కథా భారతి  - 1

లక్ష్మీ పుత్రుడు

- రచన : ఆర్. శర్మ దంతుర్తి  
 


 

విమానం లోపలకి మొదటి పేసెంజర్ గా ఎక్కి ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నాడు లక్ష్మీ నారాయణ. గత మూడేళ్లుగా ఇండియా రావడానికి ప్రయత్నం చేస్తున్నా ఇప్పటిదాకా కుదర్లేదు. పోరగా పోరగా ఇప్పటికి తనకి మేనేజ్ మెంట్ ఓ పదిరోజులు ఇంటికెళ్ళి రావడానికి శెలవిచ్చింది. మళ్ళీ ఒకటో తారీఖుకి న్యూయార్కులో ఉండాలి.
"మీ కోటు ఇస్తారా? లోపల పెట్టడానికి? మీకు తాగడానికి ఏం కావాలో చెప్పండి." అప్పుడే వచ్చిన ఎయిర్ లైన్స్ అమ్మాయ్ అడుగుతోంది కోటు కోసం చేయి సాచి.
కోటు ఇచ్చి చెప్పేడు నారాయణ, "ఒక బ్లడీ మేరీ కొంచెం లెమన్ జ్యూస్ తోటి, థేంక్స్!"
వచ్చిన డ్రింక్ తాగుతూ మెల్లిగా రిలాక్స్ అవుతూంటే డెల్టా విమానం కదిలింది. ఓ సారి గాలిలోకి లేచాక కిటికీలోంచి చూసేదేమీ ఉండదు కనక మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు. ఆరేళ్ళ క్రితం తానో అనామకుడు; ఎకానమీ క్లాసులో మొదటిసారి అమెరికా వచ్చేడు అహ్మదాబాదులో ఎం. బి. ఏ అవ్వగానే. అంతకు ముందు ముక్కూ మొహం తెలియని తను ప్రైవేట్ గా కట్టి నానా తంటాలూ పడి బి.ఏ పేసయ్యేడు. సినిమా రీలులాగా ఒక్కో జ్ఞాపకం బయటకి రావడం మొదలైంది.

* * *

"ఒరే లక్ష్మీ నిన్న స్కూలికెందుకు రాలే?" సుబ్బారావు మేష్టారు అడిగేరు.
"నిన్న మా ఇంట్లో తినడానికేమీ లేదండి. అమ్మ ఒక ఇంట్లో పని చేస్తోంది; అక్కడ పని ఎక్కువైతే నేను తోడు వెళ్ళాను. పని అయ్యేక వాళ్ళిచ్చిన అన్నం అదీ తీసుకుని వెనక్కి వచ్చేసరికి సాయంత్రం ఐపోయింది."
మేష్టారి మనసులో ముల్లు గుచ్చుకున్నట్టైంది. వీడికి ఎంత సహాయం చెయ్యలని ఉన్నా, ఆయనకున్న సంతానం, సంపాదనా గుర్తొచ్చేసరికి నోటమ్మట మాటరాలేదు, "సరే సరే," అనేసాడు. కాస్సేపాగి చెప్పేరు మేష్టారు, "సాయంకాలం, మా ఇంటికోసారి రా."
సాయకాలం మేష్టారింటికెళ్ళాక చెప్పేడు లక్ష్మి, "ఈ రోజు అమ్మ నన్ను ప్రింటింగ్ ప్రెస్ రామయ్యగారి దగ్గిరకి తీసుకెళ్ళింది. రేపట్నుంచి స్కూల్ ఐపోయేక రాత్రి తొమ్మిద్దాకా పనిచేయడానికి రమ్మన్నారు. రాత్రి వాళ్ళింట్లోనే భోజనం పెడతానన్నారు."
"మరి నువ్వు చదువుకునేదెప్పుడు?" మేష్టారడిగేరు.
" ఆది వారాలు సాయత్రం నాలుగునుంచి రాత్రి పది దాకా కుదురుతుందండి."
"అదేమిట్రోయ్, ఆదివారాలు కూడా పొద్దున్న ప్రెస్సు పనా లేకపోతే అంట్లు తోముతావా అమ్మతోటి?" ఎక్కెసెక్కంగా అడిగేరు మేష్టారు.
"లేదండి, ఆ రోజు శ్రేష్టిగారు వాళ్ళ కొట్లో చిల్లర లెక్కపెట్టి చిన్న చిన్న మూటలుగా కట్టి ఇవ్వడానికి రమ్మన్నారు, ఇది వేరే ఉద్యోగం లాంటిదే. కానీ ఆయన భోజనం పెట్టమని ఖఛ్ఛితంగా చెప్పేసారు."
"ప్రెస్సులో ఉద్యోగం అంటే కాయితాలు తొక్కుకుంటూ ఉండాలేమో?" స్వగతంలో అనుకుంటున్నట్టూ పైకే అన్నాడు మేష్టరు.
"అవునండి. ఆయనే చెప్పేరు కాయితాలు తొక్కుకుంటూ పనిచేయాలని. అదే కాదు శ్రేష్టి గారు చెప్పడం బట్టి, వాళ్ళింట్లో కూడా చిల్లర మీదనుంచి నడిచి వెళ్ళాలి. అప్పుడప్పుడు నాణేలు కాళ్ళకింద పడుతూ ఉంటాయి అని చెప్పారు."
"పుస్తకాలూ, కాయితాలంటే సరస్వతీ, చిల్లరంటే లక్ష్మీ దేవీను. వీటిని తొక్కుకుంటూ బతికితే నువ్వు బికారిలాగా తయారౌతావ్ చదువూ, సంధ్యారాక."
"మరి తిండి గడవొద్దా మేష్టారూ?"
మేష్టారికేం చెప్పాలో తెలియలేదు. ఆ పూటకి కడుపునిండా తిండి మాత్రం పెట్టించి పంపించేడు ఇంటికి. వెనక్కి వస్తోంటే మేష్టారి భార్య చిన్న మూట చేతికిచ్చి చెప్పింది, "ఈ మూట మీ అమ్మకియ్యి. నువ్వు మేష్టరు అన్న మాటలు పట్టించుకోకు నాయనా, ఆయనకి చాదస్థం ఎక్కువ. నీకేమైనా కావలిస్తే నన్ను అడుగు. మా పిల్లలకి చదువు పెద్దగా రావట్లేదు కానీ ఈ చాదస్థాలు అంటుకుంటున్నాయి బాగా. నువ్వు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తే ఇవన్నీ పట్టించుకోక్కర్లేదు. దేవతలంటే కరుణ చూపిస్తారు కానీ ఇలా కాయితాలు తొక్కేవని శపిస్తే ప్రపంచంలో ఈ పాటికి ఎవరికీ చదువు వచ్చి ఉండేదు కాదు."

* * *

"సార్, డిన్నర్ కి లేస్తారా?" అడుగుతోంది విమానం అమ్మాయి, మెల్లిగా చేతిని కదుపుతూ. ఒకసారి కళ్ళు తెరిచి చూసేడు, నిద్ర పట్టేసినట్టుంది. చుట్టూ అందరూ డిన్నర్ తినడంలో బిజీగా ఉన్నారు. లేచి డిన్నర్ తినడానికి ముందు బాత్రూంలోకి దూరేడు.

మొదటిసారి విమానం ఎక్కినప్పుడు, రెండో సారి ఇంకో కోక్ ఇమ్మని అడిగినందుకు తనవైపు ఎంత చుర చురా చూసిందో విమాన పడతి. ఇప్పుడో? ఫస్ట్ క్లాసు కనక లేపి మరీ మేపుతున్నారు తనని. ఫస్ట్ క్లాసూ, బిజినెస్ క్లాసూ పూర్తిగా నిండకపోయినా, ఈ ఎయిర్ లైన్స్ కి వచ్చే ఆదాయం అంతా దాదాపు ఎకానమీ క్లాసుల వల్ల వచ్చినా ఎకానమీ జనాల్ని మాత్రం పనికిరాని వెధవల్లాగా చూడడం మానరు కాబోలు. క్రితం సారి బిజినెజ్ క్లాసులో వచ్చినప్పుడు ఐస్ క్రీం లూ, సలాడ్లూ వద్దు మొర్రో అన్నా లేపి మరీ మేపలేదూ?
డిన్నర్ తిన్నాక ఒక స్వీటూ, ఇంకో డ్రింకూ అయ్యేక పడతి మళ్ళి వచ్చింది; ఈ సారి డెల్టా వాళ్ళు అమ్మే వాచీలతోటీ మిగతా సరుకులతోటీ. ఈ తతంగం అయ్యేక పడతిని అడిగేడు లక్ష్మి, "మన విమానం సరైన టైముకే బాంబే లో దిగబోతోందా లేకపోతే లేటవ్వొచ్చా?"

"లేటా? ఇంకా నయం. పైలట్ డేవిడ్ సంగతి మీకు తెలియదు. ఎప్పుడూ అరగంట ముందే దింపుతాడు."
మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు లక్ష్మి సీటు వెనక్కి చాపుకుని. ఎకానమీ లో సీటు తొంభై డిగ్రీలనుంచి నూటపదికి వస్తే గొప్పే. మరి ఇక్కడో? నూట ఎనభై గ్యారంటీ.కాళ్ళు చాపుకుని పడుకున్నా మళ్ళీ ఆలోచనల్లోకి వెనక్కి వెళ్ళింది మనసు.

..... అలా ప్రెస్సులో పనిచేస్తూ, శ్రేష్టిగారికి చిల్లర లెక్కపెడుతూ మెల్లిగా స్కూల్ చదువు అయిందనిపించేడు లక్ష్మీ. అదిగో అప్పుడే సరిగ్గా అమ్మకి ఆరోగ్యం పాడవడం మొదలైంది. ఇంక అమ్మని ఇంట్లో కూర్చోమని చెప్పి తను ఫుల్ టైం ఉద్యోగం మొదలుపెట్టేడు ప్రెస్సులో. ఎప్పటిలాగానే చిల్లర ఉద్యోగం ఆదివారాలు కొనసాగింది. సాయంత్రం కాలేజీలో బియ్యే మొదలుపెట్టాడు. తన స్నేహితులు ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్సులతో కుస్తీ పడుతూంటే తనకీ ఉండేది అలా చదువుకోవాలని. డబ్బులుండొద్దూ? మూడేళ్లు తిరిగేసరికి బియ్యే పూర్తి చేసేడు. ఫస్ట్ క్లాసే కానీ ఈ రోజుల్లో ఫస్ట్ క్లాసుదేనికి పనికొస్తుంది?

అప్పుడు ఎవరో చెప్తే తెల్సింది. అహ్మదాబాదులో ఎం బి ఏ మంచిదని. దాని ఎంట్రన్సుకి పుస్తకాలు కొనుక్కోడానికి ప్రెస్సులో ఓవర్ టైం పనిచేసేడు అర్ధరాత్రి దాకా. శ్రేష్టి గారు ముందు ఎంత నిక్కచ్చిగా ఉన్నా చదువులో ఫీజులకి కొంత చొప్పున ఆయనే సహాయం చేసేడు. అలా తాను నక్కని తొక్కి ఎం బి ఏ లో చేరేడు. మళ్ళీ బెంగ అమ్మ గురించి. అహ్మదాబాదులో వచ్చిన ష్కాలర్షిప్పు వల్ల డబ్బుల బెడద లేదు గానీ రెండేళ్ళు అమ్మ ఒక్కత్తే ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అది అలవాటు అయింది కూడా. ఇప్పుడెలా ఉందో? వస్తున్నట్టు చెప్పేడు కదా ఫోన్ చేసి. ఈ ట్రిప్పులో అమ్మని తీసుకురావడం, మేష్టరితో మాట్లాడ్డం అయితే పని అయిపోయినట్టే. మొదటిసారి ఇంఫర్మేషన్ సిస్టంస్ లో ఎం.బి.ఏ అయ్యేక వచ్చిన ఉద్యోగం న్యూయార్క్ బేంకులో. అక్కడ్నుంచి మళ్ళి వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. రెండేళ్ళు పనిచేసాక తాను సైడ్ బిజినెస్సుగా మొదలు పెట్టిన వ్యాపారం కొనడానికి ఐ బి ఎం, మైక్రోసాఫ్టూ ఒకదానితో ఒకటి పోటీపడి రేటు పెంచుతూంటే చూడాలి అప్పుడు తను నవ్వుకోవడం. ఇలాంటి పరిస్థిలో తాను ఉంటాడని ఎప్పుడైనా కలగన్నాడా? ఎక్కడి ప్రెస్సులో పని? ఎక్కడి వాడు తను? ఏడాది క్రితం తాను ఇరవై మిలియన్లకి కంపెనీ అమ్ముతాడని ఎవరైనా చెప్తే ఫకాలున నవ్వి ఉండేవాడు. ఇప్పుడు ముఫ్ఫై ఏళ్ళు రాకుండానే అది చేయగలిగేడు. అన్నింటికన్నా ముఖ్యంగా మేష్టారు చెప్పినట్టూ తనని లక్ష్మీ సరస్వతులు శపించలేదు - రోజూ ప్రెస్సులో కాయితాలు తొక్కినా చిల్లరమీదనుంచి నడిచినా. చూద్దాం మేష్టారు ఏమంటారో?.... మెల్లిగా నిద్రలోకి జారిపోయేడు లక్ష్మీ.

బాంబేలో దిగేక విమానం మారి హైద్రాబాదూ, అక్కడ్నుంచి గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఎక్కి రాజమండ్రీలోనూ దిగేడు లక్ష్మీ నారాయణ. ఇంకొక్క ముప్పై కిలోమీటర్లు - రాజమండ్రీ నుంచి టేక్సీ మాట్టాడేడు వడిశిలేరుకి. బస్సులో వెళ్ళడం ఇష్టంలేక . వాకిట్లోనే అమ్మా మేష్టారు కనిపించేరు. కుశలప్రశ్నలయ్యేక చెప్పేడు మేష్టారితో, "సాయంకాలం వచ్చి మాట్లాడతానండి మీతోటి."

సరేనని ఆయన నిష్క్రమించేడు. మూడేళ్ళలో ఎంత తేడా? ఈ ఇంట్లో తాను దాదాపు పాతిక సంవత్సరాలు బతికేడు. ఇప్పుడిది ఒక పనికిరాని గుడిసెలాగా ఉంది తన అమెరికా ఇంటితో పోలిస్తే. తేడా ఎక్కడుంది? తన మనసులోనేనా, లేకపోతే దృష్టిలోనా?
సాయంత్రం రామయ్యగారి ప్రెస్సులోనూ, శ్రేష్టిగారి కొట్లోనూ పలకరింపులయ్యేక మేష్టారింటికి బయల్దేరేడు.
ఆయన ఎప్పట్లాగానే ఉన్నాడు. పిల్లలు పెద్దవాళ్లయ్యేరులా ఉంది ఏమీ సందడిలేదు ఇంట్లో. లోపలికెళ్ళాక మేష్టారి భార్యా, మేష్టారూ కనిపించేరు.
కబుర్లలో చెప్పేడు మేష్టరే, "మా పెద్దాడు బేంకులో చేరాడు, చిన్నవాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఇదిగో ఈ పిల్ల పదో క్లాసులోకి వచ్చింది. దీనికి పెళ్ళి చేసేస్తే రిటైర్ అయ్యేలోపుల నా బాధ్యత తీరిపోయినట్టే."
సమాధానంగా చిన్న నవ్వు నవ్వేడు లక్ష్మీ నారాయణ. ఆయనే అడిగేడు మళ్ళీ తాను ఏం చదువుకున్నాడూ, ఏం చేస్తున్నాడూ అనేవన్నీ. తాను అహ్మదాబాదూ అక్కడ్నుంచి అమెరికా వెళ్ళడం ఆయనకి తెల్సు కానీ పూర్తి విషయాలు పట్టించుకునే తీరికెక్కడా?
తాను అహ్మదాబాదులో చదివిన చదువూ, వాల్ స్ట్రీట్లో చేసే ఉద్యోగం అన్నీ విడమర్చి చెప్పేడు. సడన్ గా అన్నాడు మేష్టారు, "జీతం ఎంతొస్తుందేంటీ? ఖర్చులకి పోగా లక్షలు మిగులుతాయని అంటారు అమెరికాలో?"
ఆయన తనకి మేష్టారే, అయితే మాత్రం మామూలు మనిషే కదా, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి? నవ్వి ఊరుకున్నాడు. ఆయనే రెట్టించేడు మళ్ళీ, " ఏం? మాతో చెప్పకూడదా?"
"అబ్బే అదేం లేదండి."
"మరి?"
ఇంక తప్పలేదు."జీతం ఏడాదికని లెక్క, అది నూట యాభై వేలు"
మేష్టారు నోరు వెళ్ళబెట్టేడు. "ఏమిటి? లక్షా యాభైవేల డాలర్లే?" లోపల్నుంచి మేష్టారి భార్య అంది మెల్లగా, "ఎందుకంత ఆశ్చర్యం? ఆ కుర్రాడు చిన్నప్పట్నుంచీ ఎంత కష్టపడ్డాడో మీరెరగరా? అంత తెలివైనవాడిక్కాకపోతే ఇంకెవరికిస్తారు అలాంటి జీతం? బేంకు గుమాస్తాలకీ ఎలక్ట్రిసిటీ బోర్డు గుమాస్తాలకీ వస్తాయా?"
"సరేలేవే నా తప్పా ఇదంతా? నన్ను సాధిస్తావెందుకు?" ఆవిడతో అని మళ్ళీ అడిగేడు మేష్టారు, "ఏదాది చివర్లో బోనస్సూ అదీ ఉంటుందా?"
"పనీ, చూపించిన ఫలితాలూ బాగుంటే ఉంటుందండి"
"ఎంతవరకూ ఉండొచ్చేం?"

"క్రితం ఏడు నాకు అరవై వేలు ఇచ్చారండి" ఈ అంకెలకేంగానీ తాను అమ్మిన కంపెనీ వాల్యూ తెలిస్తే మేష్టారికి గుండె ఆగిపోతుందేమో అని మాట మార్చి అడిగేడు లక్ష్మీ, "మీ పిల్లలిద్దరూ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? ఏ ఊర్లో చేస్తున్నారు ఉద్యోగం?"
ఆయనేదో చెప్పేడు. చెప్పడంలో జీవంలేదు. తానింత కష్టపడినా ఇంతమందికి విద్యాదానం చేసినా నా బతుకు ఇలా ఉందే అనే జీర వాయిస్ లో కనబడుతోంది కొట్టోచ్చినట్టూ. తను చెప్పిన అంకెల ప్రభావమే ఇదంతా?
మేష్టార్నీ వాళ్ళావిడ్నీ కలిపి కూర్చోపెట్టి చెప్పేడు లక్ష్మీ, "మేష్టారూ మీరు అనుకున్న దానికంటే ఎక్కువే సంపాదించాను నేను. దాని సంగతి అలా ఉంచి ఇప్పుడు నేను చెప్పబోయేదేమిటంటే, ఎప్పుడైనా మీకు సహాయం కావలిస్తే నాకు తెలియచేయండి. మీ అమ్మాయి పెళ్ళికో, లేకపోతే దేనికైనా సరే. డబ్బు అనేది ఇవ్వగలను కానీ మిగతావి మీరు చూసుకోవల్సిందే కదా?"
మేష్టారు అన్నాడు కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలాక, "నువ్వు పుస్తకాలు తొక్కుతూ ఉద్యోగం చేస్తే చదువురాదు అన్నాననీ, చిల్లర తొక్కుతూ లెక్కపెడితే లక్ష్మీ కటాక్షం రాదని ఎన్నో సార్లు అన్నానని నీకు కోపం రాలేదు కదా?"
" భలేవారే మేష్టారూ, మీకు తోచినది మీరు చెప్పేరు. కానీ నాకు వేరు దారిలేక నేను ఆ ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. అయినా మీరు చెప్పినదాంట్లో పూర్తిగా నిజం లేదు కదా?"
"ఏమిటీ? పుస్తకం సరస్వతీ, డబ్బులు లక్ష్మీ కాదా?"
"మీరేమనుకోనంటే, కాదనే నా సమాధానం," నవ్వుతూ చెప్పేడు లక్ష్మీ నారాయణ.
"అదేలాగురోయ్?"

"మేష్టారూ, లక్ష్మి సంపదలకి అధిదేవత. అలాగే సరస్వతి చదువుల తల్లి. లక్ష్మీ ఇచ్చేది సంపద. సంపద వేరూ, సంపద ఇచ్చే లక్ష్మివేరూను. లక్ష్మీ దేవి ఇచ్చిన సంపదని బారుల్లో, పేకాట్లో తగలేస్తే ఆవిడకి కోపం వచ్చి సంపద ఇవ్వడం మానేయవచ్చేమో కానీ సంపదే లక్ష్మి అనడం సరి కాదు. అలాగే చదువు ఇచ్చేది సరస్వతి, కానీ పుస్తకం సరస్వతి కాదు. పుస్తకం చదివేసాక అది ఎప్పుడో ఒకప్పుడు పాతబడడమో, చిరిగిపోవడమో జరుగుతుంది. అప్పుడు శ్రేష్టి గారు దాని కాయితాలు పొట్లాలు కట్టడానికి వాడొచ్చు. పుస్తకాన్ని కావాలని కాలితో తంతే ఆ పుస్తకం ఇచ్చిన సరస్తతీ దేవికి కోపం రావచ్చేమో, కానీ ప్రింటింగ్ ప్రెస్సులో పుస్తకం డాటకుండా, కాలితో తొక్కకుండా ఉండడం దాదాపు అసంభవమే కదా? అలాగే శ్రేష్టిగారి చిల్లరానూ. చిల్లర లక్ష్మీదేవి ఇచ్చిన సంపద కానీ లక్ష్మి వేరూ, చిల్లరవేరూ. నేను చిన్నప్పట్నుంచీ కాయితాలు తొక్కుతూనే ఉన్నాను ప్రెస్సులో. అలాగే శ్రేష్టిగాగారింట్లో చిల్లర కూడా తొక్కాను చాలా సార్లు. మరి లక్ష్మీ సరస్వతులు నన్ను శపించినట్టా? కటాక్షించినట్టా?"
మేష్టారు కళ్ళు విప్పార్చి చూసేడు, కొంచెం షాక్ తగిలినట్టుంది. నోరు మెదపలేదు కాసేపటిదాకా. ఆఖరికి “మరైతే మనకి పెద్దలు చెప్పినదంతా తప్పా?" అన్నాడు.
మేష్టారి భార్యే చెప్పింది దానికి సమాధానం, "మన పెద్దలకి ఎలాంటి ఛాదస్థం ఉందో అదే మనకీ అంటుకుంది మేష్టారూ. ఈ కుర్రవాడు లక్ష్మీ పుత్రుడు. కాయితాలు తొక్కినా చిల్లర తొక్కినా అది కావాలని చేసింది కాదు. అది చేయకపోతే పొట్ట గడవక అలా చేసాడు. ఏం చేసినా మొత్తమ్మీద తనేమిటో, తన భాధ్యతేంటో తెలిసి చేసాడు. తన పని చేసుకుంటూ పోయాడే తప్ప మీలాగా ఛాధస్థాలు పట్టుకుని వేళ్ళాడలేదు. అదే అతనికీ మన సుపుత్రులకీ తేడా"
మేష్టారు ఏ కళనున్నాడో ఇది విన్నాక ఫక్కున నవ్వి చెప్పేడు, "నువ్వన్నదాంట్లో నిజం ఉంది. ఇతను లక్ష్మీ పుత్రుడే. ఈ లెక్కన కొన్ని సంవత్సరాల్లో కోట్లకి పడగలెత్తగలడు."
అప్పటికే తాను కోట్లకి పడగలెత్తానని మేష్టారితో చెప్పకుండా, చిన్న నవ్వు నవ్వి ఇంటికేసి కాలు సాగించేడు లక్ష్మీ నారాయణ. వచ్చేస్తూంటే వెనకనుంచి మేష్టారు వాళ్ళావిడ్ని అడగడం వినిపించింది, "అయితే కాంతం, మన శ్రేష్టిగారు డబ్బులు కిందపడితే తీసి కళ్ళ కద్దుకుంటాడు కదా, దానికేమంటావ్? అది చూస్తే డబ్బులు అంటే లక్ష్మి అనే కదా?"
"ఇప్పుడే చెప్పేడు కదా మన శిష్యుడు? లక్ష్మి వేరూ, లక్ష్మి ఇచ్చే సంపద వేరూను. డబ్బులు మన చెప్పుచేతల్లో ఉండాలి. కానీ ఈ ప్రపంచంలో మనిషే డబ్బుల చేతిలో ఉన్నాడు. శ్రేష్టిగారు డబ్బు కళ్ళకద్దుకోవడం అనేదో మూఢనమ్మకం. ఇలాంటివి ఒకరు చేస్తే మరొకరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. అలా తయారైందే మన చాధస్థం."
 

 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)