బాలరంజని

నిజం దాగదు

- రచన : తమిరిశ జానకి
 


 

మహారాజు ప్రతాప సింహుడికి అందమైన రూపం ఉంది గానీ ఆలోచనాశక్తి తక్కువే. విందులు వినోదాలు విలాసాలలో జీవితాన్ని గడిపేయాలనే నిర్లక్ష్య స్వభావం అతడిది. రాజ్య పరిపాలన విషయంలో ఏమాత్రం శ్రద్ధ కనపరిచేవాడు కాదు. అన్ని విషయాలలోనూ పూర్తి అధికారం మహామంత్రికే ఇచ్చి తాను ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఏ సమస్య వచ్చినా ఏ పనికైనా ఇతర మంత్రులతో కూడా తెలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం అనే పద్ధతి పాటించే వాడు కాదు. ఇది చాలా అలుసుగా తీసుకునేవాడు మహామంత్రి చంద్రసేనుడు. తాను చేసే పనులుగానీ, తీసుకునే నిర్ణయాలు గానీ మహారాజుకు తెలియవలసిన అవసరం లేదని తనకే పూర్తి అధికారం ఆయన ఇచ్చాడని ఇతర మంత్రులకు చెప్పి ఉండడం వలన వారెవరూ ఏ విషయంలోనూ నోరు మెదిపేవారు కాదు.

తన ఇష్ట ప్రకారం ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రజలనుండి పన్నులు వసూలు చేయడమే కాకుండా అడుగుతీసి అడుగు వేస్తే పన్ను కట్టాలి అన్నట్టుగా అవసరం లేని వాటిమీది కూడా పన్నులు విధించేవాడు. వసూలు చేసిన అధిక మొత్తాన్ని తన ఇంట్లో నేలమాళిగలో దాచుకునేవాడు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతూ అసహనంతో దిక్కుతోచని వారయ్యారు. కరువు కాటకాలు వచ్చినా పంటలు సరిగ్గా పండకపోయినా తిండిగింజలు కరువై చేసేందుకు పనులు దొరకడమూ కష్టమై ఆదాయం లేక అలమటించి పోయే ప్రజలని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు చంద్రసేనుడు. ఎవరైనా ధైర్యం చేసి రాజుగారికి తమ గోడు చెప్పుకోవాలని వచ్చినా అనుమతి ఇచ్చేవాడు కాదు. పైగా అలాంటి ధైర్యం ఉన్నవారి వలన ఎప్పటికైనా తనకి ముప్పు కలుగుతుందన్న భయంతో రహస్యంగా వాళ్ళని పరలోకానికి పంపించెయ్యమని తన అనుచరులకి పురమాయించేవాడు.

కవులు కళాకరుల రచనలు, నృత్యాలు, నాటికలు అన్నీ కూడా మహారాజుని మహామంత్రిని పొగుడుతూ, రాజ్యం సుభిక్షంగా ఉందని మెచ్చుకుంటూ ఉన్నవే మహారాజు చూసేలా ఏర్పాటు చేస్తాడు. వేరే ఇతరమైన వాటికి అనుమతి ఇవ్వడు. పరిపాలన గురించి ప్రతాపసింహుడికి ఏ అనుమానం రానివ్వడు.

ఆ రోజు వినోద కార్యక్రమలలో ఆఖరి అంశం ఇద్దరు యువకుల కళాప్రదర్శన జరుగుతోంది మహారాజు సమక్షాన. ఒకరు గానం చేస్తుంటే రెండవవారు దానికి తగినట్లుగా నాట్యం చేస్తున్నారు. పూర్తయిన తర్వాత రాజుగారు వారిని అభినందిస్తుంటే ఆ ఇద్దరి ముఖాల్లో ఆనందం కాదు కోపం ప్రజ్వలించింది. ఆపు మహారాజా నీ అభినందనలు.

రాజు గారితో పాటూ అక్కడున్న అందరూ నివ్వెరపోయి చూశారు. ఇద్దరి యువకులలో పెద్దవాడు అన్నాడు నాగానంలో ఎన్నో అపశృతులు దొర్లాయి. నా తమ్ముడి నాట్యంలో ఎన్నో తప్పులు పొరపాట్లు ఉన్నాయి. మేము కావాలనే ఆ విధంగా కార్యక్రమం చేశాము. ఎందుకంటే ఇక్కడ మేథావులు ఉన్నారు. నాట్యంలోనూ గానంలోనూ మంచి విద్వత్తు గలవారు ఉన్నారు. ఏ ఒక్కరైనా మా తప్పులు పొరపాట్లు చెప్తారేమో చూద్దామని వారికి పరీక్ష పెట్టాము. వాళ్ళ నోళ్ళు ఏనాడో కట్టేశాడు మహామంత్రి. అత్యంత ముఖ్యమైన విషయాలలో కూడా మాట్లాడడానికి వీల్లేని పరిస్థితులలో ఉన్న వీళ్ళు ఈ సందర్భంలో.. రాజునీ మంత్రినీ పొగుడుతూ వారి పరిపాలనని మెచ్చుకుంటూ పాడుతూ ఆడుతుంటే నోరు మెదిపే సాహసం ఎందుకు చేస్తారు? మేము అనుకున్నదే జరిగింది. మహారాజా మిమ్మల్ని వెర్రి వెంగళప్పని చేసి విలాసాలకి బానిసని చేసి తన పబ్బం గడుపుకుంటూ అధికారం ఉందన్న గర్వంతో ప్రజలని నానా ఇబ్బందులూ పెడుతున్న ఈ మహామంత్రి... అతని మాట పూర్తి కాకుండానే కత్తి దూసి మీదకి వచ్చాడు మంత్రి చంద్రసేనుడు.

ఊహించని ఈ సంఘటనకి వెలవెల పోయాడు ప్రతాపసింహుడు. కనురెప్పపాటులో చంద్రసేనుడి చేతిలోని కత్తి ఒడుపుగా పట్టి తీసుకున్నాడు చిన్నవాడు. మరు నిమిషంలో యువకులిద్దరూ తమ మారువేషాలు చటుక్కున తీసివేయడంతో ఆసీనులై ఉన్న ఇతర మంత్రులందరూ ఒక్క ఉదుటున సంభ్రమంగా లేచి నిలబడ్డారు. ప్రతాప సింహ మహారాజుకి ఆనందంతో నోట మాటరాలేదు. ఆ యువకులిద్దరూ మరెవరో కాదు... తన సోదరులే..

మూడు నాలుగు సంవత్సరాల కిందట వేటకి వెళ్ళిన వారిద్దరినీ అడవి మృగాలు చంపి తినివేశాయని చెప్పి తనని నమ్మించిన చంద్రసేనుడివైపు కోపంగా చూశాడు.

వేటకి వెళ్ళిన మా ఇద్దరినీ హత్య చేయవలసిందిగా చెప్పి నలుగురిని మా వెనక రహస్యంగా పంపించిన ఘనుడు ఈ మహామంత్రి. వాళ్ళు అసలు విషయం మాకు చెప్పడంతో పొరుగు రాజ్యంలో అజ్ఞాతవాసం చేశాము ఇన్నాళ్ళూ. అన్ని విద్యలలోనూ ఆరితేరి వచ్చాము. యుద్ధానికైనా సిద్ధమే. ఇంక ఈ చంద్రసేనుడి ఆటలు సాగనివ్వం. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని మీరు పరిపాలన చేసేందుకు మీకు అండగా మేము ఉంటాము. సోదరులిద్దరూ ప్రతాపసింహుడికి చెరొక పక్కగా నిలబడ్డారు.

అక్కడ ఉన్న అందరూ జయ జయ ధ్వానాలు చేశారు.
చంద్రసేనుడి తల వొంగిపోయింది.

 
 

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం   
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)