పాఠకుల సమర్పణ  
     మా నాన్నకు జేజేలు - నిర్వహణ : దుర్గ డింగరి  

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా!

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది. నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించండి. 


 

మా నాన్న మిలిటరీ ఆఫీసరే కాదు బొమ్మలు కూడా వేసేవారు

రచన : బాలి

నాన్న

అప్పటికి మా నాన్నగారి వయసెంతో తెలియదు.  చాలా పసివాడని తెలుస్తుంది.  ఇది మా అమ్మకు మా నాన్నగారు చెప్పిన విషయం.  వాకిట్లో చాప మీద స్నానం చేయించి, కొత్త చీర కట్టి ఇంత బొట్టు పెట్టి, చుట్టూ పూలు చల్లి అగరొత్తులు వెలిగించి, తలవేపు మండిగలో దీపం వెలుగుతోంటే ఆమె విగతజీవిగా బంధువుల రోదన మధ్య పడి వుంటే ...మా నాన్న గబుక్కున అందరి మధ్యలో నుండి పరుగెత్తుకెళ్ళి చాప మీద పడి ఉన్న తల్లి పమిటను పక్కకు లాగి పాలు కుడవడానికి ప్రయత్నం చేస్తూ, ఇది మా అమ్మ అన్నట్టు అందరి వేపు చూశాడట.  అవును ఆమె తన అమ్మ.  అమ్మ దగ్గర బిడ్డ పాలు తాగడం తప్పా?! 

ఆ దృశ్యాన్ని చూసిన జనమంతా దు:ఖంతో గొల్లుమన్నారట.  అదంతా ఆ బిడ్డకేం తెలుసు అమ్మ చనిపోయిందని.  మా తాతయ్య అయితే దు:ఖం పెల్లుబికివస్తుంటే ఆపుకోలేక భజం మీద తువ్వాలును నోటికడ్డంపెట్టుకొంటూ "వెంకట్లూ పిల్లాడిని తీయవే?" అన్నారట.

మా నాన్నకు ఆ దశలో తల్లి చనిపోయిందట.

తల్లిమీద పడి పాలు తాగాలని పేచీపెట్టాడట ఈయన. వెంకట్లు అనే పేరు గల ఆమె మా నాన్నకు పెద్ద వదిన.  ఆమె వయస్సు అప్పటికి పది పదిహేను ఏళ్ళ అమ్మాయి మాత్రమే.  కొత్తగా పెళ్ళయి ఆ ఇంటికి వచ్చింది.  ఆ క్షణం నుండి ఆమే తల్లయి, వదినయి పెంచింది.  

మా నానమ్మకు చాన్నాళ్ళు పిల్లలు లేరట.  వెంకటస్వామి అనే పేరు గల పిల్లాడ్ని పెంచిన తరువాత ఓ ఆడపిల్ల (కనకం) ముగ్గురు మగపిల్లలూ పుట్టారు.  అందులో ఆఖరివాడే మా నాన్న.  ఆ వెంకటస్వామి భార్యయే వెంకట్లు.

మా నాన్న ఆఖరివాడు కావడం వల్లే వాళ్ళనాన్నకు గొప్ప ప్రేమ, గారాబం ఉండి వుంటుంది అందులోనూ తల్లి ప్రేమ దొరకని వాడు కాబట్టి అతడు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగినట్లు తెలుస్తోంది.  

ఇకపోతే మా నాన్న, నాన్న (మా తాత) ఓ మాదిరి మోతుబరి రైతు.  రైతాంగంతో పాటు విశాఖపట్నంలో ఉన్న బుద్దవరపు జమీందారీ, అనే బ్రాహ్మణ జమిందారీ వారికి ఆస్థాన వైద్యుడూ, నమ్మకస్తుడున్నూ.  ఆ జమిందారీలోనే కాక తన స్వగ్రామంలో, చుట్టు పక్కలా వున్న వూళ్ళ వారికి ఈయన వైధ్య సేవలందవలసిందే!  అందువల్ల తెల్లవారుఝామున నాలుగింటికి పొయ్యి రాజేస్తే, తిరిగి రాత్రి పన్నెండు గంటలకే ఆర్పడం.  రోగులకు పత్యపు కూళ్ళతో పాటు, వార్ని కనిపెట్టుకొని ఉన్నవారికీ ఇక్కడే భోజనాలు!  ఇంటి చుట్టూ పాకలూ, పందిళ్ళూ వేసి, అందులో వుంచి వారి వారి జబ్బు నయమయ్యేదాకా చూసుకునేవాడట.   

బుద్దవరపు జమిందారీ వారికి ఈయన నమ్మకస్తుడవ్వడం వల్ల వారి భూముల మంచీ, చెడ్డా, శిస్తులూ, దస్తులూ ఈయన చూడవలసిందే. అయితే ఈయనా ఆ వంశం వారి అక్రమ సంతానమే!  అదో పెద్ద కథ. అందువల్లే వారికి ఆయనంటే అభిమానం.  ఈయన కాపులింటికి దత్తత వెళితే, ఈయన తమ్ముడొకడు సింహాచలం దేవాలయం వెళ్ళే దారిలో ఉన్న శ్రీ వైష్ణవుల ఇంటికి దత్తు వెళ్ళాడు.  

ఇక మా నాన్న సంగతి చూస్తే పసి తనంలోనే తల్లిని పోగొట్టుకున్న వాడయునందువల్ల పైన చెప్పుకున్నట్టు ఆయనది ఆడింది ఆట, పాడింది పాటవ్వడం వల్ల తనకు కుక్కల బండీ కావాలని మారాం చేస్తే చిన్న చిన్న చక్రాలతో చక్కటి చిన్న బండి చేయించి దానికి ఇంట్లో పెంచే రెండు పెద్ద కుక్కల్ని పూన్చేవారట.  ఆ బండి ఎక్కి ఉదయం నుండి సాయంకాలం వరకూ చేలో నుండి ఇంటికీ, ఇంటినుండి చేలోకీ తిరిగేవాడట మా నాన్న.

కొంచం పెద్దయ్యాక మా మనవడ్ని మేమే చదివించుకుంటామని, ఆ బుద్దవరపు ఇంట్లో వారు మా నాన్నను తీసుకుపోయి తిండీ, నిద్రా అక్కడే ఏర్పాటు చేసి విశాఖపట్నంలోనే ఉన్న మిసెస్ ఏ.వి.ఎన్ కాలేజీలో "ఎఫ్.ఏ" చదివించడం జరిగింది.  చదివి ఇలా బయటకు రాగానే వాల్తేరు రైల్వే స్టేషన్ లో ఉద్యోగం రావడం జరిగిందట.  అయితే ఈయనకు ఆ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేక, అది వదిలి విశాఖపట్నం ఏయిరోడ్రాంలో ఎయిరో కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టర్ గా చేరేడట.  మేయిన్ కాంట్రాక్టర్ మహా మోసగాడు.  ఈయన దగ్గర బంగారం ఉందని తెలిసి అదే పనిగా ఆ కాంట్రాక్ట్ వర్క్స్ లో ఈయనకు అనుభవం లేక తండ్రి ఈయనకు వాటాగా ఇచ్చిన వందతులాల బంగారం, మా అమ్మ తెచ్చుకున్న కొంత బంగారం హారతి కర్పూరంలా హరించుకుపోయి, కట్టుకున్న దానితో సహ ఎవరి మాటా వినక పోవడం వల్ల, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోవడం జరిగింది.  మరి నా వాటా డబ్బు తాలూకా లాభం ఏదీ, నేనూ పెట్టుబడిపెట్టాను కదా అంటే, ఆ పెద్ద మనిషి అటూ ఇటూ తిప్పి చివరకు మర్డర్ చేయించేవరకూ వెళ్ళడం, ఇది తెలుసుకొని ఈయన ఇంటికొచ్చి ఇంటిముందు నులకమంచం వాల్చుకుని దానికి అడ్డంగా పడి బోరున ఏడవడం ఇవన్నీ జరిగి, ఎలాగో తట్టుకొని, మనస్సులో స్థిరమైన సంకల్పం వెతుక్కొంటుంటే, "రెండవ ప్రపంచ యుద్దం మొదలయ్యిందీ - మిలటరీ కోసం కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటున్నాం" అని ప్రభుత్వ ప్రకటన విని, విశాఖపట్నంలోని రిక్రూటింగ్ ఆఫీసుకు పోతే ఈయనలో వడ్డు, పొడువు, బరువూ, చదువూ సరిపోయి ఆర్మీలో సెలెక్ట్ అవడం అన్నీ జరిగిపోయాయి.  ఆ చదువు వల్లనే ఆర్మీలో చాలా త్వరగా సుబేదార్ మేజర్ గా ప్రమోట్ అయ్యాడు. 

దేశంలో ఎక్కడ విన్నా యుద్ధం వార్తలే! అప్పట్లో ఇన్ని "టీవీ" చానళ్ళు, పత్రికలు లేనే లేవు.  అయినా ఏ నలుగురూ ఒక చోట చేరినా యుద్దం కబుర్లే! దాని పక్కనే కలరా రోగంలా రేషన్! కిరసనాయిలు, బియ్యం లాంటి తిండిగింజలు దొరకవు.  ఎందుకు దొరకవో ఎవరికీ తెలియదు. ( ఇప్పటివరకూ అదే చావు. ఏమి దొరకవు. అంతా రేషన్, కంట్రోల్).

                                

                                                  అమ్మ

"నేను మిలటరీలోకి పోతున్నాను" అన్నారట ఓ ఉదయాన్న. మా అమ్మా బిక్కచచ్చిపోయి, మరో మాట చెప్పలేక గోడకు అంటుకుపోయిందట - "వీలయినంత త్వరగా తిరిగి రండి." అని మాత్రం చెప్పగలిగిందట.

కూతుర్ని ఓదార్చుతూ, "వీలయినంత త్వరగా ఇంటికి క్షేమంగా రా బాబూ!" అని చెప్పగలిగారట మా అమ్మ తాలూకా అమ్మా నాన్నగారున్నూ.  

ఇటలీ, సింగపూర్,మలయా, బర్మా- ఇలా సైనిక పటాలంతో తిరుగుతూ ఎక్కడున్నా మా అమ్మకు తన క్షేమ సమాచారాలతో ఉత్తరం రాసేవారట మా నాన్న.  "నీ బంగారం నాశనం చేసాను.  డబ్బులు పంపుతున్నాను.  ఇల్లు గడపగా మిగిలిన డబ్బుతో బంగారం కొనుక్కో" అనే మాట ప్రతి ఉత్తరంలో రాయడమే.  మా అమ్మ కూడా సంతోషం పట్టలేక, ