కబుర్లు  
     వీక్ పాయింట్ - రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి  

సిరా లేని కలం

మనది ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యం.
మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రహసనం!
దీనికి తాజా రుజువు రష్దీ గొడవ!

సల్మాన్ రష్దీ అనే భారతీయ ప్రవాసి ఇరవై మూడేళ్లకింద ఒక నవల రాశాడు. దాని పేరు ‘శాటానిక్ వర్సెస్’! ప్రపంచమంతటా... ముఖ్యంగా ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ అది అంగట్లో దొరుకుతుంది. మన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో తప్ప!
1988 సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో తొలిసారి వెలువడిన పదిరోజులకే ఇండియాలో ఆ పుస్తకం అడుగుపెట్టటానికి వీల్లేదని రాజీవ్‌గాంధీగారి సెక్యులర్ ప్రజాతంత్ర ప్రభుత్వం ఘనమైన ఆంక్ష పెట్టింది. టర్కీ, ఈజిప్టులాంటి ముస్లిం రాజ్యాల్లోనే దానిమీద ఎలాంటి నిషేధం లేదు. ఈ మధ్యదాకా నిషేధం ఉన్న లిబియాలోకూడా గడాఫీ పీడ వదలగానే ఈ పుస్తకం మీద నిషేధం కూడా పోయింది. పిడివాదానికి కడు దూరమనీ, విభిన్న భావాలను ఎప్పుడూ స్వాగతిస్తుందనీ గొప్పగా చెప్పుకునే మన పుణ్యభూమిలో మాత్రం ప్రభుత్వాలు మారినా, దశాబ్దాలు తిరిగినా పుస్తకం మీద ఆంక్ష మాత్రం చిరంజీవి!

తనకు మరణశిక్ష వేసిన ఖోమేనీ ఫత్వాకు హడలిపోయి సల్మాన్ రష్దీ చాలా ఏళ్ళు బ్రిటన్, అమెరికాలాంటి దేశాల్లో రహస్యంగా తల దాచుకున్నాడు. కాలం గడిచేకొద్దీ ప్రాణభయం తగ్గింది. ఈ పదేళ్లలో ఐదుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లాడు. ఆఖరుగా నాలుగేళ్లకింద జైపూర్‌లో లిటరరీ ఫెస్టివల్‌కూ హాజరయ్యాడు. ఎక్కడా ఏ గొడవా కాలేదు.
ఈసారీ అదే జైపూర్‌లో రివాజుప్రకారం లిటరరీ ఫెస్టివల్ జరిగింది. రష్దీ ఎప్పటిలాగే దానికి రావాలనుకున్నాడు. కానీ- అతడొకటి తలిస్తే మత రాజకీయం వేరొకటి తలచింది.

మొదట రష్దీ ఇండియాకు రాకుండా చేయాలని కాంగ్రెసుకు అనుకూలమైన ఒక మతవర్గం డిమాండ్‌చేసింది. మీరు ఇక్కడికి వస్తే చంపెయ్యాలని కొంతమంది ముచ్చటపడుతున్నారు. ఈ పనిమీద ముంబాయినుంచి ముగ్గురు టెర్రరిస్టులను పంపిస్తున్నట్టు మాకు మహారాష్టన్రుంచి వేగుల ఆరా అందింది. ఏమైనా జరగొచ్చు కాబట్టి మీరు రాకపోతేనే ఉత్తమం... అని రాజస్తాన్ కాంగ్రెసు సర్కారువారు రష్దీని భయపెట్టారు. నిజమేకాబోలనుకుని ఆయనగారు పర్యటన మానుకున్నాడు. తరవాత వాకబుచేస్తే వేగు మిథ్య... ముప్పు మిథ్య అని తేలింది. స్వయానా కాకపోతే మానె... కనీసం వీడియో లింకు ద్వారా అయినా జైపూరులో జమ అయిన సాహితీ పరులతో ముచ్చటిద్దామని అతడు అనుకుంటే రాజస్తాన్ సర్కారువారు దానికీ జయప్రదంగా అడ్డం కొట్టారు. ఇక మేము ఏమి చెయ్యగలం అని నిర్వాహకులు... వారు మాత్రం ఏమి చెయ్యగలరని సాహిత్య కారులు జాయంటుగా ఆక్రోశించారు. ఇదంతా యు.పి ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల మెహర్బానీ కోసమే చేశారని, స్వేచ్ఛా సమాజానికి, భారతీయ సహిష్టతకు, ప్రజాస్వామిక విలువలకు సిగ్గుచేటు అని మేధావులు, పత్రికా సంపాదకులు, మీడియా మోతుబరులు తెగ తిట్టిపోశారు. అవన్నీ విని, చదివి విజ్ఞులందరూ రోజులు తరబడి ఆవేశపడ్డారు.

మంచిదే. మేథావులన్నాక ఆ మాత్రం పలుకు, బిగువు ఉండాల్సిందే. ప్రజాస్వామ్యమన్నాక ఆ మాత్రం మీడియా తెగువ కావలసిందే. ఎటొచ్చీ... దాదాపు వారం పాటు దేశాన్ని ఊదరబెట్టిన ఈ వివాదం రూపురేకలను గమనిస్తే మందబుద్ధులకు కలిగే సందేహం ఒక్కటే!

మైనారిటీలను ఓటు బ్యాంకులుగానే చూస్తూ, ఎన్నికల పబ్బంగడుపుకోవటం కోసం ఏ రకమైన వెధవవేషాలు వెయ్యటానికీ రాజకీయ జీవులు వెనకాడని దేశకాల పరిస్థితుల్లో కొంచెం హెచ్చు తగ్గులేతప్ప అన్ని పార్టీలూ, అన్ని ప్రభుత్వాలూ ఒక్క తాను ముక్కలే. క్షుద్ర రాజకీయమంతా ఫలానా కాంగ్రెసు సర్కారు మొగానే పొద్దుపొడిచినట్టు తిట్టిపొయ్యటం దండుగ. రష్దీ తకరారు ఘట్టంలో ప్రభుత్వాల దుర్నీతిని, దుర్ణయాన్ని నిష్కర్షగా తెగనాడవలసిందే అయినా- ఆ దూకుడుకు ముకుతాడు వెయ్యటానికి మన సాహిత్య లోకం, బాధిత మేధావి వర్గం తమ వరకూ చేసిందేమిటి? అధికార వర్గాల బెదిరింపులను, ఒత్తిళ్లను తట్టుకుని, పర్యవసానాలను లెక్కచెయ్యక తమ హక్కులకోసం తాము నమ్మే విలువలకోసం ధైర్యంగా నిలబడినప్పుడే కదా ఎవరి నిబద్ధత ఎంతో తెలిసేది?

తాను ఇండియాకు వస్తే ప్రమాదమని ఎవరో ఎవరిచేతో చెప్పించినంత మాత్రానే సల్మాన్ రష్దీకి కాళ్ళు చల్లబడి, కట్టిన ప్రయాణం మానుకోవాలా? ప్రభుత్వమాడింది పచ్చి అబద్ధమని తనకే రూఢి అయ్యాక అయినా... దేశాంతరంలో కూచుని వాదులాడటమే తప్ప కనీసం ఇండియాలో అడుగుపెట్టే ప్రయత్నం ఆయన ఎందుకు చెయ్యలేదు?
సరే! ఎవరి ప్రాణం వారికి తీపి. రష్దీ సంగతి అలా ఉంచితే జైపూర్‌లో కొలువుతీరిన రెండొందల పైచిలుకు సాహిత్యకారులు, దేశదేశాల మహా మేధావులు సర్కారీ దాష్టీకాన్ని అడ్డుకోవటానికి తమ వరకు ఏమి చేశారు?

అసలు సంగతి ఏమిటంటే నిషేధం, నిషేధం అని అంతా అనుకోవటమేగానీ- రష్దీ పుస్తకం కొనరాదని, చదవరాదని, దగ్గర ఉంచుకోరాదని చట్టరీత్యా నిషేధం ఎప్పుడూ లేదు. అభ్యంతరకర గ్రంథాల నిషేధానికి ఉద్దేశించిన క్రిమినల్ ప్రొసిజర్‌కోడ్ 95వ సెక్షను రష్దీ గ్రంథానికి వర్తించదు. 1988లో మతవర్గాల ఒత్తిడికి తలఒగ్గి రాజీవ్ ప్రభుత్వం నిషేధించిందల్లా 1962 కస్టమ్స్ చట్టం 11వ సెక్షనుకింద ఆ గ్రంథం దిగుమతిని మాత్రమే. ఆ ఉత్తర్వుకంటే ముందే దేశంలోకి దిగుమతి అయిన కాపీలమీదా, ఇంటర్నెట్‌లో ధారాళంగా డౌన్‌లోడ్ చేసుకోగలిగిన ప్రతులమీదా ఎలాంటి నిషేధమూ లేదు. ఆ పుస్తకాన్ని దగ్గర ఉంచుకోవటమూ, చదవటమూ చట్ట రీత్యా నేరం కాదు. మరి- రాజస్తాన్ ప్రభుత్వం కేసులు పెడతామని కాస్త తొడపాశం పెట్టగానే జైపూర్ వేదికపై రష్దీ పుస్తకం భాగాలను చదివిన నలుగురు మహా రచయితలూ రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసి ఎందుకు పరారయ్యారు? ఒక గ్రంథంపై ఒక విధమైన నిషేధం ఉన్నంత మాత్రాన గ్రంథరచయిత మొగం టీవీ తెరమీద కూడా కనిపించటానికి వీల్లేదని ఏ చట్టమూ చెప్పదు. వీల్లేదని ఎవరైనా అంటే అది చట్ట విరుద్ధం.... సహించరాని దౌర్జన్యం. నాలుగు గోడలమధ్య, పరిమిత ఆహ్వానితుల నిమిత్తం ప్రైవేట్ సాహిత్యసభలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించటానికి ఏ గవర్నమెంటు అనుమతీ అక్కర్లేదు. మరి- రష్దీని వీడియోద్వారా మా కార్యక్రమంలో మేము చూపించుకో వచ్చా అని గవర్నమెంటు అనుమతి కోసం సాహిత్య దిగ్గజాలు ఎందుకు అంగలార్చారు? వారు వద్దని కనుసైగ చెయ్యగానే నిస్సహాయంగా ఎందుకు తోక ముడిచారు? గ్రంథాలు రాసే మహా రచయితలకే, సమాజానికి దారి చూపించవలసిన మహా మేధావులకే తమ హక్కులకోసం నిర్భయంగా నిలబడే తెగువ లేనప్పుడు ఎవరిని ఎంత తిట్టి మాత్రం ప్రయోజనమేమిటి? అధికారదండానికి భయపడి బేలగా చేతులెత్తేసేకంటే... రాజ్యాంగం ప్రసాదించిన అభిప్రాయ స్వేచ్ఛకోసం, ప్రజాస్వామ్య హక్కులకోసం జాతీయ సాహితీ లోకం ఏకమై నియమబద్ధంగా పోరాడితే ప్రజలు సమర్థించరా? న్యాయవ్యవస్థ అండ దొరకదా? జులుంపై కలం ధ్వజంగా ఆ పోరాటం చరితార్థమయ్యేది కాదా?


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech