సారస్వతం  
    
     సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (9వ భాగం)
 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil

 
14. శ్వాన పుచ్ఛ న్యాయం:
శ్వానం= అనగా కుక్క.పుచ్చం= అనగా తోక కుక్కతోక అనిఈన్యాయానికి అర్థం.
ఇదే తెలుగులో “కుక్కతోక వంకర”అని వాడుక. కుక్క తోకని తిన్నగా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా దాని వంకరపోదు.”ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు.”అని వేమన అన్నట్లు, వంకర గుణాలు,వక్ర బుద్ధి ఉన్నవారిలో ఎంత ప్రయత్నించినా మార్పు రాదు. ఈశ్లోకం చూడండి.


“పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః
న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః”

సహజంగా మానవులు పుణ్యం చేయరు కాని, పుణ్య ఫలాన్ని కోరుకొంటారు.కావాలని పాపం చేస్తార.ు కాని పాప ఫలం కోరుకోరు. ఎంత విచిత్రం! మనిషికి కావలసిన సుఖం,అనందం కేవలం డబ్బు సంపాదనవల్ల మాత్రమే అనుకొంటారు.కాని చిన్ని,చిన్నిసంఘటనల వల్ల కుడా ఆనందాన్ని పొందవచ్చు.అని అనుకోరు.

ఉదా:-“కుటుంబంలో అందరుకలిసి వెన్నెట్లో కూర్చొని మాటాడుకోవడం, కలసి భోంచేయడం, చిన్నపిల్లల బోసినవ్వులు చూడడం, వాళ్ళతో కలసి ఆడుకోవడం, వనవిహారం చేయడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, మంచివారితో స్నేహం చేయడం, వికసించే పుష్పాలు, జలపాతాల గలగలలు, పక్షుల కిలకిలా రావాలు,నక్షత్రాల మిలమిలలు, ఉదయ కాలంలోఆకుమీద పడి క్రిందికి జారే మంచు బిందువు సోయగాలు, తొలకరి జల్లు భూమిపైన పడినపుడు వచ్చే మట్టి వాసనలు, ఇలాంటి ఎన్నో, మరెన్నో ప్రకృతి లోని అందాలని ఆస్వాదించడం వంటి వాటి వల్ల కుడా ఎంతో ఆనందాన్ని, సుఖాన్ని పొందవచ్చు.అన్నిటికి మించి “తృప్తి”కి మించిన ఆనందం మరొకటి లేదు. “తృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపంబునైన చక్కంబడునే” అంటాడు పోతన. కాని ఈనాటి సమాజంలో మానవుడు దురాశకు పోయి, వక్ర మార్గంలో ధన సంపాదన చేస్తూ, కష్టాలని,అనారోగ్యాన్ని, అశాంతిని కొని, “నిజంగానే డబ్బుతో కొని” తెచ్చు కొంటున్నాడు.

ఎన్ని సుభాషితాలు విన్నా,వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు “దురాశ”ను గురించి వివరించినా “శ్వానపుచ్ఛ” న్యాయంలా బుద్ధిని మార్చుకోటం లేదు. ఈ దురాశను గూర్చి చిన్నకధ చెప్తాను.

”పూర్వం ఓ బాటసారి తన ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళడానికి ఓ అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ, ఎండ ఎక్కువగా ఉన్నందున అలసిపోయి, దారిలో ఉన్న ఓ చెట్టుక్రిందకి వెళ్లి కూర్చుంటాడు. కొద్ది సమయం అయ్యాాక మనసులో కోరికలు కలగడం ప్రారంభం అవుతాయి. అవి ఇలా ఉంటాయి. “ చాలా దాహంగా ఉంది, చల్లని నీళ్ళు ఉంటే బాగుంటుంది అనుకొంటాడు. అతడు కూర్చున్న వృక్షం “కల్పవృక్షం”వంటి దేవతా వృక్షం. దాని క్రింద కుర్చుని ఏదికోరితే అది జరుగుతుంది. ఆ సంగతి బాటసారికి తెలియదు. అతడు నీళ్ళు కోరేడుకదా! వెంటనే అతని ముందు ఒక పాత్రలో నీళ్ళు ప్రత్యక్షం అయాయి. అతడు ఆశ్చర్యపడి, వాటితో దాహం తీర్చుకొంటాడు. తరువాత దాహం తీరింది, మంచి భోజనం ఉంటే ఆకలి కుడా తీరుతుంది అనుకొంటాడు.


వెంటనే పంచ భక్ష్యాలతో భోజనం వస్తుంది. హాయిగా భుజిస్తాడు. వెంటనే నిద్ర వస్తోంది మంచం పరుపు ఉంటే బాగుంటుంది కదా! అని అనుకొంటాడు.అవి కూడా వస్తాయి.ఆశ అధికం అయితే దురాశ అవుతుంది. ఆహా మంచం పరుపూ ఎంత సుఖంగా ఉన్నాయి, ఇప్పుడు నాభార్య పక్కన ఉండి సపర్యలు చేస్తుంటే ఇంకా ఎంతో సుఖంగా ఉంటుంది కదా! అనుకొంటాడు. వెంటనే భార్య ప్రత్యక్షం అవుతుంది. (అంతటితో ఆ బాట సారి ఊరుకోవచ్చు కదా!) అరె! నిజంగా ఇది నా భార్యా లేక ఏదో భూతం నన్ను తింటుందేమో! అనుకొంటాడు. వెంటనే అతడి భార్య దెయ్యంగా మారి అతడిని మింగి మాయం అవుతుంది.” దురాశ దు:ఖానికి చేటు. అన్నదానికి ఈ కథ చక్కని ఉదాహరణ.

మనసులో ఒక చెడ్డ ఆలోచన ఉంటే దానిని ఎవరూ పోగొట్టలేరు. అని పై న్యాయం చెపుతుంది. పెద్దలు చెప్పిన మరో చిన్న పురాణ గాధ ద్వారా ఈన్యాయాన్ని ఇంకా వివరిస్తాను.(ఇది కల్పిత కథ)


“రావణుడు సీతని తెచ్చి లంకలో ఉంచుతాడు.విభీషణుడు, కొంతమంది మంత్రులు, మండోదరి,చివరికి కుంభకర్ణుడు కూడా, సీత విషయంలో తప్పుచేసావు అంటే ఒప్పుకోడు.రామునితో యుద్ధానికి కూడా సిద్దపడతాడు.ఇది అందరికి తెలిసిన విషయమే. ఆ సమయంలో ఒకసారి పాతాళ లోకంలో ఉన్న ప్రహ్లాదుని మనుమడు, తన ముత్తాత అయిన “బలిచక్రవర్తి” వద్దకు రావణుడు వెళ్తాడు. ముని మనుమని రాకకి బలి సంతసించి కుశల ప్రశ్నలు వేసి ఇలా అంటాడు.”రావణా నా పూజా మందిరంలో ఒక చేతి కంకణం ఉంది, దానిని కొంచం తెచ్చిపెట్టు” అంటాడు.అలాగే అని రావణుడు పూజా మందిరంలోకి వెళ్లి,”రత్న ఖచిత సువర్ణమయ” కంకణాన్నిచూసి దానిని తీయ బోతాడు, కాని అది పైకి లేవదు. రెండు చేతులతో పట్టుకొని ఎత్తబోతాడు, కొంచం కూడా కదలదు. ఆశ్చర్యపడి తన బలమంతా ఉపయోగిస్తాడు, అయినా కూడా అది కదలదు. తాతగారి వద్దకి వచ్చి.”తాతగారు! అది ఎవరి కంకణం? కైలాసాన్నే కదల్చగలిగిన నాబలం ఆ చిన్న కంకణాన్నిఎందుకు కదల్చ లేక పోయిందో” తెలుపమని అడుగుతాడు. అప్పుడు బలి ఇలా చెపుతాడు.

రావణా! నా ముత్తాత గారు అయిన హిరణ్య కశిపుని సంహరించిన సమయంలో నృశింహ రూపంలో వచ్చిన శ్రీ హరి చేతి నుండి జారిన కంకణం అది. దానిని మా తాతగారైన ప్రహ్లాదుల వారు నాకొసంగి, నిత్యం పూజించు కోమని చెప్పారు. అట్టి పవిత్రమైన ఆ చిన్ని కంకణాన్నేకదల్చలేని నీవు శ్రీహరి అవతారమైన శ్రీరామునితో పోరాడి ఎలా గెలవగలవు., కనుక సీతని విడచి రాముని శరణు వేడు.”అని హితాన్ని చెపుతాడు బలి. గర్వ భంగం చెంది కూడా, పెద్దల మాటను పెడ చెవిని పెట్టి “శ్వానపుచ్ఛ”న్యాయంలా ఎవరిమాట వినక రావణుడు నశిస్తాడు. ఇది ఈన్యాయాన్ని వివరించే కథ. మనం మన బుద్ధిని పై న్యాయంలా ఉండకుండా జాగ్రత్తగా ఉంచుకొందాం.

(వచ్చే నెల మరి కొన్ని)


(సశేషం.)
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech