుర్చీలో కూర్చొని ఫైల్ తెరిచి చూస్తున్నాడు. నా బయోడేటా కాబోలు.
రఘవీర్ నా వైపు చూసి నవ్వాడు. "మీ గురించిన వివరాలన్నీ తెలుసుకున్నాను. నేను మీకు సహాయం చేయడానికి వచ్చినవాడినని అర్థం చేసుకుని, నాతో సహకరించండి. అది మీకే ఉపయోగపడుతుందని చెప్పగలను - ఓ.కే?" అన్నాను..

"తప్పకుండా, చెప్పండి’అన్నాను.
"గత పదిరోజులుగా మీ గురించి పూర్తి ఎంక్వయిరీ జరిగింది. నాకు కొన్ని అనుమానాలున్నాయి. నేనడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. అసలు మీరు లాయర్నెందుకు పెట్టుకోలేదు".
"అవసరం అనిపించలేదు. జరిగింది. ఒక దుర్ఘటన - అనుకోకుండా జరిగిపోయింది. ఆ చెప్పాల్సిందేదో నేనే చెప్పవచ్చు కదా అనుకున్నాను. చాలా సింపుల్ కేసండీ ఇది"చెప్పాను.

"అది మీ ఉద్దేశ్యం. జడ్జి తన తీర్పు వినిపించేవరకు ఏ కేసయినా ఒకటిగానే సాగుతుంది. కేసుల్లో సింపుల్, కాంప్లికేటెడ్ అని వుండవు".
జరిగిన విషయాలు తెలిసి వాడిని కాబట్టి నాకు ఇది సింపుల్ గా అనిపిస్తోంది. కాని వినే రెండో వ్యక్తికి అదంత సహజంగా జరిగినట్లవిపించక పోవచ్చు కదా!

"మీరడగాల్చిన ప్రశ్నలు అడగండి" - అన్నాను
"ఈ మధ్యనే మీ అమ్మగారు పోయారా?"
"అవును".
"అంటే హత్య జరిగిన ఎన్ని రోజులు ముందు?"
"పదో, పన్నెండో సరిగ్గా గుర్తులేదు".

"అంటే, ఆవిడ పోయాక రోజుల లెక్క మీకు తెలియదా? మరి కర్మలు చేయాలి కదా"?
"అందులో నాకు నమ్మకంలేదు కాబట్టి చేయలేదు. ఆ ఆలోచన అందుకే లేదు".
"మీరు హిందువులేగా, నమ్మకం లేకపోవడం ఏమిటి?"
"నేను హిందువునే. కానని అనడంలేదు. హిందువు కాకపోయినా ఏ మతం వారికయినా, మనిషి చనిపోయాక చేయాల్సిన కర్మలు వుండవచ్చు. కాని నా కందులో నమ్మకంలేదు. కొన్ని ఆచారాలు నాకు మూర్ఖంగా అనిపిస్తాయి. అంతే".

"దహనక్రియలు ఎలా చేసారు?"
"ఎలక్ట్రిక్ క్రిమేటేరియా".
"మీ ఊళ్ళో ఎందుకు చేయలేదు? మీ బంధువులంతా అక్కడే ఉన్నారనుకుంటాను?"
"చెప్పాగా! ఆ బంధువులు నాకు తెలియదు. ఆ క్రియల్లో నాకు నమ్మకం లేదుకూడా"అన్నాను.
"రాత్రి శవం దగ్గరే కూర్చున్నారా?"
"ఊ"

"సిగరెట్ కాల్చారా?" అడిగాడు క్యాజువల్ గా. ఈ ప్రశ్నలన్నీ దేనికో అర్థంకావడంలేదు. ఈ హత్యకీ అమ్మ మరణానికీ సంబంధం ఏమిటి?
"అవును. రాత్రంతా కూర్చోవలసి వచ్చిందిగా"!
"అయితే మాత్రం? తల్లి శవాన్ని ఎదురుగా పెట్టుకుని స్మోక్ చేయాలని ఎలా అనిపించింది?"
"అందులో తప్పేమిటో అర్థంకాలేదు. టెన్షన్ లో ఉన్నప్పుడు ఒక్కో మనిషి ఒక్కోరకంగా అది తగ్గించుకోడానికి ప్రయత్నిస్త్తాడు".
"నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. జరిగింది తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు కాఫీ కూడా తాగారా?"
"ఆ ,తాగాను, అక్కడ ఎవరో యిస్తే".
"అన్నట్లు మీరు ఆవిడను వృద్దుల శరణాలయంలో ఎందుకు వదలాల్సి వచ్చింది?" సడన్ గా అడిగాడు.

"నా పరిస్థితి అలాంటిది. ఆవిడను చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. నర్స్ ని పెట్టుకునే ఆర్థికస్తోమత లేదు. అయినా ఇవన్నీ కేసుకి సంబంధించిన విషయాలు కావే".
"మీ వరకు మీకు అలా అనిపించవచ్చు. కాని రేపు కోర్టులో మీరు ఇలాంటి ఎన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సివస్తుంది. అందుకే అడుగుతున్నాను. మీ తల్లి మరణం బాధ కలిగించలేదా? ఆమె అంటే మీకు ప్రేమలేదా?"
"కలిగించింది. అమ్మంటే నాకు ప్రేమలేదని ఎందుకనుకుంటున్నారు?"
"ఆమె మరణం మీకు బాధ కలిగించినట్లు మీరు ఎక్కడా చూపించలేదు కాబట్టి".

"అందరూ ఒకే రకంగా బాధను వ్యక్తం చెయ్యరు. నేను ఏడవలేదు. అమ్మ శవం మీద పడిపోలేదు. నిజమే".
"అంటే మీ బాధని మీరు లోలోపలే అనుభవించారన్నమాట".
"అలాంటిదేమీ లేదు. నాకేమీ అనిపించలేదంతే".
అతడు సూటిగా నా కళ్ళలోకి చూసాడు. "మీరలా మట్లాడకండి. మీకేం అనిపించదేమో కాని వినేవాళ్ళకు బాగుండదు".

"వినేవాళ్ళకు బాగుండటం కోసం నేనేమీ మాట్లాడలేదు. నాకారోజు ఆరోగ్యం బాగుండలేదు. చాలా అలసటగా వున్నాను. అమ్మ మరణం నాకు బాధ కలిగించే వుండవచ్చు. కాని ఆమె ఏ క్షణంలో పోతోందో అన్న ఆలోచనతో మెంటల్ గా ప్రిపేరయి వున్నవాడిని. కాబట్టి అంత దు:ఖం కలగలేదు".
"అది నిజమే కాని కోర్టులో ఇలా మాట్లాడకండి. నాకు దు:ఖాన్ని బయటకు వ్యక్తం చేసే అలవాటు లేదని చెప్పండి చాలు. ఎందుకంటే మనిషి నేరం చేసాడంటే దాని వెనుక అతడి మనస్తత్వం ఎలాంటిదోనన్న ఆలోచనతో మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు కాబట్టి".

"న్యాయవ్యవస్థ మనిషి నేరాన్ని కాకుండా నేరప్రవృత్తి కారణాలు తెలుసుకొని శిక్ష విధిస్తోందా? అలా అయితే ఇన్ని హత్యాలు, దోపిడీలు, కిడ్నాప్ లు చేసిన వ్యక్తిని ఎన్నికల్లో నిలబడటానికి ఎందుకు పర్మిట్ చేస్తోంది? అతడిని దేశాన్ని పాలించే నేతగా ఎలా ఒప్పుకోగలుగుతుంది?" లాయర్ని ప్రశ్నలు అడగలేదు. అతడేదో నాకు ఉచితంగా సహాయం చేయడానికొస్తే అవమానించినట్లు అవుతుంది అని.

* * *

రెండు రోజుల్నుంచీ నాకు ఒకటే ఆలోచన. ఆలోచన కూడా కాదు అంతర్గతమైన బాధ.
ప్రణవి ఏమయింది? నేను సెల్ కి మొదటిసారి వచ్చినప్పుడే ఆమె నాతో కలసి స్టేషన్ కి వచ్చింది. ఆ తరువాత కలవలేదు. ఎందుకని?

ఆమె రాలేదన్న బాధ వుంది. అసలీ బాధ ఎందుకు కల్గుతోంది? కష్టాల్లో పడిన తరువాత ఆ ఆలోచనల్లో మార్పొచ్చిందా? ఇంతవరకూ లేని బలహీనత నాలో ప్రవేశించిందా? నాకూ ఒక ’తోడు’ కావాలనుకుంటున్నానా? వృద్దాప్యంలో మనిషి ఒక తోడు ఎలా కోరుకుంటాడో, నేనూ అంతర్గతంగా అలాంటిదాన్నే ఆశిస్తున్నానా? ఈ మానసిక బలహీనత వల్లే మనుఘ్యలు ప్రేమిస్తారా? ఒకరి ఓదార్పుకోసం ఒకరు తహతహలాడతారా? మరి కిడ్నీల అనారోగ్యంతో నా మరణం ఖాయం అని తెలిసినప్పుడు నేనేమీ ఎవరి ఓదార్పు కోసం తహతహలాడలేదే. ఈ జైలు శిక్ష అంతకన్నా పెద్ద సంచలనమైన బాధ కాదు. మరి ఇప్పుడే ప్రణవి ఎందుకు గుర్తు వస్తూంది?

నేనామెని ప్రేమిస్తున్నానా?
ప్రణవి రాలేదన్న బాధకంటే, ఎందుకు రాలేదన్న కారణం తెలుసుకోవాలన్న కోర్కె నాలో బలీయమైంది. రెండో కారణాలు వుండవచ్చు. ఆర్నెల్లల్లో మరణించేవాడితో ఎందుకులే అనుకుని ఉండవచ్చు. లేదా హంతకుడితో కలిసి పిక్నిక్ కి వచ్చిన స్త్రీ అని పేపర్ లో రాబోయే వార్తపట్ల భయం అయినా అయ్యుండవచ్చు.

మనుఘ్యలపట్ల నా దృక్పధం ఏమిటో, ప్రణవి కూడా అలాగే ప్రవర్తించటం చూసి ఒకప్పడయితే సంతోషించేవాణ్ణేమో! కానీ ఇప్పుడు సంతోషం కలుగలేదు.
రెండ్రోజుల తరువాత శ్రీనాధ్ వచ్చాడు. మల్లిక విడాకులకి ఒప్పుకుందట. చాలా సంతోషంగా వున్నాడు. మల్లికా, ఆమె అన్నయ్య- ఆ రౌడీ మరణంతో గ్యాంగ్ వుందని బహుశా అనుకుని వుంటారు.
ప్రస్తుత సమాజంలో రౌడీలకీ, హంతకులకీ వున్న గౌరవం మరెవరికీ లేదు కదా. శ్రీనాధ్ ఆనందం చూసి నాకూ సంతోషం కలిగింది.

"నీకు హైద్రాబాద్ నుంచి మంచి లాయర్ ని ఏర్పాటు చేస్తాను" అన్నాడు శ్రీనాధ్.
"వద్దు. ఇప్పుడు వస్తున్న లాయర్ బాగానే వున్నాడు" అని తిరస్కరించాను. నా గురించి అక్కడ చాలా అనుకుంటున్నారట. నా గదికి అమ్మాయిలు రావటం గురించి, నా రౌడీ చేష్టల గురించి మన్మధరావు కథలు కథలుగా చెపుతున్నాడట.

పరంధామయ్యగారు గానీ, సత్యం గానీ, చివరికి చలపతి గానీ నా గురించి రాకపోవటం కూడా ఆశ్చర్యం అనిపించలేదు. వస్తే ఆశ్చర్యపడి వుండే వాడ్ని, సుశీల గురించి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో, ప్రస్తుతం అదే ఆఫీసు హాలులో నా గురించి కూడా అలాగే చర్చలు, కామెంట్లూ జరుగుతూ వుండి వుంటాయని నాకు తెలుసు. నా గురించి యిష్టం వచ్చినట్టు మాట్లాడటానికీ, తమకు తెలిసినది, తెలియనిదీ చెప్పటానికీ, వీలయినన్ని రంగులు పులిమి కథలుగా చెప్పటానికి చాలామంది నా "మిత్రుల"కి అవకాశం దొరికింది. అదృష్టవశాత్తు నేను పేరున్న ప్రముఖుడిని కాకపోవటంతో పేపరులో ఈ హత్యకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.

నాతో కొంచెంసేపు మాట్లాడి శ్రీనాధ్ లేచాడు...
వెళ్ళబోతూ ఆగి, చెప్పాలా వద్దా అన్నట్లు కొంచెంసేపు సంశయించి, "నీకో విషయం తెలుసా"? అన్నాడు.
"ఏమిటి"? అన్నాను.
"ప్రణవి బిజినెస్ పెట్టింది".
ఛెళ్ళున కొరడాతో కొట్టినట్లయింది.
ప్రణవి బి....జి....నె...స్ పెట్టింది!

అంత షాక్ లో కూడా అతడు వాడిన ఆ పదం నాకు బాధ కలిగించింది. అతడు చెపుతున్నది నా చెవి కెక్కటంలేదు. అతడు చెప్పుకుపోతున్నాడు.
"వాళ్ళ మావయ్య దగ్గరకు వెళ్ళిపోయింది. చాలా పెద్ద పెద్ద కస్టమర్లను పట్టుకుందట. చదువుకుంది. డిగ్నిఫైడ్ గా వుంటుంది కదా. చాలా పెద్ద రేటు...."
నా జీవితంలో నేనెప్పుడూ అంత విచలితుణ్ణి అవలేదు. ఏ వార్తా నన్ను ఇంతగా కదిలించలేదు. చివరికి నా కన్న తండ్రి వేరే ఎవరో అని తెలిసినప్పుడు కూడా నేను ఇంత చలించలేదు. కేవలం నేను కూడా మామూలు మనిషిలా స్పందిస్తాను అని నిరూపించటానికే ఈ సంఘటనలు వరుసగా జరుగుతున్నాయనుకుంటాను.

ప్రణవి నన్ను ఈ వూళ్ళో - ఈ జైల్లో ఇలా వదిలేసి ‘వెంటనే’ హైద్రాబాద్ వెళ్ళిపోవటానికి కారణం ఇదా...? అకస్మాత్తుగా ఆమెకి డబ్బుమీద వ్యామోహం పుట్టిందా? తిరిగి అందుకే మావయ్యని ఆశ్రయించిందా?
నేను నమ్మలేకపోతున్నాను.
కానీ నమ్మాలి - తప్పదు.

ఒకప్పుడు నేను చాలా థియరీలు చెప్పేవాడిని. మనిషి మనిషిని అవసరం కోసమే ప్రేమిస్తాడని నమ్మేవాడిని. ఇంత భయంకరంగా ఈ నిజం నన్ను చుట్టుముట్టి నిలువుగా కమ్మేస్తుంటే, నా థియరీ నిజమైనందుకు ఆనందించాలి తప్ప విచారించటం దేనికి?
ఆ క్షణం నించే ప్రణవిని మర్చిపోవాలని నిశ్చయించుకున్నాను.
అదంత సులభమా?

* * *

" మీరు చిత్తూరులో ఎప్పుడున్నారు?" రావడమే అడిగాడు లాయర్ రఘవీర్. అతడు మొహంలో ఎందుకో కోపం తాండవిస్తోంది. బహుశా ఆ రోజు నుంచి నా మీద కోపం తగ్గలేదేమో.

సమాధానం చెప్పాను.
"ఎన్నేళ్ళు?"
"మూడేళ్ళు - డిగ్రీ అక్కడే చదివాను"
"నీకు ఓంకార్ తెలుసా?" ఏకవచనంలో అడిగాడు.
"ఓంకార్...పేరు విన్నట్లుంది. ఎక్కడో గుర్తురావడం లేదు".
"చిత్తూరు హాస్టల్లో వుండేవాడా?"

అప్పుడు గుర్తు వచ్చింది. హాస్టల్లో రౌడీ గుంపులో అతడు ఒకడని, ఆ విషయమే చెప్పాను.
"నాకంటే సీనియర్. చాలా ఏళ్ళుగా అక్కడే వుండేవాడు" అతడిని గుర్తు తెచ్చుకోచడానికి ప్రయత్నించాను. సరిగ్గా గుర్తురావడం లేదు.

"అతడిని మళ్ళీ ఎప్పుడు చూశావు?":
"ఉహు - చూడలేదసలు"
"అబద్దం చెప్పకు - మళ్ళీ ఎప్పుడు కలిసాడు?"

"నిజమే చెప్తున్నాను. అతడి గురించి నాకేమీ గుర్తు రావడంలేదు. ఇప్పుడు ఎదురుగా నిలబడ్డా గుర్తుపట్టలేనేమో కూడా".
"అంటే, అతడు ‘ఓంకార్’ అని తెలియకుండా హత్య చేసానంటావా?" అన్నాడాయన కోపంగా.

నేను హత్య చేసింది ఓంకార్నా? ఇది నిజమా? అతడి మొహం గుర్తు తెచ్చుకున్నాను. అతడే కావచ్చు. ఆ కళ్ళు, నుదురు ఓంకార్ నే గుర్తు తెచ్చాయి. నేనూ, ప్రణవి ఎక్కడో చూసినట్లుంది అనుకోవడం గుర్తు వచ్చింది.
"నిజమే లాయర్ గారూ! కాని నేనతడిని నిజంగానే గుర్తు పట్టలేదు. అప్పటికీ, ఇప్పటికీ చాలా మారాడు. బాగా లావయ్యాడు. గెడ్డం పెంచాడు. అతడే ఓంకార్ కావచ్చనిపిస్తోంది.
అయనకు కోపం రావడంలో ఆశ్చర్యం లేదు. మూడేళ్ళు హాస్టల్లో కలిసి వున్న వ్యక్తిని గుర్తుపట్టలేదంటే ఎవరూ నమ్మరు. కాని నా మనస్తత్వం అలాంటిది. వాళ్ళను సరిగ్గా గమనించి చూసేవాడినే కాదు.

"అతడు మిమ్మల్ని హైదరాబాద్ లో ఫాలో అయ్యేవాడు. అది నిజం కాదా?" అడిగాడు రఘవీర్. అతడి కోపం ఇప్పుడు బాగా అర్థమయింది.
"నిజమే" ఒప్పుకున్నాను.
"ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు?"
"ఈ కేసుకి అవసరం అనిపించలేదు." అతడికి శ్రీనాధ్, మల్లికల విషయం వివరంగా చెప్పాను. పోలీస్ కంప్లయింట్ ఇవ్వటం, నేను వెళ్ళి సాక్ష్యం చెప్పడంతో పోలీసులు కేసు ఉపసంహరించుకోవటం....అన్నీ చెప్పాను.

"అంటే అతడు నిన్నూ, ప్రణవినీ ఫాలో చేసేడు కదా?"
"శ్రీనాధ్ ద్వారా వాళ్ళకి శత్రువునయ్యాను. మేము భద్రాచలం వచ్చే రోజునే వాళ్ళు నన్నూ, ప్రణవినీ కలిపి చూడటం" అన్నాను.
"హస్టల్లో వున్నప్పుడు ఒకసారి అతడిని కొట్టావుట, నిజమేనా?"
"అవును. ఎవరో అమ్మాయిని అల్లరి పెడితే చూసి, కొట్టాను. ఆ అమ్మాయి ప్రణవే" అన్నాను.

"ఆ విషయం మా ఇన్వెస్టిగేషన్ లోనే తెలిసింది. ఓంకార్ దీ చిత్తూరే. అతడి గురించి వివరాలు తెలుసుకోవాలని వెళితే తెలిసింది. హాస్టల్ కెళ్ళి ఎంక్వయిరీ చేస్తే, ఈ విషయాలు బయటపడ్డాయి. ముందుగా చెప్పలేదని నీ మీద చాలా కోపం వచ్చింది" అన్నాడు నవ్వుతూ. అతడి నవ్వు చూసి నా మనసు తేలికయింది.
"అది నిజమే. కాని చెప్పకపోవడం రహస్యంగా వుంచాలని కాదు. అనవసరం అనిపించి" అన్నాను.
"అంటే అతడు మల్లిక అన్నయ్య స్నేహితుల్లో ఒకడా?"
"అవును. నలుగురు రౌడీలు మమ్మల్ని ఫాలో చేసేవారు. వాళ్ళల్లో ఇతనూ ఒకడు".

"నువ్వతడిని గుర్తుపట్టకపోయినా, అతడు నిన్ను గుర్తుపట్టి వుంటాడు. ఆ అమ్మాయిని చూడగానే పాత పగ గుర్తుకొచ్చి వుంటుంది. అందుకే ఒంటరిగా మిమ్మల్ని ఫాలో అయి భద్రాచలం వచ్చాడు. అవకాశం చూసి, చివరకు గోదావరి ఒడ్డున పట్టుకున్నాడు. నీ ఎదురుగా ఆ అమ్మాయిని ఏదో చేసి పగ తీర్చుకోవాలన్న ఉద్దేశ్యం అయింటుంది".

నిజమే. ఆలోచిస్తుంటే, అదే జరిగిందనిపిస్తోంది.
"ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఆ విషయాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఆనాటి నుంచి నువ్వు వాడిమీద కక్ష పెంచుకుని వున్నావని, అందుకే అవకాశం చూసి హత్య చేసావనీ అంటారు. వాళ్ళనెలా టాకిల్ చెయ్యాలో నాకు తెలుసు".
వచ్చినప్పుటి కోపం పోయి, కాస్త ప్రసన్నంగా వెళ్ళిపోయాడతను.

లాయర్ గా విజయం సాధించాలన్న తపన తప్ప, నన్ను రక్షించాలన్న ఆలోచన అతడికి వుండకపోవచ్చు. కాని, దానికోసం అతడెంత శ్రమ తీసుకుంటున్నాడో ఆలోచిస్తే మాత్రం చాలా గొప్ప వ్యక్తిగా అనిపిస్తున్నాడు.
‘ఓంకార్ ని నేను గుర్తుపట్టలేదని అతడు నమ్మాడు’ అనుకుంటే మనశ్మాంతిగా అనిపించింది. ఆ రాత్రి ఆలోచనలకు కొత్త వస్తువు దొరికింది.
ఎనిమిదేళ్ళ క్రితం ఒకమ్మాయిని అల్లరి పెట్టినందుకు ఒక దెబ్బ వేస్తే, ఎదగలేదన్నమాట. బహూశా ఈ ఎనిమిదేళ్ళలోఅతడు జీవితంలో ఏ రకంగాను స్థిరపడలేదు. రౌడీయిజంటో ఒక గుంపులో చేరి రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు.

డబ్బు విషయంలో కంటే స్త్రీ విషయంలో ఓటమి మగవాడిని ఎక్కువగా బాధపెడుతుందేమో! ఎప్పటికైనా పగ తీర్చుకుంటే తప్ప అహం శాంతించదు కాబోలు.
ఆ రాత్రి ఆలోచనలతో కలతనిద్రే అయింది.

* * *

ఈరోజే కోర్టులో కేసు ప్రారంభమవుతోంది. ఉదయం ఏడు గంటలకల్లా పోలీసువ్యాన్లో నన్ను కోర్టుకి తీసుకొచ్చారు. సెషన్ పదింటికి మెదలవుతుందట. నన్నొక గదిలో కూర్చోపెట్టి వెళ్ళారు. చేతులకి హేండ్ కప్స్ వేసి వున్నాయి. వాటిని చూస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది. నేనొక ఖైదీనన్న నిజానికి అలవాటు పడ్డమాట నిజమేగాని ఈ బేడీలతో నా మొహాన ట్రేడ్ మార్క్ వేసినట్లనిపిస్తోంది.

కోర్టు సీన్లు చాలా సినిమాల్లో చూసాను. అచ్చం అలాగే వుంది. జనం కిటకిటలాడుతున్నారు. ఎందుకొచ్చారీ జనం? నా కేసు గురించి అనిపించడంలేదు. నాది సాదా సీదా కేసు. ఏ ఆసక్తిలేని అది సాధారణమైన కేసు.

నేనుగాని, నా పరిచయస్తుల్లో ఎవరూగాని ఎప్పుడూ కోర్టు ఎలా వుంటుందో చూడాలని వెళ్ళలేదు. అంత సమయం, తీరిక, ఆసక్తి ఎవరికుంటాయసలు? కాని ఈ రోజు జనాన్ని చూస్తుంటే అనిపిస్తోంది కోర్టు విషయాల్లోను ఆసక్తి చూపించే జనం వుంటారని.
ఏ సినిమాకో, క్లబ్బుకో వెళ్ళినట్టు టైంపాస్ కోసం కోర్టుకి వస్తారేమో.
పోలీసు నన్నొక బోనులో నిలబెట్టాడు. అతడు నా పక్కనే నిలబెట్టాడు. ఇది అతడికి అలవాటయిన రొటీన్ కాబోలు.

"చూడు, నీ కేసు గురించి తెలుసుకోవాలని ఎంత మంది వచ్చారో" అన్నాడు మెల్లిగా నా లాయరు.
"అదే అనుకుంటున్నాను. ఎందుకొచ్చారింత మంది జనం?" అడిగాను ఆశ్చర్యంగా.
"నికు నిజంగా తెలియదా?" ఆడిగాడు ఆశ్చర్యంగా.
"లేదే".

"గత నెలరోజులుగా పేపర్లో నీ కేసు గురించి వార్తలే వస్తున్నాయి. అదిగో అక్కడ పక్కవరసలో కూర్చున్న వాళ్ళంతా ప్రెస్ రిపోర్టర్లే చూపించాడు. నిజమే ఒళ్ళో పుస్తకాలు, చేతుల్లో పెన్నులు పట్టుకొని కూర్చున్నారు. చాలామంది నన్నే నిశితంగా పరిశీలిస్తున్నారు.
"పేపర్లలో వ్రాయడానికి విశేషం ఏముందీ కేసులో?"
"ఏమో, నేను చదవలేదు".అన్నాడు. ఆ సంబాషణ కొనసాగించటం అతడికి ఇష్టంలేదని అర్థమయింది. అతను వెళ్ళిపోయాడు.
అంతా తమాషాగా వుంది. నా కేసులో విశేషం ఏమిటో నాకు తెలియదు. అక్కడ కూర్చున్న అందరికీ తెలుసు!!

జడ్జిగారి సీటు ఎదురుగుండా పొడవాటి టేబుల్ వుంది. నా సినిమా పరిజ్ఞానంతో ఆలోచిస్తే, అది లాయర్ల, ఇతర స్టాఫ్ కూర్చునే ప్రదేశంగా గుర్తుపట్టాను. ఆ వెనుక అంతా జనసమూహానికి వేసిన బెంచీలు. అప్పటికే అన్నీ నిండిపోయాయి. చాలామంది నిలబడి వున్నారు. చాలామంది చూపులు నామీదే కేంద్రీకరించబడ్డాయి. చూపులు తిప్పేశాను.

నా కుడివైపున వున్న తలుపులోంచి లాయర్ రఘవీర్ లోపలకు వచ్చాడు. వెంట మరో నలుగురు లాయర్లు వున్నారు. అందరి చేతుల్లో ఫైళ్ళు వున్నాయి. ఒక్క కేసు గురించి ఇంత తతంగమా?
రఘవీర్ చేతిలో పుస్తకాలు టేబుల్ మీద పెట్టి నా దగ్గరకు వచ్చాడు.

‘మరేం భయంలేదు. అంతా సవ్యంగా జరుగుతోంది. కేసు గెలవడానికి కావలసిన పాయింట్లన్నీ దొరికాయి. నువ్వు మాత్రం అన్నిటికీ క్లుప్తంగా సమాధానం చెప్పు. నేను అదుకుంటాలే’ అన్నాడు.
జడ్జిగారు వస్తున్నారని, అందర్నీ లేచి నిలబడమని అదేశించారెవరో. అంతా నిశ్శబ్దం, చిన్నప్పుడు స్కూల్లో హెడ్ మాస్టారు, ఇన్ స్పెక్టర్ గారు వస్తున్నారంటే ఇంత భయంగా, గౌరవంగానూ లేచి నిలబడే వాళ్ళం.

జడ్జిగారు వచ్చి కూర్చున్నారు. అందరూ కూర్చున్న శబ్దమే, ఆ నిశ్శబ్దంలో వింతగా ప్రతిధ్వనించింది. ఆ కాస్త శబ్దమే నాకు ఇరిటేషన్ తెప్పించింది. ఇన్నాళ్ళూ ఒంటరితనానికి అలవాటుపడి, ఇప్పుడింత జనసమూహాన్ని భరించలేకపోతున్నాను.
జడ్జిగారుకేసి చూశాను. అరవై ఏళ్ళ వయసుంటుందేమో. అయన సర్వీసులో ఎన్ని హత్యకేసులు విచారించి వుంటాడు? మొదటిసారి హత్య కేసు విచారించినప్పుడు ఎలా ఫీలాయ్యాడో.....

అందరూ నాకేసి సీరియస్ గా చూస్తున్నారు. అందులో శ్రీనాధ్ తప్ప తెలిసినవాళ్లెవరీ కనిపించటం లేదు. ఎవరూ రాలేదు. కనీసం ప్రణవి కూడా.
తలనొప్పి ఎక్కువ అవుతోంది.. బయట బాగా ఎండగా వున్నట్టుంది. లోపల ఉక్క చెమటలు కారుతున్నాయి. నడుము దగ్గిర కూడా విపరీతమైన నొప్పిగా వుంది.

జడ్జి నా వైపు తిరిగి చెప్పటం మొదలు పెట్టాడు. నా పేరు, ఊరు, వయసు, ఉద్యోగం అంతా ఆయన చెపుతుంటే ఆశ్చర్యం వేసింది. ఆయనికి నా బయోగ్రఫీ ఎవరు వ్రాసి పెట్టారూ అని.
హత్య జరిగిన రోజు గురించి కూడా అడిగాడు. ‘ఓంకార్ అక్కడున్నట్టు తెలియకుండానే గోదావరి ఒడ్డుకి వెళ్ళావా?’ అన్నాడు.

"నేను మామూలుగా ఈతకొట్టటానికి వెళ్ళాను".
"మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈత కొట్టాలనిపించిందా?"
"అవును"అన్నాను. అందులో అంతగా ప్రశ్నించవలసింది ఏముందో నాకు అర్థంకాలేదు. మిట్ట మధ్యాహ్నం చంటిపిల్లల్నెత్తుకుని ఎండలో మ్యాట్నీ సినిమాలకు వెళ్ళేవాళ్ళని అడగాల్సిన ప్రశ్న అది.
....జడ్జి ప్రాసిక్యూటర్ వైపు తిరిగి తన సాక్షుల్ని ప్రవేశపెట్టమన్నాడు.

పోస్టుమార్టం చేసిన డాక్టర్ వచ్చి దెబ్బ తగిలినచోట మళ్ళీ గట్టిగా దెబ్బ తగలటంవల్ల ప్రాణం పోయిందని చెప్పాడు. మొదటి దెబ్బతో ఆపు చేసి వుంటే బ్రతికివుండేవాడా? అన్న ప్రశ్నకి తప్పుకుండా బ్రతికేవాడు అని చెప్పాడు.
తరువాత సాక్షి ఆశ్రమం కేర్ టేకర్ విశ్వనాధంగారు.
"తల్లి వున్నప్పుడు ముద్దాయి అక్కడ ఎన్నాళ్ళున్నాడు?" ప్రాసిక్యూటర్ అడిగాడు. నా లాయరు లేచి అభ్యంతరం తెలిపాడు. దీనికీ కేసుకీ సంబంధం లేదన్నాడు. కానీ జడ్జి ప్రశ్న కొనసాగించమన్నాడు.

"ఒకే ఒకరోజు వున్నాడండీ".
"ఎన్నిసార్లొచ్చాడు?"
"అర్నెల్లల్లో ఒకే ఒకసారా?"
"అవును".
"కొడుకు తనని చూడటానికి రానందుకు ఆవిడ బాధపడలేదా?"

"అది సాధారణమే కదండీ. కాని ఆవిడ చెప్పుకునేది కాదు. రాత్రిళ్ళు ఒక్కోసారి దు:ఖిస్తూ వుండేదని మా వాళ్ళు చెప్పారు. నేను అడిగితే ఏమీ లేదనేది మహా ఇల్లాలు".
ఏ పరిస్థితుల్లో వెళ్ళలేకపోయానో నా ఒక్కడికే తెలుసు. సెలవు దొరకదు. తరుచు వెళ్ళటానికి డబ్బు కూడా లేదు. నాది టెంపరరీ ఉద్యోగం.
ప్రాసిక్యూటర్ అడిగాడు. "ఆవిడ మరణించిన తరువాత వచ్చాడన్నారు. అప్పుడతని ప్రవర్తన ఎలా వుంది? బాగా దు:ఖంలో వున్నాడా?"

లేదండీ, అసలు ఏడవలేదు. తల్లి శవం దగ్గిర కూడా వెళ్ళి కూర్చోలేదు".
కోర్టులో ఒక్కసారిగా కలవరం. నాకు ఆ కలవరాన్ని చూస్తే ఆశ్చర్యమేసింది. ఎవరయినా చనిపోతే మీదపడి ఏడవటం ఆచారమా? అసంకల్పితంగా చేసే ఒక చర్యా? అను దు:ఖాన్నీ, బాధనీ, చివరికి ప్రేమనీ బహిర్గతం చేయటానికి ఇష్టపడని వాళ్ళుంటారనీ వీళ్ళెవరికీ తెలీదా?
తరువాత ఏం జరిగింది?’

"అమ్మ ఎలా చనిపోయిందని వివరాలు కూడా అడగలేదు. కృపావతి దగ్గిరికి వెళ్ళిపోయి, రాత్రయ్యాక వచ్చాడు. ప్రొద్దున్నే శవాన్ని తీసుకు వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఇక్కడే శ్మశానంలో చెయ్యవచ్చు కదా అంటే, అటువంటి వాటిల్లో తనకు నమ్మకం లేదన్నాడు." జనం మళ్ళీ కలవరం.

మనిషి బ్రతికి వున్నప్పుడు ఎలా చూసుకోవాలో తెలియకపోయినా, చచ్చిన తరువాత ఏం చెయ్యాలో ఈ జనానికి బాగా తెలుసు. నా ఆలోచన్లని ఛేదిస్తూ -
"రాత్రి అక్కడే వున్నాడా"? అని అడిగాడు ప్రాసిక్యూటర్.

"ఉన్నాడు. భజన చేయిస్తున్నానంటే ఎందుకన్నట్లు మాట్లాడాడు. ఆశ్రమంలో వాళ్ళంతా వచ్చి కూర్చుంటారంటే ఇష్టంలేదన్నట్లు మొహం పెట్టాడు. ఒక రాత్రివేళ నేను చూడ్డానికి వెళితే కూర్చునే నిద్రపోతున్నాడు. ఆ తర్వాత బయటకు వెళ్ళి కూర్చున్నాడు".
"ఉదయం ఏం జరిగింది?"

"టాక్సీ వచ్చింది. వాళ్ళ బంధువులు వచ్చి అంత్యక్రియలు అలా చెయ్యడానికి వీల్లేదని గొడవపెట్టారు. అతడేం వినిపించుకోలేదు. చివరిసారిగా తిసుకెళ్ళేటప్పుడు చెయ్యవలసిన క్రియలేమీ కూడా చెయ్యలేదు." అంటూ నా వైపు అసహ్యంగా చూసాడు విశ్చనాథం. ఇప్పుడు నా పరిస్థితి ఇలా వుంది కాబట్టి ధైర్యంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నేను అడిగిన ఏర్పాట్లన్నీ నోరెత్తకుండా చేశాడు ఈయన.

"క్రియలేమీ చేయలేదన్నారు. అంటే ఎలాంటి క్రియలు?" ప్రాసిక్యూటర్ అడిగాడు.
"శవానికి స్నానం చేయించడం, కొత్త బట్టలు తొడగడం, పూలు చల్లడం లాంటివి ఏమీ చేయించలేదు. అలాగే తీసుకెళ్ళిపోయాడు".

కోర్టులో ఒక్కసారిగా గోల. వారానికోసారైనా స్నానం చెయ్యకుండా అలాగే వుండేవాళ్ళనీ, ఏడింటికి లేస్తే పదకొండింటికి స్నానం చేసే వాళ్ళని చాలామందిని నేను చూశాను. చనిపోయిన మనిషికి స్నానం చేయించలేదని వీళ్ళబాధ.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక అడిగేదేమీ లేదన్నాడు. లాయర్ రఘవీర్ లేచి వచ్చాడు.

"వాళ్ళ బంధువులు వచ్చి గొడవ చేశారన్నారు. ఎప్పుడు?"
"శవాన్ని తీసుకెళ్ళడానికి టాక్సీలో పెడుతుంటే".
"అంటే వాళ్ళు క్రితం రోజు నుంచి అక్కడలేరా?"
"ఉహూ! ఆవిడ పోయిందని కబురు చేసినా రాలేదు.
"కొడుకు వచ్చి చూడలేదని ఆవిడ బాధపడేదని మీరన్నారు. మరి బంధువులు చూసేవారా?"
"లేదు".
"వాళ్ళు డబ్బున్నవాళ్ళేనా?"

"ఉన్నవాళ్ళే. ఆవిడ బ్రతికి వున్నప్పుడు కూడా ఎన్నడూ ఒక పండో, కాయో తెచ్చివ్వలేదు. కానీ వాళ్ళందరికీ పళ్ళతోటలున్నాయి".
"థాంక్యూ. ఇంకేం లేదు"రఘవీర్ వెళ్ళి సీట్లో కూర్చున్నాడు.

నేను అడగాల్సిన ప్రశ్నలు అతడడగటం నాకు సంతోషాన్ని కలిగించింది. లాయర్ రఘవీర్ నన్ను బాగా అర్థం చేసుకున్నాడనిపించింది.
తర్వాత వచ్చిన సాక్షిని నేను గుర్తుపట్టలేదు. ఆశ్రమంలో వ్యక్తే ననుకుంటాను. ప్రాసిక్యూటర్ అడిగే ప్రశ్నలనిపట్టి అప్పుడు గుర్తు పట్టాను. ఆశ్రమంలో నౌకర్.
"వాళ్ళమ్మగారిని ఆయనేమీ అడగలేదండి. నేనే కొన్ని విషయాలు చెపితే విన్నారు" అంటున్నాడు. ఏ విషయాలో అర్థంకాలేదు.
"సిగరెట్ ఇచ్చాడా నీకు"?

"ఆ, ఇచ్చారండి. అతను ఒకటి వెలిగించుకున్నాడు. ఆ తర్వాత కాఫీ ఇస్తే తాగారు" కోర్టులో మళ్ళీ విపరీతమైన సంచలనం. జడ్జి చాలాసార్లు ఆర్డర్, ఆర్డర్ అనవలసి వచ్చింది.

అమ్మ శవాన్ని ఎదురుగా పెట్టుకుని సిగరెట్ కాల్చటం ఎంత దారుణమయిన విషయమో వివరిస్తున్నాడు ప్రాసిక్యూటర్. నాకు కోపం రావటంలేదు. నవ్వొస్తోంది. తండ్రి శవాన్ని లేపకుండానే ఆస్థులు పంపకాల గురించి, తల్లి శవం శ్మశానానికి చేరకముందే ఆవిడ వంటిమీద నగల గురించి, హక్కుల గురించీ మాట్లాడుకునే సంతానాన్ని నా కళ్ళారా చూశాను. మరెన్నో కథలుగా విన్నాను. వాళ్ళకంటే ఘెరమయిందా నేను చేసిన తప్పు. తమకు కావలసినవాళ్ళు ఆపరేషన్ ధియేటర్ లో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంటే బయట నిలబడి సిగరెట్లు వూదేసే వాళ్ళని ఎప్పుడూ చూడలేదా వీళ్ళు? అందులో కనపడని అసహజత్వం నా చర్యలోనే కనిపిస్తోందా?

తరువాత సాక్షిగా ఎలక్ట్రికల్ క్రిమెటోరియం సూపర్ వైజర్ వచ్చాడు. నేను చివరిసారిగా అమ్మ కాళ్ళకు నమస్కారం చెయ్యలేదని, అస్థికల కోసం అగమన్నా ఆగనన్నాననీ చెప్పాడు.

జడ్జిగారు బెదిరిస్తే గానీ కోర్టులో గొడవ సద్దుమణగలేదు.

తరువాత ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నా తరుపున మార్టిన్ గారు అమ్మ అస్థికలు పవిత్ర జలాల్లో కలపటానికి తీసుకు వెళ్ళారని వెప్పినప్పుడు, వింటూన్న జనానికి కొంత ఉపశాంతి కలిగింది. అమ్మ అస్థికలు పవిత్ర జలాల్లో కలిసాయంటే, ఒక మనిషి అత్మను డైరెక్టుగా స్వర్గానికి పంపినంతగా వాళ్ళు సంబరపడిపోయారు.
అసలు మార్టిన్, కృపా అంటీ ఏమయిపోయినట్లు? ఎందుకు రాలేదు?
నా ప్రశ్నకు సమాధానం వెంటనే లభించింది. జడ్జిగారి ప్రశ్నకు మార్డిన్ అమెరికాలో వున్నారని, కృపా అంటీ నెల క్రితమే గుండెపోటుతో మరణించిందనీ తెలిసింది.

కేసు మర్నాటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు జడ్జి. ఆయన వెళ్ళేవరకూ కోర్టులో ఒక్కటే గొడవ! అందరూ కేసు విషయమే మాట్లాడుకుంటూ వెళుతున్నారు.

వాళ్ళందర్నీ వెనక్కి పిలిచి అంత ఓర్పుగా ఆ ఉక్కపోతులో ప్రొద్దున్నించీ కూర్చుని, శ్రద్దగా అంతా గమనిస్తున్నందుకు, నా గురించి శ్రద్ధ తీసుకుని పేపర్లు చదువుతున్నందుకు, నా గురించి అంతగా చర్చించుకుంటున్నందుకూ ’థాంక్స్’ చెప్పాలనిపించింది. ఈ లోపులో పోలీసు వచ్చి నన్ను బోనులోంచి దిగమన్నాడు. వ్యాన్ ఎక్కించి కోర్టుహాలు నుంచి సెల్ కి తీసుకొచ్చి పడేసారు.

నిద్రపడుతుందనుకున్నాను కానీ వెన్నులో నొప్పి నిద్రపోనివ్వలేదు. ఈ గొడవల్లోపడి డాక్టరు చేసిన హెచ్చరిక మర్చిపోయాను. ఆర్నెల్లు గడిచాయా? గడువు ఇంకా వుందా?

ఇంకా నెలో, రెండు నెలలో వుండొచ్చు నేను మరణించటానికి.
ఈ లోపులో తీర్పు వస్తుందా?
నేను దోషిగా మరణిస్తానా - నిర్దోషిగా మరణిస్తానా?
మరణం ఎలానూ ఖాయమైనప్పుడు ఎలా మరణిస్తేనేం?

(- సశేషం)

     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)