సారస్వతం  
     పుస్తక పరిచయం-2 - పరిచయకర్త: శైలజామిత్ర  

గ్రామీణ సొగసుతో పాటు భాద్యత  ఉట్టిపడిన కవిత్వం - ఆర్. రామకృష్ణ "పినలగర్ర"


పల్లె ఎపుడూ బాల్యంలోనే ఉంటుంది... పల్లెకు వృద్దాప్యం లేదు. ఎందుకంటే వృద్దాప్యం రెండో బాల్యం కనుక. కవిత్వం ఇలా ఉండాలనే కొలమానం లేదు. ప్రత్యేకంగా వస్తువుపై ఉండాలనే బలవంతం లేదు. ప్రాంతం మీద మాత్రమే ఉండాలని లేదు. పట్నవాసం కంటే గ్రామీణం, పల్లె ప్రాంతాలు కవిత్వానికి అనుకూలంగా ఉంటాయి అంతే! 'పినలగర్ర' ఆంటే ఏమిటి అని మొదట అనిపించినా మాట నిజమే! కాని పిల్లనగ్రోవి అనే పేరుతో కవిత గ్రంధం రావడం అనేది ఒక గొప్ప ప్రయోగమనే చెప్పాలి. కవిత్వం అనేది ఆయా కవుల గుండె శబ్దం. ఆర్. రామకృష్ణ గారి గుండె శబ్దం ఎంతో హృద్యంగా ఉంది. ఇలా ఎలా అనగలము అనడానికి వాక్యాలు చూడండి "సముద్రమంటే నాకిష్టం/సముద్రానికి నేనన్నా /అంతే ఇష్టం అని నేననుకుంటాను/నన్ను అల్లంత దూరం నుంచే చూసి /తెల్లని నవ్వు పెదాలతో పలకరిస్తుంది/నన్ను ముట్టుకోవాలని ముందుకురికి/అంతలోనే సిగ్గు నటించి/వెనక్కు జారుకుంటుంది../నేనేదో పరధ్యానంలో ఉంటానా /టపీమని వచ్చి నా కాళ్ళను చుట్టేస్తుంది" అంటారు. కవికి సముద్రానికి చాల దగ్గర సంభంధం ఉంది. ఎందుకంటే సముద్రంలోని గంభీరత్వం, కెరటంలా పడిలేచే మనస్తత్వం, కవిలో మెండుగా ఉంటాయి. అవసరంకోసం సముద్రం ఏర్పడిందో? ప్రకృతిని ఎంతగా ఆస్వాదింప జేస్తోందో తెలియదు కాని కవికి మార్గదర్శకం అయ్యింది అనేది వాస్తవం! మాటలు రాని రాయిని కూడా మాట్లాడించ గల సామర్ధ్యం ఒక్క కవికే ఉందంటే అతిశయోక్తి లేదు

బిడ్డ తల్లి ఎక్కడికెళ్ళినా ధ్యాస అంతా బిడ్డపైనే ఉంటుందనేది సహజం. కాని పాలు తాగే బిడ్డని ఒకచోట ఉంచి, కడుపు కోసం పనికి పోతే తల్లి మనసు బిడ్డ ఎలా ఉన్నాడో? ఏడుస్తున్నాడేమో? పక్క తడిపితే చీమలు చేరి కుడుతున్నాయేమో, బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తున్నాడేమో, అనే ఆలోచనలతో తాను మడిలో ఆంటే పనిలో    అనే ఆలోచనలతోనే  ఉంటుందనే విషయం ఎంతో హృద్యంగా అందిస్తారు రామకృష్ణ గారు చూడండి. " పెరిగిపోతున్న పొద్దు/ పని నుంచి నన్ను తిరిగి పంపించేస్తుందేమో అన్న భయం / తొందర పెడుతుంటే/ అబ్బా చేను కోయ్యబోయి / చెయ్యి కోసుకున్నా కదా / మనసు మనసులో ఉండటం లేదు/ వాది నుదుట నల్ల బొట్టు / ఒళ్ళంతా పులుముకున్నాడేమో/ నేను చూపిన బూచి భూతమై / కలలో వాడిని జడిపిస్తోందేమో./ చూస్తుండ మన్న పక్కింటి కాళ్ళు రాని ముసల్ది / చూసిందో లేదో/ . / మనసు మనసులో ఉండటం లేదు." అంటూ చెప్పుకోడానికి చిన్నవి.. గ్రామీణ యువతులు భరించడానికి పెద్దవి అయిన సమస్యలను అద్భుతంగా అక్షరీకరించిన కవి కలం ఎంతో గొప్పదనే చెప్పచ్చు. చాలా వరకు గ్రామీణ నేపధ్యంలో సాగిన వీరి కలం మనసుల్ని తట్టి పలకరించే తీరులో సాగింది..

కవిత్వం ఎంత రాసాము ఆంటే చాలానే అనే సమాధానం వస్తుంది. ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం రాదు. వేల కొద్దీ కవిత్వాలు వస్తున్నా మనకు ఆంటే కవికి తాను ఎదురుచూస్తున్న స్థానం వస్తోందా ఆంటే లేదు. కాని ఇక్కడ మనం తరచి చూస్తుంటే మాత్రం నిజమనిపిస్తుంది. కవి మాట్లాడినంత సేపు ఎవరు గుర్తించరు. కాని కవిత్వం ఎపుడైతే మాట్లాడటం మొదలు పెట్టిందో అప్పుడు కవిని వెదకటం ప్రారంభిస్తారు. కవిత్వమే నిలబడుతుంది. కవి చరిత్రలో ఒక పేజీ గా నిలిచిపోతాడు.   రహస్యం తెలియనంతవరకు కవిత్వమనబడే వాక్యాలు జనాలను తరుముతూ హాస్యంగా మిగిలిపోతూనే ఉంటుంది. కానిఆర్ రామకృష్ణ గారిలో కవిత్వం ఉంది. ఏది కవిత్వం గా మలచాలో తెలుసుకున్నారు. పల్లె తల్లిని, అక్కడి వాతావరణాన్ని ఆధునికత అనే ముసుగులో కొట్టుకుపోతున్న సమాజానికి తెలియజేసారు. నిజంగా వీరు కవిత్వాన్ని ఉనికి చాటుకోవడం కోసం కాకుండా భాద్యతగా తీసుకున్నారు. అందుకు ఉదాహరణలు సంపుటిలో అనేకం . మచ్చుకు కొన్ని " నువ్వు సీరా సిలక్కట్టేసి / వరి మళ్ళలో / ఉలవలోసినపుడే/నగరం నాగరికత నేర్చుకుంది/ చేల గట్ల మధ్య నీ చేతులు గలగలలాడకపోతే/ నగరం నాలుకపై నల్లేరు పూస్తుంది/నగరంలో హృదయం పరచిన తల్లీ /నీకు నమస్కరిస్తున్నా " అంటారోకచోట..మరోచోట " బిడ్డల చేత బహిష్కరింపపడిన తలలో ఆమె / భర్త చేత బయటకు నెట్టబడిన  తలలో ఆమె/రోడ్డు మీద/ నా ముందు నిలబడి 'నాయనా' అని /చేయి చాపుతుంది/ ఆర్తి నిండిన పిలుపుతో / ఆవేదన నిండిన చూపుతో ఆమె / నా మనసు సల్లకుండకు చిల్లు పెడుతుంది/ ఎన్ని బరువులు మోసి మోసి అలిసిపోయిందో/ ఆమె శరీరం/ వయసును మోయలేక వంగిపోతోంది" అంటూ చివరిలో " మాటల మధ్య నలిగిన వ్రుద్దాప్యమో ఆమె ? నా మనసు మీద మంచు పర్వతమైపోతుంది" అని అద్భుతమయిన వాక్యాలతో ముగించారు.. ప్రతి కవితలోనూ సామాజిక స్పృహ కనిపిస్తుంది..

మతం, కులం అనే పదాల మధ్య నలిగిపోతున్నా సమాజానికి 'మతోన్మాద రాసక్రీడ' అనే మరో అక్షర చురక అంటించారు. " మనం మనుషులమై మాట్లాడుకోవడం/ వాడికిష్టం ఉండదు/ మనం చిరునవ్వుతో చేతులు కలిపి / ఒకరికొకరం గుండె చప్పుళ్ళనందించుకోవడం/ వాడికి సుతరాము ఇష్టం ఉండదు./ మనల్ని మనకు కాకుండా చేస్తాడు/ మన హృదయాల్లో నిప్పును రాజేస్తాడు" అంటూ సమాజంలోని మతోన్మాదాన్ని నిరసిస్తారు

మరో  చోట " కళ్ళు రెండు/ కన్నీరు ఒకటే అయినట్టు/ దేశాలు రెండు/ బతుకు మాత్రం ఒకటే/ మీరు పైన చిరునవ్వుల కరాచలనం చేసినట్టు నటిస్తున్నా/ కింద నుంచి కాళ్ళు దువ్వుతున్న దృశ్యం / నేను చూస్తూనే ఉన్నా" అంటూ భారత్ పాక్ మధ్య దౌత్యం ప్రారంభించిన ఇరువురు ప్రదానులుద్దేశించి ఆలోచనాత్మకమైన కవితను రచించారు.

కవిత్వం ఆంటే ఇష్టం ఉంటే అది ఆత్మీయంగా సాగుతుంది. సమాజం పట్ల ఇష్టం ఉంటే కాపాడుకోవడానికి భాద్యతగా సాగుతుంది. కవికి కవిత్వ మన్నా, సమాజమన్నా ఎంతో ఇష్టం కనుకనే ఇంతటి గొప్ప గ్రంధం మన ముందుకు వచ్చింది. ఇంకా ఇలాంటివే మరిన్న సమాజ ప్రక్షాళన చేసే కవిత్వం రావాలని కోరుకుంటూ, అందించిన  గ్రంధానికి అభినందిస్తున్నాను...

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech