సారస్వతం

నేటి సమాజంలో స్త్రీ సవాళ్ళు

- రచన :  - జ్యోతిర్మయి  


 

 

 
 

సభ్య సమాజం తలదించుకునేలా ప్రతి నిత్యం మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల్ని గురించి చదువుతూనే వున్నాం. "ఆడది అర్ధరాత్రి స్వతంత్ర్యంగా బయట తిరగ గల్గినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు" అన్న మహాత్ముని మాటలు విన్నప్పుడు, "అర్ధరాత్రి బయట దానికేం పనో" అని వంకరగా నవ్వే సంకుచిత స్వభావం వున్న వాళ్ళు మన చుట్టూ పెద్ద సంఖ్యలోనే వున్నప్పుడు, జరుగుతున్న సంఘటనల పట్ల విస్మయం వ్యక్తం చేయటం అర్ధ రహితం.

ఇటువంటి నేరాలు చేసిన దుర్మార్గులకి కఠినమైన శిక్షలని నిష్పక్షపాతంగానూ, సత్వరంగానూ విధించడం ద్వారా చట్టం కొంత వరకైనా నేరాల శాతాన్ని తగ్గించగలగటానికి ప్రయత్నించాలి. కానీ అది రోగంతో కుళ్ళిపోయిన శరీరానికి కేవలం పైపైన పూతలు పూయటం లాటిది. నానాటికీ పెరిగి పోతున్న ఈ విపరీత ధోరణులకి మూలాల్ని అన్వేషించాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి పైనా వుంది. అప్పుడు మాత్రమే వెర్రి తలలు వేస్తున్న యీ విష వృక్షాన్ని సమూలంగా పెకలించి మన రాబోయే తరాలకి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలం. విశ్వకవి ఠాగూర్ పలవరించినట్టు, "ఓ ప్రభూ! అటువంటి స్వేఛ్చాయుత స్వర్గ ధామంలోకి నా దేశాన్ని మేల్కొలుపు".

సంఘమనే బండిని స్త్రీ, పురుషులనే రెండు ఎడ్లు పరస్పరం సమన్వయంతో లాగినప్పుడే అది గమ్యాన్ని సరిగ్గా చేరగలుగుతుంది. అక్క, చెల్లి, స్నేహితురాలు, ప్రేయసి, భార్య లాంటి భిన్న రూపాల్లో మనిషి జీవితాన్ని సుసంపన్నం చేసే స్త్రీమూర్తిని గౌరవించటమనేది కేవలం మహిళా దినోత్సవం నాడు జరిగే మొక్కుబడి తంతులా కాకుండా ప్రతి రోజూ, ప్రతి క్షణం జరగాలి.

"నీ మొహం నీకేం తెలుసే, నోరు మూసుకో" అనే మాటలు ఇప్పటికీ చాలా ఇళ్ళల్లో వినపడుతూనే వుండటం మనందరం సిగ్గు పడాల్సిన విషయం. మన తల్లుల్ని, భార్యల్ని, తోడబుట్టిన వాళ్ళని మనమే గౌరవించలేనప్పుడు, ఎవరో దారిన పోయే సంస్కార హీనుడు ఎలా గౌరవిస్తాడు? ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని స్త్రీలు విజ్ఞానవంతులయ్యేటట్టు, ఎటువంటి విపత్కర పరిణామాలనైనా ఎదుర్కోగలిగేటట్టు, ఆత్మ విశ్వాసంతో తలెత్తుకు తిరిగేటట్టు చేసే రోజు రావాలి. తమ బిడ్డలు సాటి వాళ్ళను, ముఖ్యంగా ఆడవాళ్ళను గౌరవించేలా పెంచటం ప్రతి తల్లి, తండ్రీ కనీస బాధ్యత కాదా?

తమ కంటే భిన్నమైన విషయాలనీ, వ్యక్తులనీ సహించటమనే తొలి మెట్టుపై కాలు మోపలేని ఏ జాతికైనా పురోగమనం ఎండమావే. అహంభావం అనే అగ్నికి, స్వార్ధమనే గాలి తోడైతే మనిషి హద్దులు దాటుతాడు .. మృగమౌతాడు. ఒకమ్మాయి తనను కాదందనో, లేదా అవమానించిందనో, లేదా తనకు నచ్చని విధంగా బట్టలు వేసుకుందనో, ఆమెను బాధించాలి, అవమానించాలి అనే అపరిపక్వ ఆలోచనలు పుడుతున్నాయి. "ఆ సమయంలో ఆ అమ్మాయికి బయటేం పని?", "ఎవడో మగాడితో తిరుగుతుంటే అలా కాకుండా ఏమౌతుంది?", "అలాంటి దుస్తులు వేసుకుంటే మానభంగాలు జరుగుతాయి మరి" లాంటి దురదృష్టకర వ్యాఖ్యలు మన సమాజపు పలాయనవాద దృక్పధాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కళ్ళకు కడతాయి. ఆ అమ్మాయి వుద్యోగ రీత్యానో, అత్యవసర పరిస్థితిలోనో బయటికి వెళ్ళుండవచ్చు; ఆమెతో వున్న వ్యక్తి ఆమె స్నేహితుడో, తండ్రో, సోదరుడో అయివుండొచ్చు; అతి హేయమైన నేరాలకు పాల్పడిన మృగాలను సైతం నేరం ఋజువు కానిదే శిక్షించని మనం, మన ఆడపిల్లల నుదుట లిఖించబడుతున్న అన్యాయమైన మరణశాసనాల్ని ఏ నైతిక హక్కుతో సమర్ధిస్తున్నాం? ఆమెను బాధించటం, హింసించటం సరైనదని ఏ నాగరిక చట్టం చెపుతోంది .. ఆమె ప్రాణానికున్న విలువ ఏ విధంగా మన ప్రాణానికన్నా తక్కువ?

ఆడపిల్లలని ఎంతో అపురూపంగా పెంచుకునే కుటుంబాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ముదావహం. ఆడవాళ్ళు యుధ్ధ రంగంతో సహా అన్ని రంగాల్లోనూ "మేము సైతం" అంటూ ముందుకి వెళ్తున్నారు. ఇటు కుటుంబాల్ని, అటు వుద్యోగాల్ని సమన్వయించుకుంటూ సమాజాభివృధ్ధికి తమ వంతు శాయశక్తులా కృషి చేస్తున్నారు. పురిటిలో కన్ను తెరిచిన క్షణం నించీ పొంచి చూసే సమస్యల సుడిగుండాల్ని నేర్పుగా తప్పించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఆ ప్రయత్నంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనౌతున్నారు.

అటువంటి స్త్రీలను చూసి మనం గర్విద్దాం. వారి పురోగతిని కాంక్షిద్దాం. వారిని ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టలేకపోయినా, కనీసం వాళ్ళపై రాళ్ళు వేయకుండా వుందాం. మగవాడిలో అర్ధభాగమై, అతనికంటే భిన్నమైన మహిళ తనని తాను ఓ సంపూర్ణ శిల్పంలా మలచుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్ని హర్షిద్దాం. భిన్నత్వాన్ని స్వాగతించి మన మనసుల్ని విశాలం చేసుకుందాం.

మమ్మల్ని పూజించనవసరం లేదు .. మీతో పాటు మమ్మల్నీ సమానంగా చూడండి చాలు అంటున్న వాళ్ళ అభ్యర్ధనని ఆలకిద్దాం. ఇండియా గేట్ వద్ద ప్రతిధ్వనించిన వేలాది యువ గొంతుకలు ఆ రోజు దగ్గర లోనే వుందేమో అనే ఆశను కల్పిస్తున్నాయి.

ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)