శీర్షికలు  
     వేదాంత ధర్మంలో శాస్త్రీయత లేదా?  - రచన : పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు,      
              ఫ్రీమాంట్, కాలిఫోర్నియ
 
 

సుజన రంజనిలో వచ్చిన దేవుడున్నాడా? అన్న శీర్షిక ఆసక్తిగా చదివాను. అలాగే, ఈమధ్య దేవుడు లేడని తోసిపారెయ్యటం చాలా ఫాషన్ అయిపోయింది. ఇంత లోతైన విషయం గురించి ఇంత తేలిగ్గా జనాకర్షణ మాత్రమే ధ్యేయంగా చాలా మంది రాస్తున్నారు. నేను ఈ వ్యాసం దేవుడిని నమ్మం అని భీష్మించుకు కూర్చున్న వాళ్ళని మార్చడానికి రాయట్లేదు. అయితే, ఒక గొప్ప విశేషం తోచి, వైదిక మత శాస్త్రీయత ఎంత బలీయంగా ఉన్నదో మనందరికీ తెలియాలనీ, అమెరికాలోనే కాక, ప్రపంచంలో చాలా మంది సశాస్త్రీయంగా చదువుకుని, చక్కగా అలోచించగలిగే వాళ్ళున్నారనీ రుజువు చెయ్యడానికే రాస్తున్నాను. కానీ, ఒక విషయానికి ముందర పూర్తి పూర్వపక్షం చెయ్యలి. భగవత్తత్వాన్ని ఇక్కడ పూర్తిగా వివరించలేను. నా మేధకి అది పూర్తిగా అందదు. కానీ, భగవద్గీతలో కృష్ణ భగవానుడు అన్నట్లు కర్మ యోగంలో ఉంటూకూడా బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి, నేను మనకి తెలిసిన, అధారాలు దొరుకుతున్న విషయాలను కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. గత 35 ఏళ్ళుగా టెక్నాలజీలో పని చేస్తున్నాను కాబట్టి కొంత భౌతిక వాదం కూడా తెలిసిన వాడినే.

ఇప్పుడు ఈ పూర్వ పక్షం పాయింట్లేమిటో చూద్దాం. లేకపోతే, మనం దేన్ని సమర్ధిస్తున్నామో, దేన్ని సమర్ధించట్లేదో ఎలా తెలుస్తుంది? చాలా మంది హేతువాదులు ఇలా వాదిస్తున్నారు:

1. భగవంతుడి ఉనికికి శాస్త్రీయమైన ఆధారం లేదు. అంటే, శాస్త్రపరంగా మనం బ్రహ్మాన్నీ, మాయనీ వర్ణించలేము.

2. సాంకేతిక ప్రగతి, భౌతిక వాదం సశాస్త్రీయమైన సిద్ధాంతమని నిరూపిస్తున్నది. ఇదే భౌతిక వాదం, భౌతిక వాదులు దేవుడు లేడని వాదిస్తున్నారు.

3. ఆధునిక యుగపు మానవులు హేతుతత్త్వం, శాస్త్రీయ ఆలోచనలు కలిగిన వారు. (అంటే భౌతిక వాదుల ఉద్దేశ్యం గత కాలంలో శాస్త్రీయత్వం లోపించిందని, అప్పటి వారు ఎంతసేపూ మూఢనమ్మకాలతోనే వాదించేవారు అని).

4. దేవుడు జీవ, సజీవ పదార్ధాలని విడివిడిగా సృష్టించాడు.

5. భగవంతుడు లేడని నమ్మిన వారే జిఙ్ఞాసువులు.

6. భగవంతుడు ఒక రూపంలో ఉండి, మిగతా విశ్వాన్నంతా సృష్టించాడు.

7. పదార్ధం అనాదిగా ఉన్నది.

8. సృష్టికర్తని ఎవరు సృష్టించారు?

9. ప్రయోగశాలల్లో కొత్త వృక్ష, జంతుజాలాల్ని సృష్టించే శాస్త్రఙ్ఞులు ఉండగా, భగవంతుడెందుకు?

10. నిర్జీవపదార్ధాల్నించి జీవపదార్ధం అవిర్భవించింది.. కాబట్టి దేవుడి ప్రమేయం దీనిలో లేదు. ఈ నిర్జీవపదార్ధం అనాదిగా అదంతట అదే తయారై ఉన్నది.

11. శూన్యాన్నించి పదార్ధాలని సృష్టించే బాబాలు పచ్చి మోసగాళ్ళు. వాళ్ళు అలా చేస్తున్నారు గాబట్టి దేవుడు లేడు అని మరింత రుజువవుతున్నది.

12. ఆధ్యాత్మిక వాదులు ముందు దేవుడున్నాడని నమ్మితే తప్ప దేవుడు అర్ధం కాడని అంటారు. ఇది శాస్త్ర విరుద్ధం.

13. రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు సామాన్య మానవులలాగే క్లేశాలు అనుభవించారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? అలా మనఃక్లేశాలు అనుభవించిన వాళ్ళని మనం దేవుడిగా నమ్మడమేమిటి?

14. ఙ్ఞాన సముపార్జనకు వినియోగించాల్సిన పంచేంద్రియాలకూ, మనస్సుకూ పనిచెప్పకుండా అభిప్రాయం ఏర్పరచుకోవడం శాస్త్ర విరుధ్ధం.

15. మిగతా విషయాలు ఈ పైన ఉన్న వాటిని వినియోగించుకుని రాసినవే కాబట్టి, మనం వాటిగురించి విడిగా రాసుకోవచ్చు.

ఇక పోతే, శాస్త్రీయత: అంటే ఏమిటి? ఎవరైనా, ఏవిషయాన్నైనా ఒక 'సత్యాన్వేషణ ' మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని, వివిధ మార్గాలు అవలంబించినా చివరకి ఆ సత్యాన్ని చేరటమే శాస్త్రీయత. దీనిలో ఒక ముఖ్యమైన మాట ఉన్నది: అవలంబించిన మార్గాలు కూడా సత్యం పరిధిలోనే ఉండాలి. ఏఒక్కరికో కాదు, చెప్పిన మార్గాన్ని అవలంబించిన వారందరికీ అదే రిజల్టు రావాలి.

నేను హిందువుని. నేను వైదిక ధర్మం గురించే రాస్తాను. మిగతా మతాల పట్ల ఏవైనా విరోధ భావాలుంటే, ఆ మత ముఖ్యులని అడిగి చూడండి. నా వాదం దేవుడున్నాడనే. అయితే, నా దేవుడికి నాలుగు చేతులూ, వగయిరా ఉండక్కర్లేదు. అది మనం ఊహించుకునే రూపం మాత్రమే. మన సుళువు కోసం మనం నిర్మించుకున్న ఆకారం మాత్రమే. దీని గురించి మళ్ళీ కింద రాస్తాను.

దేవుడి ఉనికికి ఆధారం మనంతట మనమే తీసుకురావక్కరలేదు. ఆయన ఉనికిని అనుభూతిచెందితే చాలు. ఈ అనుభవం, భావం పనికిరావంటారా, 'భౌతిక వాద శాస్త్రీయత 'లో ఇలాంటి ఉదాహరణలు కొల్లలు. చిన్న ఉపమానం చెపితే, గాలి మనకి కనిపిస్తున్నదా? కానీ, గాలిని మనం ఎన్నిరకాలుగానో అనుభవిస్తున్నాం కాబట్టి గాలి ఉన్నదని ఒప్పుకుంటున్నాం. అయితే, గాలి అంటే ఏమిటనికుడా అదే సమయంలో నిర్వచిస్తున్నాం. ఎంత అనుభవిస్తున్నా, 'గాలి అనేది లేదు, నేను చూడలేదు 'అని వాదించేవాళ్ళని మనం ఏం చెయ్యగలం? మిగతా మాటలన్నీ రాసే ముందర ఒక మాట చెప్పనివ్వండి. మీ చుట్టూ చూడండి! మీకు తెలిసినంతగా ఉన్న విశ్వాన్ని పరిశీలించండి! ప్రతీ జంతువూ ప్రతీ వృక్షాన్నీ చూడండి! ఎంత అర్గనైజేషన్, ఎంత క్రియాశీలకత ఉన్నాయో తిలకించండి! ఒక చిన్న ప్రాజెక్టు, ఒక చిన్న పని కూడా సరియైన పర్యవేక్షణ లేకుండా సరిగ్గా పూర్తవ్వవే, ఇంత పెద్దది, అనంతంగా ఉన్న్న విశ్వంలో ప్రతీ ఒక్క చరాచర జగత్తు అంశ తన పని తను చేసుకుంటూపోతున్నదే? దాని విశేషాలను చూసి, ఎదో ఒక శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నదని అనుకోకుండా ఎలా ఉంటాం? ఆ శక్తిని మీరు ఏ పేరు పెట్టి పిలిచినా సరే! ఒక పుష్పవృక్షం, ఒక జంతువు వాటి లాంటి పుష్పాలే, వాటిలాంటి జంతువులనే మళ్ళీ మళ్ళీ పుట్టించగలుగుతున్నాయంటే ఎంత పర్యవేక్షణకావాలి! ఒక ధాతువు తన లక్షణాన్ని కోల్పోకుండా ఉంటేనేకదా దాన్ని వాడి శాస్త్రఙ్ఞులు ఇంకొకటి తయారు చేసేది? అది అలాగే ఉండాలని శాసించే శక్తి ఏది? ఇలా జడ, చర జగత్తులో ఉన్న ప్రతి జీవి, పదార్ధాన్నీ విశ్లేషించుకుంటూపోతే, అన్నిటికన్న వెనకాల మిగిలే 'సత్యం ' ఏమిటో అదే బ్రహ్మం.

ఇకపోతే ఈ దేవుడిని ఎలా అనుభూతితోనూ, అంతర్చక్షువులతోనూ చూడవచ్చో మన వేదాలలో చాలా వివరంగా చెప్పారు. నేను హిందువుని కాబట్టి సనాతన వేదాంత ధర్మం నించే ఉదాహరణలు చెపుతాను. ఇవి మిగతా అన్ని మత ధర్మాల కన్నా ఎంత పురాతనమైనవో, వీటినించే మిగతా ధర్మాలు ఎలా స్ఫూర్తి పొందాయో అవసరమైతే ఇంకొకసారి సోదాహరణంగా రాస్తాను.

ఇంకొక మాట: నేను రాసేవన్నీ నేను చాలామంది గొప్పవాళ్ళు రాసిన పుస్తకాలలో చదివిందే. ఇవన్నీ నేను సొంతంగా అలోచించి రాసానని అనటంలేదు. వాటితో ఒక కొత్త ఆలోచనని ప్రవేశపెట్టటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

అనుభూతి వల్ల ఏదైనా విషయం గ్రహించి, అంగీకరించవచ్చు అని ఇందాక అనుకున్నాము. మనకి తెలిసిన వాళ్ళు, మనం అధికారకులు అని ఒప్పుకునేవాళ్ళు ఏదైనా తెలుసుకుని రాస్తే అది సరియైనదే అని ఒప్పుకుంటాము. ఉదాహరణకి, పరమాణువు ఇలా ఉన్నదని మనందరం చూసామా? మనలో ఎవరో కొంతమంది రిసెర్చి చేసి, చాలా శ్రమకోర్చి ఏదైనా కనుక్కుంటే, దానిని ఆ కనుక్కున్న వారి సమకాలీకులు, సమ ఉజ్జీలు, వారిని ప్రశ్నించిన తరువాత, ఆ విషయం పరిశీలించిన తరువాత అది నిజమేనని ఒప్పుకుంటారు. మరి మన వేదాంత ధర్మంలో ఇలాంటి పరిశీలన ఏదైనా ఉందా?

ఉన్నది. సాధికారంగా చెపుతున్నాను. పూర్తిగా తర్కం, మీమాంసల మీద ఆధార పడిన వేదాంత ధర్మం ఈనాటి భౌతిక వాద శాస్త్రీయతకి ఏమాత్రమూ తక్కువకాదు. అయితే, దీని ప్రస్తావన తీసుకొచ్చే ముందు కొంత పూర్వ వృత్తాంతం, ప్రస్తుత పరిస్థితులు చెప్పాలి. లేకపోతే ఇలాంటి సంవాదాలకి పూర్తి అర్ధం బయటకి రాదు.

మన ప్రస్తుత జన జీవితంలో ఒక సమస్య ఉన్నది. 'సత్యం' అనేది ఇక విశ్లేషణకి అందకూడని విషయంగా ఉండాలి. మన మనస్సులో ఒక పనికని ఒక సత్యాన్ని అంగీకరించి, అదే సత్యాన్ని ఇంకొక పనికని విడిచిపెట్టటం మనస్సు చెయ్యలేని పని. ఈ భౌతిక శాస్త్రం ఒక ఉన్నత స్థాయికి చేరుకుంది. దాన్ని విడిచిపెట్టడం తప్పు. అయితే, మనం తెలుసుకోవలసిందేమిటంటే, మనకి కనపడే భౌతికమైన విషయాలు, శక్తులు సులభంగా వాటిని పరిశీలించనిస్తాయి. కాబట్టి అవి తొందరగా అభివృధ్ధి చెందడం, ఆశ్చర్యం కాదు. తత్వంలో ఇది అంత సులభంకాదు. ఏదైతే ప్రాసెస్ భౌతికశాస్త్రంలో 'నిజం ' కి రుజువు అని మనం ఒప్పుకుంటామో, అదే 'ప్రాసెస్ ' మనం తత్వ విషయాలలో కూడా అంగీకరించాలి. లేకపొతే హేతువాదులు ఊరుకోరు కదా? అయితే, శాస్త్రీయ పద్ధతులు అంగీకరించటమంటే, వేదాంతానికి ఓటమి కాదు! సత్యం యొక్క గరిష్ట ప్రమాణాన్ని ఒప్పుకోడం మాత్రమే! మతం - శాస్త్రం: ఇవి రెండూ ఎప్పుడూ ఒక సంయమనంతో ఉండగలగడమే అసలు రహస్యం.

మతానికి, శాస్త్రానికి మధ్య విభజన పెరుగుతున్నదని మనం మధన పడితే, మతానికీ, మొరాలిటీకి మధ్య అంతరం ఇంకా ఎక్కువయింది ఈమధ్య. ఎదో విధంగా పని అయిపోవాలన్నదే ధ్యేయంగా మారి, నిజం అవసరార్ధంగా మారింది ఈరోజు. దీనివల్ల మతానికి, శాస్త్రానికి, 'నిజం' కి ఉన్న విభేదాలని చాప అడుగుకి తోసేసి, మనసుని ఎదోవిధంగా సరిచెప్పుకోవటం మనకి అలవాటయిపోయింది. మీరు గమనించి చూడండి, పోయిన్నెల ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసంలో ఈ ముసుగులో గుద్దులాటే ఒక వ్యధగా బయటకి రావటం చూస్తున్నాము. మొత్తం సమాజం బ్రష్టు పట్టిపోవటానికికూడా ఇదే చివరకి కారణం అవచ్చు. ఉదాహరణకి, ఒక తండ్రి ఇంట్లో కుర్రవాడికి నిజం మాత్రమే మాట్లాడాలని బోధించి, ఒక గంటలో బయటకి వెళ్ళి వ్యాపారానికో, రాజకీయాలకో ప్రతి నిమిషం అబధ్ధాలు చెప్పుతూ ఉంటే, అ కుర్రవాడికి సత్యం యొక్క అవసరం, అర్ధం ఎలా తెలుస్తుంది? మన సమాజం ఈ మత, శాస్త్రీయ సంయమనరాహిత్యం వల్ల జనించే 'హిపాక్రసీ' తో ముక్కలు ముక్కలుగా విరిగే ప్రమాదం ఉన్నది. మనందరం కూడా 'నిజం, లేక సత్యం' ని పరిస్థితులకనుగుణంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఉంటాం చాలామటుకు. శాస్త్రంలో ఒప్పుకునే రూల్సు మతంలో కూడా ఒప్పుకోగలిగితే చాలా గొప్పగా ఉంటుంది కదా? కానీ, గమనించండి, మనం ఇలాంటి వ్యాసాలు రాసేటప్పుడు, సమాజంలో పైపైన కనిపించే 'తప్పులూ, లేక ఇంగ్లీషులో అన్నట్టు 'అబెర్రేషన్స్ ' ని చూస్తూ సత్యం మర్చి పోకూడదు. ఈ తప్పులు చాలామటుకు దారిద్ర్యం వల్ల, రాజకీయత వల్ల, పాశ్చాత్య దేశాల చేతిలో బానిసత్వంవల్ల వచ్చి ఉండవచ్చు. (డబ్బు ఉన్న దేశాల్లో ఈజాడ్యం లేదని నేనంటంలేదు, అంతకంటే ఎత్తుకు ఎదిగిన భారతదేశానికి పట్టిన గతి ఎందువల్ల? అని ఆలోచిస్తే వచ్చిన సమాధానాల్లో ఇది ఒకటి).

మరి ఈ విధంగా అలోచిస్తూ పోతే, మనందరం బ్రతకాలి కాబట్టి, మతాన్ని వదిలేయ్యాలి అనే హేతువాదుల వాదం లాంటి వాదాన్ని ఒప్పుకోవాలా? లేదా, దీనికేదైనా సమాధానం ఉన్నదా? అని ఆలోచిస్తే, 'ఉన్నది ' అని తేలుతున్నది. అదే వేదాంత ధర్మం. వేదాంతం ఎంత మటుకూ శాస్త్రంతో అంగీకరిస్తుందంటే, చాలా ఆశ్చర్యం వేస్తుంది! వేదాంతం అనగానే, ఎదో ముక్కు మూసుకునే సన్యాసి మీ కళ్ళకి కనిపిస్తే, అది మీ తప్పు కాదు! ఇందాకటినించి రాస్తున్నానే, ఆ ఎఫెక్టు మాత్రమే!

ఈ వేదాంత ధర్మమనేది మన ఋషులు ఒక సమ సమాజం కోసం, తత్వ నిర్దేశనం కోసం సత్యాన్వేషణతో తయారు చేసిన అద్భుతమైన 'ఫిలాసఫీ . ఇంత గొప్ప వేదాంత ధర్మాన్ని నాలాంటివాడు ఒక చిన్న వ్యాసంలో రాయడమనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ అవసరం వచ్చింది కనుక, కొన్ని విషయాలు, చిన్న ఉదాహరణలు మాత్రం పొందుపరుస్తున్నాను.

వేదాంత ధర్మంలో ఎప్పుడూ 'సత్యాన్నే అనుసరించు ', సత్యాన్వేషణకై నీ జీవితం వినియోగించు ' అని ఉంటుంది. ఏ కర్మలోనైనా, సత్యమే వెతుకు అని చెప్పే ధర్మం అశాస్త్రీయం ఎలా అవుతుంది? పైగా, మీరు వేదాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా, వెంటనే అర్ధమయ్యేదేమిటంటే, ప్రతీ విషయం ఒక 'ప్రశ్న ' ఒక 'జవాబు ' గా ఉంటాయి. మన ఋషులు ఎంత తపస్సు, తర్కము, మీమాంస చేసి ఇంత స్పష్టంగా ప్రతీ విషయాన్నీ బోధించగలిగారు?

భౌతిక వాదంలో ఒక కష్టమైన విషయం మీద రిసెర్చి చేసేటప్పుడు, ముందర మనం కొన్ని నేర్చుకోవాలని శాసిస్తారు. లేకపోతే ఆ రిసెర్చి చేయ్యటానికి కావలసిన అర్హత రాదు కదా? అలాగే ఈ 'సత్ ' లేక 'బ్రహ్మం ' లేక 'భగవంతుడు ' (ఈ అఖరి మాట అంత సరియైనది కాదు; ఎందుకంటే, 'సత్ ' అనేది అర్ధమైతే భగవంతుడిని ఎలా నిర్వచించవచ్చో వేదం చెపుతుంది). మన వేదాల్లో బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని అన్వేషించే వారే మనకి ఎక్కువగా తగులుతారు. వారెవ్వరూ కూడా, ముందర బ్రహ్మం అంటే ఏమిటో నిశ్చయించి, దానిని నమ్మి, ఆ తరువాత అదేమిటో కనుక్కోలేదు! అసలదేమిటో కనుక్కునే పద్ధతి ఏమిటో తెలుసుకుందామనే బయల్దేరారు! కాబట్టి, బ్రహ్మం ఏమిటో తెలుసుకోవాలంటే, ముందర మనిషికి కావలసిన తయారీ ఏమిటో తెలుసుకోవాలి. ఒక ఎక్స్పరిమెంటు చేసేముందర దాని ప్రిపరేషన్ నిర్ణయించినట్లు. దీన్నే భౌతిక వాదంలో ఇంగ్లీషులో 'పీర్ ఆక్సెప్టన్స్ బై ప్రి-ఎక్స్పరిమెంటల్ ప్రిపరేషన్ ' అని అంటారు.

తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లిలో భగవదన్వేషణతయారీకి రకరకాల సాధనాలు చూపించారు. పంచకోశాలు ఎలా మనల్ని భ్రమ చేస్తాయో చెప్పారు. (ఆనందవల్లిలో పంచకోశాలంటే ఏమిటో వర్ణించబడి ఉంది). అసలు కధ ఆ తరువాత భృగువల్లిలో చూస్తాము.

భృగువు వరుణుడి కొడుకు. తండ్రి దగ్గిరకి వెళ్ళి 'బ్రహ్మం' అంటే ఏమిటో బోధించమని ప్రాధేయపడతాడు. అన్నీ తెలిసిన వరుణుడు 'బ్రహ్మం అంటే ఇది ' అని కొడుకుకి చెప్పడు! చిన్నగా దారి చూపించి, వెళ్ళి తపస్సు చేయమని చెపుతాడు. భృగువు తపస్సు చాలా సంవత్సరాలు చేసి, 'అన్నం బ్రహ్మం' అని తెలుసుకుని, అయినా ఎందుకైనా మంచిదని మళ్ళీ తండ్రి దగ్గిరకి వెళ్ళి అదే మాట చెప్పి, నేను కరెక్టేనా, లేకపోతే బ్రహ్మం అంటే ఏదో చెప్పమని అడుగుతాడు. వరుణుడు భృగువుని మళ్ళీ తపస్సు చెయ్యమని సూచిస్తాడు. భృగువు మళ్ళీ ఘోర తపస్సు చేసి, 'ప్రాణం బ్రహ్మం ' అని తెలుసుకుని మళ్ళీ తండ్రిదగ్గరకు వెళ్ళి బ్రహ్మం ఏదో చెప్పమని అడుగుతాడు. వరుణుడు ఇంకా తపస్సు చెయ్యమని అదేశిస్తాడు. ఈసారి భృగువు ఇంకా గట్టిగా తపస్సు చేసి, 'మనస్సు బ్రహ్మం' అని తెలుసుకుని, తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదే చెప్పి, బ్రహ్మం అంటే ఏమిటో చెప్పమని అడుగుతాడు. వరుణుడు ప్రతీసారిలాగే ఈసారిగూడా మళ్ళీ తపస్సు చెయ్యమని సూచిస్తాడు. భృగువు మరింత పట్టుదలతో తపస్సు చేసి, 'విఙ్ఞానం బ్రహ్మం' అని తెలుసుకుని, తండ్రి దగ్గరకు వెళ్ళి, ఈమాట చెప్పి, బ్రహ్మం అంటే ఏమిటో చెప్పమని ప్రాధేయపడతాడు. అయితే వరుణుడు, శిష్యుడు ఇంకా పక్వం చెందలేదని అర్ధం చేసుకున్నవాడై, భృగువుని మళ్ళీ తపస్సు చెయ్యమని ఆదేశిస్తాడు. భృగువు మళ్ళీ ఘోర తపస్సు చేసి, ఈసారి 'ఆనందం బ్రహ్మం' అని తెలుసుకుని, దాని తరవాత ఇంకేమీ లేదని తెలుసుకుని, ఇక తండ్రి దగ్గరికి వెళ్ళడు! ఇప్పటికి అతని మనస్సులో సందేహాలన్నీ సమసిపోయాయి! ఈకధ పూర్తి అయిన తర్వాత భృగువల్లిలో బ్రహ్మం గురించి వేదం చెప్పింది ఏమిటో కూడా చెప్పబడింది.

పంచకోశాలంటే, 'అన్నం, ప్రాణం, మనస్సు, విఙ్ఞానం, ఆనందం ' కోశాలని ఆనందవల్లిలో వర్ణించబడి ఉన్నది. వీటిని ఒకొక్క ప్రపంచాలుగా అర్ధం చేసుకుని, వాటి ప్రభావం మనమీద ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అన్నమయ కోశం అంటే మనం తినే అన్నం మాత్రమే కాదు; కానీ మనం తినే ఆహారం వల్ల మనం తయారవుతాము అని చెపుతుంది.

తమాషా ఏమిటంటే, భృగువు లాగే, శుక మహాముని తన తండ్రియైన వ్యాస మహాముని దగ్గరకు వెళ్ళి, ఇలాగే బ్రహ్మం అంటే ఏమిటో సూచించమని అడుగుతాడు. వ్యాసుడు, కొడుకు చిన్నప్పటినుంచీ ఇలాంటి బ్రహ్మతత్త్వ బోధనకి తయారుగా ఉన్నాడని గ్రహించి, తపస్సు అదేశిస్తాడు. మళ్ళీ అన్నీ చెప్పుకోవక్కరలేదు కానీ, దాదాపు సమ కాలీకులైన భృగువు, శుకుడు ఒకే విషయాన్ని విడివిడిగా పరిశీలించి, రిసెర్చి చేసి, ఇతమిధ్ధం: అని తేల్చారన్నమాట.

ఈ పై కధలో మనకి చాలా శాస్త్రీయత కనిపిస్తుంది.

1. జిజ్ఙ్ఞాస్యం ఉన్నప్పుడు, జిఙ్ఞాసువు ముందర తయారు కావాలి. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు నేర్చుకోవటం, వాటిని అనుసరించటం పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలాగా లేదూ? (జిఙ్ఞాస్యం అంటే వెదకతగినది అని అర్ధం)

2. వరుణుడు మంచి గురువు. ఫైనల్ ఆన్సర్ ముందరే చెప్పడు. మంచి లెక్కల మాస్టారులాగా 'నువ్వే వర్క్ ఔట్ చెయ్యి!' అని అదేశిస్తాడు. అంటే, ఈ బ్రహ్మం అనేది ఎవరికి వారే వెదుక్కోవాలి.

3. భృగువు ఏదీ షార్ట్ కట్ గా చెయ్యడు. శ్రద్ధగా అన్ని వైపులనించీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, గురువు దగ్గర సౌమ్యంగా తన రిజల్టులని ఉంచి, ఇంకా దీనిగురించి తెలుసుకోవలసింది ఉందా? అని అడుగుతాడు. ఇది ఎంత శాస్త్రీయంగా ఉందో అలోచించండి!

4. ఈ ఫైనల్ ఆన్సర్ దొరికినప్పుడు, మీకు ఇంక అనుమానం ఉండదు. గమ్య స్థానాన్ని చేరుకున్నట్లే. ఇది కూడా పూర్తిగా శాస్త్రీయమే! ఈ ప్రాసెస్ లో ఉన్నంత వరకూ, అంతకు ముందర బ్రహ్మాన్ని మీరు నమ్మక్కర లేదు. శ్రద్ధ ఒక్కటే ముఖ్యం.

5. భౌతిక వాదంలో మనంతట మనం చెయ్యని ప్రయోగాలు ఇంకెవరైనా చేస్తే మనం నమ్మినట్లు, మీరు అనుభవించని బ్రహ్మాన్ని ఇంకెవరైనా అనుభవించి, తెలియబరుస్తే ఒప్పుకోవడంలో తప్పు లేదు! వారు చూపించిన మార్గంలో నడవడం కూడా తప్పు లేదు!

6. అన్నిటికన్నా ముఖ్యమైనది, సృష్టికర్తను ఎవరు సృష్టించారు? అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరకడం. మన పంచేంద్రియాల ప్రభావం వల్ల, ఆ ఇంద్రియాలకి అనుభవానికొచ్చే పరిధిలోనే ఒక మనిషిని ఒక మనిషి 'పుట్టించినట్టుగా' (నిజంగా మనం పుట్టిస్తున్నామా? అలోచించండి!) సృష్తికర్త ఉండాలని ఆశించడం మొదటితప్పు. ఇది అన్నమయకోశం మనల్ని పడేసే భ్రాంతి లోకం. దీన్ని అధిగమించాలి.

ఈకింద చెప్పిన మాట కూడా ఈ పైన చెప్పిన కధ వల్ల రుజువవుతుంది!

వేదాంతంలో బ్రహ్మము, జీవాత్మ అని రెండు ఉన్నాయి. విడి విడిగా కనిపించినా, మనకి ఙ్ఞానం పెరిగేకొద్దీ ఇవి రెండూ కలిసిపోతాయి. ఈ బాహ్య ప్రపంచం అనంతమైన, ఆశ్చర్యకరమైన, ఒకప్పుడు ఒకదానితో ఒకటి విరుధ్ధమైన సజీవ, నిర్జీవ వస్తువులతో కూడుకుని ఉంటుంది. ఇవన్నీ బ్రహ్మము, ఆత్మ - ఈ రెంటి చుట్టూ తిరుగుతుంటాయి. చివరకి సచ్చిదానంద స్వరూపం అర్ధమవుతుంటే, నెమ్మది నెమ్మదిగా ఆ మబ్బులు విడిపోయి, ఒకే ఒక సత్యం - అదే బ్రహ్మం - మిగులుతుంది. అది అర్ధం కావాలంటే మరి కష్టపడక తప్పదు కదా! అన్నమయ కోశం నించి, ప్రాణ, మనో, విఙ్ఞాన, ఆనందమయ లోకాలవరకూ అన్నింటినీ అధిగమించుకుంటూ పోతేనే ఇది అర్ధమయ్యేది!

ఈ వేదాంత సారం అంతా మనకి త్వరిత గతిలో అర్ధమవాలంటే, ఉపనిషత్తులూ, భగవద్గీతా చాలు. భగవద్గీత రెండవ అధ్యాయం మీకు ఈ 'బ్రహ్మం' లేక 'అల్టిమేట్ కాన్షస్నెస్ ' ఏమిటో తెలియజేస్తుంది. దీన్ని చేరటానికి పలు మార్గాలు ఉన్నాయనీ చెపుతుంది. దీన్ని చేరే దారిలో మీకు వచ్చే అడ్డంకుల్నీ తెలియబరచి, హెచ్చరిస్తుంది! అలాగే మూడవ అధ్యాయంలో ఈ బ్రహ్మాన్ని చేరటానికి సాంఖ్య యోగం, కర్మ యోగం దారులని కూడా చెపుతుంది. అంటే ఙ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మ యోగం మూడూ మార్గాలే. ఒకటినిమించినదొకటి కాదు. సంసారంలో ఉంటూ కూడా బ్రహ్మాన్ని సాక్షాత్కరింపజేసుకోవచ్చు. అసలు భగవద్గీత ఒక టెక్స్ట్ బుక్కు లాగా ఉంటుంది. వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూకూడా కొంత హెచ్చైన విశ్లేషణ ఉంటుందేమో కానీ, భగవద్గీతలో మాత్రం ఏమాత్రం డొంకతిరుగుడు లేకుండా భగవానుడు మనకి మార్గం బోధిస్తాడు.

ఒక రిసెర్చి చేసేటప్పుడు గట్టి పధ్ధతులు పాటించే హేతువాదులు, ఈ బ్రహ్మం విషయానికి వచ్చేటప్పటికి అంత కష్టపడడానికి ఒప్పుకోరెందుకో? కష్టపడకుండా 'భగవంతుడు లేడూ అని ఒక మాట పారేసి, ఇహ మీరు నాకు భగవంతుడిని చూపిస్తే తప్ప నేను నమ్మను అని కూర్చుంటారు. అదేదో భగవంతుడు నాలుగు చేతులు, మూడు తలలూ, ఆయుధాలతో కనిపించాలని కాబోలు! నిరాకారుడైన, నిర్గుణుడైన భగవంతుడు, నిరాకారమైన బ్రహ్మం ఇలా ఉంటుందని ఎలా చెప్పటం? అనుభవించవలసినదే! ఆ అనుభవం కావటానికి కావలసిన సాధన చెయ్యవలసినదే! ఈ సాధన ఒక గురువు దగ్గిర నేర్చుకోవలసినదే!

దీనికి రుజువుగా భగవద్గీతలో అధ్యాయం 2, శ్లోకం 17:

అవినాశితు తద్విధ్ధి యేన సర్వమిదం తతం|

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి|

"నాశ రహితమైన పరమాత్మ తత్వము జగత్తునందు వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరు నశింపజేయజాలరు. "

అలాగే, 2, 20 చూదండి:

నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః|

అజో నిత్యః శాశ్వతో యం పురాణో నహన్యతే హన్యమానే శరిరే|

" ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు."

ఇది చెప్పేటప్పుడు అద్వైత సిధ్ధాంతం కూడా ఒక సారి అర్ధం చేసుకోవాలి. 'బ్రహ్మం ', శక్తి ', భగవంతుడు ', విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది. అది లేని చోటు లేదు. మీలోనూ, నాలోనూ అదే బ్రహ్మం, అదే భగవంతుడు ఉన్నారు. ఇది అర్ధం చేసుకోటం కొంచెం కష్టమైనా, ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో ఇదే శక్తి ఉన్నదని నమ్మడం అంత కష్టం కాదు. నా నిజమైన పాయింటు ఇక్కడే ఉన్నది. ఒక పరమాణువు గర్భంలో ఎన్ని కణాలున్నాయో సుజనరంజనిలో డాక్టర్ వేమూరి వేంకటేశ్వర రావు గారు ఇదివరకే రాసారు. ఆ కణాలన్నీ శక్తి స్వరూపాలే (ఎనెర్జీ పార్టికల్స్) అని మనకి ఇప్పుడు సాధికారికంగా తెలుసు. కావాలంటే 'స్ట్రింగు థియరీ ' చదవండి. చివరకి ఈ శక్తి కణాలే పరమాణువు గర్భం గానూ, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఇంకా చిన్న కణాలుగానూ, ఎలెక్ట్రాన్లు వగయిరా గానూ తయారవుతున్నాయి. చిన్న పిల్లలు ఆడుకునే లెగో ఇటుకలతో రక రకాల కట్టడాలని తయారు చేసినట్లే, ఈ ఎనెర్జీ పార్టికల్సే కోటానుకోట్ల రూపాలుగా తయారు అవుతున్నాయి. విశ్వారంభంలో గోళీకాయ ప్రమాణంలో ఉన్న పదార్ధం విస్ఫోటకమై, ఇంత మేరకు వ్యాపించిందని మనం భౌతిక వాదంలో తెలుసుకుంటున్నాము. ఇది పదార్ధ రూపం వల్ల అయ్యే పని కాదు. శక్తి స్వరూపంలో ఉన్నదే విస్ఫోటకం చెంది క్రమంగా పదార్ధంగా మారుతోంది. మరి అదే మాట మన వేదాల్లో ఉన్నది! విశ్వారంభం ముందర ఏముంది? అదే 'సత్ '! 'ఎనర్జి కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ '!

భగవద్గీతలో కృష్ణుడు చెపుతాడు - మాయ వల్ల విశ్వ ప్రకోపం అవుతుందనీ, పదార్ధం రక రకాలుగా విభజించబడి, వివిధ రూపాలుగా మార్చబడుతుంది, అని.

గీత|దైవీ హ్యేషాం గుణమయీ మమ మాయా దురత్యయా|

మామేవ యే ప్రపత్యంతే మయమేతాం తరింతతే|

' మాయ దైవికమైనది. నా మాయలో సహేతుకమైన గుణములున్నవి. అందువల్ల అది బేధించనశక్యము. అయినను నన్ను చేరువాడు ఈ మాయను అధిగమించుచున్నాడు '.

ఇప్పుడు మనం చెప్పుకున్నది, చెప్పుకోవలసింది ఏమిటంటే, ఈ మాయని మనం మాడర్న్ శాస్త్రీయతతో ఎలా చూపించచ్చు అని.

కొంత ప్రక్రియ తెలిస్తే శాస్త్రఙ్ఞులు కూడ ఈ పనిలో చిన్న భాగం చెయ్యచ్చు, చేస్తున్నారు. మారిందేమిటో, మార్చబడిందేమిటో గట్టిగా పరిశీలించి చూస్తే, రెండూ ఒకటే - ఎనర్జీ పార్టికల్సే - అని అర్ధమవుతుంది. భగవంతుడు చెప్పిన మాయే మనల్ని పదార్ధం, జీవం కోటానుకోట్ల రూపాలుగా చూసేట్లు చేస్తోందని తెలుస్తోంది. దీన్ని నమ్మక పోతే ఏదైనా థియరెటికల్ ఫిసిక్స్ పుస్తకం చదవండి.

నాకు ఆశ్చర్యం అల్లా ఏ పరికరాలు వాడి ఋషులు ఈ సత్యాలని కనుక్కున్నారు?

ఇలా రాసినప్పుడు మనకి ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి. ఏనాటి కాలమో కాకుండా, ఇప్పటి కాలంలో కూడా ఈ బ్రహ్మాన్ని సాధించిన వాళ్ళున్నారా అని ఒక ప్రశ్న. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఈ అనుభవం చెందిన వారే! వారి అనుభవాలని చాలా వివరంగా రాసారు, ప్రసంగించారు. మనకి తెలియకపోతే, తెలిసిన వాళ్ళు చెపితే నమ్మాలని ముందరే ఒప్పుకున్నాము కదా? శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు ఈ కోవకి చెందిన వారే! అయితే, వీళ్ళెవర్నీ నమ్మము అనే తత్వం మనకి ఇందాక అనుకున్నట్లు, అన్ని చోటల సత్యమే పలకాలనే నియమాన్ని మన సమాజం మొత్తం వదిలేయడం మూలానే, మన దౌర్భాగ్యం వల్ల, వచ్చింది.

ఇంకొక ప్రశ్న ఏమిటంటే, కొంత నమ్మి, సాధనలో ఉన్నవాళ్ళు అసలు ఏమైనా సాధించగలరా అని. దీనికి సమాధానం తప్పక ప్రయోజనం ఉంటుంది అని. మనం ఈ జన్మలో చేసుకున్న మంచి సాధన వల్ల, పూర్తిగా బ్రహ్మాన్ని సాధించలేకపోయినా, అ ఫలం వల్ల అఖండానందానుభవము కొన్ని నాళ్ళు పొంది, మళ్ళీ మంచి కుటుంబంలో జన్మించి తొందరగా సాధకుడవైపోతావు అని కృష్ణుడు చెపుతాడు.

కొందరు నాకు భగవంతుడు ఇన్ని కష్టాలెందుకు వచ్చేట్లు చేసాడు? నేను ఇన్ని పూజలు చేసానే? అని ప్రశ్నించుకుంటారు. దీనికి మంచి సమాధానం భగవద్గీత: 5, 14 లో:

నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః|

న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే|

" భగవంతుడు జీవులయొక్క కర్తృత్వమునుగాని, వారి కర్మలనుగాని, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్తించుచున్నది. "

దీనివల్ల మనకి అర్ధమయ్యేదేమిటంటే, భగవంతుడు ఒక ప్రకృతి ధర్మాన్ని తయారు చేసి పదార్ధాన్ని (మాయ వల్ల శక్తినే మనం పదార్ధం అనుకుంటున్నాం) రూల్ చేసే శక్తిగా పెట్టాడు. కాబట్టి ప్రకృతి ఆ పని తుః చః తప్పక చేస్తూపోతున్నది. అందుకే ప్రకృతి మీద మనం ఆధార పడి, అది మనలని చేయనిచ్చిన పనులన్నీ మన ఘనతే అని పొంగిపోతూ, దానికి కారణభూతుడయిన దేవుడిని విస్మరిస్తున్నాము.

ఇలా అవుతుందని రుజువు: గీత| అధ్యాయం 8 - 14:

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం|

అవజానంతి-మాం-మూఢః-మానుషీం-తనుం-ఆశ్రితం|

'మూఢులు నా పరమభావమును ఎఱుగక సర్వప్రాణులకు ప్రభువునైన నన్ను లోక కల్యాణానికై అవతరించినానని తెలియక సామాన్య మానవునిగా భావించి నన్ను అలక్ష్యము చేయుచున్నారు. '

రాముడు, కృష్ణుడు భగవంతుడి అవతారాలు. ధర్మానికి సహాయం అవసరమైనప్పుడు ఆయనే మనలోకంలోకి దిగివచ్చి మనకి అర్ధమయ్యేలా, మనలాగే ప్రవర్తిస్తూ, మనకి ఒక మార్గం చూపుతాడు. ఆ రూపంలో ఆ అవతారం పడే క్లేశాలు తన రూల్స్ కి తనే కట్టుబడి ఉండటం అన్నమాట. అదే సమయంలో మనకి ఒక మార్గదర్శకుడవ్వటం మనం చూస్తూ ఉంటాము ఈ అవతారాల్లో.

మనుష్యులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉధ్ధరించుకొనవలెను అని భగవద్గీత అధ్యాయం 6, 5 వ శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు.

ఉధ్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్|

ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః|

' మనుజులు ఈ సంసారసాగరమునుండి తమను తామే ఉధ్ధరించుకొనవలెను. తమకుతామే అధోగతిపాలు కారాదు. లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. '

మీరు చూడండి, మన వేదాంతంలో ఇందాక నిర్వచించిన బ్రహ్మం నిరాకారం అని తేలినప్పుడు, మనం ఆ బ్రహ్మాన్ని ఏ రూపములోనైనా ఆరాధించవచ్చు కదా? అది చూసే వారిలో ఉంటుంది. వేదాంతంలో ఎక్కడా కూడా భగవంతుడి ఆకారాన్ని నిర్ణయించరు. స్వరూపం మాత్రమే చెపుతారు. ఈ ఆకారం మనంతట మనం తయారు చేసుకున్నది. కాబట్టే, ఒక్కటైన సత్యానికి మనం రక రకాలైన రూపాలని తయారు చేసుకుని ఆరాధిస్తున్నాము. ఎందుకని? మనకి ఈ సాధనలో ఏకాగ్రత కుదరాలంటే, మొదట్లో ఈ ప్రక్రియ అవలంబించ వచ్చు. ఈ సాధనలో ఒక ఎత్తుకి వెళ్ళిన వాళ్ళు ఇక దైవ రూపాలని ఆరాధించరు. సత్, చిత్, ఆనంద స్వరూపం తెలిస్తే ఇంక వేరే భగవదాకారాలెందుకు?

ఇక ఈ బ్రహ్మ స్వరూపం ఎలాంటివారికి తెలుస్తుంది? అనేది ఇంకొక ప్రశ్న. కఠోపనిషత్తులో (అధ్యాయం 1-2-23,24) 'వికాసం'- చదువుకుంటే, మీమాంసలు చేస్తే రాదని తెలియజేస్తుంది. బుద్ధి 'చెడు ' నించి మళ్ళినప్పుడే, మనసుని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే ఈ సాధన సాధ్యం అని చెపుతుంది.

మరి మనస్సుని కంట్రోల్ చేసుకోడం ఎలా? దీనికి సాంఖ్య యోగం, కర్మ యోగం మార్గాలు. అది ఏమిటో తెలుసుకోవాలంటే భగవద్గీత అధ్యయనం చేయవలసిందే! ఇప్పుడు శ్వేతశ్వరోపనిషత్తులో ఒక శ్లొకం చూడండి:

వేదాంతే పరమం గుహ్యాం పురాకల్పే ప్రచోదయాత్|

నాప్ర్శాంతాయ దాతవ్యం నాయుత్రాయాశిష్యాయ వా పునః|

శ్వేతశ్వతరోపనిషత్తు ఇలా చెపుతుంది: ఒక తండ్రి, ఒక గురువు లేకుండా వేదాంతం నేర్చుకోవడం నిరుపయోగం. పైగా, ఙ్ఞానం సంపాదించాలంటే, ఉత్కృష్టమైన సత్యం తెలుసుకోవాలంటే, ముందర మనఃక్షాళనం అవసరం అని. (శ్వేతశ్వతరోపనిషత్తు - 6-22). అలాగే ముండకోపనిషత్తు (అధ్యాయం 1-3-5)లో 'సత్యము, తపస్సు, నిజమైన అర్ధమెరుగుట - ఇవి బ్రహ్మార్ధ కాంక్ష ఉన్న జీవికి తప్పక అవసరం అని తెలియజేస్తుంది.

ఈ భగవంతుడి స్వరూపం (ఇది ఆకారం కాదని గమనించండి!) గురించి రాయాలంటే నావంటి సామాన్యుడికి సాధ్యమయ్యే పని కాదు కానీ, భగవద్గీతలో 9వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునునికి చెపుతాడు: ' నేను ఈ జగత్తు నంతా వ్యాపించి ఉన్నాను. (9-4) చరాచర జగత్తు అంతా నాలో ఉన్నది, కానీ, నేను దానికి అతీతంగా ఉన్నాను.(9-5 నించి 9-10). ఇలా ఉండగలిగే శక్తి ఏదైనా మనకి ఇప్పుడు అర్ధం అయ్యే ఈ ఎనెర్జీకి కూడా అతీతంగా, కానీ ఒక సృజనాత్మక శక్తితో ఉండాలి. అదే భగవత్స్వరూపం అని నా చిన్ని మేధకి అర్ధం అవుతోంది. అదేమిటని నేను నిర్ణయించలేను.

హేతు వాదాన్ని మూఢంగా వాదించే వాళ్ళు ఈ భగవత్తత్వం భౌతిక వాదానికి సరిపోదని రాస్తారు. కొన్ని వేల ఏళ్ళ క్రితం రాసిన ఈ వేదాలు థియరెటికల్ ఫిసిక్స్ నీ, బైయాలజీనీ ఆ సమయంలోనే ఎలా ఊహించాయో చూడండి: ఈ విశ్వం అంతా ఒక ' ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ' నించి, దానిలో ఉన్న ఒక సృజనాత్మక శక్తి నించి జనించిందని ఉపనిషత్తులు చెపుతున్నాయి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఈ జగత్తు అంతా ఒక 'మాయ ' తో కప్ప బడి ఉన్నది. మనకి కనిపించే చరా చర జగత్తు, కనిపించని ఆ 'బ్రహ్మ పదార్ధం' (ఈ మాట ప్రయోగం నేను చేస్తున్నాను; ఎందుకంటే 'వేవ్ థియరీ ' ని కలపాలి కాబట్టి) అన్నీ ఒకటే (అంటే ఒక 'కంటిన్యువం' ) అని చెప్పాడు. మాయే శక్తిని పదార్ధంగా, మాయే పదార్ధాన్ని కోటానుకోట్ల రూపాలలో కనిపించేలా పంచేంద్రియాలకి భ్రమ కలిగేలా చేస్తుంది. మీరు ఏ థియరటికల్ ఫిసిసిస్టు నయినా అడిగి చూడండి, లేదా, గొప్ప సైంటిస్టు స్టీఫెన్ కింగు పుస్తకం ' ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం ' అనే పుస్తకం చదివి చూడండి, 'మాయ ' బదులు ఎనెర్జీ పార్టికల్స్ ' అని ఊహించండి, మీకు రుజువు అవుతుంది.

ఈ వేదాంత ధర్మానికి శాస్త్రీయత ఉందా లేదా అని భౌతిక వాదుల ప్రధాన ప్రశ్న. పై పై సమాజ అడ్డుదారుల్ని విమర్శించి, మూలం కూడా తప్పే అని నిర్ధారించకండి. అది అశాస్త్రీయం. మనకి దేశంలో ఇన్ని చట్టాలు ఉన్నాయి. అయినా దొంగతనాలు, మోసాలు వంటివి ఎందుకు జరుగుతున్నాయంటారు? కొందరు 'బాబాలు ' జనాలని మోసం చేస్తున్నారంటే ఒప్పుకుంటాను. అందరూ అలా కాకపోవచ్చు కదా? పైగా, విభూతి సృష్టించి ఇచ్చిన వాళ్ళు ఏనుగుని ఎందుకు సృష్టించరు? అని ప్రశ్న. భగవద్గీతలో కృష్ణుడు చెపుతాడు - ఎవరికి ఏది ఇవ్వాలో అది నేను నిర్ణయిస్తాను - అని. అలాగే, ఒక ప్రయోజనం కోసం ఎవరైనా ఏదైనా పని చేస్తే, ఆ పనియొక్క పరిధులు మార్చి, వేరే విధంగా రుజువు చెయ్యమనడం సులువు. అలా అవతల వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వారు చూస్తున్న గమ్యం వేరేవిధంగా ఉంటుంది. మనం చేసే కర్మ బట్టి దాని ఫలితం ఉంటుందనీ, అయినా కర్మ ఫలాన్ని ఆశించకుండా, నిరాసక్తితో కర్మ చెయ్యమని కృష్ణుడు బోధిస్తాడు. అలాగని కర్మ చెయ్యకుండా ఉండకూడదు అని కూడా చెపుతాడు. ఇంతకంటే కావలసిన మార్గదర్శకం ఏమిటి?

వేదాలలో, ఉపనిషత్తులలో 'శక్తి ' లేదా 'అమ్మ ' తన ఆనందంలో ఒక విశ్వం తరవాత ఒక విశ్వం పుట్టిస్తుంది, అని ఉన్నది. దీనికి రుజువు కావాలంటే, పోయిన ఏడాది శ్రీ డా| వేమూరి వెంకటేశ్వర రావు గారు సుజనరంజనిలో రాసిన ' అష్టావక్ర్తుడు - రోమహర్షుడు ' కథ చదవండి. దీనిలోనే ఈ విశ్వాల వెనకాల ఎంత పెద్ద టైము స్కేలు ఉన్నదో కూడా తెలుస్తుంది. చాలా ఆసక్తి కరంగా శ్రీ వెంకటేశ్వర రావు గారు రాసారు. అదంతా మళ్ళీ రాయడం అనవసరం కదా? భౌతిక వాదులు చాలా ఏళ్ళు ఈ మాటని పట్టుకుని, ఈ వేదాంతమంతా బోగస్, ప్రపంచం ఒక విశ్వానికే పరిమితం అని వాదించారు. దీని మీద చాలా రాయవచ్చు గానీ, ఈ మధ్య స్టీఫెన్ కింగు 30 ఏళ్ళుగా 'బ్లాకు హోల్స్ ' మీద రెసెర్చి చేసి, ఇంక ఏ విధమైన సమాధానం దొరకక, తన లెక్కలు అన్నీ అనంత సంఖ్యలో విశ్వాలు ఉన్నప్పుడే సమకూరుతాయి అని రాసాడు. ఏ పరికరాలతో, ఏ లెక్కలతో మన ఋషులు ఈ విశ్వరూప సందర్శనం చేసారంటారు? ఇలా చెప్పిన వేరే మతం గాని, ఫిలాసఫీ గానీ ఉన్నదా? మీరు ప్రపంచంలో గొప్ప గొప్ప ఆలోచనాపరులని అడిగి చూడండి, సనాతన ధర్మం వల్ల మిగతా ధర్మాలన్నీ ప్రభావితమయ్యాయి అని ఒప్పుకుంటారు. ఒక ఆలోచనకి ఉండే పవరు ఏమిటో దీని వల్ల తెలియడంలేదూ? ఇంత మంచి మంచి మాటలు చెప్పిన ఋషుల మాటలు, తత్వం ఒప్పుకోడంలో, వాటిని అనుసరించడంలో ఎంత హాయి ఉంది!

తమిళ స్వామి నమ్మాళ్వార్ మోక్షం అంటే ఒక ప్రదేశమో , ఒక భవంతో, ఒక ఊరో కాదూ, ఒక మనోస్థితి అని వర్ణిస్తారు. వేదాంత ధర్మంలో ప్రతీ జీవంలో ఉండే ఆత్మ నాశనము లేనిదీ, శాశ్వతమైనదీ అని, మనకి కనపడే పదార్ధ శరీరాలు బట్టలవలే ఆత్మని కప్పి ఉంటాయి మాత్రమేగాని, స్వ-అస్థిత్వం కలిగి ఉండవనీ చెప్పబడి ఉంది. ఈ పరమాత్మ - ఆత్మ కంటిన్యువం ఉందే, అది ఒక మహాద్భుతమైన ఆలోచనా ప్రక్రియ, వేదంలో. సశాస్త్రీయంగాకూడా అదే నిరూపించబడింది. చార్ల్స్ డార్విన్ - ఎవల్యూషన్ థియరీ ప్రతిపాదించిన ఘనుడు - దేవుడు అనే ప్రతిపాదన లేకుండా ఈ ఎవల్యూషన్ ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్ధం కాలేదు అని రాసాడు.

ఙ్ఞాన సముపార్జనకు వినియోగించాల్సిన పంచేంద్రియాలకూ, మనస్సుకూ పనిచెప్పకుండా అభిప్రాయం ఏర్పరచుకోవడం శాస్త్ర విరుధ్ధం అని భౌతిక వాదులనే మాటతో నేను ఏకీభవిస్తాను. ధర్మ ఙ్ఞాన సముపార్జనకూ అదే మార్గం. అదే అనుసరించమని హేతు వాదులని హెచ్చరిస్తున్నాను.

మొదట రాసిన వాదాలన్నిటికీ సమాధానం రాసాననే అనుకుంటున్నాను. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన సమాజానికి, మన వేదాంత ధర్మానికీ!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech