సారస్వతం

అన్నమాచార్య కీర్తనలు

- రచన : జి.బి.శంకర్ రావు    


 

కేశవదాసి నైతి

కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరాలి కనేలా వెదక||

నిచ్చలు కోరికలియ్య నీనామమే చాలు
తెచ్చి పునీతుచేయ నీతీర్ధమే చాలు
పచ్చి పాపాలణచ నీ ప్రసాదమేచాలు
యెచ్చు కొందు వుపాయాలు ఇకనేల వెదక||

ఘనుని చేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనపి కా వగ తిరుమణి లాంఛనమే చాలు
యెనసెను దిక్కుదెస ఇకనేల వెదక||

నెలవైన సుఖమియ్య నీ ధ్యానమేచాలు
అల దాపుదండకు నీ యర్చనే చాలు
యిలపై శ్రీ వేంకటేశ యిన్నిటా మాకు కలవు
యెలమి నితరములు యికనేల వెదక||
 

అన్నమయ్య నమ్మినది, స్వీకరించినది, ఆచరించినది భగవద్రామానుజుల వారు అందించిన వైష్ణవమతం! వైష్ణవమతం తీసుకున్నవారు పంచ సంస్కారాలైన 1. తాపము 2. పుండ్రము 3. నామము 4. మంత్రము 5. యాగము లచే పునీతులౌతారు. తరువాత వీరు పునర్జన్మ పొందినట్లు లెక్క! ఎప్పుడైతే ఈ విధంగా కేశవుని దాసులౌతారో అప్పుడిక ఈ శరీరపు నేరాలను, పాపలను విడిచిపెట్టినట్టు! అని శాస్త్రం చెబుతుంది! కాబట్టి అన్నమయ్య విష్ణుదాసుడై, శరణాగతుడై స్వామివారి కైంకర్యాలలో మునిగితేలుగూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.

నిచ్చలు = నిత్యము;
పునీతు చేయు = పవిత్రుడిని చేయు;
మొనసి = పూనుకొని;
మనిపి = బ్రతికించి (పోషించి);
తిరుమణి = తిరునామము;
ఎనసెను = వ్యాపించెను;
నెలవైన = నిలుకడయైన (నిలిచి ఉండే)


కొండలలో నెలకొన్న

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంతవరములు గుప్పెడు వాడు

కుమ్మరదాసుడైనకురువరతినంబి
ఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాంజక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు

అచ్చపువేడుకతోడ అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక తిరుమలనంబితోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు

కంచిలోన నుండ తిరుకచ్చినంబిమీద కరు
ణించి తనయెడకు రప్పించినవాడు
యెంచ నెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ పాలించినవాడు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొండలలో కొలువై ఉండటమే కాదు, కొండలంతవరాలను గుప్పే దొడ్డదొర అని అన్నమయ్య ఈ పాటలో కీర్తిస్తున్నారు. రాజు అర్పించిన బంగారు పూలను వద్దని, మహాభక్తుడైన కురువనంబి (కుమ్మరిదాసు) అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నతమూర్తి వేంకటేశ్వరుడు! ఆశ్రితుడైన తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు! అనంతాళ్వార్ల వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు స్వామి! తిరుమలనంబిని బ్రోచినవాడు! భక్తుడైన తిరుకచ్చినంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు! అట్టి వేంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అని ఆచార్యులవారు అంటున్నారు.

ముచ్చిలి = దొంగతనము

 
     
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)