కబుర్లు

వీక్ పాయింట్ / మీడియా ముద్దుబిడ్డ

- రచన : ఎం.వి.ఆర్.శాస్త్రి    

- ఆంద్రభూమి సౌజన్యంతో..


 

ఇక ఫరవాలేదు.
మోడీ బెడద తప్పింది.
దేశానికి రక్షకుడు దొరికాడు.
ముంచుకొస్తున్న మోడీ సునామీ బారి నుంచి సెక్యులర్ ఇండియాను కాపాడగల వారెవరూ కనపడక ఇంతకాలం దిగాలుపడ్డ మీడియా మేధావిగణానికి ఆమాద్మీ అరంగేట్రంతో ప్రాణం లేచొచ్చింది. ఆపదలో అక్కరకొచ్చేవాడే అసలైన మిత్రుడు. కాబట్టి ‘ఆప్’బాస్ అరవింద్ కేజ్రీవాల్ నరేంద్రమోడీని ద్వేషించే అలౌకిక, అతివాద, మితవాద, మతవాద, వేర్పాటువాద శక్తులకు అర్జంటుగా ఆప్తమిత్రుడయ్యాడు. ఆ బాపతు పుణ్యశక్తులకు అండదండ అయిన మిడిమేలపు మీడియాకు తెగ ముద్దొచ్చేస్తున్నాడు.
పార్టీ పుట్టి ఏడాది. పోటీచేసింది ఒక బుల్లి సిటీ స్టేటులో. అక్కడా దక్కింది రెండోస్థానం. ప్రజలు పూర్తిగా నమ్మి అధికారం అప్పగించకపోయినా, వారు తన్ని తగలేసిన మాజీ పాలకపక్షంతో చేతులు కలిపి అనైతికంగా పవర్లోకి వచ్చింది. ఆ తరవాతైనా ఊడబొడిచింది పెద్దగా లేదు. కరెంటు బిల్లులు సగం... మంచినీరు కొంతవరకు ఉచితం అని ప్రకటించినంత మాత్రానే ఎన్నికల బాస భేషుగ్గా నెరవేర్చినట్టు కాదు. ఇప్పుడిప్పుడే మొదలైన కొత్త రాయితీల అమలును నింపాదిగా గమనిస్తేగానీ వాటి సార్థక్యం ఎంతో తెలియదు. ఒక కొత్త ప్రయోగం అన్నదానికి మించి ఢిల్లీలో ఆమాద్మీ పనితనం గురించి ఓవరైపోవలసింది ప్రస్తుతానికి ఏమీ లేదు.
విఐపి సంస్కృతికి, పటాటోపానికి బహుదూరం అని చెప్పుకున్న ఆమాద్మీలు అధికారం అందగానే వెనకటి మాట మరచారు. మెట్రోరైలెక్కి, స్కూటరెక్కి ప్రమాణ స్వీకారానికి వెళ్లినవాళ్లు ఆ తతంగం కాస్తా కాగానే సర్కారీ వైభోగాలను ఎంచక్కా లంకించుకున్నారు. నిరాడంబరాన్ని ఇంటిపేరుగా చెప్పుకున్న విప్లవనాయకుడు కూడా తనకో పెద్దిల్లు; పక్కనే క్యాంపాఫీసు అమరేలా పెద్ద లోగిలిని ఎంచుకుని, సర్కారీ ఖర్చుతో దానికి సొగసులు పురమాయించి, జనంలో అల్లరయ్యాక ఆ ప్రయత్నం మానాడు.
సి.ఎం. అయినా సొంత ఇంట్లో ఉండేవాళ్లు, సాదాసీదాగా మసలేవాళ్లు దేశ చరిత్రలో ఎందరో ఉన్నారు. గోవా ముఖ్యమంత్రి పారికర్ ఇప్పటికీ స్కూటర్ ఎక్కుతాడు. కేజ్రీబాబు అధికార నివాసాన్ని ఒకవేళ వద్దన్నా అదో అపూర్వఘటన కాదు. ఎర్రబుగ్గను పీకేసి ఖరీదైన ప్రభుత్వ వాహనాల్లో మంత్రులు తిరగటం మహాత్యాగం కాదు.
కాని - దేశానికి కళ్లు, మెదడు అన్నీ తామే అనుకునే మీడియా శిఖామణులకు మాత్రం కళ్లు మూసినా తెరిచినా ఆమాద్మీ అద్భుత విజయం మినహా ఇంకో సబ్జెక్టు కనపడటం లేదు. కేజ్రీవాలా శక్తిని, ఎన్నికల్లో అతగాడి జాతీయ పెను ప్రభావాన్ని తలచుకుంటే వారికి ఒంటిమీద బట్టనిలవటం లేదు.
దేశంలోని మహానగరాలన్నీ ఆమాద్మీ మెళ్లో వరమాల ఎప్పుడెప్పుడు వేద్దామా అని ఆవురావురు మంటున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ అనే పత్రికా రాజం గొప్ప సర్వేను వండివార్చింది. ‘ఆప్’ అభ్యర్థికే ఓటెయ్యాలని 44 శాతం ఓటర్లు ఇప్పటికే డిసైడయ్యారన్న ఆ మహాపత్రిక భోగట్టాను చూస్తే ఎంతటి ‘ఆపా’త్ముడికైనా నోట్లో నీరు ఊరాల్సిందే. ఈ శుభవార్త వెలువడటానికి ముందే ఆమాద్మీలకు మేలుకొని ఉండగానే రంగుల కలలొస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా లాంటి చోట్ల సంసారపక్షంగా ఏ 50 సీట్లో పోటీచేద్దామని మొదట అనుకున్నవారల్లా పత్రికల్లో, టీవీ చానెళ్లలో డప్పులగోల ముదిరే కొద్దీ ఆశలు పెరిగి, ఇప్పుడు 15-20 రాష్ట్రాల్లో 300 లోక్‌సభ సీట్ల పైమాటే అంటున్నారు. ఎక్కడెక్కడి పెద్దలూ కొత్త పార్టీలోకి ఎగబడుతున్నారని వార్తలొచ్చే కొద్దీ తామెక్కడ వెనకబడిపోతామోనని ఎక్కడెక్కడి అమాంబాపతు పెద్దలూ ఆ పార్టీలోకి గద్దల్లా వాలుతున్నారు.
కేజ్రీ బాబు హైజాక్ చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఆద్యుడు అన్నా హజారే. ఆయన తనకు తండ్రిలాంటి వాడని స్వయంగా ఆ బాబే చెప్పుకున్నాడు. అంతటివాడే జాతీయ ఎన్నికల కుప్పిగంతులు మాని ఢిల్లీలో అసలు పనిని తిన్నగా కానివ్వమని ఇతగాడికి సలహా ఇచ్చాడు. అన్నా ఎందుకలా అన్నాడన్నది కొత్త బిచ్చగాడికి పట్టదు. అతనిని ఆకాశానికిత్తే మీడియాకు అంతకంటే పట్టదు.
‘కాంగ్రెసు సర్కారు కుంభకోణాల పాతర! షీలాదీక్షిత్ నిలువెల్లా అవినీతే. అధికారం అందీ అందగానే ఆమె అవినీతి వెంటపడతాం. ఎక్కడెక్కడి అక్రమాలనూ బయటికీడుస్తాం’ అని జనాన్ని నమ్మించి, స్వయానా షీలమ్మ మీదే పెద్ద మెజారిటీతో గెలిచిన గ్రంథసాంగుడు అదే కాంగ్రెసుతో కొంగుముడి వేసుకుని అధికారం కొట్టేశాక కాంగ్రెసు అవినీతి గురించి నోరెత్తితే ఒట్టు. వెనకటి కబుర్లు ఏమయ్యాయని పత్రికలవారు అడిగితే ‘సాక్ష్యం చూపండి - చర్య తీసుకుంటాం’ అని అడ్డం తిరగటం విడ్డూరం.
ఇదే మాట ఏ బిజెపి పాలకుడో అన్నాడనుకోండి. ‘సెక్యులర్’ మీడియా కాకుల్లా పొడిచేది. అలాగే - కాశ్మీర్‌లో వేర్పాటువాదులను, జాతి వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటున్న సైన్యాన్ని రిఫరెండం ద్వారా ఎత్తేయ్యాలన్న పాపిష్టి ఆలోచన ప్రశాంత భూషణ్ అనే ‘జిహాదీ మిత్ర’ ఆమాద్మీ పెద్దకు వచ్చింది కాబట్టి దేశభక్త మీడియా పెద్దగా పట్టించుకోలేదు. సర్వానర్థాలకూ మూలమైన 370 అధికరణం గురించి అందరూ చర్చించాలని నరేంద్రమోడీ అంటేనే అది నిష్కృతిలేని మహానేరంగా ఇదే మేధావిగణం గొంతులు చించుకుంది.
కాంగ్రెసుతో షరీకైనవాడు కాంగ్రెసు కొమ్మేకాస్తాడు. కాంగ్రెసును చిత్తు చేసేందుకు దూసుకొస్తున్న నరేంద్రమోడీ ధాటిని కొంతమేర తగ్గించడానికి మాత్రమే బహుశా పనికొస్తాడు. ఓట్లయుద్ధంలో విరోధిని నేరుగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడు ఓట్లు చీల్చి దొంగదెబ్బతీయటమే రాజకీయం. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవిని, జె.పి.ని పావుల్లా వాడుకుని బాబునోట మన్నుకొట్టినట్టే రేపటి ఎన్నికల్లో మోడీని మోదటానికి ఆమాద్మీని కాంగ్రెసు అడ్డంగా వాడుకుంటుంది. ఈ సంగతి అమాయకులకు సైతం అర్థమైనా మీడియా అర్కెస్ట్రా మాత్రం కేజ్రీని ‘రాగా’ (రాహుల్‌గాంధి)కి ఎక్కువ; ‘నమో’కు తక్కువ అయిన తృతీయ ప్రత్యామ్నాయంగా, ముందుకు దూసుకుపోతున్న స్వతంత్ర శక్తిగా చూపెట్టాలని నానా తంటాలు పడుతున్నది. ప్రజాభిప్రాయాన్ని కృత్రిమ ఉత్పత్తి చేయగలమనుకునే పత్రికలను చానెళ్లను మాత్రమే చదువుతూ, చూస్తూ కూర్చొనేవారు ఈ మాయాజాలానికి ఓహో అనుకోవచ్చు. కాని - పత్రికా వ్యాఖ్యాతలు, టీవీల వాగుడుగాళ్లు ఎన్నికల రిటర్నింగు అధికారులు కాదాయె! ఎన్నికల వైతరణిని దాటటానికి కుక్కతోక ఎలా పనికొస్తుందబ్బా!?

 
     
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)