శీర్షికలు  
     పద్యం - హృద్యం - నిర్వహణ : రావు తల్లాప్రగడ  
 
"సమస్యాపూరణం:
ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com) ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు ఫిబ్రవరి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ మాసం సమస్యలు 
ఆ.వె.|| తప్పుచేయకున్న తప్పుయగును
వర్ణన(స్వేచ్చా వృత్తంలో) : "వైకుంఠాన శివుడుంటే"

అన్న భావాన్ని వర్ణిస్తూ మీ ఇష్టమైన చందస్సులో పద్యం చెప్పండిs

 

క్రితమాసం సమస్యలు ( గండికోట విశ్వనాధం గారు ఇచ్చినవి)
ఆ.వె.|| రచ్చ గెలిచె ఇంట రచ్చరచ్చగ చేసి
కం|| తారసితారల భేదము

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ -  డా.అయాచితం నటేశ్వర శర్మ, హైదరాబాదు
   
  ఆ.వె.||ఈచదీర్చి ఇంత నచ్చగ పనిజేసి
రచ్చ గెలుచు వాడె మెచ్చ నరుడు
రచ్చ గెలిచె ఇంట రచ్చ రచ్చగ జేసి
నేటి మానవుండు నియతి లేక

కం.||తారసితారల భేదము
నారయ తళ్కులను లేదు గాని జగతిలో
తారలు రాలుట తథ్యము
తారలు చిరముందు నింగిదారుల సిరులై.
రెండవ పూరణ - గండికోట విశ్వనాధం, హైదరాబాద్
   
  ఆ.వె.||మాయదారి పనుల మరిగిన ముడుపుల
దొరికి నంత దోచి దొరకకుండ
మరల ఎన్నికైన మంత్రివర్యు డతడు
రచ్చ గెలిచె యింట రచ్చ రచ్చగ జేసి.

కం.|| తార బృహస్పతి సతియౌ
మరియొక తార బలశాలి వాలికి సతియౌ,
తార సితారల భేదము
నరయగ అసలు నకిలీల నాణ్యత పోలున్    

(ఇదే సమస్య ఉత్పలమాల పద్యంలో పూరిస్తే )
ఉ.|| తార అయోనిజాత వనితామణి, కన్యగ తేజరిల్లె నీ
భారత ధాత్రియందు, మురిపాల సితారయు చిత్రసీమ శృం
గార కళాభి దేవతగ కన్పడి, కృత్రిమ సుందరా కృతిన్
తారసిలున్ సితారయన ; తార సితారల భేదమున్ గనన్
మూడవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం
   
  ఆ.వె.|| ఇంటగెలిచి రచ్చవంటి బాహ్య ప్రదే
శాల గెలుచు టొప్పు! అటుల గాక
రచ్చగెలిచి ఇంట రచ్చరచ్చగ చేసి
ఇల్లు తోసి పందిరల్ల తగున?

కం.|| తార బృహస్పతి భార్య, సి
తారయె నారదుని చేతి తంబుర అనుచున్
తారసితారల భేదము
గౌరీనాధునకు గరుడగమనుడు తెలిపెన్
నాల్గవ పూరణ  - నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ స్
   
  ఆ.వె.|| రచ్చ గెలిచె నన్న పిచ్చసం తసమున
పట్ట లేని ముదము తట్టు కొనక
రచ్చ గెలిచె ఇంట రచ్చ రచ్చగ చేసి
తుట్ట తుదకు వెడలె తూడ యగుచు
(తూడ = దుష్టుడు)

కం.|| తార యనగ నక్షత్రము
తారాదిపుని భార్య తార , తారా పధమున్ !
తార సితారల భేదము
తారుచుట కసాధ్యము తలపున నైనన్ !
(తారుచుట = పోలిక)
ఐదవ పూరణ  - యం.వి.సి. రావు, బెంగళూరు
   
  ఆ.వె,|| తెలిసి యసురయంచు తెగతార్చి పూతన
కాళిపడగలెక్కి కేళిసల్పి
రచ్చ గెలిచె, ఇంట రచ్చరచ్చగ చేసి
యేమి తెలియనట్లు యేమరించె

