ధారావాహికలు

మరీచికలు (సాంఘిక నవల) - 4

- రచన : వెంపటి హేమ. 


 

 ఆ ఊరు వచ్చినప్పటి నుండీ ఏ రోజునా తొమ్మిదవ్వగానే రామేశం బ్యాంక్ కి బయలుదేరుతున్నాడు. అందుకే రాజేశ్వరి తొందరగా లేచి ఆ సమయానికి ఆయనకి కావలసినవన్నీ సిద్ధంగా అమిరేలా చూస్తుంది. ఆయన బయలుదేరే వేళకి చిన్న కారియర్లో భోజనం కూడా సద్ది ఉంచుతుంది. ఇంటిదగ్గర బ్రేక్ ఫాస్టు కానిచ్చి, భోజనం వెంట తీసుకుని బ్యాంకుకి వెళ్ళిపోతాడు రామేశం.

తండ్రి బయటికి వచ్చేసరికి మోటారుసైకిల్ని శుభ్రంగా తుడిచి, గుమ్మంలో సిద్ధంగా ఉంచాడు ప్రిన్సు. భార్యాబిద్దలకు వీడ్కోలు చెప్పి సంతోషంగా బ్యాంకుకి వెళ్ళిపోయాడు రామేశం.

తండ్రిని కనుచూపు మేర సాగనంపి ఇంట్లోకి వచ్చిన ప్రిన్సు, ఆయన వదిలి వెళ్ళిన న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. పేపర్లో ఉన్న విశేష వార్త ఒకటి అతన్ని ఆకర్షించడంతో చెల్లెల్ని కేకేసి పిలిచాడు, "వకుళా! ఈ ఊరికి త్వరలోనే మహర్దశ పట్టబోతోంది! ఊరికావలలగా ఉన్న కొండగుట్టపైనున్న ఆలయం ఇన్నాళ్ళకి ఆర్ఖియాలజిష్టుల ద్రష్టిలో పడింది . ఆ గుడిమీద లెక్కకు మిక్కిలిగా, అపురూపమైన శిల్పాలెన్నెన్నో ఉన్నాయిట. త్వరలోనే దానికి పూర్వ వైభవాన్ని తెప్పించే ప్రయత్నం జరుగబోతుందిట! బాగుంది కదూ ...."

"ఔనా! మంచిదే కదా " అంది వకుళ సంతోషంగా. "అంతేకాదు, ఆ కొండ ఒక మోకరిల్లిన ఏనుగులా, గుడి ఏనుగుపై నున్న అంబారీలా ఉంటాయిట . ఆ గుడి ఎవరు, ఎప్పుడు కట్టించారో ఎవరికీ తెలియధు. గుళ్ళో శాసనాలు ఉన్నాయిటగాని, వాటిని చదవడంరాదు ఇక్కడ ఎవరికీ. ఆ గుడిని చూడాలని నాకు చాలా ఉబలాటంగా ఉంది, రేపొకసారి వెళ్లి చూసి వద్దామా?" ప్రిన్సు సరదా పడ్డాడు . కాని వకుళ ఒప్పుకోలేదు.

"సరిగ్గా నాల్గు రోజుల్లోకి వచ్చింది నీ ప్రయాణం. అమ్మనీకోసం ఏవేవో చెయ్యాలనుకుంటోంది. నేను అమ్మకి సాయం చెయ్యాలి. మళ్ళీమాటు వచ్చినప్పుడు వెడదాంలే మనిద్దరం కలిసి, ఈ మాటుకి నువ్వెళ్ళు" అంది వకుళ.

"నా ఫ్రెండ్సు,ముఖ్యంగా సురేశ్ అడుగుతాడు - "మీ హోంలాండుకి వెళ్ళోచ్చావు కదా, అక్కడి విశేషాలు చెప్పవా" అని. అప్పుడు నేనీ ఫొటోలూ, ఇంకా నేను తీసిన చాలా చాలా సీనరీలు చూపించి , మన జన్మభూమి ఎంత సంపన్నమైనదో చెపుతా ... ఎలాఉంది నా ప్లాను? అప్పుడు చూడాలి వాళ్ళ మొహాలు " అంటూ ఉత్సాహం పట్టలేక, "నా జన్మభూమి కన్న అందమైన దేశము ...." అంటూ ఈలపాట పాడ సాగాడు ప్రిన్సు. అన్నగారి సరదా చూసి నవ్వుకుంధి వకుళ.

అంత వరకూ గుమ్మంలో, వాళ్ళ సంభాషణ వింటూ నిలబడిన కామాక్షి , గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. వకుళ కళ్ళబడింది అది .

" ఏమయ్యిందిట! ఈ వేళ లోపలకి రాకుండా కామాక్షి అలా వెళ్ళిపోయిందేమిటి" అంది ఆశ్చర్యంతో .
" ఏం? నీ బూజం ఫ్రెందు నిన్ను కలవకుండా వెళ్ళిపోయిందని బాధగా ఉందా ఏమిటి" అని అదిగాడు ప్రిన్సు హేళనగా.

"ఛ! బూజం ఫ్రెండా, బూడిద గుమ్మడికాయా! నా కసలు గాసిప్పంటే పడదు. తనంతట తానై వస్తోంది కదా - అని, తప్పనిసరిగా మాట్లాడుతున్నానేగాని, ఇంక నాకు ఆమె స్నేహం కావాలని ఏ మోజూ లేదు. నే నెప్పుడైనా తనకోసమని వాళ్ళింటికి వెళ్ళానా? ఐనా తను వస్తూనే ఉంది. తనకు మూడేళ్ళే వయసు అనుకుంటుందేమో మరి, ముద్దుముద్దుగా మాట్లాడుతుంది, నాకు చిరాకు " అంటూ వకుళ వికారంగా మొహం పెట్టింది.

"ముద్దా, మొద్దా ..." అంటూ ప్రిన్సు పకపకా నవ్వా

***
టైం మూడయ్యేసరికి ప్రిన్సు లేచాడు, తల్లి ఇచ్చిన టీ త్రాగి, చిరుతిండి తిని రెడీ అయ్యాడు. కెమేరా తీసుకుని, స్పేర్ రీళ్ళు జేబులో వేసుకుని, తల్లికి చెల్లెలికి వీడ్కోలు చెప్పాడు. వాళ్ళిద్దరూ వెంటరాగా తాళాలు తీసుకుని అతడు బైక్ దగ్గరకి నడిచాదు.

బైక్ స్టార్టు చెయ్యబోతూ , "అమ్మా ! నాన్న ఇంకా లేవలేదు కదూ..." అన్నాడు తల్లితో .
చిన్నగా నవ్వి అంది రాజేశ్వరి, "ఔనురా కన్నా! వారానికి ఒక్కరోజే కదా మీ నాన్నకి విశ్రాంతి! పడుకోనియ్యి, లేచాక నేను చెపుతాలే" అంది.

ఈ ప్రయాణం కోసం ఉదయాన్నే బైక్ శుభ్రంగా తుడిచి టాంకు నిండా ఆయిలు, టైర్లనిండా గాలి కొట్టించి సిద్ధంగా ఉంచుకున్నాడు ప్రిన్సు . మళ్ళీ కావలసినవన్నీ సరిగా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకుని, "బై అమ్మా, బై వకుళా" అంటూ మరోసారి వాళ్ళకు "బై" చెప్పి బైక్ స్టార్టు చేశాడు. కనుచూపుమేర అతన్ని కంటిచూపుతోనే సాగనంపి అప్పుడు ఆ తల్లీకూతుళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు.

తమ ఇంటి అరుగుమీద స్తంభం చాటున నక్కి ఇటే చూస్తున్న సుబ్బులమ్మ సంతృప్తిపడి, సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంత వరకు కరెంట్ వైర్ మీద వాలి కూర్చుని, కన్నుమార్చి కన్నుతో లోకాన్ని పరికించి చూస్తున్న కాకి, కనిపించని దేవుణ్ణి కాపాడమని వేడుకుంటున్నదానిలా "కావు, కావు" మని కూస్తూ ఎటో ఎగిరిపోయింది

* * *

ఆ ఊరి మెయిన్ రోడ్డు మీదుగా పడమటి వైపుకి నాలుగు మైళ్ళు వెళ్ళాక కరిగిరి దగ్గరగా కనిపించింది. అక్కడ నుండి సూటిగా అక్కడకి వెళ్ళే అడ్డరోడ్డు ఉంది. వెంటనే అటు మళ్ళాడు ప్రిన్సు. భక్తుల రాకపోకలు ఆగిపోడంతో గుడిలాగే ఆ రోడ్డుకూడా శిధిలావస్థకు చేరుకుంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న తుప్పలు అదుపు తప్పి రోడ్డు మీదికంతా వ్యాపించిపోడంతో దారి ఇరుకైపోయింది. ఆ సన్నని దారిలో అడ్డంగా ఎదిగిన కొమ్మల్ని నేర్పుగా తప్పించుకుంటూ ముందుకి సాగుతున్నాడు ప్రిన్సు. "అదొక అపురూప శిల్పారామం - అనొచ్చు" అన్న ఆర్ఖియాలజిస్టుల మాట ఇచ్చిన స్పూర్తితో, ఆ శిల్పాలను తన కెమేరాలో నిక్షేపించి, వాటిని తీసుకెళ్ళి తన మిత్రులకు చూపించాలన్న ఉత్సాహంతో ముందుకి సాగుతున్నాడు ఆ పుంత దారివెంట . అతడలా ఆ గతుకుల రోడ్డు మీద కొంతదూరం వెళ్ళి ఒక మలుపు తిరిగే సరికి అతనికి, పూజా సామగ్రి ఉన్న వెండి సజ్జ చేత్తో పట్టుకుని ఆపసోపాలు పడుతూ నడవలేక నడవలేక, ఒంటరిగా గుడి వైపుకి నడిచి వెడుతున్న కామాక్షి కనిపించింది. ఆమెకు దగ్గరగా వచ్చి బైక్ ఆపాడు ప్రిన్సు. అలాంటి నిర్మానుష్య ప్రదేశానికి ఒక ఆడపిల్ల అలా ఒంటరిగా రావడం అతనికి ఆశ్చర్యంగా తోచింది.

ముందునుండీ ఉన్న పరిచయం వల్ల చనువుగా ఆమెను పలకరించాడు ప్రిన్సు,. "ఇలా ఎక్కడికి? గుడికేనా "అంటూ.

"ఔను. మొక్కుంది, తీర్చాలని బయలుదేరా" అంది ఏమీ ఎరగనట్లుగా కామాక్షి .
"ఇలా ఒంటరిగానా! తోడెవరూ రాలేదా?"

గతుక్కు మంది కామాక్షి. అంతలోనే సద్దుకుని, "రాకేం, అత్తయ్య వచ్చింది. కొంత దూరం వచ్చాక ఆమెకు కాల్లో గాజుపెంకు గుచ్చుకోడంతో రక్తం ధారలయ్యింది. తప్పనిసరిగా ఇంటికి వెళ్ళిపోవాల్సివచ్చింది. తెలిసిన ఊరేకదా అని నేనిలా వచ్చేశాను" అంది .

" నేనూ ఆ గుడికే వెళుతున్నా. ఫొటోలు తీయడానికి. కావాలంటే మీరూ నాతో రావచ్చు, నేను లిఫ్టు ఇస్తా" అన్నాడు ప్రిన్సు. దానికోసమే ఎదురుచూస్తున్న దానిలా, వెంటనే బైక్ ఎక్కి కూర్చుంది కామాక్షి . ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరారు.

