శీర్షికలు

పద్యం - హృద్యం

- రచన : పుల్లెల శ్యామసుందర్    


 

సమస్యాపూరణము:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా (padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య:

కందకు లేనట్టి దురద కత్తికిఁ బట్టెన్

గతమాసం సమస్య:

సూర్యుండుదయించె రాత్రి శుభములు గలుగన్

 

ఈ సమస్యకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

వారణాసి సూర్యకుమారి ,మచిలీపట్టణం

కం// 

సూర్యం విహారయాత్ర గ

భార్యా మణితో డ చూడ భాగ్య మలాస్కా

సూర్య మొక వింత గనెనట

సూర్యుం డుదయించె రాత్రి శుభములు కలుగన్

కం//

కార్యార్థ మమెరి కా జని

సూర్య మచ టి యద్భు తమ్ము జూచిన తోడన్

భార్య కెరిగిం చె వింతగ

సూర్యుండు ద యిం చె రాత్రి శుభములు కలుగన్

 

గండికోట విశ్వనాధం, హైదరాబాద్ (తాత్కాలికంగా సిడ్నీ)

కం//

ఆర్యాదేవిని కొలచగ

కార్యోచిత లగ్నయైన కన్యక మదిలో

సూర్యాఖ్య వరుని తలచిన

సూర్యుండుదయించె, రాత్రి శుభములు గలుగన్.

కం//

కార్యాలయమున రాత్రని

వార్యపు పనుల మునిగి తన వాసము చేరన్

భార్య సరసోక్తిగ గొణగె

సూర్యుండుదయించె రాత్రి శుభములు గలుగన్

డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశంజిల్లా.

కం//

పర్యాయము వంచనకును
మర్యాదయు నీతి దప్పు మంత్రుల మార్చన్
కార్యోధ్ధతి "అన్నా"అను
సూర్యుండుదయించె రాత్రి శుభములుగలుగన్

శివప్రసాద్ చావలి,సిడ్నీ 

కం//

సూర్య కిరణములు తగులగ

సూర్యఘటంబున నిలచిన సూర్యప్రభలే

సూర్యాస్తమయమున వెలుగ

సూర్యుండుదయించె రాత్రి, శుభములు గలుగన్

(సూర్యఘటము:సొలార్ సెల్)

 

కం//
భార్య కవితలను చదువగ

నార్య సభాస్థలి నొకనిశి, నాధుడు కవితన్

భార్యను మెచ్చి పొగడగను

సూర్యుండుదయించె, రాత్రి శుభములు గలుగన్

జంధ్యాల కుసుమ కుమారి

కం//

తూర్యంబుల్ చెలగన్ లయ

కార్యంపుటధిపతి కాలకాలుడు పేర్మిన్

ఆర్యాంబా హృదయాంబుజ

సూర్యుండుదయించె రాత్రి శుభములు కలుగన్

యం.వి.సి.రావు, హిందూపురం 

కం//

క్రౌర్యంపు కంసు చెరలో

ధైర్యంబును నింప తల్లి దండ్రుల యెడదన్

శౌర్యంబొప్పగ హరియను

సూర్యుండు ఉదయించె రాత్రి శుభములు కలుగన్

సుమలత మాజేటి, క్యూపర్టీనో, కాలిఫోర్నియా 

కం//

సూర్యుండు ఫలంబనుచున్
వీర్యుండు హనుమడు మ్రింగ బెకలించె, జగత్
కార్యంబు గోరి విడువగ
సూర్యుండు ఉదయించె రాత్రి శుభములు కలుగన్

ఇంద్రగంటి సతీష్ కుమార్ , చెన్నై  

కం||

సూర్యారావు విదేశియ
కార్యములొదలి నడి రేయి గృహమును జేరన్,
భార్యకు దోచెన్ ముదమున
సూర్యుండుదయించె రాత్రి శుభములు గలుగన్!

పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియా

కం//

భార్యామణితో గనె నా

చార్యులు డే-నైటు మ్యాచి సాయంకాలం

సూర్యుడు కృంగగ విద్యుత్

సూర్యండుదయించె రాత్రి శుభములు గలుగన్


 
 

పద్యాలలో నవ రసాలు(14 భాగం) 
- భైరవభట్ల కామేశ్వరరావు

చిరుచిరునవ్వుల సిరిసిరిమువ్వలు

 


 

మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా

బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీ చంద మె

క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం

బడుటేలాగునొ మా మొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా!

 

హాస్యమనగానే నాకు గుర్తుకు వచ్చే పద్యాలలో ఇదొకటి. ఈ భక్తునికి శివుని సంసారంలో కూడా భవసాగరాలు కనిపించాయి! బుసబుసలు, గుసగుసలు, రుసరుసలు - వీటి మధ్య తన మొఱ లాతని చెవిని పడతాయో లేదోనని ఈయన కంగారు. ఇది శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి పద్యం. భక్తిలో కూడా గమ్మతయిన హాస్యరసస్పర్శ ఈ కవి సొంతం. ఇల్లాంటి పద్యాలు కోకొల్లలుగా ఉంటే, తెలుగు సాహిత్యంలో హాస్యానికి చోటు తక్కువనే మాట అపవాదు కాక మరేమిటి? తెలుగువారు ఎంతటి భోజనప్రియులో అంతటి హాస్యప్రియులు. కావ్యాలలో హాస్యం, తాలింపులో యింగువ గుబాళింపులా యింపు గూర్చితే, చాటుసాహిత్యంలో అది మిఠాయిలో నేతి ఘుమఘుమాయింపులా మనసులో హాయిని నింపుతుంది.

 

"శృంగార వీరయోర్హాసః" అని, హాస్యరసాన్ని శృంగార వీర రసాలకు అంగరసంగా ఆలంకారికులు చెప్పారు. అందువల్ల హాస్యం మన కావ్యాలలో ప్రధానరసంగా పోషింపబడలేదు. దశవిధ రూపకాలలో ఒకటైన "ప్రహసనం" హాస్యరస ప్రధానమైనది. కానీ ప్రాచీన తెలుగు సాహిత్యంలో మనకు రూపకాలు కనిపించవు. సంస్కృత కావ్యనాటకాలలో హాస్యరసం, విదూషకుడు వంటి పాత్రల ద్వారా ప్రత్యేకంగా పోషింపబడింది. తెలుగులో అలాంటిది లేదు. తెలుగు కావ్యాలలో మనకు కనిపించేది చాలా వరకూ సందర్భోచితమైన హాస్యమని చెప్పవచ్చు. ఉదాహరణకు, రామాయణంలో కనిపించే వానరచేష్టలు మనకు సహజంగా నవ్వు పుట్టిస్తాయి. భాస్కరరామాయణంలో యుద్ధకాండ ప్రారంభంలోని యీ పద్యం చూడండి:

 

పండిన భూజముల్ పెఱికిపట్టి ఫలంబులు దించు నన్యు డ

ప్పండులు వేడినం దనదు పండ్లిగిలించు, నొకం డొకండు చే

పండటు చూప వాడు కరపల్లవ మల్లన జాప, మ్రింగి బ్ర

హ్మాండము బోలెనున్న తన యంగిలి చూపుచు బోయె బొమ్మనున్

 

పండ్లతో నిండిన చెట్లను పెఱికి పళ్ళను కోసి దించాడు వానరుడొకడు. వాడిని మరొకడు తనకి పళ్ళనిమ్మని అడిగితే, పళ్ళికిలించి పొమ్మన్నాడు. మరొకడేమో పండు చేత్తో పట్టుకొని ఇంకొకడికి ఆశ చూపిస్తున్నాడు. వాడు ఆశగా చేయి చాచేసరికి వాడా పండును గుటుక్కున మింగి నోరు తెరిచి తన అంగిలి చూపించి పోపొమ్మని వెక్కిరించాడు. ఇలా ఆ సన్నివేశంలో వానరులు చేసే చిలిపిపనులు, అల్లరి, చాలా సహజంగా వర్ణించబడ్డాయి. అది మనలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.

 

హాస్యమంటేనే వికృతివల్ల, వికటత్వంవల్ల పుట్టేది. వికటమైన చేష్టలు, రూపము లేదా వేషము, మాటలు - ఇవి హాస్యరసానికి ఆలంబనలు. హాస్యానికి స్థాయిభావం హాసం, అంటే నవ్వు. ఈ నవ్వులలో మొత్తం ఆరురకాలు చెప్పారు ఆలంకారికులు. అవి - స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అపహసితము, అతిహసితమూను. చిన్నగా సన్నగా, ఒకింత గంభీరంగా ఉండే నవ్వు స్మితము ఉత్తరోత్తరా పెరిగుతూ పోయి చివరకు భూమి దద్దరిల్లేట్టుగా చేసే అట్టహాసం అతిహసితం అవుతుంది. మన కావ్యాలలో పోషింపబడిన హాస్యం, చాలా వరకూ, మనలో మధురదరహాస విలాసాన్నే మిగులుస్తుంది తప్ప కడుపుబ్బా నవ్వించదు. ఇప్పటి చాలా సినిమాలలో మాదిరి హాస్యం ముదిరి అపహాస్యం పాలైన సందర్భాలు ప్రాచీన ఆధునిక సాహిత్యంలో కూడా ఉన్నాయి కాని, మనం వాటి జోలికి వెళ్ళనవసరం లేదు. శృంగారంలాగానే, హాస్యం కూడా చాలా ఔచిత్యంతో జాగ్రత్తగా నిర్వహించాల్సిన రసం. దాన్ని మన కవులు చాలా సమర్థంగా నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, చిలిపిచేష్టలు అనగానే మనకి గుర్తుకువచ్చేది బాలకృష్ణుని లీలలు. వాటిని పోతనార్యుడు ఎంతో లలితసుందరంగా తీర్చిదిద్ది తెలుగువారి హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసాడు. యశోదమ్మతో గోపకాంతలు చేసే ఫిర్యాదులలో ఆ లీలలు మనకి ప్రత్యక్షమవుతాయి.

 

ఆడం జని వీరల పెరు

గోడక నీ సుతుడు ద్రావి యొక యించుక నా

కోడలి మూతిం దుడిచిన

గోడలు మ్రుచ్చనుచు నత కొట్టె లతాంగీ!

 

ఒకరింటికి వెళ్ళి పెరుగంతా త్రాగేసి, వెళుతూ వెళుతూ కొంచెం పెరుగు కోడలి మూతికి రాసేసి పోయాడు కృష్ణుడు. ఆపళంగా తన కోడలే పెరుగు తినేసిందనుకొని అత్త కోడలిని కొట్టింది!

 

వారిల్లు సొచ్చి కడవల

దోరంబగు నెయ్యి ద్రావి తుదినా కడవల్

వీరింట నీ సుతుండిడ

వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ!

 

మరో ఇంటికి పోయి కడవల్లో పెట్టిన నెయ్యంతా త్రాగి, ఆ కడవలని పక్కింట్లో పెట్టేసాడు. దానితో వాళ్ళకీ వీళ్ళకి పెద్ద వాదులాటైపోయింది! ఇలా బాలగోపాలుని అల్లరంతా తేట తెలుగులో విస్తృతంగా వర్ణించి, హాస్యరసపోషణకు అనువైన సందర్భాన్ని చక్కగా సద్వినియోగం చేసాడు పోతన.

 

రామాయణ భాగవతాలలో పైన చూసిన రెండు సన్నివేశాలూ చేష్టల ద్వారా పుట్టే హాస్యానికి ఉదాహరణలు. ఇక, రూపం వేషం ద్వారా పుట్టే హాస్యానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే అందుకు ఆలంబనగా మారాడు! ఈశ్వరార్చనకళాశీలుడయినా శ్రీనాథుడే ఆ వర్ణన చేసాడు! ఇల్లరికపుటల్లుడైన శివుని భిక్షుక రూపాన్ని అధిక్షేపిస్తూ హిమవంతుడు పార్వతితో అన్న మాటలివి.

 

తలమీద చదలేటి దరిమీల దినజేరు

కొంగలు చెలగి కొంగొంగురనగ

మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి

బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ

గట్టిన పులితోలు కడకొంగు సోకి యా

బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ

గడియంపు బాములు కకపాలలో నున్న

భూతి మై జిలికిన బుస్సు రనగ

 

దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి

దిట్టతనమున బిచ్చము దేహి యనుచు

వాడవాడల భిక్షించు కూడుగాని

యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివుండు!

 

"తలమీద ఉన్న "చదల ఏరు"(అంటే ఆకాశ గంగ)లో దరిమీనులు (ఇవో రకం చేపలు) ఉన్నాయట! జుమ్మని ఎగసిపడే గంగలో చేపలేంటని చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దు. శివుడి తలే పెద్ద మడుగైపోయి ఉంటుంది. అందులో చేపలు చేరి ఈదులాడుకోవచ్చు కదా. వాటిని తినడానికి కొంగలతని తల చుట్టూ మూగుతున్నాయట. అవి "కొంగు కొంగు" అని చేసే గోల అంతా ఇంతానా! మెడలోనేమో పుఱ్ఱెలమాల. శివుడు కదులుతూ ఉంటే, ఆ పుఱ్ఱెలు ఒకదానితో ఒకటి రాసుకుంటూ చేసే "బొణుగూ బొణుగూ"మనే శబ్దం ఒకటి. అంతేనా! కట్టుకున్న పులితోలు కొంగుచివర, శివుడెక్కి కూర్చున్న నందిని తాకుతూ ఉంటే అది చిరాకుతో (భయంతోనో) చిఱ్ఱుబుఱ్ఱు లాడుతోంది. చేతిలో ఉన్న కకపాలలోని విభూది మీద తుళ్ళినప్పుడల్లా, చేతికి కడియాలుగా కట్టుకున్న పాములు బుస్సు బుస్సు మంటున్నాయి. అంతా గోల గోల! ఇంత గోలా అవుతూండగానే, "తమ్మిపూ చూలి" (అంటే పద్మంలోంచి పుట్టిన బ్రహ్మ) కపాలాన్ని ఓ చేత్తో పట్టుకొని భిక్షాందేహీ అంటూ వీధివీధి తిరిగి బిచ్చమెత్తుకొంటాడు. అలాటి ముష్టెత్తుకున్న కూడు తప్ప శివుడికి మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా?"

పాపం ఎంతగా ఇబ్బందిపడ్డాడో ఆ హిమవంతుడు. లేకపోతే ఇంత ఘాటుగా తన కూతురి ముందే అల్లుణ్ణి మరే మావైనా గేలిచేస్తాడా! శ్రీనాథుడికి శివుడంటే ఎంత చనువులేకపోతే ఇలాటి పద్యాలు రాయగలడు!

 

అయినా ఆ దేవుడు భోళాశంకరుడు. భక్తులు చేసే పరిహాసాలకు తాను కూడా చిరునవ్వులు చిందిస్తాడు తప్పితే కోప్పడడు. అతనికి సంబంధించినదే మరొక సరస సన్నివేశం కూచిమంచి తిమ్మకవి వ్రాసిన శివలీలావిలాసంలో వస్తుంది. శివుడు గంగను పెళ్ళిచేసుకు వచ్చాడని అలిగిన పార్వతి తన అలకా గృహంలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. శివుడు తనను లోనికి రానిమ్మని వేడుకొనే సందర్భంలో వారి మధ్య జరిగిన చమత్కార సంభాషణ పఠితలకి నవ్వుపుట్టిస్తుంది.

 

"నీలకంఠుడనే హరినీలవేణి

నీ చెలిమి గోరికొని వచ్చి నిలిచినాడ"

 

అని అంటాడు శివుడు. అంటే ఆవిడంటుందీ,

 

"ఔర! మేల్ నీలకంఠుడవైతివేని

కేక లిడుకొంచు వేగంబె గిరికి జనుము"

 

నల్లని గరళాన్ని కంఠంలో దాచుకున్నాడు కాబట్టి శివుడు నీలకంఠుడు అయ్యాడు. నెమలి కంఠం కూడా నీలంగా ఉంటుంది కాబట్టి నీలకంఠము అంటే నెమలి అని కూడా అర్థం. శివుడన్న మాటని ఆ అర్థంలో అన్వయించిన పార్వతి, "నువ్వు నీలకంఠుడివైతే కేకలు పెట్టుకుంటూ కొండల్లోకి వెళ్ళిపో యిక్కడికెందుకు వచ్చావు!" అని సమాధానం ఇస్తుంది. "కేక" అనేది సాభిప్రాయంగా వాడిన పదం. క్రేంకారాలు చేస్తుంది కాబట్టి నెమలికి కేకి అనే పేరు కూడా ఉంది! ఇలా శివుడు తనని తాను రకరకాల పేర్లతో పరిచయం చేసుకోవడం, దానికి పెడర్థాలు దీసి పార్వతి పొమ్మనడం సరదాగా సాగుతుంది. పైగా యీ సంభాషణంతా పద్యాలలో సాగడం మరింత చమత్కారభరితం!

 

"క్రీడాకిరాతుడను నే

చేడియ", "యటులైన నీవు జింకలు పులులున్

క్రోడంబులు గల యడవికి

బోడిమితో వేటలాడ బొమ్మా నెమ్మిన్!"

 

("నేను కిరాతవేషం వేసుకున్నవాణ్ణి" - "అయితే జంతువులున్న అడవికి వెళ్ళి వేటాడుకో పో!")

 

"అబల! నే పశుపతి", "యహహ! నీ వట్లైన నాలమందకు ఱంకెలడర జనుము"

"స్థాణుడ నేను కంజాక్షిరో", "యబ్బబ్బ మోడు మాటాడుట చూడమెందు!"

"బురహరుండను నేను పొలతి", "నీ వట్లైన మా వీటనుండక మరలి పొమ్ము"

"బన్నగధరుడను బడతి నే", "నట్లైన బడిగె లెత్తుచు నూళ్ళబడి తిరుగుము"

 

("నేను పశుపతిని" - "అయితే ఱంకెలు వేస్తూ వెళ్ళి గోడ్లు కాచుకో!". "నేను స్థాణుడిని" - "అబ్బో చెట్లు మాట్లాడ్డం ఎక్కడా చూడలేదే". "నేను పురహరుడిని" - "అలా అయితే వెంటనే మా పురంనుండి వెళ్ళిపో". "నేను పన్నగధరుడిని" - "అయితే పాముల్ని ఆడించుకుంటూ ఊళ్ళమ్మట తిరుగు వెళ్ళి!")

 

"భూతనాథుడ నేను పూబోడి" "యట్టు

లేని నల ప్రేతభూముల కేగు మిపుడె"

"కుటిలకుంతల నేను మహానటుడ" "నట్టు

లైన ప్రభువులకడ కేగి యాడు మెలమి"

 

("నేను భూతనాథుడను" - "అయితే శ్మశానానికి వెళ్ళు". "నేను మహానటుడిని" - "అయితే ఏ రాజుదగ్గరకో వెళ్ళి హాయిగా నాట్యం చేసుకో")

 

"విను విరూపాక్షుడను నేను వనజవదన"

"అహహ బుధులు విరూపాక్షుడైన వాని

జూడ రాదని తఱచుగ నాడుచుంద్రు

తొలగి వేంచేయుమిక బెక్కు పలుకులేల!"

 

("నేను విరూపాక్షుడను" - "విరూపాక్షుడైనవాణ్ణి, అంటే వికృతరూపం కలవాడిని, చూడకూడదని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి వెంటనే ఇక్కడనుంచి వెళ్ళిపో!")

 

ఇలా సాగుతుంది వారి సంభాషణ. శివుని నామాలలో ఉన్న శ్లేష ఆధారంగా, సన్నివేశానికి తగ్గట్టుగా సాగే సరససంభాషణ పాఠకులలో చక్కలిగింతలు కలిగిస్తుంది. ఇది మాటలు ఆలంబనగా గల హాస్యానికి చక్కని ఉదాహరణ.

 

శ్లేషకు మరో మెట్టు పైనుండేది వ్యంగ్యం. శ్లేష చాలావరకూ శబ్దంపై ఆధారపడుతుంది. సన్నివేశగతమైనది వ్యంగ్యం. అలాంటి వ్యంగ్యం చమత్కారభరితమై పాఠకులలో హాస్యపు చిరుజల్లు కురిపిస్తుంది. దీనికి ఉత్కృష్టమైన ఉదాహరణ, తిక్కనగారు విరాటపర్వంలో నర్తనశాలలో భీముని నోట కీచకునితో పలికించిన పలుకులు.

 

ఇట్టివాడవు గావున నీవు నిన్ను

బొగడుకొన దగు, అకట నా పోల్కి యాడు

దాని వెదకియు నెయ్యెడనైన నీకు

బడయవచ్చునె యెఱుగక పలికితిట్లు

 

తనగూర్చి గప్పాలు కొట్టుకున్న కీచకునితో సైరంధ్రి వేషంలో ఉన్న భీమసేనుడు చెపుతున్న మాటలివి. నువ్వంతటి వాడివి కాబట్టే నిన్ను నువ్వు పొగుడుకున్నావు. కాని నాలాంటి ఆడది నీకు ఎక్కడ వెదకినా దొరకదు సుమా! నీకది తెలియక అలా మాట్లాడావు.

 

నా యొడలు సేర్చినప్పుడె

నీ యొడలెట్లగునొ దాని నీ వెఱిగెదు న

న్నే యబలలతోడిదిగా

జేయదలంచితివి తప్పు సేసితి గంటే!

 

నా మేను చేర్చినప్పుడు నీ శరీరమేమవుతుందో అప్పుడు తెలుస్తుంది. నన్ను తక్కిన ఆడవారితో సమానంగా అనుకుని తప్పు చేసావు సుమా!

 

నను ముట్టి నీవు వెండియు

వనితల సంగతికి బోవువాడవె యైనం

దనువే బడసిన ఫలమే

కనియెద విదె చిత్తభవ వికారములెల్లన్

 

నన్ను ముట్టుకొని మళ్ళీ మరొక ఆడదాని చెంతకు నువ్వు పోగలవా! నీ చిత్తభవ వికారాలన్నీతొలగి నీ జన్మ సఫలమవుతుంది!

ఈ మాటల్లో ఎక్కడా శ్లేష కనిపించదు (ఒక్క "చిత్తభవ వికారములు" అనే చోట తప్ప)! అయినా అవి కీచకునికి ఒకలా అర్థమవుతాయి. పలికే భీమునికీ, వింటున్న ద్రౌపదికీ, చదువుతున్న మనకూ మరోలా అర్థమవుతాయి. రాబోయే చావు గురించి కీచకునితో అతనికే తెలియకుండా సంభాషించడం, పైగా అవి సరసమైన మాటలుగా వానికి స్ఫురించడం అనేది పాఠకుల మనసులో హాస్యరస స్ఫూర్తి కలిగిస్తుంది. ఇది ఒకరకంగా చూస్తే వీరరసానికి అంగంగా పోషింపబడిన హాస్యం (భీముని దృష్టితో చూస్తే). మరొక రకంగా (కీచకుని దృష్టితో చూస్తే), శృంగార రసాభాస నుండి పుట్టే హాస్యం. ఏదైనా, యిది సన్నివేశగతమైన హాస్యం. అదే ఉత్తమ హాస్యం. ఇలాంటి సందర్భగతమైన హాస్యం మన కావ్యాలలో మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తుంది.

 

దక్షాధ్వరధ్వంస సందర్భంలో, ప్రమథగణాల విజృంభణకు దిక్పాలకులు, బ్రహ్మ, విష్ణువు కూడా భయభ్రాంతులై పరుగులుతీసే సన్నివేశంలో నన్నెచోడుడు హాస్యరసాన్ని చక్కగా పోషించాడు. నిజానికి ఇక్కడ పోషింపబడ వలసినది భయానక రసం. కానీ, దైవస్వరూపులైన వారు భయానికి ఆశ్రయులైతే, పాఠకులు అందులో తాదాత్మ్యం చెందలేరు. అది రసాభాసానికి దారితీస్తుంది. దాన్ని నివారించడానికి పాఠకులను తటస్థులని చేసి, ఆ రసాభాసలోనుండి హాస్యాన్ని సృష్టించాడు నన్నెచోడుడు. తెలుగు కావ్యాలలో ఇంతకంటె హాస్యరసభరితమైన సన్నివేశం మరొకటి నా కంటబడలేదు!

 

వాహనమ్ము నెక్కవచ్చియు భయమున

వడకి నేలబడ్డ వనజగర్భు

గమిచికొని మరాళకము వాఱె జెందమ్మి

గఱచికొని రయమున బఱచినట్లు

 

ప్రమథగణాల ధాటికి తట్టుకో లేక పరిగెత్తి వచ్చి తన హంసవాహనాన్ని ఎక్కబోయిన బ్రహ్మ, భయంతో కాళ్ళు తడబడిపోయి గబుక్కున నేలమీద పడిపోయాడట. అప్పుడు ఆ హంసే అతన్ని, ఒక తామరపువ్వుని ముక్కున కరుచుకున్నట్లు, ముక్కున కరచుకొని ఎగిరిపోయిందట!

 

గరుడి నడుము మెడయు గాలును గేలును

నిఱికి కొనుచు జక్రి వెఱచి పఱచె

ఘర్మజలము లొడల గ్రమ్మంగ వర్షేంద్ర

చాపజలదభాతి జదల బొదల

 

గరుత్మంతుని కాళ్ళు, నడుము, మెడ, రెక్కల మధ్య ఎలాగో ఇరుక్కుని పారిపోతున్నాడు విష్ణుమూర్తి. ఒళ్ళంతా చెమటతో నిండిపోయి అచ్చం ఇంద్రధనుస్సుతో కూడిన వర్షాకాల మేఘంలా ఉన్నాడట ఆ నీలమేఘశ్యాముడు. బ్రహ్మ విష్ణువుల పరిస్థితే అలా ఉంటే ఇక దిక్పాలకుల అవస్థ ఏమని చెప్పాలి!

 

వేటకాఱు ముట్టి వెనుకొనగా శ్వేత

నగము చరికి దారు నమిలివోలె

నభ్రగజము మీది కాసహస్రాక్షుండు

వ్రాకి పాఱె బ్రమథరాజి యార్వ

 

ప్రమథగణాలు అరుస్తూ వెంటబడుతూ ఉంటే ఇంద్రుడేమో ఐరావతం వైపు పరుగులు తీసాడు. అప్పుడతను, వేటగాళ్ళు వెంట తరుముతూ ఉంటే వెండికొండ చరియల్లోకి పారిపోయే నెమలిలా (నమిలి అన్నా నెమలే) ఉన్నాడట! ఐరావతం తెల్లని ఏనుగు కదా. అందుకది శ్వేతనగం, అంటే హిమాలయంలా ఉంది. ఇంద్రుడేమో సహస్రాక్షుడు, అంటే వేయికళ్ళు కలవాడు. నెమలికూడా అంతేకదా!

 

ఇతనికన్నా ఘోరమైన పరిస్థితి పాపం కాలభయంకరుడైన యమునిది!

 

ఇక్కుముట్టి చక్కెనెక్కగ మఱచి సం

భ్రమము బొంది పిఱుద ప్రమథగణము

లార్వ బోతు మీద నడ్డంబువడి యుప్పు

బెఱికవోలె వెఱచి పఱచె జెముడు

 

ప్రమథగణాల భీకరరవాలకు యముని దున్నపోతుకూడా బెదిరిపోయింది కాబోలు. అదికూడా పరుగులు పెట్టింది. దాని వెనుక యముడు పరిగెత్తుతున్నాడు. అంత పరుగులో దాని నడుము పట్టుకొని సరిగా ఎక్కలేక, భయంతో అలాగే ఎగిరి దున్న నడ్డిమీద అడ్డంగా పడిపోయాడట! అటూయిటూ వేలాడే ఉప్పుబస్తాని మోసుకువెళ్ళినట్టు మోసుకుపోయిందట యముణ్ణి, ఆయన వాహనం.

 

ఉరుతరాబ్ధీశుడయ్యును నోడి పాఱె

వరుణు డలుకుచు నోడిక వాగువోలె

గలుము లెడరైన నేమియు నిలువవనుట

దగు భయాతురుడై నోర తడియు లేక 

ఇక వరుణుడు. అవ్వడాని కితను సముద్రాధిపతి అయినా, అప్పుడు భయంతో అడ్డదిడ్డంగా పారే ఒక చిన్న వాగులాగా పరిగెత్తాడట. అతని నోరుకూడా పిడచకట్టుకు పోయింది

తన యెక్కిన మానిసి దా

ననయము నెక్కంగ మఱచి యాతని దన మూ

పున నిడికొని పఱచె భయం

బున ధనపతి తన్ను బిఱుద భూతము లార్వన్ 

చిట్టచివరగా, అన్నిటికన్నా నవ్వుపుట్టించేది ధనపతి కుబేరుని కంగారు. కుబేరుని వాహనం నరుడు, అంటే మనిషి. తానెప్పుడూ ఎక్కే మనిషిమీద తాను ఎక్కడం మరచిపోయాడు సరికదా, తిరిగి తనే అతణ్ణి వీపుమీద ఎక్కించుకొని పరిగెత్తేడట కుబేరుడు. భయంతో అంతలా మతిభ్రమించిందతనికి

చదివిన ప్రతిసారీ కడుపుబ్బ నవ్వించే సన్నివేశమిది. ఇలా కడుపుబ్బా నవ్వించకపోయినా, చిన్నగా మనసులని గిలిగింతలు పెట్టే సన్నివేశాలు అనేకం మన కావ్యాలలో ఉన్నాయి. అవన్నీ వివరిస్తూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. కాబట్టి, ప్రౌఢకావ్యమని పేరుపొందిన ఆముక్తమాల్యదలో కూడా, వర్ణనల్లో భాగంగా ఒకే ఒక పద్యంలో రాయలవారు చిత్రించిన ఒక లేలేత నవ్వుల సన్నివేశాన్ని మాత్రం ఉదాహరిస్తాను:

 

తల బక్షచ్ఛట గ్రుక్కి బాతువులు కేదారంపు గుల్యాంతర

స్థలి నిద్రింపగ జూచి యారెకు లుషస్నాత ప్రయాత ద్విజా

వలి పిండీకృత శాటులన్సవి దదావాసంబు జేర్పంగ రే

వుల డిగ్గన్వెస బాఱు వాని గని నవ్వున్మాలి గోప్యోఘముల్

 

ఒక పల్లెటూరు. దాని పేరు విల్లిపుత్తూరు. ఆ ఊరి పొలాలో వరిమళ్లకోసం తవ్విన పిల్ల కాలువలున్నాయి. ఆ పంటకాలువలలో బాతులు తమ స్వభావగుణంచేత తలలు రెక్కలలో దూర్చికొని నిద్రిస్తున్నాయి. అవి కాపలావాళ్ళ కంటబడ్డాయి. వాళ్ళవి బాతులని అనుకోలేదు. ప్రాతఃకాలములో స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు, పిండి మరచిపోయిన ధోవతులనుకున్నారు. తీసుకువెళ్లి వాళ్ళ యిళ్ళల్లో అప్పగిద్దామని నీటిలోకి దిగారు. ఆ అలికిడికి ఉలిక్కిపడ్డ బాతులు లేచి చరచరా పారిపోయాయి. ఆ పక్కనే కూర్చున్న శాలిగోపులు, అంటే కాపలా కాసే యువతులు, ఈ దృశ్యాన్ని చూసి సన్నగా నవ్వుకున్నారు. ఎంతటి సహజసుందర దృశ్యం!

 

ఇప్పటిదాకా చూసిన ఉదాహరణలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక విశేషం కనిపిస్తుంది. కొన్ని నెలల కిందట బీభత్సరసానికి సంబంధించిన వ్యాసంలో దీని గురించి మీకొక ప్రశ్నని సంధించి వదిలేసాను. "ఈ వ్యాసంలో బీభత్స రస స్వరూపాన్ని పూర్తిగా చెప్పుకున్నామో, ఏమైనా వదిలేసామో ఆలోచించండి." అన్నది ఆ ప్రశ్న. ఈ వ్యాసంలో కూడా జాగ్రత్తగా గమనిస్తే, రసస్వరూపంలో ఉన్న అన్ని అంశాలూ ప్రస్తావించబడలేదు. మరోసారి రసనిష్పత్తి గురించిన సూత్రం గుర్తు చేసుకుందాం. విభావ, అనుభావ, వ్యభిచారిభావాలు మూడిటి కలయికలో రసనిష్పత్తి జరుగుతుందని భరతుని సూత్రం కదా. మనం చూసిన ఉదాహరణల్లో ఆలంబన తప్ప అనుభావ వ్యభిచారి భావాల చిత్రణ ఏది? లేదు. బీభతం విషయంలోనూ అంతే! రసానికి ప్రధానంగా కారకమై, ఊతమిచ్చే పాత్ర ఆలంబన. అయితే రసానికి సంబంధించిన స్థాయిభావం మరొక పాత్రను ఆశ్రయించి ఉంటుంది. ఆ భావాన్ని అనుసరించి ఆశ్రయ పాత్రలో అభివ్యక్తమయ్యే వికారాలు, మార్పులే అనుభావాలు. ఉదాహరణకు శృంగార రసం తీసుకుంటే, నాయికానాయకులలో ఒకరు ఆలంబన అయితే మరొకరు ఆశ్రయమవుతారు. వీరరసానికి ప్రతినాయకుడు ఆలంబన, నాయకుడు ఆశ్రయం. ఆశ్రయమైన పాత్రలో వ్యక్తమయ్యే స్థాయిభావంతో పాఠకుడు లేదా ప్రేక్షకుడు మమేకమైనప్పుడు, రసనిష్పత్తి జరుగుతుంది. అనుభావాలు, సాత్వికభావాలు, సంచారీభావాలు, ఇవన్నీ ఆశ్రయమైన పాత్రలోనే అభివ్యక్తమవుతాయి. సహృదయుడు ఆ పాత్రతో మమేకం కావడానికి అవి సహాయపడతాయి. తద్వారా రసనిష్పత్తి జరుగుతుంది. అయితే, బీభత్స హాస్య రసాలకు మాత్రం ఒక మినహాయింపు ఉంది. అదేమిటంటే, ఈ రసాలను నిర్వహించడానికి ఆశ్రయం అవసరం లేదు. కేవలం ఆలంబన ద్వారానే రసనిష్పత్తి జరిగే అవకాశం ఉంది. సహృదయుడే నేరుగా రసానికి ఆశ్రయం. దీని అర్థం ఏమిటంటే, బీభత్సమైన ఒక దృశ్యాన్ని చూసి ఒక పాత్ర జుగుప్సకి లోనై దాన్ని అభినయిస్తే, ఆ పాత్రతో మమేకమై సహృదయుడు తానుకూడా జుగుప్సకి లోనవ్వాల్సిన అవసరం లేదు. శృంగారాది యితర రసాలకు ఆ అవసరం ఉంది. ఉదాహరణకు ఒక కావ్యంలో ప్రతినాయకుడున్నాడు. అతన్ని యుద్ధంలో మట్టికరిపించాలనే ఉత్సాహం చదువుతున్న పాఠకునిలో సహజంగా కలగదు. నాయకునిలో ద్యోతకమయ్యే అలాంటి ఉత్సాహం పాఠకుని మనసుని ఆ స్థాయికి చేరుస్తుంది. అదే రసం. బీభత్సరస విషయంలో, జుగుప్సని కలిగించే ఒక దృశ్యాన్ని చదివిన పాఠకునిలో నేరుగా ఆ భావం కలుగుతుంది. అలాగే హాస్యం విషయంలో కూడా. నవ్వుపుట్టించే సన్నివేశం చదవగానే నేరుగా పాఠకుని పెదవులు విచ్చుకుంటాయి. వేరే పాత్ర ఆ సన్నివేశాన్ని చూసి నవ్వితే ఆ నవ్వుతో మనం కలిసి నవ్వాల్సిన అవసరం లేదు. ఇంచుమించు పైన చూపిన ఉదాహరణలన్నిట్లోనూ (చివరిదైన ఆముక్తమాల్యద పద్యంలో తప్ప), ఎక్కడా మనకు అలాంటి ఆశ్రయం కనిపించదు. అయినా వాటిలో హాస్యరసం పండింది.

సరిగ్గా హాస్యరసానికున్న యీ ప్రత్యేకత వల్లనే అది కథ, పాత్రలు, ఉండని చాటుసాహిత్యంలో మూడుపూవులు ఆరుకాయలుగా వికసించింది. చాటుసాహిత్య ప్రపంచంలో ప్రాచీన కాలంనుండి ఆధునిక కాలం వరకూ కూడా హాస్యరస ప్రవాహం జీవనవాహినిలా కొనసాగుతూనే ఉంది. వాటికి ఉదాహరణలిచ్చుకుంటూ పోతే ఆ సాహిత్యంలో ముప్పాతికశాతం పైగా ఉదాహరించాల్సి వస్తుంది! స్థాలీపులాకన్యాయంగా అతికొద్ది ఉదాహరణలు మాత్రం ఇప్పుడు చూద్దాంవీటికి పెద్దగా వివరణలు కూడా అవసరం లేదు.

 

శివడద్రిని శయనించుట

రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం

డవిరళముగ శేషునిపై

పవళించుట నల్లిబాధ పడలేక సుమీ!

 

ఆడినమాటను దప్పిన

గాడిదకొడుకంచు తిట్టగా విని, అయ్యో!

వీడా నాకొక కొడుకని

గాడిద యేడ్చెన్ గదన్న ఘనసంపన్నా!

 

బూడిదబుంగవై యొడలు పోడిమి దప్పి మొగంబు వెల్లనై

వాడలవాడలం దిరిగి వచ్చెడి వారలు చొచ్చొచోయనన్

గోడల గొందులందొదిగి కూయుచునుండెడి కొండవీటిలో

గాడిద! నీవునుం గవివి గావుగదా! యనుమానమయ్యెడిన్!

 

ఇటువంటి చాటుపద్యాలెన్నో చమత్కారబంధురాలై చిరునవ్వులను చిందిస్తాయి. కొన్ని చాటువులు, రెండు భాషల చిత్రమైన కలయికలో హాస్యాన్ని సృష్టిస్తాయి. అటువంటి వాటికి ఒక ఉదాహరణ

మత్కుణం నదీ సంయుక్తం

గోపత్నీ సింధు సంయుతం

విచార ఫల సంయుక్తం

గ్రామ చూర్ణం కరిష్యతాం  

దీని కథాకమామీషూ యిక్కడ చదువుకోవచ్చు:

http://chandrima.wordpress.com/2009/12/06/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%A8%E0%B0%82-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE-%E0%B0%9A%E0%B1%82/ 

శతకాలు కూడా చాటుసాహిత్యంలో అంతర్భాగమే. అవి కూడా ఎంతో హాస్యాన్ని పండించాయి. ముఖ్యంగా అధిక్షేప కావ్యాలు, వ్యాజస్తుతి నిండిన కావ్యాలూ హాస్యరసోల్లాసాలు. ఆంధ్రనాయక శతకంలో చాలామందికి తెలిసిన ఈ పద్యం దీనికి చక్క్లని ఉదాహరణ:

 

ఆలు నిర్వాహకురాలు భూదేవియై అఖిలభారకుడన్న ఆఖ్య దెచ్చె

ఇష్టసంపన్నురా లిందిర భార్యయై కామితార్థుడవన్న ఘనత దెచ్చె

కమలగర్భుడు సృష్టికర్త తనూజుడై బహుకుటుంబికుడన్న బలిమి దెచ్చె

కలుషవిధ్వంసియౌ గంగ తనూజయై పతితపావనుడన్న ప్రతిభ దెచ్చె

 

నాండ్రుబిడ్డలు దెచ్చు ప్రఖ్యాతి గాని

మొదటినుండియు నీవు దామోదరుడవు

చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ

హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ 

సరే వేమన శతకంలో కనిపించే చురుకైన హాస్యానికి ఎన్ని పద్యాలైనా ఉదాహరణలివ్వవచ్చు

గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ

క్రూరమృగమొకండు తారసిలిన

ముక్తిమార్గమదియె ముందుగా జూపురా

విశ్వదాభిరామ వినురవేమ!

 

లోభివాని జంప లోకంబులోపల

మందు వలదు వేరు మతము కలదు

పైకమడిగినంత భగ్గున పడిచచ్చు

విశ్వదాభిరామ వినురవేమ!

 

ఇలా "కళ్ళుమూసి జెల్లకొట్టే" పెంకితనపు పద్యాలు చాలా ఉన్నాయి.

ఆధునికసాహిత్యంలో కూడా యీ సంప్రదాయం నిరాఘాటంగా సాగుతూ వచ్చింది. శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకంలో హాస్యం నిండుగా పండింది

తెగకుట్టి వదలిపెట్టిన

వగణిత వైజాగు దోమ లశ్వత్థామల్

పొగరెక్కిన రెక్కేన్గులు

సెగలెగసెడు తుమ్మముళ్ళు సిరిసిరిమువ్వా!

 

నేనూ ఒక మూర్ఖుణ్ణే

ఐనా నాకన్న మూఢులగుపడుతూంటే

ఆనంద పారవశ్యము

చే నవ్వక తప్పలేదు సిరిసిరిమువ్వా! 

ఆధునిక కాలంలో పేరడీ ప్రక్రియకూడా హాస్యానికి మంచి ఆలంబనగా నిలించింది. వేమన పద్యాలకు పేరడీలు వ్రాస్తూ, భావకవులపై కృష్ణశాస్త్రిగారు సంధించిన హాస్యబాణం ప్రసిద్ధమైనదే

మెరుగు కంటి జోడు గిరజాల సరదాలు

భావకవికి లేనివేవి లేవు

కవితయందు తప్ప గొప్పవాడన్నింట

విశ్వదాభిరామ వినురవేమ! 

ఆధునిక విషయాలపై కూడా వ్యంగ్యాస్త్రాలు, హాస్యచతురోక్తులు అనేకం వచ్చాయి. ముచ్చటగా మూడు సీసాలతో యీ నెల వ్యాసానికి ఫుల్‌స్టాపు పెడదాం. వైద్యుణ్ణి గూర్చి శ్రీ ఇలపావులూరి సుబ్బారావుగారు చెప్పిన పద్యం:

 

చెవుల స్టెతస్కోపు చెప్పి గుండియ బీటు

           హార్టు స్పెషలిస్టను నాఖ్యదెచ్చె

జ్వరమాని దేహాన వరలు నుష్ణత దెల్పి

           ఫీవర్ల డాక్టరన్ పేరు దెచ్చె

బీపీని తెలియజెప్పెడి సాధనము నీకు

           రక్తపోటెరిగెడి శక్తినిచ్చె

ఎక్సురే విరిగిన యెముకలు చూపింప

           బోన్సు స్పెషలిస్టుగా పొగడబడితి

 

వంతె, యిసుమంత యెరుగవు సుంతయేని

అన్యులెవ్వరు చదువంగ నలవిగాని

లిపిని దివ్యౌషధముల పేర్లెల్ల వ్రాసి

వ్యాధి కుదిరింతు వయ్యయో వైద్యవర్య!

 

శ్రీమతి దేవీప్రకాశమ్మగారు (మా అమ్మగారు) పరీక్ష పేపర్లు దిద్దే పంతులమ్మలకు వచ్చే అర్జీలనుగూర్చి (స్వానుభవంతో) వ్రాసిన పద్యం

"రాముడ"నుచుగాక "రాడ"ని వ్రాయంగ

ముల్లోపమొక్కటే ముప్పులేదు

"కొండ" "కుండ"యినను "కుండ" "కొండ"యినను

కొంపమునిగిపోదు కొమ్ముతోడ

"ఆహింస"యని యన్న, అది "అహింస"యె సుమ్ము

దీర్ఘాలుదీయుటే దిట్టతనము

"కరమనుగ్రహము"ను "ఖరమనుగ్రహ"మన

వత్తిపలుకుటద్ది వైదికమ్ము

 

చదువు చెప్పదలచు చాదస్తమునువీడి

మార్కులంద గలుగు మార్గమందు

చిన్నపిల్లవాని చిత్తు "లోనారసి"

ప్యాసుచేయవమ్మ పంతులమ్మ!

 

చాలా ఏళ్ళ కిందటెప్పుడో శ్రీకాళ్ళకూరి నారాయణరావుగారు ఒక త్రాగుబోతు దినచర్యని, మనకిప్పుడు బాగా పాపులరైన తెంగ్లీషులో వర్ణించిన పద్యం:

 

మార్నింగు కాగానె మంచము లీవింగు

మొగము వాషింగు చక్కగ సిటింగు

కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు

గబగబ డ్రింకింగు గ్రంబులింగు

భార్యతో ఫైటింగు బైటకు మార్చింగు

క్లబ్బుకు రీచింగు గాంబులింగు

విత్తము లూజింగు చిత్తము రేవింగు

వెంటనే డ్రింకింగు వేవరింగు

 

మరలమరల రిపీటింగు మట్టరింగు

దారి పొడవున డాన్సింగు థండరింగు

సారెసారెకు రోలింగు స్లంబరింగు

బసకు రీచింగు జేబులు ప్లండరింగు! 

కావ్యాలలో చాటువులలో శతకాలలో, ప్రాచీనాధునిక కాలాలలో, ఇంత విస్తృతంగా పోషింపబడిన, పోషింపబడుతూ ఉన్న హాస్యరసానికి తెలుగు సాహిత్యంలో తగిన స్థానమే లేదనడం నా దృష్టిలో కేవలం హాస్యాస్పదం!  

మళ్ళీ వచ్చే వారం మరొక రసంతో కలుసుకుందాం. అందాకా ఎప్పటిలా మీ మెదడుకు మేత, ఈమారు ఒక ప్రహేళిక పద్యం. ఈ పద్యం గుట్టువిప్పితే మీ పెదవులు విప్పారడం తథ్యం! :)

కలువలరాజుబావ సతిగన్న కుమారుని యన్నమన్మనిన్

దొలచిన వాని కార్యములు తూకొనచేసిన వాని తండ్రినిన్

జిలికిన వాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్

వలచిన వాహనంబువలె వచ్చెడి నింటికి జూడవే చెలీ!
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)