కం|| తార సితారలభేదము
ఆరెండును మినుకుమనుచు నాకర్షించున్
తారకు చంద్రుడు వెలుగు, సి
తారకెపుడు ప్రేక్ష కుండె తగ వెలుగనరే
    ఆరవ పూరణ  - జగన్నాథ రావ్ కె. ఎల్., బెంగళూరు
   
  కం|| తార సితారల భేదము
తారస పడు తరచి చూడ తార్కాణమిదే
తార సితారను మీటగ
తార సితారలకు తారతమ్యము తెలిసెన్

 

 

ఏడవ పూరణ - నిరంజన్ అవధూత, బోస్టన్
   
  ఆ.వె.||"రచ్చ గెలిచె ఇంట రచ్చ రచ్చ జేసి"
అన్న నింద బడయ అందమౌనె ?
ఇంట గెలిచి, రచ్చ నింత కెక్కువ గెల్చి
మెప్పు పొందు వాడె మహిని ఘనుడు.

కంద|| తార సితారల భేదము
కోరగ నేనేమనందు ? కన్ఫ్యూజనె పో !
తారలు నింగిన కలవు సి
తారలు మరి యెందు కలవొ తెలియదు నాకున్ !

 
 ఎనిమిదవ పూరణ  - రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా
   
  కం.|| తారసితారల భేదము
నరయగ రాలెడి విధంబున యనే తెల్సెన్!
తారలు తామే రాల, సి
తారల నిర్మాత కూడ తమతో రాలున్

ఆ.వె.|| ఇంటమెచ్చువాడు ఎవ్వాడు మిగిలేడు?
నాయకులట వీరు న్యాయమేన?
రచ్చ గెలిచె ఇంట రచ్చరచ్చగ చేసి,
రచ్చబండ ఘనులు, రామచంద్ర!

 
  తొమ్మిదవ పూరణ  - జె. బి .వి లక్ష్మి 
  విత: మన్మధ శాస్త్ర ప్రవీణుడతడు - ఆలి మనసే ఎరుగ డమ్మ
నీతిశాస్త్ర కోవిదు డతడు - అవినీతికే పెద్ద పీట వేయు నమ్మ
పౌర శాస్త్ర పండితు డతడు - పౌరహక్కు లనుమాట ఇంట లేనే లేదమ్మా
త్రికరణ సుద్ది లేని పాండిత్య పటిమ తో - రచ్చ గెలిచిరి వారు ఇల్లు రచ్చ రచ్చగ చేసి

కవిత: నీలాకాశములో తారల తళుకులు- మనసును చల్లగా చేసి మమత పెంచు
వెండి తెరపై సితారల తళుకు బెళుకులు - ఎండమావుల వెంట పరుగు లేత్తించు
తార సితారల బేధ మెంచగా లేని అంధుడు - తారల పై శీతకన్ను వేసి
ఏ. సి రూములో సితారల శివాలు ఎత్తగ - బ్రతుకు అర్ధమే మార్చుకొనగ నెంచెన్
పదవ పూరణ సతీష్ కుమార్ ఇంద్రగంటి
  ఆ.వె.|| పాఠశాల పరుగు పోటీలనుచును, మా
చ౦టి ఇల్లు రె౦డు జేసె, చివర
రచ్చ గెలిచె ఇ౦ట రచ్చ రచ్చగ జేసి,
మెచ్చు కొ౦టి రచ్చ మరచి మేము!
 

క౦.|| తార సితారల భేదము,
చేరి నిఘ౦టువుల నార జూచి వెదకగన్,
‘తార’’ తెరన వెలుగు, మరి ’’సి
తార’’ దివి నొదిలిన తార! దెలిసె చివరకున్!

 
   పాఠకులనుండీ మరిన్ని పద్యాలు  - డా.అయాచితం నటేశ్వర శర్మ, హైదరాబాదు
  సుజనుల రంజన జేయుచు
స్రుజనల నిలువెల్ల దాల్చి చూచిన నెపుడున్
రుజువర్తనలను నేర్పెడి
సుజనుల పత్రికకు సర్వ సుభములు గలుగున్
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech