సారస్వతం  
    

         శకుంతల (పద్యకావ్యం)

                          రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ  

 సు రం ని   పా కు    కో సం   సు రు చి   కా  వ్య థాం శం

డా. యా చి తం  టే శ్వ  ర్మ  లం  నుం డి   జా లు వా రి    తా జా   ద్య కా వ్యం   ` కుం   `

  మీ ముం దు  ని లి చిం ది  !    వం డి  !! 

 ప్రథమాశ్వాసం        

            సకలజగద్వినిర్మితికి చాలిన మూలము యజ్ఞ వస్తువున్

            సుకరణశీలి రేబవలుసూచిక వింకిడిచోటు బీజముల్

            ప్రకటితమైన నేల ఇల ప్రాణుల జీవము నిల్పు గాలి యీ

            ప్రకరత రూపముల్ జెలగి భాసిలు వానిని గొల్తు నీశ్వరున్ !

       
వ్యాఖ్యానం:  

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల నాటకం జగత్ప్రసిద్ధం. ఆ నాటకాన్ని చదివి తన్మయుడనైన నేను నాటకాన్ని పద్యకావ్యంగా రచిస్తే బాగుంటుందని భావించాను. కానీ కావ్యరచన అంటే సామాన్యమైంది కాదు. నా సామర్థ్యం అంతంత మాత్రమే అని తెలిసినా, నాటకం నన్ను ఎంతో ప్రభావితం చేసిన కారణంగా కావ్యంగా మలచడానికి సాహసించాను. ఈ కావ్యం కాళిదాస నాటకానికి చాలా వరకు అనువాదప్రాయం. అక్కడక్కడ నా స్వాతంత్ర్యం కూడా చోటు చేసుకుంది. దాని ఫలితమే మీ ముందున్న కావ్యం. శివుని అష్టమూర్తి వర్ణనతో కాళిదాసు నాటకాన్ని  ప్రారంభించాడు. కనుక నేనూ అలాగే అష్టమూర్తి వర్ణనానువాదంతో  ప్రారంభిస్తున్నాను-

  
సకల సృష్టి రచనకు మూలమూలమైంది నీరు. యజ్ఞానికి కావలసిన ప్రధాన వస్తువు హవిస్సు. అది అగ్నిరూపం. యజ్ఞం చెసేవాడు యజమాని. రాత్రింబగళ్ళను కల్పిస్తున్నవాళ్ళు సూర్యచంద్రులు. శబ్దగుణానికి మూలమైంది ఆకాశం. సమస్త బీజాలూ మొలకెత్తడానికి మూలమైంది నేల. ప్రపంచంలో ప్రాణుల ప్రాణాలు నిలుపుతున్నది గాలి. ఇలా మొత్తం ఎనిమిది రూపాలు. అంటే - నీరు, హవిస్సు, యజమాని, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, వాయువు, అనేవి శివుని అష్టమూర్తులు. ఎనిమిది రూపాలలో వెలుగొందుతున్న ఈశ్వరుణ్ణి కొలుస్తాను అని ఇష్టదేవత ాప్రార్థనతో కావ్యం ప్రారంభమౌతొందని తాత్పర్యం. ఇలా కాళిదాసశ్లోకాన్ని అనువదించినా తనివి తీరక ఆదిదంపతులైన ఉమామహేశ్వరులను మరొక పద్యంలో ఇలా నేను స్తుతిస్తున్నాను-

           అరుణసుధాంశు బింబములు నద్వయమందినవో,తపమ్ములున్

           వరఫలరాజముల్ గలిగి భాసిలునో, సకలైహికమ్ములౌ

           నిరుపమ సౌఖ్య జాలములు నిండగు పుణ్యసుధాస్రవంతులై

           విరిసినవో యనన్ వెలుగు వేల్పుల గొల్తు నుమామహేశులన్ !

                
వ్యాఖ్యానం:

ఉమామహేశ్వరులు సూర్యచంద్రులవలె అద్వయస్థితిలో ఉన్నారు. సూర్యుడు ఈశ్వరుడైతే, చన్రకళ ఉమాదేవి. అంతేగాక వాళ్ళిద్దరూ తపస్సు, తప:ఫలాల వలె  ఉన్నారు. పార్వతి తపోరూపిణి ఐతే ఈశ్వరుడు తపస్సుకు ఫలంవంటి వాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఇహలోకంలోని సకలసౌఖ్యాలకూ పుణ్యామృతఝరీతరంగాలు తోడైతే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. అలాంటి వేల్పులైన ఉమామహేశ్వరులను కొలుస్తాను అని అనువక్త ఐన కవి ఇష్టదేవతాప్రార్థన చేస్తున్నాడు పద్యంలో.

          

కవికులముల గురువు కాళిదాసుని నోట

నిల వెలింగె నేది లలితచరిత

దాని తెలుగు సేయ తపియింప హృదయమ్ము

పలుకుచుంటి కావ్యభక్తి నెరిగి                    3


వ్యాఖ్యానం:

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం లలితభావాలతో కూడిన చరితం. అంటే నాటకంలోని నాయిక శకుంతల లలితమైంది.దుష్యంతుడు కళాపిపాసి కనుక అతడూ లలితుడే.ఖణ్వుడు మొదలైన మునిపుంగవులు కారుణ్యంచేత లలితులు.

శకుంతల చెలులు అనసూయా ప్రియంవదలు లలితహృదయలు. ఇలా సకలలలితుల చరిత్రలతో కూడిన కావ్యం లలితచరితాత్మకం. అనువదిస్తున్న కవిహృదయం కావ్యకళాభిమానంతో లలితమైంది. కనుకనే నాటకాని లలితకోమలమైన తెలుగుభాషలోనికి అనువదించాలని కవిహృదయం తపించింది. అలా తపించిన  కవి కావ్యభక్తిని కూడ కలిగి ఉండడం చేత ఇలా పద్యరూపంలో రాయదానికి పూనుకున్నడు. విషయాన్నే పద్యంలో విన్నవించాడు.

ఇచ్చ తీరు పలుకు దెందెందు రమ్యత

విచ్చుకొనుచు మదికి విందు సేయు

మూలమునకు మక్కి కేలిక నుండదు

వీలు తీరు సాగు విపుల రీతి                      4


వ్యాఖ్యానం:

అనువాదరచన కవి మనోగతమైన విశ్లేషణకు అనుగుణంగా రమణీయతను అనుసరిస్తూ సాగుతుందని కవిమాట. అంటే ఎక్కడెక్కడ రమణీయఘట్టాలు విరబూసి సహృదయుల మనస్సులకు విందు చేస్తాయో ఆయా ఘట్టాలను వదలకుండా ఈ కావ్యాని రచిస్తాను అని కవి చెబుతున్నాడు. అందువల్లనే మూలానికి మక్కికి మక్కిగ ఉండదని స్పష్టం చేస్తున్నాడు. కవి అనుకున్న వీలును బట్టి ఈకావ్యం విపులతను సంతరించుకుంటుంది. ఇలా ఈ కవి ఈ కావ్యంలో తన రచనారీతిని తెలియజేశాడు.

 

ఒక వరపుత్రి వాణివలె నొక్క సుపుత్రిక లక్ష్మి వోలె నిం

కొక కనుపాప పార్వతిగ నొప్ప సమర్పణజేతు నీ కృతిన్

ప్రకటితజేసి భవ్యగుణభాసురలీలల ఖేలనంబులన్

వికసితమానసుండనయి ప్రీతి సుతాత్రయి కక్షరంబుగన్


వ్యాఖ్యానం:

కవి తాను రచించిన కావ్యాన్ని తన ముగ్గురు వరపుత్రికలకు అంకితం చేస్తున్నాడు.
ముగ్గురు పుత్రికలలో మొదటి పుత్రిక వాణివలె అంటే సరస్వతీదేవి వలె ఉంది. రెండవ పుత్రిక
లక్ష్మి వలె ఉంది. మూడవ కనుపాప అంతే కంటిపాపలా చూసుకొనే తన మూడవ కూతురు పార్వతి వలె ఉంది. మొదటి పుత్రిక వ్యవహార నామం కౌముది. రెండవ పుత్రిక వ్యవహార నామం జాహ్నవి. మూడవ పుత్రిక వ్యవహారనామం అపర్ణ. వారి పేర్లకు తగినట్లే కవి ఉపమానాలను సంధించాడు. కౌముది అంటే వెన్నెల కనుక తెల్లనిదైన సరస్వతితో సమానం. జాహ్నవి విష్ణుపాదం నుండి పుట్టిన నది కనుక లక్ష్మితో సమానం. అపర్ణ అంతే సాక్షాత్తూ పార్వతే కనుక పార్వతితో సమానం. ఇలా ముగ్గురు పుత్రికలతో వారి బాల్యంలో ఖేలన లాలనాదులతో ఆనందాన్ని అనుభవించినవాడు కనుక ఈ కవి తన అనుభూతులను తలచుకొంటూ వికసితమనస్సుతో వారికి ఈకావ్యాన్ని అక్షరంగా అంటే నాశం లేని కానుకగా, నాశం లేని అక్షరాల రూపంలో అంకితం చెయడం సురుచిరం. కవి ఔచిత్యానికి పద్యం ఒక ఉదాహరణం.

                                                                                     -(సశేషం)    


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech