కథా విహారం

 విషాదమోహనపార్శ్వం - జీవనస్వారస్యం!
కె.బి.లక్ష్మిగారి కథ ‘సంధ్యాసమీరాలు’

- రచన : విహారి     


 

రచయిత ఒక పిట్టగా కొంత ఎత్తులో విహరిస్తూ, ఆగి, కిందికి చూస్తే - ఎన్నెన్ని దృశ్యాలు! ఎందరెందరి చలనం, గమనం! కిందికి దిగి వాటిలో, వారిలో కలిసిపోయి, ఒదిగిపోయి, పరిశీలనగా వాటన్నిటినీ అర్థం చేసుకుంటే చదవగలిగితే....?ఓహ్, అద్భుతం! కొందరు రచయితలకి, ఈ అద్భుతాన్ని చూసి, అనుభవించి, ఇతరులకు చెప్పగల నేర్పూ, నైపుణ్యం ఉంటాయి. ఈ నైపుణ్యాల వల్లనే మనిషి బాహ్య వర్తనమూ అంతరంగిక భావపరంపరా - సమస్తమూ - అనేకానేక అంశాలుగా కథల్లో వైవిధ్యభరితంగా భాసిస్తోంది వీటిలో.

అటు సామాజిక ప్రయోజనం, ఇటు సాహిత్యప్రయోజనం కలిగిన ఇతివృత్తాన్ని జాగ్రత్తగా ఎన్నుకుని, ప్రత్యేకమైన, విలక్షణమైన, విశిష్టమైన రచనల్ని చేస్తారు అసలు సిసలైన కథకులు. అలాంటి అసలు సిసలైన రచయిత్రి, సాహిత్యవిద్వన్మణి - కె.బి.లక్ష్మిగారు. ఆమె ప్రముఖ పత్రిక సంపాదకమండలిలో పని చేసిన అనుభవశాలి. బహుముఖీనమైన ప్రతిభావ్యుత్పుల సమాహారరూపం. పొందిన గౌరవాలకీ, సత్కారాలకీ కొదవలేదు!

పేరు చూడగానే, కథ పట్ల ఉత్సుకత కలిగే విధంగా వుంటాయి కొన్ని కథలు పేర్లు, శీర్షికలో ఒక ఆకర్షణ. ఒక ఆలోచన, ఒక పిలుపు. ’నన్ను చదువు’ అనే ఆహ్వానం. ఒక ప్రేరణ, ఒక కవ్వింపు వుంటాయి. ‘మనసున మనసై’ ‘ఆని నీవనుచు అంతరంగమున’ ‘తరలిరాద తనే వసంతం’ ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే’....ఇలా తెలుగువరి రసనకెక్కిన పదాలూ, పాదాలూ, పల్లవులూ, - లక్ష్మీగారి కథల పేర్లు! వీటిని గమనిస్తే రచయిత్రి భావుకత, కవితాత్మ, మృదుహృదయ సౌహృద, సాహిత్య సౌమనస్యం అర్థమవుతాయి.

లక్ష్మిగారు రాసిన ఒక గొప్ప కథ - ‘సంధ్యా సమీరాలు’. యశ్వంత్. అనూహ్య భార్యభర్తలు. ఇద్దరూ ఉద్యోగాల్లో పెళ్లయిన ఏడాదికే ట్రాన్సిఫర్. ప్రమోషన్ తో లింకు. కెరీర్...! యశూ వస్తున్నాడు. రెండ్రోజులు కాన్ఫరెన్స్. హోటల్ లో బస.

అనూహ్య మనస్సులో ఎన్నెన్నో మధురోహలు,. ఆమె వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటున్నది. యశూ వచ్చాడు.

అక్కడినుంచీ ప్రైవేసీ కోసం, స్వీట్ నథింగ్స్ పంచుకోవడం కోసం, పరస్పర సమీక్ష వీక్షణాల కోసం, స్పర్శ కోసం, హృదయ పరామర్శ కోసం.....

టాంక్ బండ్, లుంబినీ పరిసరాల్లో బుద్ధపూర్ణిమ ఫైఓవర్ మీద కాఫీ బగ్గీ దగ్గర...ఎక్కడికి పోయినా...జంటలు జంటలు....ఖాళీ లేదు. ‘ఒకరినొకరు పెనవేసుకుపోయి ముద్దుల్లో మునిగి తేలూతూ...’ జంటలు! నిరాశే మిగిలింది వీరిద్దరికీ!

మర్నాడు, యశూ ఎవరో మిత్రుడి కారు తెచ్చాడు. డ్రైవర్ లేకుండా, పార్క్ కి పోయారు.

ఎటు చూసినా జనమే. టీనేజ్ జంటలే ఎక్కువ. కొన్నిక్షణాల్లోనే పార్క్ కాపలావాళ్ల హెచ్చరికలు. విజిల్స్....బయటపడక తప్పలేదు. దార్లో రెండు ఐస్ క్రీమ్ లు తినడానికి గంటా నలభై అయిదు నిముషాలు గడిపారు. ఎక్కడో దూరంగా కారు ఆపి కొంచెం సన్నిహితం కాదలుచుకున్నా ఎదురు బంగళా వాచ్ మాన్ ప్రవేశం. వాడి భయం, బాధ, డ్యూటీ వాడివి మరి!

’ఇవే పార్క్ లు, పబ్లిక్ ప్లేస్ లు కొన్నేళ్లుగా ఉన్నా ఇంతలా ప్రేమికుల తాకిడికి గురవలేదు. కానీ, ఇప్పుడు సినిమాలు, టివి ఛానల్స్ ప్రభావం యువత మీద ఎంతకాదన్నా ఉంది. వాళ్లు ప్రతినిముషం ప్రైవసీ కోరుకునే పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇక పెళ్లయి సంసారం చేస్తున్న భార్యభర్తలు కూడా రొటీన్ జీవితం. మొనాటనీ పెరిగిన బతుకు తీరులో జీవన స్వారస్యం కోల్పోతున్నామన్న భయంతో, భ్రాంతితో, ఎప్పటికప్పుడు దాన్ని రెన్యూ చేసుకొనే తాపత్రయంతో ప్రేమాస్పదమైన ప్రదేశాన్ని ఆశ్రయించక తప్పడం లేదు...’ ‘వీళ్ళ మధ్య మాలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అయితేనేం! నది సాగరంలోొ కలిశాక సముద్రపు ఉప్పు నీరే అవుతుంది గానీ, తీయని నదిజలంలా ఉండిపోలేదు కదా?!’ ఇదీ అనూహ్య ఆలోచన.

...యాశూ ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ‘నా ఇంట్లో నేను నా భార్య వొళ్ళో పడుకుని ఎవరూ లేని ఏకాంతంలో హాయిగా సాయంత్రాలు గడపాలని నిశ్చయించుకున్నాను’ అని! ఏకాంతము, సాయంత్రము,,...ఎద నీకై వేచేనూ’ అని అప్రయత్నంగా పెదవి దాటిన పాట అనూహ్య మనసును ఊయల లూపింది! ఇదీ కథ!

అనిర్వచనీయమైన అనుభూతి తరంగాల మీద, మనిషీ, మనసూ తేలిపోయే స్థితిని ఆలంబనం చేసుకుని, కథ రాయడం, పరిధిలో గిరికీలు కొట్టి, చెప్పాల్సింది చెపద్దామన్నా, ఆ పరిధి "పట్టా" మీది నడకలో అటో ఇటో చప్పున కాలు జారి పట్టు దప్పే ప్రమాదమే ఎక్కువ. అప్పుడు చప్పున రసాభాస మిగులుతుంది. కథ ప్రయోజనం గల్లంతవుతుంది. లక్ష్మిగారి అభివ్యక్తీకరణ నైశిత్యం, సాహిత్య సంప్రదాయాల విజ్ఞత సొంతం చేసుకున్న భావుకురాలు, విదుషీమణీ కనుక, ఈ కథకు ఎలాంటి రచానా నిర్మాణ ప్రమాదం జరగలేదు! తెలుగు సాహితి కథాహారంలో ఒక మణిపూస లభించింది!

ప్రేమ ఒక ఉన్మత్త ప్రేరక ద్రవపదార్థం. అందునా సాంసారిక ప్రణయం ఒక రసరాగఝరి. దానికి కథరూపం ఇవ్వటం ఒక ఆల్కెమీ. అది ఆనాటి మునిమాణిక్యం, మల్లాది, బాపిరాజు, ఇచ్చాపురపు వంటి కథాశిల్పులకి తెలుసు. ఈ నాటికీ అలాంటి రసవిద్యావంతులు ఉన్నారని లక్ష్మిగారు నిరూపించారు. ముప్ఫైఏళ్ల క్రితం ‘వికృతి’ అని కథ రాసిన నన్నూ, రాజారాం, సంజీవదేవ్ వంటి పెద్దలు ఈ మాటతోనే అభినందించారు.

అమూర్త భావపరంపరతో సాగవలసిన కథాంశాన్ని ఎక్కడా ‘అలతి’ అతి కూడా రాకుండా, రానీయకుండా, బహునేర్పుతో సంవిధాన పరచారు లక్ష్మిగారు.

‘ఇన్నాళ్ళూ లేనిది ఈ వేళ మనసు మరీ అల్లరి పెడుతోంది’ తీయని బాధను ద్విగుణం, త్రిగుణం చేస్తోంది కాలం’ ‘చెప్పినట్లువిని ఎంతో బుద్ధిగా ఉండే మనసు ఇటీవల ఎంతో పెంకిగ తయారయింది. తన ధ్యానంలో నా మాటని పట్టించుకోవడం లేదు. అంతా యశూ చేసిన గారమే!’ ఎంత చిక్కటి భావ ప్రకటన! చివరి వాక్యం అంతా యశూ చేసిన గారమే’! సన్నగా మీ ‘లోమది’లో అనుకోండి ఆ గడుసుదనపు కనుకొనల కినక అందుకోవచ్చు! అదీ రచనాశక్తి!

అలాగే, ‘చాలా కష్టంగా ఉందిరా నీకు దూరంగా ఉండటం’ అనుకున్న ప్రియభామిని, రా’ కొట్తే ఔచిత్యభంగం లేదు కదా. పైగా స్నేహసుధ, పరిచయపరీమళం...,గోము, గారం,.. అన్నీ పులకింపజేస్తున్నాయి కదా!

‘ఏయ్ మనిద్దరిదీ ఒకటే టెంపరేచర్’! భావం పలకటంలో కవితాత్మ చదివరిని లేతనవ్వుతో పలకరించి, గిలిగింతలు పెడుతుంది. వ్యక్తీకరణలో చల్లని స్పర్శ్జ! పదాల కమ్మ తెమ్మరని వీచటమంటే ఇదే మరి!

లక్ష్మిగారి కథకి అంతస్సూత్రం - సామాజిక సమస్యా నేపథ్యంలో సాహిత్య భావాంబరవీధి విస్తృత విహారం!

‘సంధ్యాసమీరాలు’ కథ సమకాలీన సమస్యాగత విషాదమోహనరాగ ప్రస్తారం! అందులో సమాజపు రోదా వుంది ఆర్ట్రతా, అత్మీయతా, ఆర్తీ వున్నాయి! అందుకే అది ఒక గొప్ప కథా తేజోరేఖ! లక్ష్మిగారికి అభినందనలు!

 
   

 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)