సారస్వతం

సాహిత్యంలో చాటువులు-5

-  ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు   


 

 సాహిత్యం సుసంపన్నం కావాలంటే కవికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలనే మూడు గుణాలతోపాటు ఈ క్రింది కవితా లక్షణాలు బాగా తెలిసి ఉండాలి.
౧.నవరస పరిపోషణ = అవి శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స,అద్భుత, శాంతాలు.
౨. అలంకార విన్యాసాలు= కొన్ని అలంకారాలు- ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, స్వభావోక్తి,
శ్లేష, క్రమాలంకారం. మొదలైనవి.
౩. పాకాలు= నారికేళపాకం, కదళీపాకం, ద్రాక్షాపాకం.
౪. రీతులు= వైదర్భి, గౌడి. పాంచాలి.
౫. వర్ణనలు= ఇవి పదునెనిమిది. వాటిలో కొన్ని. వన, జల, కేళి, రవి,శశి, ఋతు, మొ; (ఈ కవితాలక్షణాలని వివరించడం ఈ వ్యాసాల ఉద్దేశ్యం కాదు. కేవలం కొన్ని కవితాలక్షణాలని పరిచయం చేయాలని మాత్రమే రచయిత ఉద్దేశ్యం.)
ఇట్టి అనేక కవితాలక్షణాలతో కూడుకొన్న కవిత్వమే ఆనందప్రదమై, “విశ్వశ్రేయోదాయక” మై పదికాలాల పాటు నిలుస్తుంది. అట్టి కవిత్వాలలో ‘చాటు’ కవిత్వం కూడ కొంత ప్రాచుర్యం పొందింది అనుటలో అతిశయోక్తి లేదు. అటువంటి చాటుకవిత్వాన్ని స్థాలీపులాకన్యాయంగా ఆస్వాదించి, ఆనందించండి.
చాటువు అంటే సరసోక్తి అనికూడా ప్రారంభంలో తెలియ జేయబడింది. అట్టి రసపూరితమైన చాటువులను తెలిసికొందాం.
“ దివా కాకరుతాత్ భీతా/ నక్తం తరతి నర్మదా/
తత్ర సంతి జలే గ్రాహాః/ నర్మజ్ఞా సైవ సుందరి//” ముందుగా అర్థం తెలుసుకొందాం – దివా= పగలు. కాకరుతాత్= కాకి అరుపుకి. భీతా= భయపడింది.
నక్తం= రాత్రులు. నర్మదా= నర్మదానదిని. తరతి= ఈదుతూ దాటుతుంది.
తత్ర జలే= ఆనదిలో. గ్రాహాః= మొసళ్ళు కూడా. సంతి= ఉన్నాయి.
సైవ సుందరి= ఆ సుందరి. నర్మజ్ఞా= గొప్ప జాణ కదా! ఇప్పుడు భావ పూర్వక వృత్తాంతం తెలుసుకొందాం. అందమైన,వివాహిత అయిన స్త్రీయొక్క జాణతనాన్ని పై చాటువు వివరిస్తుంది. “ఒక స్త్రీ పగలు భర్తతో తోటలో విహరిస్తుండగా కాకి అరిస్తే భయపడి భర్తని గట్టిగ కౌగలించు కొందిట. అప్పుడు భర్త నా భార్య ఎంత భయస్తురాలో కదా! అని అనుకొనేవాడట,అదే స్త్రీ రాత్రి భర్త నిదురించేక, రహస్యంగా భయంకరమైన మొసళ్ళతో కూడిన నర్మదానదిని ఈదుతూ ఆవలి ఒడ్డుకు వెళ్ళి, ప్రియుడితో రాత్రంతా గడిపి, భర్త లేవక ముందే మరల నదిని దాటి ఇల్లు చేరేదట.ఆమె ఎంత నెరజాణ! ( తెలివిగలది) అని పై చాటువు చమత్కరిస్తుంది.ఇంకా
అందమైన స్త్రీని వర్ణించిన శ్లోకాన్ని ఓ ఆధునిక కవి మనం రొజూ త్రాగే కాఫీకి అన్వయించి చెప్పిన ఇంకో చాటుశ్లోకాన్నితెలుసుకొందాం.
“ మధురాధర సంసర్గా/ శ్యామా చారు పయోధరా
స్నిగ్ధ సర్వాంగ సురభి:/ కాపి కస్మై న రోచతే!//
ముందుగా స్త్రీ పరమైన అర్థాన్ని తెలుసుకొందాం-
మధురాధర సంసర్గా= మధురమైన ఆధారాలతో (పెదవులతో) స్పర్శించేది.
శ్యామా = చక్కని చామనఛాయ రంగుకలిగినది. చారు పయోధర= చక్కని
పయోధరములు (వక్షస్థలం) కలది.
స్నిగ్ధ = చక్కనైనది. సర్వాంగసురభి:= శరీరమంతా పరిమళాలు వెదజల్లేది.
కాపి= అట్టి అందమైన స్త్రీ. కస్మై=ఎవరికీ. న రోచతే=ఇష్టం ఉండదు.( అందరూ ఇష్ట పడతారు అని అర్థం.) ఇక పై శ్లోకంలో ‘కాపి’ అనేపదాన్ని’కాఫీ’ అని చిన్నమార్పు చేస్తే మనం త్రాగే కాఫీకి ఎలా అన్వయించ వచ్చో ఇపుడు చూద్దాం ( ఇది కేవలం కల్పితం మాత్రమే)
మధురాధర సంసర్గా= పెదవులతో తీయగా త్రాగేది. (త్రాగుట అనేపలకాలి, తాగుట అనకూడదు.) శ్యామా= నల్లని రంగు (కాఫీ కలర్) కలిగినది.
చారు పయోధరా= మంచి పాలను కలుపుకొనేది.
స్నిగ్ధ= చిక్కనైనదీ.( కంటికి బాగా కనపడేది.)
సర్వాంగ సురభి:= మంచి వాసనకలిగినది. (కాఫివాసన బాగుంటుంది కదా!)
కాఫీ= కాఫీ. కస్మై నరోచతే= ఎవరికి రుచించదు? (అందరూ త్రాగుతారని భావం)
చూశారా! ఒకే శ్లోకం రెండు అర్థాలతో ఎంత చక్కగ శోభిల్లిందో! కనుకనే సాహిత్యాన్ని రత్నాకరం (సముద్రం) తో పోలుస్తారు. ఎవరి శక్తి సామర్ధ్యాలని బట్టి వారు రత్నాలని పొందవచ్చు. అంటే కవిత్వాన్ని చదివి ఆనందించ వచ్చు.

 

(వచ్చే నెల మరికొన్ని)

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)