కబుర్లు

సత్యమేవ జయతే! అమెరికాలమ్ – 30

- రచన : సత్యం మందపాటి   


 

రేపులు లేని రేపు!

 
 

అది డిసెంబర్ 16, 2012.

భారతదేశ రాజధాని ఢిల్లీ.

            “లైఫ్ ఆఫ్ పై” అనే సినిమా చూసి, 23 ఏళ్ల ఒక యువతి, 28 ఏళ్ల స్నేహితుడూ ఇంటికి వెళ్ళటం కోసం బస్సు ఎక్కారు. ఆ బస్సు అనుకున్న వేపు కాక ఇంకెటో వెడుతుంటే, స్నేహితుడికి అనుమానం వచ్చింది. అప్పుడే తెలిసింది ఆ బస్సు డ్యూటీ పూర్తిచేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్న బస్ అని. స్నేహితుడు ఆ బస్సుని ఆపమని అడిగినా, వాళ్ళు ఆపలేదు. బస్సులోవున్న ఆరుగురూ ఆ యువతిని, యువకుడినీ ఇనుప కడ్డీతో కొట్టి, బస్సు వెనక్కి లాక్కుపోయారు. ఆ యువతిని ఒకరి తర్వాత ఒకరు – ఆ ఆరుగురూ మానభంగం చేశారు. సామూహిక అత్యాచారం. అంతేకాదు అదే ఇనుప కడ్డీతో ఆమె మర్మాంగాన్ని, పొట్టనీ చీల్చివేశారు. ఆ ఇద్దరి శరీరాల్నీ బస్సులో నించీ క్రిందకి విసిరేశారు. డ్రైవరు బస్సుని ఆమె శరీరం మీదుగా పోనిస్తుంటే, చావు దప్పుల్లో వున్న ఆమె మిత్రుడు ఆమెని  పక్కకి తప్పించాడు

            తర్వాత రాత్రి పదకొండు గంటలకు రోడ్డు మీద అర్ధనగ్నంగా పడివున్న ఆ ఇద్దరినీ ఎవరో చూసి పోలీసులకి రిపోర్ట్ చేశారు.

            ఇంత ఘోరమైన అమానుషం జరగగానే, అందులోనూ భారతదేశ రాజదానిలో జరగగానే, భారతదేశం ఒక్కసారిగా మేల్కొన్నది.

            నిద్రపోతున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు, వందల్లో వేలల్లో వచ్చి నిద్రలేపారు.

                                                                                                                 

            ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో, రక్తాశ్రువు చిందిస్తూ, రాస్తున్నా శోకంతో.. మరో మహా భారతం, ఆరవ వేదం.. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం.. నిర్వేదం” అన్నారు వేటూరి.

                                                                                                                 

            తర్వాత ఐదు సర్జరీలు చేసి, నిర్భయ పొట్టలోనించీ కొన్ని పేగులు తీసివేశారు. ఇంకా ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంటే, సింగపూరులోని స్పెషాలిటీ హాస్పిటలుకి తరలించారు. నిర్భయ అక్కడ డిసెంబరు 29, 2012న ఈ దుర్వినీత లోకం వదిలి, రక్తాశ్రువులు చిందిస్తూ.. మానభంగపర్వంలో ఒక పాత్రగా మిగిలి... ఎంతో దూరంగా..  వెళ్ళిపోయింది.

                                                                                                                 

            జనవరి మొదటివారంలో మేము, హైదరాబాదులోని వేగేశ్న ఫౌండేషన్ వారి వికలాంగుల పాఠశాలకి వెళ్ళాం. వికలాంగులకి అశ్రువులు చెరిపేసి మరో జన్మనిస్తున్న ప్రదేశం అది.

            ఢిల్లీలో జరిగిన మరో మహా భారతం గురించి, పిల్లలకి నాలుగు మాటలు చెప్పమన్నారు నన్ను.

            ఏమని చెప్పను? ఇలాటివి ఎందుకు జరుగుతాయో నాకే తెలియని వయసులో పెద్దని, అభం శుభం తెలియని ఆ అమాయకపు పసికందులకి, నిర్భయ కేసు గురించి వారికి అర్ధమయే భాషలో ఎలా చెప్పను?

            అప్పుడే గుర్తుకి వచ్చింది, వేటూరివారి ఆక్రందన.

            పుడుతూనే పాలకేడ్చి, పెరిగి పెద్ద కాగానే ముద్దూ మురిపాల కేడ్చీ, తనువంతా దోచుకున్న తనయులు మీరు.. మగసిరితో బ్రతకలేక కీచకులై, కుటిల కామ నీచకులై, స్త్రీ జాతిని అవమానిస్తే, మీ అమ్మల స్తన్యంతో, మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా.. ఈనాడే మీకోసం.. మరో మహా భారతం..”

ఈ అక్షర లక్షల వాక్యాలకి శరీరం ఉడికిపోతుంటే, ఆ అమాయకపు పిల్లలకి నేను ఏమని చెప్పేదీ? ఎలా చెప్పేదీ?

            రెండు నిమిషాలు తమాయించుకుని, సృష్టికి స్త్రీ జాతి ఎంత ముఖ్యమైనదో, అదే స్త్రీ ఒక అమ్మగా, ఒక అక్కగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా మనకి ఎంత ప్రేమ పంచుతుందో, మనం ఆ ఋణం తీర్చుకోవటానికి వారిని ఎంతగా గౌరవించాలో, జీవితంలో మన మానవత్వపు విలువలు ఎలా కాపాడుకోవాలో ఆ చిన్న చిన్న పిల్లలకి అర్ధమయేలా నా మాటలతో జాగ్రత్తగా చెప్పాను.

కానీ.. ఇంటికి వచ్చాక కూడా నా మనసులో నించీ ఇవేమీ బయటికి వెళ్ళలేదు. అదే ఆలోచన. అందుకే ఈ విషయంలో ఎన్నో వివరాలు సేకరించి ఇన్నాళ్ళకి ఈ వ్యాసం వ్రాస్తున్నాను.

                                                                                                                 

            ఢిల్లీ మన దేశానికి మాత్రమే రాజధాని కాదు. మానభంగాలకు కూడా రాజధాని. ఈ నగరంలో జరిగినన్ని మానభంగాలు, దేశంలో ఇంకెక్కడా జరగటంలేదు. 2012వ సంవత్సరంలో అంతకు ముందు యాభై ఏళ్లలో ఎన్నడూ జరగనన్ని ఎక్కువ మానభంగాలు జరిగాయి. 2013లో మొదటి ఆరు నెలలలో అంటే జనవరి నించీ జూన్ దాకా 1780 కేసులు నమోదయాయి. 2012లో అవే నెలలలో 1270 కేసులు నమోదయాయి. అంటే అప్పటికే అవి నలభై శాతం దాటాయి. 2013 గణాంకాలు 2012 సంవత్సరం మీద రెట్టింపు అవుతాయని అధికారుల అంచనా. నిర్భయ కేసు అయాక కూడా ఈ అత్యాచారాల సంఖ్య తగ్గకపోగా, ఇంకా ఎక్కువయింది. దేశమంతటానే కాక, ముఖ్యంగా ఢిల్లీలో!

కొన్ని స్త్రీవాద సంఘాలు, భారతదేశంలో సాంస్కృతికపరంగానూ, మానభంగం చేయబడిన స్త్రీల తదుపరి భవిష్యత్తు దృష్ట్యానూ చాలామంది స్త్రీలు, వారి కుటుంబాలు మానభంగం జరిగినప్పుడు పోలీసు రిపోర్ట్ ఇవ్వరనీ, ఆ కారణం చేత ప్రభుత్వ గణాంకాలు, మామూలుగా జరుగుతున్న గణాంకాల కన్నా చాల తక్కువ చూపిస్తున్నాయని అంటున్నారు. ముంబాయిలో కూడా గణాంకాలు ఎక్కువే కానీ ఢిల్లీ అంత కాదు

            భారతదేశం మొత్తం మీద రిపోర్టు చేయబడిన మానభంగాలు 1990నించీ 2008దాకా రెట్టింపు అయాయనీ, అప్పటినించీ ప్రతి సంవత్సరం చకచకా పెరిగిపోతున్నాయనీ చెబుతున్నారు. 2011లో మొత్తం భారతదేశంలో 24,206 కేసులు నమోదయాయి. దాదాపు ఇంకా అన్ని కేసులు అసలు నమోదే అవలేదని కొన్ని సంఘాలు చెబుతున్నాయి. ఈరోజుల్లో ప్రతి ఇరవై నిమిషాలకీ భారతదేశంలో కనీసం ఒక మానభంగం కేసయినా రిపోర్ట్ అవుతున్నది అని ప్రభుత్వమే చెబుతున్నది. మరి నిజంగా ఎన్ని జరుగుతున్నాయో చెప్పటం కష్టం!

            మన హైదరాబాదు కూడా తక్కువేమీ కాదు.

            అక్టోబర్ 23, 2013 రోజున హైదరాబాదులో సాఫ్టువేరు ఇంజనీరు అభయ (నిజం పేరు కాదు. పోలీసులు ఇచ్చిన పేరు) ఆఫీసు పని పూర్తయాక, షాపింగ్ చేయటానికి వెళ్ళింది. రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు, హాస్టల్ కి వెళ్ళటానికి బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడింది.

            ఒక కారులో వెడుతున్న ఇద్దరు వ్యక్తులు, కారు ఆపి తాము అటే వెడుతున్నామనీ, యాభై రూపాయలు ఇస్తే ఆమెని హాస్టల్ దగ్గర దింపుతామనీ అన్నారు. నలభై రూపాయలకు బేరమాడి, కారు ఎక్కింది అభయ.

            కారుని పక్క దారి పట్టించి మెదక్ జిల్లాలోని అడవి ప్రదేశానికి తీసుకువెళ్ళారు, 32 ఏళ్ల సతీష్, 28 ఏళ్ల వెంకటేశ్వర్లు. ఆ రెండు గంటల ప్రయాణంలోనూ అభయ వారితో పోట్లాడుతూనే వుంది. కారులోనించీ దూకటానికి ప్రయత్నాలూ చేసింది. బెంగుళూరులో వున్న స్నేహితుడికి ఫోన్ చేస్తుంటే, ఆమె సెల్ ఫోన్ని బయటికి విసిరేశారు. బెంగుళూరు స్నేహితుడు అర్ధాంతరంగా ఆగిపోయిన ఫోన్ కాల్ వల్ల  అనుమానం వేసి, హైదరాబాదులోని మిత్రులకి ఫోన్ చేశాడు. పోలీసు రిపోర్టు ఇవ్వమన్నాడు.    

            ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఆ ఇద్దరూ ఎన్నోసార్లు అభయని చెరిచారు. వాళ్ళ పని పూర్తి అయాక, ఆమెని హాస్టల్ దగ్గర దించి పారిపోయారు. పోలీసులకి చెబుతుందేమో అని వెంకటేశ్వర్లు అంటే, “ఏమీ చెప్పదురా.. ఇది భారతదేశం” అన్నాడు సతీష్.

            రిపోర్టు అందుకున్న పోలీసులు, అభయని కలిసి ఆమెతో మాట్లాడారు. కానీ సతీష్ అన్నట్టుగానే ఆమె మానభంగం జరిగినట్టు వారికి చెప్పలేదు. తనని బలవంతాన తీసుకుపోయారనీ, తను గట్టిగా గొడవ చేస్తే వదిలేసి వెళ్ళిపోయారనీ చెప్పింది. ఆమె దుస్తుల మీదా, వంటి మీదా రక్తం చూసిన పోలీసులు ఆమె మాటలు నమ్మలేదు. గుచ్చిగుచ్చి అడగగా, ఇరవై నాలుగు గంటల తర్వాత అసలు విషయం చెప్పింది. ముందుగా నిజం చెప్పకపోవటానికి ఆమె ఇచ్చిన కారణం, తన తల్లిదండ్రులకు ఆ విషయం తెలిస్తే, అప్పటికప్పుడు ఆత్మహత్య చేసుకుంటారని!

            హాస్టల్ బయట వున్న విడియో కెమెరా సహాయంతో ఆ కారునీ, ఆ ఇద్దరు అపరాధులనీ పట్టుకున్నారు.

ఐదారేళ్ల పసిపిల్లల్ని రేప్ చేసిన సంఘటనలు కూడా ఈమధ్య హైదరాబాదులో జరిగాయి.

            “ఇలాటి కేసులు వెయ్యి జరిగితే, వాటిలో ఒకటి మాత్రమే పోలీసుల దాకా వెడుతుంది. వారి తల్లిదండ్రులు, భర్త, సమాజం, అంతకు మించి సమాజంలో వారి భవిష్యత్తు దృష్ట్యా, ఎంతోమంది ధైర్యం చేయరు” అన్నది క్లినికల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ.          

                                                                 

కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి – మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా, ఎర్రని తన రక్తాన్ని తెల్లటి నెత్తురు చేసి – పెంచుకున్న తల్లి ఒక ఆడదనే మరిచారా, కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర - ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర, రతి భారత సతి మానం చంద్రమతీ  మాంగల్యం, మర్మస్థానం కాదది మీ జన్మస్థానం, మానవతకికి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం...”  

                                                                 

మన హైదరాబాదులో రేపులతో పాటూ ఇంకా ఘోరమైనవి కూడా జరుగుతున్నాయి. అరబ్ దేశాలకు చిన్న వయసులో వున్న ఆడపిల్లల్ని బలవంతాన పంపించటం ఇక్కడ చాల ఎక్కువ. ఆడపిల్లల అమ్మకాలు అందామా!

ప్రతిరోజూ హైదరాబాదునించీ అరబ్ దేశాలకు వెళ్ళే విమానాల్లో ఇలాటి అమాయకపు ఆడపిల్లలు కొందరైనా బలవంతాన పంపబడుతున్నారన్నది కొంచెం ఆశ్చర్యకరంగానే వుంది!

ఇవి కాక మన ఆంధ్ర ప్రదేశంలో చదువుకునే ఆడపిల్లల మీద ఏసిడ్ పోయటం, చంపేయటం కూడా

మామూలయిపోయింది. కారణం ప్రేమిస్తున్నామని వెంటపడటం, చదువు కొనసాగించాలనుకుంటున్న ఆడపిల్లలు నిరాకరిస్తే, వారి మీద “పగ” తీర్చుకోవటం. అసలు ఈ పగ ఏమిటో నాకు అర్ధం కావటంలేదు. ప్రేమ అనేది ఇద్దరు మనుష్యులు ఇచ్చి పుచ్చుకునేది. ప్రేమలో పగ లేదు. ఉండదు. ఉండకూడదు. ప్రేమ మనుష్యులని చంపదు. ప్రాణాలు నిలబెట్టిస్తుంది. త్యాగాలు చేయిస్తుంది.

            అంతేకాదు.. కడుపులో వున్నది ఆడపిల్ల అని తెలుసుకుని, బలవంతాన కడుపు త్రుంచుతున్నదీ మన భారతదేశంలోనే! ఇప్పుడు ప్రతి వెయ్యిమంది మగవారికి ఆడవారి నిష్పత్తి 914. అంటే ప్రతి వెయ్యిమంది మగవారిలో, ఎనభై ఆరు మందికి పెళ్లి చేసుకోటానికి భారతదేశంలో ఆడపిల్లలు లేరు! హతవిధీ!

ఈ నిష్పత్తి గత పదేళ్లలో బాగా పడిపోయింది. ఇంకా శరవేగంతో పడిపోతున్నది!

ఈ కారణం వల్ల, ఇక మనకీ ‘గే’ పెళ్ళిళ్ళు ఎక్కువయిపోతాయేమో! J 

                                                                                                   

మా పెళ్ళయిన 1970 నించీ గుంటూరులో వున్న రెండేళ్లు, నేనూ నా శ్రీమతీ రెండు మూడు కిలో మీటర్ల దూరంలో వున్న లీలా మహల్లో సెకండ్ షో సినిమా చూసి, అర్ధరాత్రి నడిచి ఇంటికి వచ్చేవాళ్ళం. నడవటం అంటే మా ఇద్దరికీ ఇష్టం కనుక. వెన్నెల్లో నడక సరదాగా వుండేది. కానీ గత పదేళ్లల్లోనూ ఇండియా వెళ్ళినప్పుడు, నాకు మావాళ్ళు ఇచ్చిన సలహా రాత్రి పది గంటలు దాటాక రోడ్డు మీద నడవవద్దు, కారులో వెళ్ళమని.

            ‘అదేమిటి మన గుంటూరు అంత ప్రమాదకరమా’ అని అడిగాను.

            మిగతా చాల వూళ్ళ మీద నయమే కానీ, ఒక్కసారి రాత్రి పూట బయటికి వచ్చి చూడు అన్నాడు తమ్ముడు. రాత్రి పూట ఎక్కడపడితే అక్కడ పూటుగా తాగటానికి ఎన్నో బార్లు, పబ్బులు, మధ్యే మధ్యే ప్రసాదులు.. అంటే ప్రభుత్వ సారా దుకాణాలు. తాగటం అంటే మామూలుగా, సరదాగా, ఇప్పుడో అప్పుడో ఒక డ్రింకు తాగటం కాదు. మంగళగిరి పానకాలస్వామి వీళ్ళ ముందు దేనికీ పనికిరాడు. కొన్ని చోట్ల రాత్రి పదకొండు గంటలకి అరుచుకుంటూ, తాగి తందానాలాడుతూ, రోడ్ల మీద పడి దొర్లుతున్నవాళ్ళు కనపడుతూనే వున్నారు

            మరి ఇవన్నీ మన పుణ్య భారతదేశంలో ఎందుకిలా జరుగుతున్నాయి?

నేను క్షేమంగా పెరిగిన, నన్ను క్షేమంగా పెంచిన భారతదేశం ఇప్పుడు ఏమయిపోయింది?

                                                                                                                 

            శిశువులుగా పుట్టి మీరు పశువులుగా మారితే, మానవ రూపంలో దానవులై పెరిగితే, సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే, కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో, భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో, నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే, ఏమయిపోతుందీ సభ్య సమాజం, ఏమయిపోతుందీ మానవధర్మం ఏమయిపోతుందీ ఈ భారతదేశం, ఏమయిపోతుందీ మన భారతదేశం ...”  వేటూరివారి హృదయ ఘోష!

                                                                 

            “ఇవన్నీ నిజం కాదు. మీడియా చేసే గోల” అన్నాడొకాయన.

            దానికి నేను ఒప్పుకోలేదు. ఇలాటి విషయాల మీద ‘గోల’ చేయటం మీడియా పని మాత్రమే కాదు. బాధ్యత కూడాను. ఇలాటి విషయాలు దాచి పెట్టినందు వల్ల సమస్యా పరిష్కారం జరగదు. మీడియా కొంచెం ఎక్కువ హడావిడి చేసినా, ఇతర స్వచ్చంద సంస్థలు ఇచ్చే గణాంకాలు తప్పు అని నేను అనను. ప్రభుత్వం కూడా ఒకవేళ ఆ సంఖ్యలని తక్కువ చేసి చూపిస్తుందేమో కానీ, ఎక్కువ చేసి మాత్రం కాదు

                                                                 

మానవులే దానవులై, మన సభ్యతకీ, సంస్కృతికీ సమాధి కడుతున్నారు. నవశక్తులు, యువశక్తులు నిజంగానే నిర్వీర్యం అయిపోతున్నాయి. ప్రభుత్వమే కాక, ప్రజలూ కళ్ళు గట్టిగా మూసుకుని నిద్రపోతున్నారు.

ఎక్కడ చూసినా లంచం. లంచం ఇవ్వటం నేరం కాదు అనేంతగా పాతుకుపోయింది. దీనికి కారణం నేటి యువత ఇస్తున్న ప్రోత్సాహం. ‘లంచాలు లేకపోతే ఏమీ చేయలేం, అవి వుండటం వల్లే మన పనులు త్వరగా అవుతున్నాయి’ అనే ‘నవ’ వాదన సర్వత్రా వినిపిస్తూనే వుంది. ఏది చేసినా ‘నాకేమిటి లాభం’ అనేదే ఒక నినాదంగా మారిపోయింది. గత ఇరవై ఏళ్లుగా ఇవి ఎక్కువ అయిపోయాయి అని పైన చెప్పిన గణాంకాలు నిరూపిస్తున్నాయి.

ఎందువల్ల ఇలా మారిపోతున్నారు? మనిషిలోని మానవత్వం, మమత, ప్రేమ.. అన్నిటికీ మించి జీవితంలోని విలువలు ఏమై పోయాయి?

కొత్త పిచ్చాడు పొద్దు ఎరగడని, పబ్ కల్చర్ రాగానే, తాగుడూ, డ్రగ్స్ కూడా ఎక్కువయిపోయాయి. మానవుడిని దానవుడిగా చేస్తాయవి

సాంస్కృతిక పరంగా చూస్తే, మన సంస్కృతి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశంలో మనకి దూరమయిపోయింది. భాష దిగజారిపోయింది. సంప్రదాయాలు పుస్తకాల్లో, పల్లెలూ, చిన్న నగరాలకే పరిమితం అయిపోయాయి. గుజరాతీలు, బెంగాలీలు, తమిళులు, ఇంకా ఎందరో అలా లేరే? మనకే ఎందుకు ఈ దౌర్భాగ్యం?

మతం చెప్పే మంచి విషయాలు, వేదాలు ఉపనిషత్తుల్లో భద్రంగా దాచివున్నాయి. పూజలూ, పునస్కారాలు, తంతులకే అలవాటయిన జనాభాకి, లక్షమందిలో ఒక్కరికి కూడా, ఉపనిషత్తులు ఎన్నో, వాటిల్లో ఏముందో తెలీదు.   

ఒకవేళ పశ్చిమ దేశాలని అనుకరించాలనుకుంటే, వాళ్ళ దగ్గరనించీ నేర్చుకోవాల్సిన మంచి ఎంతో వుంది కదా - అది వదిలేసి, మరి అక్కడ వున్న చెడునే ఎందుకు కాపీ కొడుతున్నాం మనం?

            ప్రేమకీ కామానికీ తేడాలేదని చాటుతున్నాయి మన తెలుగు సినిమాలు. ఆ కామాన్ని రెచ్చకొట్టాటానికి, బట్టలు విప్పి తమ శరీరాలని అన్ని కోణాల్లోనూ చూపిస్తున్నారు హీరోయిన్లు. అంతేకాదు, ప్రేమని పగ ద్వారా సాధించవచ్చు అనే నినాదాన్ని కూడా నేటి సినిమాలు ప్రోత్సహిస్తున్నాయి. నేటి తెలుగు సినిమాలు నేర్పుతున్న అవలక్షణాలే పైన చెప్పిన వన్నీ.

            మంత్రులూ, గవర్నమెంట్, దేశం పాడయిపోయిందని, ప్రతి రోడ్డు మీదా అరుస్తామే కానీ, వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తామే కానీ, బయటికి ఎందుకు పంపించటం లేదు? ఓటు హక్కుని కూడా వాడుకోలేని ప్రజలని రక్షించేదెవరు?

ఆకాశంలోనించీ ఒక హీరో దిగి రావటం సినిమాల్లోనే కానీ, నిజ జీవితంలో జరగదు.

ప్రతిఘటించే ప్రతి మనిషీ హీరోనే! అంత చిన్న విషయాన్ని ఎలా మరచిపోతున్నాం?

            కనుక.. ఈ సమస్యకి మూలకారణం మనమే! ప్రజలు!

            ప్రజల్లో ఆ చైతన్యం వస్తేనే కానీ, రోజులు మారవు.

            రేపులు లేని రేపు రావటం కోసం, ప్రతి పౌరుడూ తనవంతు బాధ్యత తను నిర్వహించవలసిందే!

            అప్పుడే ఆడపిల్లలు నిర్భయంగా రోడ్ల మీద తిరగగలిగేది

            ఆ భయం తీర్చి, అభయం ఇవ్వవలసింది కూడా నవశక్తులే, యువతరమే!

            స్త్రీని గౌరవించలేని దేశం, చరిత్రలో దిగజారిపోతుంది!

                                                                    

 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)