కొంచెం దూరంలో తీతువొకటి కూస్తూ ఎగురుతోంది. దారికి కొంచెం ఆవలగా ఉన్న బూరుగు చెట్టు కొమ్మల్ని పట్టుకుని తలక్రిందులుగా గాలిలో వేళ్ళాడుతున్న ఋషి పక్షులు వాటిలో అవి కీచులాడుకుని గోలగా అరుస్తున్నాయి. ప్రకృతితో అంతగా పరిచయం లేని, పట్నాలలో పెరిగినవాడు కావడంతో ప్రిన్సుకి ఆ పక్షులు వింతగా కనిపించాయి. వాటిని గురించి కామాక్షిని అడిగాడు.

"అవి తెల్లక్రిందులు పక్షులు! ఋషి పక్షులు అనికూడా అంటారు వాటిని. పాడుపిట్టలు, చీకటి పడితే చాలు, గోలగోలగా అరుచుకుంటూ, తోటలమీద పడి, పళ్ళూ కాయలూ కొరికి నాశనం చేస్తాయి" అంది కామాక్షి, వాటివైపు కోపంగా చూస్తూ. అంతలో తీతువు కూస్తూ వాళ్ళున్నవైపుగా వచ్చింది. దానికూత హృదయ విదారకంగా ఉండడంతో "ఇదేమి పక్షి" అని మళ్ళీ అడిగాడు ప్రిన్సు.

చీదరగా మొహం పెట్టుకుని, "దాన్ని తీతువు అంటరు. అదో పాపిష్టి జీవి, దుశ్శకునం కూడా! అది తలమీంచి ఎగిరి వెడితే మనకు అరిష్టం చుట్టుకుంటుంది . మనం "రామా రామా" - అని, దేవుణ్ణి తలుచుకుని దాన్ని తిట్టిపొయ్యాలి. అప్పుడుగాని దోషం పోదు" అంటూ దాన్ని నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టడం మొదలేట్టింది కామాక్షి.
విధవిధాలుగా, వివిధ రీతుల్లో ఉంటుంది సృష్టి . కాని దేని విలువ దానిది. మనకు వాటి అర్ధం తెలియకపోడం మన దురదృష్టం. లోపం మనలో ఉండగా, నిరపరాధులైన వాటిని దుమ్మెత్తి పొయ్యడం న్యాయం కాదు కదా - మనసులో అనుకున్నాడు ప్రిన్సు . ఆ తిట్లు వినడానికి దుర్భరమనిపించింది అతనికి. "ఇక చాలు గాని, ఆపు. అది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంత భయంకరమైన చోటికి ఒక్కదానివీ బయలుదేరావు, ఏం సాధించాలనీ?"
మాటలకోసం తడుముకోవలసి వచ్చింది కామాక్షికి. " మొదట్లొ అత్తయ్య కూడా ఉంది గా! కొంతదూరం వచ్చాక తప్పనిసరిగా అత్తయ్య వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తెలిసిన ఊరే కనక ఇబ్బందేం ఉంటుంది? ఎలాగా బయలుదేరా కదాని నేను ఇక ఆగకుండా వచ్చేశా. "మనం కష్టాలకు ఓర్చి ముందుకు సాగినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుని వరాలిస్తాడు" అంది మా అత్తయ్య."

గోధూళి వేళ దగ్గరపడడంతో కొండవాలులో పసువుల్ని మేపుతున్న పాలేర్లు, వాటిని ఇళ్ళకు మళ్ళించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ దృశ్యాల్ని కూడా ఫొటోలు తీశాడు ప్రిన్సు. క్రమంగా ఎండ తీక్ష్ణత తగ్గుతోంది. బైక్ కొండని సమీపించింది. ఏటవాలుగా ఉన్న ఆ కొండ దిగువనే బైక్ ఆపి, తాళంవేసి కామాక్షికి "బై" చెప్పేసి, వెలుగు తగ్గిపోతుందన్న భయంతో తొందరగా కొండ మీదికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు ప్రిన్సు.

* * *
                            
(సశేషం)

 
     
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)