సారస్వతం  
       పుస్తక పరిచయం - పరిచయకర్త: శైలజామిత్ర  

 

ఆహ్లాదకరమయిన కవిత్వం శరత్ జ్యోత్స్నారాణి  "వలస కోకిల"

విత్వం ఆంటే ఒక వాస్తవం. వాస్తవం లోనే ఉద్భవిస్తాయి నిరాశ నిస్పృహలు..అందులోంచే అగుపిస్తాయి ఆత్మ న్యూనతా భావాలు. ఆంటే నేడు వందకు 80 శాతం కవిత్వం నిరాశ గోడలనే అనుకుంటోంది. అలాంటి నేడు జ్యోత్స్న రాణి గారు తమ 'వలసకోకిల' అనే అతి సున్నిత భావాలు పొదిగిన గ్రంధ లో 'నేను నా బాల్యం '  అనే కవితలో "జీవిత చిత్రంలో / అందమయినభాగమే / బాల్యమేమో./ ఎన్ని వసంతాలు జారిపోయినా/జ్ఞాపకాల చిత్తడిలో/మనసు ఎగిరే పక్షిలా / ఎక్కడికో దూసుకుపోతుంది/ మమతల తోటలో పూసిన / ముద్ద మందారంలా నా బాల్యం పరిమళించింది. అని ఆనందంగా మొదలు పెట్టిన కవిత్వం చివరకు  కూడా అద్భుతంగా మా ఉళ్ళో స్నేహపు గట్లు తెగిపోలేదు/ఇప్పటికి పారే స్రవంతిలా /స్నేహభంధం సుగంధాలను పంచుతుంది.. అనడం కొసమెరుపు గా కవిత్వానికి శోభనిచ్చింది. కవిత్వాన్ని ఒక వ్యక్తి కోసం రాస్తున్నాము ఆంటే వ్యక్తి శ్రీ శ్రీ అని తెలియని వారు లేరు.   మహా కవి గురించి రాయని వారు లేరనే చెప్పాలి. వీరి గురించి కవయిత్రి ఏమంటారో చూడండి " మనిషిని చదివిన /మహా మనిషి/అఖండమయిన కళాకృతి/ఆధునిక మహా కావ్యం/బిచ్చగాడి ఆకలి కరువును/అద్భుతంగా మలచి/ లోకానికి అందించిన/ చిత్రకారుడివి/ అక్షర శిల్పివి"  అంటారు. అభివ్యక్తీకరణలో ఎంతో వాస్తవం ఉంది. శ్రీశ్రీ ని గూర్చి తెలియని యువతరమయినా కవిత్వం చదివితే అతను రాసిన కవితాంశాలు ఇట్టే పసిగాడతారు కూడా. కవయిత్రి సెంట్రల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలు కావడం వలెనే నేమో విద్యార్ధులకు విశదంగా తెలియజేసారు  నిజంగా అభినందించాల్సిన విషయం

స్త్రీకి నవ్వే ఆభరణం అంటారు . కాని నేడు ఒక్క ఆభరణం తప్ప అన్నిటిని వేసుకుని తిరుగుతున్న జనావళిలో మనం మసలుతున్నాం. విషయం గూర్చి వీరు అంటారు "గుండెనిండా భాధలున్నా/గంపెడాశతో బతుకును/చిగురింప జేసేది చిరునవ్వే/ సిరిసంపదలతో తులతుగుతున్నా /నవ్వలేని మనిషికి మిగిలేది /కన్నీరే/ సంప్రదాయం నవ్వు నాలుగు విధాల చేటు అన్నా/నేనయితే నవ్వే సిరి అనే ఓటు వేసి /హాయిగా/ చిరునవ్వు దివ్వెను వెలిగిస్తాను../నిండైన మనిషికి / నవ్వే సిరి.." అని ముగిస్తారు. ఈరోజుల్లో నవ్వలేక పోవడమే రోగానికి కారణం అని  వైద్యులు కూడా అంటున్నారు. కాని అలాంటి నవ్వును సిరితో పోల్చుతూ అందరిని నవ్వండి అని హెచ్చరించే తీరు అందరూ చదివి నేర్చుకోవాల్సింది

కవయిత్రి సమాజంలోని మానసిక వైకల్యాల పట్ల తీవ్రంగా స్పందిస్తారు. మనిషిని మనిషిలా ఉండమని హెచ్చరిస్తారు. తాము నమ్ముకున్న దారి ఏదైనా నిజాయితీ ఉండాలని తెలియజేస్తారు. విషయంగా కవితను గమనించండి.." మేం మనుషులం" అనే కవితలో " ఎన్నన్నా చెప్పు మిత్రమా/ నీవు చేసిన పని/ హర్షణీయం కాదు/ మేం మనుషులం/ మేం మనుషులం/ ఒట్టి మట్టి మనుషులం/ నీతి నిజాయితీలకు నీళ్ళు వదిలేసి/ ఎన్నో పుష్కరాలు దాటాయి/ మంచిని, మానవత్వాన్ని /మూసీ నదిలో కలిపేసి / కొన్ని దశాబ్దాలు దాటాయి/ బలం ఉన్నవాడికే ఓటేస్తాం/ ధనవంతుడైన పాదుషాకే సలాం చేస్తాం/అణగి మణగిన అమాయకుల్ని/ అన్యాయంగా స్మశానంలో పుడ్చేస్తాం" అంటూ తీవ్రంగా స్పందించారు. ఎక్కడ చూసినా కనబడుతున్న అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని చూస్తుంటే తట్టుకోలేక ఘాటైన హెచ్చరిక చేసారు. మనిషి ఎలా న్నాడో అక్షరీకరించారు.. 

అలాగే వీరి రచనలు అనేకం ప్రచురితమయినా, ఎన్నెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నా కూడా ఎదుటి మనిషిని సాదరంగా ఆహ్వానించడం, ఆత్మీయంగా పలకరించడం, ఎదురుగా ఉన్నది మిత్రుడైనా, శత్రువైనా సమానంగా స్పందించడం లాంటి అరుదైనా లక్షణాలున్న కవయిత్రి రచనల్లానే గొప్ప మనస్తత్వం ఉన్నవారు అనడానికి కింది అక్షరాలకంటే తార్కాణం ఏముంటుంది? గమనించండి "నేను ఒంటరినే/ నా గదిలో నేను ఒంటరినే/అవతల  శూన్యం నా నేస్తం/ మౌనంలో ముసురుకున్న/ ఆలోచన తరంగాలలో/ తేలియాడే / నా మనసు ఒంటరిదే/ అధ్బుతం అసమాన్యమయిన గూడు/ తీయని ప్రేమకు చిహ్నం అంటూనే చివరిలో ఇలా అంటారు. " నా తేలి ఉహల్లో మురిపించే పికిలిపిట్ట/ మధుర స్మృతికి ఒక జ్ఞాపిక" అంటూ అందంగా ముగిస్తారు. ఇందులో ఒకవైపు ఆనందాన్ని, మరోవైపు విషాదాన్ని కూడా చూపుతారు

సామాజికంగా, వాస్తవంగా, అన్నింటికీ మించి అర్తయుక్తంగా రచనలు చేస్తున్న శరత్ జ్యోత్స్నా రాణి గారి శైలి ఎంతో గొప్పవని  ఎన్నో గ్రంథాలు నిరూపించాయి కూడా. మనసులో ఆత్మీయత ఉంటే గుండెలో ఆర్థ్రత ఉండి తీరుతుంది. అర్ధ్రతను తట్టి లేపేది కవిత్వం. వీరి ప్రతి కవిత్వంలో ఆర్ద్రత ఉంది. చేడుపట్ల నిరసన ఉంది. మంచి పట్ల ఆహ్వానం ఉంది. ఇలాంటి గ్రంధాలు మరిన్ని రావాలని వారికి తెలియజేస్తూ.. అభినందిస్తున్నాను

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech