శీర్షికలు

ఎందరో మహానుభావులు

అపర తాన్ సేన్ భీమ్ సేన్ జోషి

- రచన : తనికెళ్ళ భరణి   


 

గిద్దెడు నెయ్యికోసం....కొంప నొదిలివెళ్ళిపోయిన వాళ్ళెవరన్నా ఉన్నారా?.....ఆహా...ఉన్నారా?.....ఎందుకు లేరూ!
ఎవర హో....పండిత్ భీమ్ సేన్ జోషి....!!
భీమ్ సేనుడు...ఆకారంలోనే కాదు...భోజన ప్రియత్వంలో కూడా!....అంచేత....కావల్సినంత నెయ్యి కూడా తినలేక పొయ్యాక ఇంకెందుకీ వెధవ బతుకు అని అలాగే....పదకొండో ఏట...కట్టుబట్టల్తో....(చిక్కా-నిక్కరు) ఇల్లొదిలి....ఊరొదిలి....రాష్ట్రం వదిలి....వెళ్ళిపోయాడు.
ఇంత చేస్తే...నెయ్యన్నది సాకు మాత్రమే. భవిష్యత్తులో సంగీత ప్రియులందరికీ తేనె గుమ్మరిద్దాం అన్న పరమేశ్వరాజ్ఞ మేరకు....సంగీత గురువును వెతుక్కుంటూ వెళ్ళిపోయిన అపర తాన్ సేన్ - భీమ్ సేన్ జోషీ...
కర్ణాటక రాష్ట్రంలోని - గదగ్ (చూశారూ...భీముడికీ, గదికీ సంబంధం ఉంది) లో జన్మించాడు భీంసేన్, తల్లి గోదావరీబాయి, సనాతనాచారపరురాయి...చక్కటి భజన్లూ అవీ పాడేది...అంటే నేతితోణే కాకుండా, ఉగ్గుపాలతోటే సంగీత జోషీ కెక్కేసింది...భజన్మ కీర్తనల్లో పాల్గొనటం అలవాటు పడ్డాడు ఆయన... ఊళ్ళోకి భజన బృందం వస్తే చాలు వాళ్ళ వెంట పడివెళ్ళిపోయేవాడు.
అప్పుడు గోవిందుడి వెంట ఆవుల మంద వెళ్ళిపోతే, ఇప్పుడు...భజన బృందం వెంట వెళ్ళే లేగదూడ భీమ్ సేన్. అలా ఎక్కడికెళ్ళిపోయేవాడో తల్లడిల్లిపోయేది తల్లి...... ఓ రాత్రివేళ ఏ పుణ్యాత్ముడో ఇంటి అరుగుమీద దిగబెట్టి చక్కాపోయేవాడు.
తండ్రికేమో కొడుకుని డాక్టర్ గానో....ఇంజనీరుగానో చూడాలని కోరిక....కానీ కుర్రాడేమో ఊళ్ళో ఎక్కడ గుడున్నా భజన్లు పాడేసి ప్రేక్షకుల్తో పాటు ....పరమేశ్వరుణ్ణీ ముగ్దుణ్ణి చేసేస్తున్నాడు. ఇక తండ్రికి తప్పక....చెన్నప్ప కురుకొటీ అనే సంగీత విద్వాంసుడికి ఐదురూపాయలు సంభావన ఇచ్చీ....శిఘ్యడిగా చేర్చాడు.
చెన్నప్ప...వృత్తి రీత్యా రజకుడు. ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ గారి శిఘ్యడు. ఓ ఏడునెల్లపాటు అక్కడ ప్రాథమిక
శిక్షణ అయిపోయాక పండిత్ శ్యామాచారు వద్ద చేరాడు. శ్యామాచారు పురోహితులు...గాయకులు....హర్మోనియం వాద్యనిపుణులు. సంగీత శిక్షణ అద్వితీయంగా సాగుతోంది. ఒకసారి ప్రముఖ సంగీత విద్వాంసుడు ’సవాయి గాంధర్వ’ గానం వినీ ఆయన వంటి వారి వద్ద సంగీతం నేర్చుకునీ...ఆయన కన్నా గొప్ప పేరుప్రతిష్ఠలు తెచ్చుకోవాలనీ నిర్ణయించుకున్నాడు. అదిగో ఆ నిర్ణయమే....ఇల్లొదిలి దేశాలు పట్టడం!!
రాగి కానీ లేకుండా రైలెక్కేశాడు...వెళ్ళాల్సింది బీజాపూర్ అయితేనేం...నోట్లో అమోఘమైన విద్య ఉంది కూదా... ఒకసారి గొంతు సవరించుకునీ....అఖండ గానం చేసాడు...శ్రోతలకి సంగీతాభ్యంగన పెట్టేవారు....రొట్టెలు పెట్టేవారు...పాలు ఇచ్చేవారు...పళ్ళు ఇచ్చేవారు....ఒక ’సంచారు సంగీతాలయం’....బీజాపూర్ చేరింది....సరస్వతీదేవి మందహాసం చేసింది!
కొన్నాళ్ళపాటు బీజపూర్ లో గురువుని అన్వేషించి ఫలితం లేక ఎవరి సలహా మేరకో....పూనా చేరాడు భీమ్ సేన్.
పూనాలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు కృష్ణారావు పుతంత్రీకర్ భీమ్ సేన్ గొంతువినీ....మెచ్చుకునీ...సంగీతం నేర్పుతా గానీ నెలకి వందరూపాయ లిమ్మన్నాడు...గురుదక్షిణ...సరే! ఆయనే ఉంటే ఈయనెందుకనీ మళ్ళీ రైలెక్కాడు...శారదాంబ ఓరగా చూసింది!!
మళ్ళీ....వేరే రైలెక్కి...
ఓ పాటందుకున్నాడు...సర్వసతీ...రసజ్ఞలే ఉండరు గదా...కొంతమంది టిక్కెట్టు కలెక్టర్లు...మరి కొంతమంది పోలీసులా ఉంటారు! అంచేత టిక్కెట్టులేని ’బాల సరస్వరి’ ని తీసికెళ్ళి జైల్లో పెట్టారు....ఎక్కడైతేనేం...సందర్భానికి తగ్గట్టు పరవశంగా ఎత్తుకున్నాడు...రాగం మారొచ్చుగానీ గానం మారదుగా! పోలీసుల్లో గూడా మహా పురుఘలుంటారు గాబట్టి...ఓ గ్లాసు లస్సీ ఇచ్చి వదిలేసాడో పొలీసు.
అక్కణ్ణించి గ్వాలియర్.... ఎట్లాగోలగ ఆస్థాన గాయకుడిని కాళ్ళావేళ్ళాపడి...ఓ తంబుర పుచ్చుకుని...ఆయన్తో పాటు రాజమందిరాలకి వెళ్ళడాం మొదలెట్టాడు. ఓసారి రాజావారు ఈ కుర్రాడి తంబుర మీటుకి ముచ్చటపడీ...దక్షిన ఓ పదిరూపాయలూ - ఓ కొబ్బరికాయ ఇచ్చారు...నారికేళ పాకానికి వాణి ముచ్చటపడింది.
తర్వాత ఉస్తాద్ హఫీజ్ అలీ వద్ద....మరువా - పూరియా రాగాల సూక్ష్మ రహస్యాలూ...ఖగర్ పూర్ లోని కేశవ్ ముకుంద్ తభీవర్య....మరికొన్ని విషయాలూ, కలకత్తాకు చెందిన భీష్మ చటర్జీ వద్ద కొంతకాలం శిష్యరికం తర్వాత పహారీ సన్యాల్ గారి వద్ద...గురుశుశ్రూష...చేస్తూ...కొంత విద్య...
అక్కణ్ణించి జలంధర్ వెళ్ళి మంగత్ రామ్ ఆర్మీ సంగీత విద్యాలయంలో చేరి ’ద్రుపథ్ - ధమ్మార్’ శైలిని సాధన చేయడం ఆరంభించాడు...!
అంటే ఒక సంగీత వటవృక్షం తయారుకావాడానికి ఒక సామాన్యుడు చేసిన ప్రయత్నం, పట్టుదలా.....శుశ్రూషా...తల్చుకుంటే.....ఆ మహానుభవుడి పాదాల్ని ముద్దెట్టుకోవాలనిపించదూ!!
చివరగా ఉస్తాద్ మొసాక్ హుస్సేన్ దగ్గర...కట్టెలు కొట్టడం..... నీళ్ళ మొయ్యడం, కాళ్ళుపిసకడం ఆఖరికి శోత్రియుడైన భీమ్ సేన్ జోషీ...సంగీత కోసం గురువుగారికు మాంసం వొండి పెట్టడం...ఇవన్నీ చేస్తూ ఆరు నెలల పాటు....రోజుకీ పదహారు గంటలు సాధన చేస్తూ ’నట్ మల్హార్’ రాగాన్ని సొంతం చేసుకున్నారు.
అంతే! ఆ రాగం ఆకాశవాణిలో ప్రసారం కావడం...మర్నాడు కల్లా....భీమ్ సేన్ జోషీ పేరు దేశమంతా మారుమ్రోగిపోవడం.
1964...82 మధ్య అయిదుసార్లు విదేశాలలో కచేరీ చేసిన భీమ్ సేన్ జోషీ...అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ సత్కారం...భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ సత్కారం మరెన్నో...ఎన్నో అవార్డులు....సంపాదించారు.
1968...’రాగ్ నియమల్హార్’ పేర.... భీమ్ సేన్ జోషీ మీద డచ్ నిర్మాత 25 నిమిషాల డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసాడు!!
ఆ మధ్య....దేశసమైక్యత కోసం ’టివీ లో ’మిలేదర్....మేరా...తుమ్హారా! గానం చేసి భీమ్ సేన్ జోషీ...’పాటకు ప్రజలంతా ఆసక్తిగానే వింటారు. కానీ...లంచాలు పుచ్చుకుంటారు...’అని వేదన చెందుతూ..నెలకొక్కసారైన...భారత యువత శాస్త్రీయ సంగీతం వింటే....ప్రవర్తనలో మార్పువోస్తుందని ఆశిస్తున్నారు...జోషీ!
తథాస్తు! అంటోంది కమలభవురాణి!!

 

 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)