కథా భారతి  - 2

మా తెలుగు తల్లికి

- రచన : రాధిక 


 


విరించి, ఇంద్రాణి కాలిఫోర్నియాలోని సన్నీవేల్ లో ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వారికి ఇద్దరు పిల్లలు.. వారు కవలలు. హరిణి, ధరిణి. విరించిది ఎక్కువగా టూర్స్ వెళ్ళే ఉద్యోగం. హరిణి, ధరణిల వయసు ఆరు సంవత్సరాలు. తమ తమ పనులు తాము అంతగా చేసుకోలేరు. ఇంద్రాణి, భర్త తరచుగా ఊర్లు తిరుగుతున్నా ఇటు ఇంటిపని, పిల్లలపని అటు వంటపని అన్నీ తానే మేనేజ్ చేసుకుంటుందామె. ఆ ఇంటికి విరించి అన్ని హక్కులూ ఉన్న అతిథి. అప్పుడప్పుడు వచ్చే మంచి ఏకాదశి తిథి.

అనుకోకుండా ఇంద్రాణి జారిపడింది. దానితోమల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ముందునేల మీద పడింది. తరువాత మంచం మీద పడింది. ఆ జారడం అన్న చిన్ని సంఘటన వారి జీవితాల్లో అల్లకల్లోలం రేపింది. ఈ పరిస్థితి విరించికి చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం వదులుకోలేడు. కుటుంబాన్ని వదులుకోలేడు. అక్కడ పనికి ‘నాని’ లను పెట్టుకుంటే వాళ్ళకు చాలా ఎక్కువ జీతం ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళు ఇండియాలోని కొందరు పనిమనుషుల్లా ఇరవై నాలుగు గంటలూ ఉండరు. టైమంటే టైమే. ఉదయం తొమ్మిది నుండి సాయంకాలం అయిదు వరకూ అంటే అంతే. వాళ్ళింక చెయ్యరు. ఆ తరువాత ఎవరి తిప్పలు వారివే.

ఇండియాలోలాగే ఇరుగువారో, పొరుగువారో, చుట్టాలో సహాయం చెయ్యరు. చెయ్యలేక కాదు వారి బిజీ జీవితంలో పరిస్థితులు అనుకూలించక.

ఆ సమయంలో విరించికి కామాక్షి పిన్ని గుర్తుకువచ్చింది. కామాక్షి విరించికి దూరపు చుట్టం పిన్ని వరుస అవుతుంది. అంతకు ముందు కామాక్షి కూతురు సురేఖ అమెరికాలో ఉండేది. అప్పుడు ఆమె తల్లికి వీసా అప్లయ్ చేస్తే అది వచ్చింది గాని అనుకోకుండా సురేఖ ఇండియా వచ్చేయడంతో ఆవిడ అమెరికా రానేలేదు. ఇప్పుడు ఆవిడను రప్పిస్తే మంచిదని తోచింది. సురేఖ ఇండియా వచ్చిన తరువాత ఆమెకు ఉద్యోగం సరిగాలేక భర్త తాగుడుకి అలవాటుపడి ఆస్తంతా అమ్మేస్తే తల్లి దగ్గరే ఉంటోందిట. అందుకే విరించి సురేఖకు ఫోను చేయగానే తల్లిద్వారా తనకు కొంత డబ్బు వస్తుందని ఇంద్రాణికి సహాయంగా అమెరికా వెళ్ళడానికి ఒప్పుకుంది సురేఖ.

మొత్తానికి కామాక్షి అమెరికా వచ్చింది. ఆమెను చూడగానే అమ్మయ్య అనుకున్నాడు విరించి. ఇంద్రాణికి తన అత్తింటి తరపువారంటే ఇష్టం ఉండదు. ఇంద్రాణికి తల్లి లేదు కాబట్టి కామాక్షి అక్కడకు రావడానికి ఒప్పుకుందామె. కామాక్షిని చూడగానే ‘అబ్బ’ ఈవిడా నా పిల్లలను చూసేది అనుకుంది. ఎందుకంటే కామాక్షికి ఇంగ్లీషురాదు. అమలాపురం వదిలి ఎక్కడకూ వెళ్ళకపోవడం వలన ఆ కోనసీమ భాష తప్పించి ఏమీ తెలియదు. పల్లెటూరికి ప్రతిరూపంలా, ఆధునికత తెలియని లోపంలా కనిపించిందామెకు...

కామాక్షి ఇంద్రాణికి అన్నిసౌకర్యాలు బాగానే అమరుస్తుంది గాని, ఆవిడకు పిల్లలతోనే సమస్య. వాళ్ళకు తెలుగు అర్ధం అవుతుంది. అదీ కొంచెం కొంచెం. కాని తెలుగు మాట్లాడటం రాదు. కామాక్షి వంటలు నచ్చడం లేదు, మాటలు నచ్చడం లేదు హరిణి, ధరిణిలకు...

హరిణి, ధరిణిలకు వేసవి శెలవులు వచ్చాయి. వారికి ఇంట్లో ఏమీ తోచడం లేదు. ఇదివరకు ఇంద్రాణి వారిని బయటకు తీసుకొనివెళ్ళేది. ఇప్పుడు ఖాళీ ఎక్కువ కావడంతో ఇల్లుపీకి పందిరేస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టేసుకొని, జుట్లు పీకేసుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల వారికి ఎవరూ స్నేహితులు లేకపోవడంతో అస్తమానూ బోర్, బోర్ అంటున్నారు.

ఇలా ఉంటే లాభంలేదని కామాక్షి ఇంద్రాణిని అడిగి అక్కడకు దగ్గరలో నున్న పార్కుకి వారిని తీసికెళ్ళడం మొదలుపెట్టింది. ముందు ఇంద్రాణి కంగారుపడింది గాని, పిల్లలను, కామాక్షి పార్కు నుండి క్షేమంగా తిరిగితీసుకు రావడంతో ఆమెకు భయం తగ్గింది. విదేశాలలో పార్కులు ఎక్కువ ఉండడం. అందులో పిల్లలు బాగా ఆడుకోవడం అదో మంచి విశేషం, వాళ్ళకు సంతోషం..

కామాక్షికి పిల్లలు పాడే ఇంగ్లీషు పాటలు అర్ధం కావడం లేదు. వాళ్ళ దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. వాటితో వారిని ఎలా ఆడించాలో కూడా ఆమెకు తెలియడం లేదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే వారి అల్లరి మాత్రం అంతంత మాత్రం కాదు.. అదుపులో పెట్టలేనంత.. భీభత్సం. అందుకే వారిని మెల్లగా తన చేతలతో మార్చాలనుకుంది. ఇద్దరూ ఒకే వయసు వారు కాబట్టి ముందుగా వారికి ఒప్పుల కుప్ప వయ్యారి భామ ఆట నేర్పించింది. మొదట్లో వారిద్దరూ కూడా ఉయ్ హేట్ దిస్ గేమ్ అన్నారు. కాని మెల్లగా వారికి బోర్ ఎక్కువై ఆ ఆట ఆడడం మొదలుపెట్టారు. వారి ఇంటి వెనకాల లోపలే ఖాళీ స్థలం ఎక్కువ వుండటం వారితో అక్కడే ఆడడం, తిరగడం కొంత ఇబ్బందిగా అనిపించలేదు. ఆ తరువాత స్కిప్పింగ్, కుంటి ఆట నేర్పింది అంతటితో ఊరుకోలేదు కాబట్టి తొక్కుడుబిళ్ళ ఆట నేర్పించింది హరిణి, ధరిణిలకు ఆ ఆటలమీద అంతగా ఇంటరెస్ట్ లేకపోయినా కాలక్షేపానికి నేర్చుకుంటున్నారు. ఆ కాలక్షేపంలోనే ఓ ఆనందం దొరుకుతుంది. వారికి, ఇంద్రాణికి కూడా.

రోజులోఎంత సేపని ఆటలు ఆడతారు. మెల్లగా పాటలు పాడించడం అలవాటు ఛేసింది కామాక్షి. వారికి తెలుగు పలకడానికి నోరు సరిగ్గ తిరగకపోయినా కామాక్షి వదల్లేదు. మరల మరల పాడి వినిపించేది. ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ..మా కన్నతల్లికి మంగళారతులు నేర్పించింది. తరువాత జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి అనే దేశభక్తి గేయం చెప్పింది. ఈ పాటల ప్రాక్టీసు ఆ కవలలకు కాస్త సరదాగానే ఉంది. ఆ పాటల అర్ధాలు వాళ్ళ అమ్మను అడిగి తెలిసి కొని మరీ వాడుతున్నారు.

కామాక్షి, తనూ వాళ్ళతో కలిసి గుడుగుడు గుంచం, గుండారాగం, పాములపట్టం పడగారాగం, అప్పడాల గుర్రం, ఆడుకోబోతే, పేపే గుర్రం - పెండ్లికి బోతే, వడీ కీడ గుర్రం నీళ్ళకు పోతే నా గుర్రం పాలకుపోతే, కత్తేయనా బద్దేయనా, వేణ్ణీళ్ళా, చన్నీళ్ళా అంటూ ఆ ముగ్గురూ పిడికిళ్ళు పట్టి ఒకరి పిడికిలి పై మరొకరి పిడికిలి పెట్టి పై పిడికిలి పై చూపుడువేలు ఉంచి, ఆ ఆటను ఆడించింది. మధ్యలో వందేమాతరం, జన గణ మన లాంటి గీతాలు నేర్పించడం మానలేదు. అమెరికాలో నాకేమీ తెలియదు అనుకుంటూ కోర్చోలేదు కామాక్షి. తనకు తెలిసిన ఆటలు పాటలు వారికి నేర్పించింది. వాళ్ళు అస్తమానూ చందమామరావే, జాబిల్లిరావే, కొండెక్కిరావే, గోగుపూలుతేవే అని పాడుతుంటే కామాక్షికి, ఇంద్రాణికి కూడ తమ చెవుల్లో తేనె పోసినట్లయింది.

అంతే కాదు ఇద్దరే ఆడుకునే ఆట చెమ్మచెక్క చారడేసి మొగ్గ, అట్లుపోయంగ, ఆరగించంగా, ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగ, రత్నాల చెమ్మచెక్క రంగులేయంగ, పగడాల చెమ్మచెక్క పందిరేయ్యంగ, పందిట్లో మా బావ పెళ్ళి చేయంగ అంటూ ఒకరి అరచేతులను మరొకరు తడుతూ ఆడుతుంటే ఆ పిల్లలకు ఎంతో బావుంది. మొదట్లో ఈ ఆటలు ఒద్దన్న హరిణి, ధరణిలు ఇప్పుడు వాటిని ఎంతో ఇష్టపడుతున్నారు. పిల్లలు నేర్వగరాని విద్యగలదే విసుగు కొనక నేర్పించినన్ అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి ఇంక ఒప్పులకుప్పా వయ్యారిభామా, మినపాపప్పు, మెంతీపిండీ, తాటిబెల్లం, తవ్వెడు నెయ్యి, గుప్పెడు తింటే కులుకూలాడే, నడుమూ గట్టి న మాట బట్టి, సన్నాబియ్యం - ఛాయాపప్పు పాలు నెయ్యి పాశం వొండ నీ మొగుడు దింటే ఆనందమంటే అంటూ హరిణి, ధరణి చేయీ చేయీ కలిపి గిరగిరా తిరగేస్తున్నారు... వారితోపాటు వారికి వేసిన పొడుగుజడ, లంగా జాకెట్లు కూడా చక్కగా సరిపోయాయి. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న మిగిలిన తెలుగు పిల్లలకు వీకెండ్ కు నేర్పిస్తున్నారు. ఈ ఆటపాటలు కామాక్షి వారికి పండుగల పాటలన్నీ గుర్తుకి తెచ్చుకొని మరీ నేర్పిస్తుంది. అందులో అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్. పలకల క్రింది - గుప్పెడు బియ్యం, పిల్లల్లార జల్లల్లార లేచి రారండోయ్. పీటల క్రింద - పిడికెడు బియ్యం, పిల్లల్లారా జల్లల్లారా లేచి రారండోయ్. అంటూ చెప్పింది. వాళ్ళూ నేర్చుకున్నారు.

పిల్లల్లోని ఈ మార్పుకి విరించి, ఇంద్రాణి కూడ ఎంతో ఆనందించారు. ఈ గండం ఎలా గట్టెక్కుతుందా అనుకున్న ఆ దంపతులకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. కామాక్షికి ఇండియా వెళ్ళి పోయే సమయం వస్తుంది. ఇంద్రాణి లేచి తిరగగలుగుతుంది, కామాక్షి సేవలవలన.

చివరగా ‘వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా నల్లనల్ల మేఘాలు వానదేవుడా, జల్లుగా కురవాలి వానదేవుడా, చేలన్ని పండాలి వానదేవుడా, చెరువులన్ని నిండాలి వానదేవుడా కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా గొప్పగా చెయ్యాలి వానదేవుడా.అన్న వానపాటను కూడా నేర్పించేసింది. ఇంక మిగిలినవి ఆంధ్రుల ముఖ్యమైన పండగ అయిన సంక్రాంతి పండుగలోని గొబ్బిపాటలు. వాటినీ వదలదలచుకోలేదు కామాక్షి. గొబ్బియల్లో గొబ్బియల్లో గౌరమ్మతల్లికి గొబ్బియల్లో, గొబ్బియల్లో, గొబ్బియల్లో..
గుమ్మాడి పూసింది గొబ్బియల్లో..ఆ పూలు కోసుకొని గొబ్బియల్లో పూజ సేతామురారె గొబ్బీయల్లో అన్నపాట. వచ్చిందయ్యా వచ్చింది ఉల్లాసంగా సంక్రాంతి, తెచ్చిందయ్యా, తెచ్చింది. తెలుగు వాకిట సంక్రాంతితో పాటు చిట్టి చిట్టి రేగిపళ్ళూ, చిట్టీ తలపై భోగిపళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు, ఎర్రా ఎర్రని రేగిపళ్ళూ, ఘల్లు, ఘల్లూన దమ్మిడీలు జల్లుగ అల్లో నేరేడి పళ్ళు తళతళ తళతళ లాడిపోరూ - తలపై ఎన్నో దొర్లిపోతాయి. అంటూ ఆ పాటను కూడ ప్రాక్టీసు చేయించేసింది.

కామాక్షి ఇండియా బయలుదేరుతుంటే ఇంద్రాణి, విరించిలు మరీ మరీ థాంక్స్ చెప్పారు. హరిణి, థరిణిలు మాత్రం ఆవిడను వదలలేక వదిలేరు. కామాక్షి అక్కడ ఉన్నంతకాలం వారిద్దరూ కొత్త తెలుగు ప్రపంచాన్ని చూశారు. ఎంతో ఆనందించారు. ఈవిడతో పిల్లలు కలుస్తారా అనుకున్న ఇంద్రాణి వాళ్ళకు ఆవిడే సరి అనుకునేలా చేసింది కామాక్షి. అందులో ఆ పిల్లలను నేను చూడగలనా అనుకున్న ఆమె వారిలో తెలుగు తనాన్ని నింపి మరీ వచ్చింది. ఒక వసంతం వచ్చి వెళ్ళిపోయింది. కామాక్షి ఇండియాకు రాగానే నీవు భలే అదృష్టవంతురాలివి అమెరికా చూసివచ్చావు అని అందరూ అన్నారు. వారి మాటల్లోని సంతోషం కంటే ఆవిడ వచ్చిన తర్వాత హరిణి, ధరణి ఆమెకు ఫోన్ చేసి ఫోనులో మా తెలుగు తల్లికి మల్లె పూదండ అన్నపాట పాడి వినిపించడం మహదానందాన్ని మదినిండా అందించింది కామాక్షికి.
 

 
 

 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)