శీర్షికలు  
      సంగీత సౌరభాలు - 2
 - రచన: సంగీతాచార్య డా|| వైజర్సు బాలసుబ్రహ్మణ్యం
 
 

వాలాజాపేట తాళపత్రములు, వ్రాతప్రతులు

సంగీత శాస్త్ర వికాస క్రమంలో అతి ప్రాచీన కాలంలోనూ, అత్యర్వాచీన కాలంలోనూ కూడా సౌరాష్ట్రం నిర్వహించిన పాత్ర స్తుతిపాత్రమౌతున్నది. అనేక కారణాల వల్ల ఘార్జర, సౌరాష్ట్ర ప్రాంతాల నుండి దక్షిణాదికి సౌరాష్ట్రుల వలన 16 శతాబ్దినాటికే ప్రారంభమై క్రమంగా మదురై, చెన్నై, వాలాజాపేట, బెంగుళూరు ప్రాంతాల్లో స్థిరపడింది. భాషా సాంస్కృతిక రంగాలలో వలస దక్షిణ ప్రాంతీయ సంస్కృతిలో మిళితమై నూతనావిష్కారాన్ని పొందింది.

ప్రస్తుతపు దక్షిణాది సౌరాష్ట్ర సమాజం మూలకందం నుండి విడివడి, సాంస్కృతిక పరంగా కొంత స్వయం ప్రతిపత్తిని కూర్చుకున్నది. నేటికీ వారి భాషలోనూ, సంస్కృతిలోనూ తెలుగుదనం, ప్రాంతీయత తొంగిచూస్తూనే ఉన్నవి. వారి మౌఖిక సారస్వతంలోనూ, ఆటల్లో, పాటల్లో, కథల్లో, గాథల్లో, చివరకు అవసాన సమయాల్లో వారు ఆలపించుకొనే ‘మాథవుడు గీతు’ అనే తెలుగు పాటలోనూ ఈ విషయం స్పష్టమవుతున్నది.

ఈనాటి దాక్షిణాత్య సౌరాష్ట్ర సాంస్కృతిక వికాసానికి మూలపురుషులైన మేథావుల్లో వాలాజాపేట వేంకటరమణ భాగవతులు ప్రముఖులు. వీరు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ప్రియశిష్యుల్లో అగ్రగణ్యులు. వారూ, వారి సంతతివారూ, స్వామివారున్నంత కాలం వారిని ప్రత్యక్షంగా సేవించుకుంటూ, వారి సంగీత ప్రతిభా వారసత్వాన్ని తర్వాతి తరాల వారికి అక్షరాలా అనితర సాధ్యమైన రీతిని పరిరక్షించి అందించిన మహనీయులు.

స్వామివారు శ్రీరామతత్పరులై పాడుతుండగా వింటూ, నేర్చుకుంటూ, వాటన్నిటినీ సస్వరం చేసి మనకందించడంలో శ్రీ వేంకటరమణ భాగవతులు, వారి వారసులు గావించిన కృషి నిత్య స్మరణీయము. వాటి దాఖలాలు మనకు సద్గురు త్యాగరాజ స్వామివారి కృతులు 711 వరకైనా అచ్చులో కనిపిస్తున్నాయంటే ఆ కీర్తిలో అధికభాగం ఈ సౌరాష్ట్ర సమాజం వారికే దక్కుతుంది.

మదురై సౌరాష్ట్ర సభవారి గ్రంథాలయం ప్రధానంగా వాలాజీపేట వేంకటరమణ భాగవతులు, ఇతరులు బహుకాలంగా భద్రపరిచినవీ, వారి వారసుల సౌజన్యంతో అక్కడికి చేరినవి, అనగా సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారికి, వారి శిష్యవర్గానికి ప్రత్యక్ష సంబంధం గల లిఖిత గ్రంథాలకు గ్రంథాలయం తరగని గని.

వ్యక్తిగతంగా చాలా పెద్ద మొత్తంలో సమకూర్చుకున్న సంగీత గ్రంథాల నిధి సౌరాష్ట్ర సభలో ఉన్నది. క్రీ.శ. 1600 నుండి 1900 సంవత్సరముల మధ్యగల కాలమునకు సంబంధించిన సంగీతము మరియు ఇతర విషయముల వ్రాతప్రతులు ఈ సేకరణలో భాగమై ఉన్నవి. సంగీత శాస్త్ర గ్రంథాలు, సస్వరంగా ఉన్న వాగ్గేయకారుల రచనలు ఎన్నో అధిక సంఖ్యలో ఉన్నాయి. సాహిత్యం మాత్ర్తం గల ఇతర వాగ్గేయకారుల రచనలూ ఉన్నాయి. వీటిలో చాలా రచనలు, లక్షణ గ్రంథములు అముద్రితాలే.

సేకరణలోని వ్రాతప్రతులలో చాలా భాగము తెలుగు లిపిలోను, కొన్ని సంస్కృత, తమిళ, కన్నడ, సౌరాష్ట్ర గ్రంథ లిపులలోనూ ఉన్నాయి. ఈ సేకరణలలో సంగీత సాహిత్య గ్రంథాలే అధికమైనా జ్యోతిషం, గణితం, వైద్యం, ఛందస్సు, వ్యాకరణం, జీవితచరిత్ర వంటి యితర విషయాలు కూడా ఉన్నాయి. సంగీతంలో సస్వరంగా ఉన్నవీ, సాహిత్యం మాత్రమే కలవీ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలే అధికంగా ఉన్నా, పురందరదాసు, భక్తరామదాసాదుల రచనలు, వేంకటసూరి ప్రభృతుల కృతులూ, జయదేవుని అష్టపదులూ, క్షేత్రయ్య పదాలూ, వగైరాలు, కృష్ణమాచార్య, తాళ్ళపాక అన్నమాచార్యాది కీర్తనలు మొదలుకొని మైసూరు సదాశివరావుగారి వరకూ గల కొందరు వాగ్గేయకారుల రచనలూ ఉన్నాయి.

సేకరణలలో చాలా భాగం త్యాగరాజ స్వామి వారి మాతామహులనాటి నుంచీ - అనగా తంజావూరు ఆస్థాన విద్వాంసులైన వీణ కాళహస్తయ్యగారి ద్వారానూ, స్వామివారి గురువులైన శొంఠి వేంకటరమణయ్య గారి ద్వారానూ శ్రీ త్యాగరాజస్వామివారికి సంక్రమించినవీ, మరెన్నో తాము స్వయంగా సమకూర్చుకున్నవీ - ఇందులో ఉన్నాయి. ఇవే అనంతర కాలంలో స్వామివారి ప్రియ శిష్యులైన వాలాజీపేట వేంకటరమణ భాగవతుల వారికీ, వారి కుటుంబ సభ్యులకూ చెందగా, వారే వీటిని బహుకాలం భద్రపరచి, మరింతగా ఆ గ్రంథాలయాన్ని పెంపొందించినారు.

ఇలా వేంకటరమణ భాగవతులు, వారి కుమారులు కృష్ణస్వామి భాగవతులు, మనుమడు రామస్వామి భాగవతులు నిక్షేపించుకొన్న అమూల్య గ్రంథ ఇధియే మదురై సౌరాష్ట్ర సభ మ్యూజియం అండ్ సాహిత్య పరిషత్ వారికి గత శతాబ్ది ఐదో దశకంలో వచ్చి చేరినవి. ఈనాడు త్యాగరాజస్వామి వారి జీవిత విశేషాలను గురించీ, సంగీత రచనలను గురించీ ప్రామాణిక సమాచారం ఇంత మాత్రమైనా మనకు అందినదంటే అది ఈ సౌరాష్ట సమాజం వారి కృషి ములంగానే అని చెప్పాలి. రామస్వామి భాగవతుల నిర్యాణానంతరం అక్కడి వ్రాతప్రతులు కలగలుపులై కొన్ని చేతులు మారుతున్న సందర్భంలో సౌరాష్ట సమాజం వారి అధీనంలోకి వచ్చినవి.

వాలాజాపేట వారి వ్రాతప్రతులు కొత్తగా వెల్లడై సంగీత ప్రపంచంలో నూతనోత్తేజాన్ని కలిగించినవి. అప్పటిలో వాటిని తిలకించి విశదంగా నోట్సు తీసుకున్న వారిలో ఆచార్య పి. సాంబమూర్తిగారూ, ఆచార్య విస్సా అప్పారావు పంతులుగారూ ప్రముఖులుగా ఉన్నట్లు లిఖితాధారాలను బట్టి తెలియవస్తోంది.

ఆచార్య సాంబమూర్తిగారు మదురై సౌరాష్ట్ర సభను సందర్శించినపుడు కూర్చిన 53 అంశాల రిపోర్టు అక్కడ ఇప్పటికీ ఉన్నది. దానికే ముందు వెనుకల మరికొంత సమాచారాన్ని చేర్చి మద్రాసు మ్యూజిక అకాడమీ జర్నల్ వాల్యూం 18 (1-4) 1947 లో వారొక సుదీర్ఘమైన వ్యాసాన్ని ప్రకటించారు. అందులో వారు గుర్తించిన కొన్ని ముఖ్యాంశాల వివరణకిది తెలుగు పరివర్తనము. ఈ సేకరణలోని ముఖ్య అంశములు ఈ దిగువ పేర్కొనబడినవి.

1. తెలుగు, సంస్కృత వ్యాకరణం : ఈ వ్రాతప్రతి చివరగల ఆకులో త్యాగరాజస్వామి వారి, వేంకటరమణ భాగవతుల వారి జన్మతిథులున్నవి. దానిమీద భాగవతుల శిష్యులైన కవి వేంకటసూరి సంతకమున్నది. ఈ వేంకటసూరియే సంస్కృత నౌకాచరిత్ర కర్త. ఈ చక్కని కృతిని సౌరాష్ట్ర సభవారు ప్రకటించిరి. ఈ తాళపత్రం ప్రకారం త్యాగరాజస్వామివారు కలిశకం 4868న సర్వజిత్ చైత్రమాసంలో 25వ నాడు (వైశాఖ శుద్ధ సప్తమి) జన్మించినట్లున్నది. ఇది క్రీ.శ. 1767 మే నెల 4వ తేదీకి సరియగును. కుత్తాళం సువడి కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అధికంగా స్వామివారి జాతకచక్ర వివరాలను అందిస్తుంది. కుత్తాళం సువడి స్వామివారి జీవితకాలంలోనే రచితమైనది గనుక ఆ వివరాలను స్వామివారు చూసి ఆమోదించి ఉంటారనే భావించవచ్చును. దీనినిబట్టి స్వామివారు జ్యోతిషశాస్త్రంలో కూడా దిట్టయని చెప్పవచ్చును. కుంభకోణం ఆరావముద అయ్యంగారు, పొట్టి జోస్యులు తరచు స్వామివారిని కలిసి జ్యోతిష శాస్త్రాధ్యయనం చేసేవారు.

2. లఘు, గురు, ఛందస్సు: ఛందో విషయ రచన

3. లక్షణ గీతాలు - మేళ రాగాలకు, జన్య రాగాలకు లక్షణ గీతాలున్నవి. ఇప్పటి 72 మేళకర్తల విషయమిందున్నది.

4. తాళార్ణవం - తాళశాస్త్రం - సంస్కృతంలో శ్లోకాలు, వాటికి తెలుగు టీక కలవు.

5. సంగీత రత్నాకరం - సోమనాథస్వామి విరచితం. ఇది సార్ జ్ఞదేవుని సుప్రసిద్ధ రచన కన్నా భిన్నమైనది. ఇందులో స్త్రీ రాగాలు, పురుష రాగాలు, గాయక దోషాలు, గాయక గుణాలు మొదలైన అంశాలున్నవి.

6. దేవతానామ మహాత్మ్యం

7. ఫలరత్నమాలికా

8. వాస్తు పుస్తకం (గృహ నిర్మాణ శాస్త్రం)

9. కళా శాస్త్రం

10. వైద్య గ్రంథం - ఇందులో 126-130 పత్రాల్లో గాయత్రీ కవచం, నవగ్రహ గాయత్రి, సూర్య గాయత్రి, చంద్ర గాయత్రి, కేతు గాయత్రి కలవు.

11. ఇందులో గీతాలు, చౌకవర్ణాలు, తానవర్ణాలు, స్వరసహితములైన పాటలు కొన్ని దీక్షితులవారి ‘స్వామినాథ పరిపాలయ’, ‘అనంత బాలకృష్ణ’ అనేవి, మాయామాళవగౌళ లో ‘రవికోటి తేజ’ అనే లక్షణ గీతం, శ్యామశాస్త్రుల వారి కృతులు కొన్ని కలవు.

12. కుత్తాళం సువడి - త్యాగరాజస్వామి వారి కృతుల సాహిత్యం గల ప్రసిద్ధమైన తాళపత్ర గ్రంథమిది. ఇందులోని కృతులన్నీ మేళకర్త రాగాల వరుసలో రాగతాళాల చేత సంకేతింపబడినవి. ఈ గ్రంథంలోనే స్వామివారి శిష్య ద్వయం తంజావూరు రామారావు, వేంకటరమణ భాగవతులు కలసి కూర్చినట్టి వాగ్గేయకార శిరోమణియైన స్వామివారి జీవితచరిత్ర కథనం కూడా ఉన్నది. దాని చివర ఆ ఇద్దరు శిష్య్లుల సంతకాలున్నవి. జాన్సన్ కి బాస్వెల్ మహాశయుడెలాగో, స్వామివారికి వేంకటరమణ భాగవతులు అలాగు అని చెప్పాలి. ఆయనే స్వామివారికి వ్రాయసకాడుగా వ్యవహరించేవారు. స్వామివారికన్నా ముందుగానే తంజావూరు రామారావు పరమపదించెను. కాబట్టి ఇద్దరి సంతకాలూ గల ఈ తాళపత్ర ప్రతి సంపూర్ణంగా స్వామివారి జీవితకాలంలోనే రచితమైనదనడానికి సందేహం లేదు.

స్వామివారి జాతకచక్రం, గ్రహ, రాశి, జన్మ నక్షత్రాది వివరాలతో సహా సలక్షణంగా కూర్పబడి ఉండడం ఈ తాళపత్ర ప్రతిలోని విశేషం. వాలాజాపేట వారి గ్రంథ సంచయంలోనే ఇది కూడా ఉంది. కాని, ఎప్పుడో ఆ తరువాతి కాలంలో అది ఒకసారి చేతప్పిపోవడమూ, అదృష్టవశాత్తూ కుత్తాళంలోని ఒక పెద్ద మనిషి నుండి సౌరాష్ట సభవారు ఆ తాళపత్ర ప్రతిని తిరిగి చేజిక్కించుకోవడమూ జరిగింది. అందుకే ఆ తాళపత్ర గ్రంథానికి ‘కుత్తాళం సువడి’ అనే పేరు స్థిరపడిపోయింది.

(సశేషం)


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech