శీర్షికలు  
     సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 14
 
- రచన : సత్యం మందపాటి  

కలిసి వుంటే కలదా సుఖం?

ఆరోజు తెడ్డెం తేగయ్య రచ్చబండ దగ్గరికి వచ్చే ముందరే, ఎడ్డెం ఎంకటేసర్లు అక్కడికి వచ్చి చుట్ట అంటించి గాలిలోకి పొగ వదిలి, ఆ పొగ పైకి వెడుతుంటే దాన్లోకి చూస్తూ కూర్చున్నాడు.

తెడ్డెం తేగయ్య అతని పక్కనే కూర్చుంటూఆ పొగలోకి ఎంత చూసినా ఏముంది. పొగ తప్ప. ఎందుకలా చూస్తూ కూర్చున్నావ్అడిగాడు భుజం మీద తువ్వాలు పక్కనబెడుతూ.

చిన్నగా నవ్వాడు ఎంకటేసర్లు.ఈ పొగలో ఎన్నో రహస్యాలున్నాయ్ తేగయ్యా! ఈ పొగే కాదు ఆకాశంలో మబ్బులు చూసినా ఇంతే! పొగలో కానీ, మబ్బుల్లో కానీ మన ఊహలను బట్టి ఎన్నో చూడవచ్చు. ఇందాక వినాయకుడు కనపడ్డాడు. ఇప్పుడు చీమల బారు కనపడుతున్నది. చూడు నీకేం కనపడుతుందోఅంటూ తేగయ్య ముఖం మీద పొగ వూదాడు ఎంకటేసర్లు.

అనుకోకుండా తన నాసికారంధ్రాల్లో పొగ దూరగానే ఉక్కిరిబిక్కిరి అయి దగ్గాడు తేగయ్య.

నీ సిగదరగా... నీ చీమలేమో కానీ... నాకు ఊపిరాడకుండా చేశావయ్యా...అన్నాడు తేగయ్య.

ఎంకటేసర్లు నవ్వాడు.చీమలంటే గుర్తుకొచ్చింది. రాత్రి టీవీలో చూశాను చీమల మీద ఒక సినిమా. చీమల్లో ఐకమత్యం బాగా ఎక్కువయ్యా. ఒకే బారుగా వెళ్ళటం. ఒకదానితో ఇంకొకటి ఎంతో సఖ్యంగా వుండటం, ఎన్నో చీమలు కలిసికట్టుగా ఆహారం సంపాదించి, భూమిలో ఒక చోట దాచుకోవటం. ఆ చీమల దగ్గరనించీ మనుష్యులు నేర్చుకోవాల్సింది చాల వుందయ్యాఅన్నాడు.

అసలు ఆది మానవుడు ఆవిర్భవించినప్పటి నించీ మనిషి మనుగడకి కావలసిన తెలివితేటలు జంతువుల దగ్గరనించే నేర్చుకున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల్లో సంఘీభావం కూడా అక్కడి నించే వచ్చిందేమో... కానీ ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది వేరు. మతాలనీ, కులాలనీ, ప్రాంతాలనీ, భాషలనీ.. ఒకటేమిటిలే... ఏదో ఒక పేరుతో విడిపోవటమే లక్ష్యంగా పెట్టుకుని, రోడ్డు మీద పిచ్చి కుక్కల్లాగా పోట్లాడుకుంటున్నారు... ఎందుకంటావ్?అన్నాడు తేగయ్య.

ఎందుకంటే.. ఎవరి అవసరాలు వారివి. అందుకని!అన్నాడు ఎంకటేసర్లు.

అవసరాల కోసం ఐకమత్యాన్ని, మనుగడనీ, సంఘీభావాన్నీ మరిచిపోతామా! మనం చిన్నప్పుడు చదువుకోలా! ఒక్కొక్క కర్రనీ సులభంగా విరిచేయవచ్చు. అవే కర్రలు, కలిసికట్టుగా ఒక మోపులా వుంటే విరవలేరు!అన్నాడు తెడ్డెం తేగయ్య.

అవన్నీ పాత రోజుల కాకమ్మ కథలు తేగయ్యా! ఈరోజుల్లో తనకు మాలిన ధర్మం లేదు

పధ్నాలుగో శతాబ్దంలో చెంగీజ్ఖాన్ వంశీయుడు, తామర్లేన్ మనవడు బాబర్ కూడా మనలో ఐకమత్యం లేకపోవటం చూసే, మొగలాయీల పాలనకు అంకురార్పణ చేశాడు. వాళ్ళు వందల సంవత్సరాలు మన నెత్తి మీద కూర్చున్నారు. అలాగే వ్యాపారం చేసుకునే ఉద్దేశ్యంతో వచ్చిన బ్రిటిష్ వాడిని, మనం మనం పోట్లాడుకుని వాడిని తెచ్చి పట్టం కట్టాం. రెండొందల ఏళ్ళు మన స్వరాజ్యాన్ని, స్వతంత్రాన్ని చేతిలో పెట్టుకున్నారు. రెండు పిల్లుల తగవు కోతి తీర్చినట్టు అయింది. ఈ విడిపోవటమనే బుద్ధి మన రక్తంలో వుంది ఎంకటేసర్లూ. స్వాతంత్రం వచ్చాక కూడా, భాషాపరంగా రాష్ట్రాల కోసం విడిపోయాం. ఆ భాషాపరంగానే ఉత్తర భారతం, దక్షిణ భారతం కలిసి వుండటం కష్టమయిపోయింది. వివిధ రాష్రాల్లో కూడా ఎన్నో జిల్లాలవారిగా విడిపోయాం. మతం పేరుతో ఎప్పుడూ కొట్టుకు చస్తూనే వున్నాం. ఇక కులాల సంగతి చెప్పనఖ్కర్లేదు. ఆరోజుల్లో అయినా, ఈరోజుల్లో అయినా ఇవి నిత్య సత్యాలు. అంతెందుకు తెలంగాణ విషయం చూడు. ఎన్నాళ్ళో కలిసివున్న తెలుగువాళ్ళు విడిపోవలసి వస్తున్నది.అన్నాడు తేగయ్య.

దానికి కారణాలు విడిపోవాలనే కోరిక కాదు! తెలంగాణా ప్రాంతం మరి ఇన్ని సంవత్సరాలైనా అలాగే వుంది కదా! పెద్ద పరిశ్రమలు లేనేలేవు. మరి అక్కడ చదువుకున్న వారికి ఉద్యోగాలెలా వస్తాయి? అలాటి అసంతృప్తులు వుండటం వల్లనే వేర్పాటు ధోరణులు వస్తాయి మరి!” అన్నాడు ఎడ్డెం ఎంకటేసర్లు.

తేగయ్య చిన్నగా నవ్వాడు. “అది కొంతవరకూ నిజమే. కానీ పూర్తిగా కాదు. అంధ్రప్రదేశ్ అవతరించి నప్పటినించీ చూస్తే, హెచ్ ఎం టి, బి హెచ్ ఇ ఎల్, ఇ సి ఐ ఎల్, డిఫెన్స్ లాబరేటరీలు లాటి ఎన్నో పెద్ద పెద్ద గవర్నమెంట్ పరిశ్రమలు, ఇంకా ఎన్నో ప్రైవేటు పరిశ్రమలు... అన్నీ హైదరాబాద్ లోనే పెట్టారు. విశాఖపట్టణంలో సముద్రం వుంది కాబట్టి షిప్ యార్డ్ లాటివి, కొన్ని తదితర పరిశ్రమలు పెట్టారు కానీ, మిగతా ప్రాంతాల్లో ఎక్కడా ఏ పరిశ్రమా లేదు. ఉదాహరణకి తెలంగాణలోని మహబూబ్ నగర్ లోనో, ఆదిలాబాద్ లోనో, రాయలసీమలోని అనంతపురంలోనో, కర్నూలులోనో, కోస్తా జిల్లాలలోని గుడివాడలోనో, చీరాలలోనో ఇంజనీరింగ్ చదువుకున్న వారికి పరిశ్రమలలో ఉద్యోగాలు కావాలంటే, హైదరాబాద్ కానీ, చెన్నైకానీ, ముంబై కానీ వెళ్లవలసిందే. లేదా అమెరికా వుండనే వుంది. ఇలాటి అసంతృప్తులు ఒక్క హైదరాబాద్లో తప్ప ఆంధ్రప్రదేశమంతా వున్నాయి. దానికి పరిష్కారం విడిపోవటం కాదు. తమిళనాడు, మహారాష్ట్రలలోలాగా అన్ని ప్రాంతాల్లోనూ గవర్నమెంట్ పరిశ్రమలే కాక, ప్రైవేటు పరిశ్రమల్ని కూడా వచ్చేటట్లు రాయితీలు ప్రకటించటం. స్థాపించటం. అంతేకానీ మొత్తం ప్రాంతాన్ని విడగొడితే ఏమీ లాభం లేదు, ఎంతో దగ్గరగా వున్న తెలుగు కుటుంబాలని దూరం చేయటం తప్ప

ఎడ్డెం ఎంకటేసర్లు వెంటనే అన్నాడు. “అవును మరి హైదరాబాద్ మన రాజధాని కదా. అందుకే అన్ని పరిశ్రమలూ అక్కడ పెట్టింది. దాంట్లో తప్పేముంది?”

తప్పేమీ లేకపోతే అసంతృప్తులు ఎందుకొస్తాయి. అందుకే తెలంగాణ విడిపోయేటట్టయితే, హైదరాబాద్ మాకు కావాలంటే మాకు కావాలని పోట్లాడుకోవటం

అవును హైదరాబాద్ తెలంగాణాలోనే వుంది కదా. వాళ్ళకే ఇవ్వటం సమంజసంఎంకటేసర్లు అన్నాడు.

ఒకప్పుడు అంతే కానీ ఇప్పుడు కాదు. హైదరాబాద్ ఒక్క తెలంగాణాదే కాదు. తెలుగు వారిదే కాదు. తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠి ఇలా అన్ని రకాలవారు వున్నారు. వీళ్ళందరూ ఎంతమంది వున్నారంటే, తెలంగాణా ప్రజలకన్నా ఎన్నో రెట్లు ఎక్కువమంది వున్నారు. అంతేకాదు, వాళ్ళల్లో చాలమంది కొన్నికోట్ల రూపాయలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, వ్యాపారాలు నడుపు తున్నారు. ఎంత పెట్టుబడి అంటే తెలంగాణా పెట్టుబడులకి ఎన్నో రెట్లు ఎక్కువగా. మరి అలాటప్పుడు వాళ్ళ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు ఏమయిపోతాయి? వాళ్ళందరూ అక్కడ అంత డబ్బూ పెట్టి బయటవారిలా వుండవలసిందేనా? అందుకే వాళ్ళందరూ అనేది ఒకవేళ తెలంగాణ విడిపోతే హైదరాబాద్, చండీఘర్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ క్రింద వుండాలని

మరి తెలంగాణ ఏమవుతుంది?”

ఏమవుతుంది. ఆంధ్రాలాగా, రాయలసీమలాగా, తెలంగాణ కూడా పారిశ్రామికరంగంలో కొత్త జీవితం ప్రారంభించాల్సిందే. ఎవరి రాష్ట్రం గురించి వాళ్ళు చూసుకోవద్దూ!”

ఇలా అన్ని ప్రాంతాల్లోను పరిశ్రమలు లేకపోవటానికి కారణం కోస్తాజిల్లాలు, రాయలసీమనించీ వచ్చిన మంత్రులే అని అంటున్నారు తెలంగాణా వాదులు. మరి దానికేమంటావ్?” ఎంకటేసర్లు అడిగాడు.

అంటారు కానీ... ఎవరేం చేశారో చూద్దాం. అరవైలలో అన్ని పరిశ్రమలు హైదరాబాద్లో పెట్టటానికి కారణం గుంటూరు జిల్లానించీ ఎన్నికైన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. ఈమధ్య సాఫ్ట్వేర్ పరిశ్రమ రావటానికి కారణం చిత్తూరునించీ వచ్చిన చంద్రబాబు, కడపనించీ వచ్చిన రాజశేఖరరెడ్డి. తెలంగాణనించీ వచ్చిన వారిలో ఒక్క వెంగళరావు తప్ప, చెప్పుకోదగ్గ పరిశ్రమలు తెచ్సినవాళ్ళు ఎవరూ లేరు. చెన్నారెడ్డి, అంజయ్య... ఇలా ఎంతోమంది స్వంతలాభాలు చూసుకున్నారు కానీ, హైద్రాబాదేతర తెలంగాణలో ఒక్క పరిశ్రమని కూడా తేలేదు. రాజకీయ నాయకులు ఏ ప్రాంతం వారైనా, వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు కానీ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లోని బాగోగులు, తగిన వసతులు, ఉద్యోగాలు చూసే దిక్కు లేదు. అలాటప్పుడు సగటు మానవ జీవితాల నించీ వేర్పాటు చేయవలసింది వాళ్ళని కానీ, వసుధైక కుటుంబమైన మన ఆంధ్రప్రదేశ్ కాదుతేగయ్య ఆవేశంగా అన్నాడు.

మరి ఆంధ్రా ప్రాంతంలో ఎన్నో వ్యాపారాలు వున్నాయి కదా.. మిగత చోట్ల లేవెందుకని?”

అవి అ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలని బట్టి, కొనుగోలు శక్తిని బట్టి, వనరులని బట్టి వుంటుంది. ఆంధ్రా ప్రాంతంలో వున్నవి తెలంగాణాలో లేవు. తెలంగాణలో వున్నవి రాయలసీమలో లేవు. రాయలసీమలో వున్నవి ఆంధ్రాలో లేవు

అయితే ఇప్పుడు నువ్వేమంటావ్? ప్రత్యేక తెలంగాణా ఇవ్వాలంటావా? వద్దంటావా? నీతో వచ్చిన గొడవ ఏమిటంటే నువ్వేదీ తేల్చి చెప్పవు తేగయ్యా!” అన్నాడు ఎడ్డెం ఎంకటేసర్లు.

నాకు ఆకలేస్తున్నది బాబూ. నేను వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒక్క మాట. అమెరికా అంతరిక్షంలోకి పంపించిన కొలంబియా స్పేస్ షటిల్లో పయనించి, మరణించిన భారతీయురాలు కల్పనా చావ్లా అంతరిక్షంలోనించీ భూగోళాన్ని చూస్తూ ఏమందో తెలుసా. నాకు ఇక్కడ్నించీ ఎంతో అందమైన నీలం రంగు భూమాత కన్పిస్తున్నది. కానీ నాకు అక్కడ మన మనుష్యులు గీసుకుంటున్న గీతలు మాత్రం ఎంత వెతికినా కనపడటం లేదని

అంటూనే లేచి భుజాన తువ్వాలు వేసుకుని చకచకా చీకట్లో కలిసిపోయాడు తెడ్డెం తేగయ్య.

 

 

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech