సారస్వతం  
     ప్రబంధ నాయికల ప్రణయవిలాపము                                                              రచన : కుంతి  

ప్రబంధ కవులు తమ నాయికల చూపులు, నవ్వులు, చేష్టలు, వారి ఆంగాంగ సౌందర్యము శృంగార భరితముగా భావిస్తూ, అత్యద్భుతముగా చిత్రించి సాహిత్యలోకములో ప్రాణప్రతిష్ట గావించారు. "చక్కనమ్మా చిక్కినా అందమే" అన్నట్లుగా ఏడు మల్లెలఎత్తు జవరాలు ఏడ్చినా అందమే  అని నిరూపించారు. వాళ్ళ నాయికలు ఏడ్చింది ఏడుపే అయినా, ఏడ్చినట్లుగా ఉండక ఏడేడు లోకాలు తరించేట్లుగా  వర్ణించారు. ఆడవాళ్ళు ఏడిస్తే బాగుండదు. అందులో  అందమైన ఆడవాళ్ళు నెత్తిపై నీటి కుండ పెట్టుకొని, నీటి కుళాయి విప్పుతూ, కర్చీఫులు పిండుతూ  ఏడిస్తే అస్సలు బాగుండదు. అందమైన ఆడవారి అందము వారి నగుమోములో ఉన్నంతగా ఏడుపుగొట్టు మొహములో ఉండదు.

అయితే కావ్యాలలో నాయికలు ఏడవాల్సి వచ్చినపుడు, వారిని  ఏడుపుతో దిగజారనివ్వక  ఏడ్చే ఏడుపుతో వారి సౌకుమార్యము,సౌందర్యము మరింత ద్విగుణీకృతమయ్యేట్లుగా తీర్చిదిద్దారు.

ఆంధ్ర   కవితాపితామహుడు అష్టదిగ్గజాగ్రగణ్యుడు అల్లసాని పెద్దన  తన మనుచరిత్రలో  వరూధినిచేత ఇలా ఏడిపించాడు.

"పాటునకింతులోర్తుర్ కృపారహితాత్మక నీవుత్రోవ ని

  చ్చోట భవన్నఖాంకురముసోఁకెగనుంగొనుమంచు జూపి

  ప్పాటలగంధి వేదన నెపంబడి యేడ్చెఁగలస్వనంబుతో

  మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టుల నశ్రుల చిందువందగున్!”

వరూధిని గడుసుది. "ఇక్కడ నీగోరుతాకింది చూడు" అంటూ జన్కట్టుపై చూపి నొప్పి  యను మిషతో యున్నత స్తనములపై  కన్నీరు చిందగా  అవ్యక్త మధురధ్వనితో  ఏడ్చింది. ఆవిడ బాధకు పెద్దనగారు చింతించారు కాబోలు అంత   అందమైన నాయికకు "పాటు" కలిగించిన  ప్రవరుడిని "కృపారహితాత్మక" అనిపించారు

అంతే కాక "అతికరుణముగా వనరుహనేత్ర ధవళరుచుల్ కావిగొననేడ్చి (ఏడిపించి) " భూసురవర్యయింత దల్పోయవు నీచదువేలచెప్పుమా " అని నిందించింది (తిట్టించాడు)

నిజమే అందమైన ఆడవాళ్ళను ఏడిపిస్తే ఇంకాచదువులెందులకు?

 శ్లేషకవితాచకవర్తి, రామరాజభూషణుడు తన వసుచరిత్రలో నాయికగిరిక దు:ఖాన్నిసంగీత రాగాలతో మేళవించాడు.

        "    జాబిల్లి వెలుంగువెల్లి కలడాయన్ లేక రాకానిశా

          రాజశ్రీసకఖమైనమోమున బటాగ్రంబొత్తి యెల్గెత్తి యా

       రాజీవాననయేడ్చె గిన్నర వధూ రాజత్కరాంభోజకాంభోజ

         మేళవిపంచికార వసుధాపూరంబు తోరంబుగాన్!"    

పారిజాతాపహరణమునసత్యభాఅ మావిలాపాన్నిముక్కుతిమ్మన గారు ముద్దుముద్దుగ ావర్ణించాడు.  

" ఈసునపు ట్టిడెందమునహెచ్చిన శోక దవానలంబుచే 

  గాసిలియేడ్చెఁ బ్రాణ విభుకట్టెదురన్ లలితాంగి పం కజ

   శ్రీసఖమైన మోముపయిజేలచెఱుంగిడి బాలపల్లవ

    గ్రాస  కషాయకంఠ కలకంఠవధూ కాకలీధ్వనిన్!     

 లేతచివుళ్ళనుమెసవినరంజకమైన  గొంతుగల  మధుర   స్వనయుక్తమైన  ఆడుకోయిల యొక్కఅ వ్యక్త మధురమైనసూక్ష్మరు తముతో  సత్యభామరోదించింది.ఇంక  ఇంత ఏడ్చిన  తరువాతఎంతటివారలైనా పాదక్రాంతులుకావలిసిందే.

అప్పుడు కృష్ణుడు ఏమిచేసాడు? "నీరజనాభుడునిండుగౌగిటంజేరిచిబు జ్జగించినునుజెక్కులజాలుకొనంగ జారుకన్నీరు కరంబునందుడిచినెయ్యముదియ్యముదోపని ట్లనున్"

పై పద్యాలపై తెనాలిరామకృష్ణుడు "పెద్దనగారు అటునిటు  ఏడిస్తే ముక్కుతిమ్మనగారు ముద్దుముద్దుగా ఏడిస్తే, భట్టుమూర్తిగారు భోరున ఏడ్చారు" అన్నాడు 

అతులితమాధురీమహిమ గల రమణీయకవితాపుష్పకమునకు ఆధ్యాత్మిక పరిమళాలనలది  ఆంధ్ర సాహిత్యప్రియులకు ముక్తి మార్గమునరయ జేసిన ధూర్జటి కూడా తన  శ్రీ కాళహస్తీశ్వరమహాత్మ్యములో సశివదాసి ఏడుపును కడురమణీయముగా వర్ణించాడు.

డి బిగువైన పీనకుచభారమువంకధరిత్రిమోవకుం

డెడు తనువల్లితోఁగటికి డెందము భూపతి దూఱుచున్ వడిన్

వడలుదృగంబుపూరములువెల్లిగొనంబలవించెదైవమున్

దడవుచుఁబంచమధ్వనులతానములీను పికాంగనారుతిన్!

పంచమ స్వరమునకధిదేవతయైన శివుడిని పేర్కొనుచు పంచమ స్వరము యొక్క తానములను బుట్టించు, ఆడుకోయిల వంటి ధ్వనితో విలపించెనట.

శ్లేష, చమత్కార, వచోవిన్యాసాలతో, ప్రతిపద్య చమత్కృతితో ఆంధ్ర సాహిత్యలోకములో విజయవిలాసముతో లబ్ధప్రతిష్టుడైన చేమకూరవారినాయిక ఉలూచి దు:ఖాన్ని రమణీయంగావర్ణిస్తాడు..

"అని వచియించునప్పుడు ముఖాబ్జమునంటెడి విన్నబాటు,

క్కని తెలిసోగ కన్నుగవ గ్రమ్ముచు నుంచెడి భాష్పముల్ గళం

బునఁగనిపించుగద్గదిక,ముప్పిరిగొన్వలవంతఁదెల్పి, ని

ట్లను మదిలో గరింగి రసికాగ్రణియా కరభోరు భోరునన్!"

కరభోరు (కరభము వంటి అందమైన తొడలు గలిగినది) .వెంటనే "భోరునన్", "నీ చక్కదనంబుఁగన్న నిముసంబయినన్నిలుపోపశక్యమే యక్కున జేర్పక" అంటూదాసోహమయ్యాడు

" గతి రచియించిన వేళ సకలకాలాలు మెత్తురుకద " అంటూ మనము చేమకూరవారిని ప్రశంసించకుండా ఉండలేము"

ప్రబంధకవులకు పూర్వుడు, అపూర్వుడు అయిన కవి సార్వభౌముడు శ్రీనాధుడు, కాశీఖండమునందు నాయిక దు:ఖాన్ని ఇలావర్ణించాడు.

"కొసరి వసంతకాలమునఁగోయిలక్రోల్చినభంగినేడ్చెన

బ్బిసరుహనేత్రకొండచఱిఁబెద్దయెలుంగునవెక్కెవెక్కె వె

క్కసమగుమన్యువేగమునగాటుక కన్నులనీరుసోనలై

యుసిరికాయలంతలుపయోధరములు దిగువారునట్లుగన్!"

అందమె ఆనందము. ఆనందమె జీవితమకరందము. కావున కవులు అందమైన కావ్యనాయికల శోకాన్ని వర్ణించేప్పుడు అందానికి, ఆనందానికి లోటు రానీయక, శోకము అదికవి శ్లోకానికి ప్రాణము పోసినట్లుగా, ప్రబంధనాయికల, కావ్యనాయికల శోకము వారిలో కొత్త సాహిత్య లోకము నవతరింపచేయగా, వారి విలాపాలు, శృంగార కలాపాలుగా చేస్తూ, సాహితీప్రియులను అలరింపచేసేట్లుగా తీర్చిదిద్దారనడములో సందేహము లేదు.

అదేవిధంగా కావ్యనాయికలు యెలుగెత్తి ఏడ్చినా, ఉసిరికాయలంత సోనలై కన్నీరుకార్చినా, అవ్యక్తమధురధ్వనులతో ఏడ్చినా, వసంతకాలములో కోయిలవలె పంచమస్వరముతో ఏడ్చినా సంగీత రాగాలు మేళవించి ఏడ్చినా, ప్రియుల వలపు పొందడానికే. ఆధునిక కాలములోకూడా మగువలు మగవారిని కొంగులో కట్టుకోవడానికి, బెట్టు నిలబెట్టుకోవడానికి, కోరికలచిట్టాలని అమలుపరిచేలా చూసుకోవడానికి ఆలపించే ఆరున్నొక్క రాగము . ప్రబంధ నాయికలనుండియే పొందారేమోననిపిస్తుంది

పూర్వకవులలో పోతనైనా, శ్రీనాధుదైనా మరొక కవియయినా వారివారి పద్యాలలో, ఎట్టి సందర్భలలోనైనా, ఆడవారు ఏడిస్తే కాటుక కంటనీరు చనుకట్టుపై పడవలసిలందే. అయితే కలకంఠి కంట కన్నీరొలికిన సిరులు తొలగు అన్న విశ్వాసము కలిగిన జాతి మనదికావున వారి కన్నీటికి, ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని కలిగించారు.

యేదిఏమైనప్పటికీ చక్కనమ్మల చెక్కుటద్దములపై జారే కన్నీటి సుమాలు, వారు పెట్టే వెక్కులు, మగవారిపై ఎక్కు పెట్టిన మదన శరములు అన్నది మాత్రము నిర్వివాదాంశము.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech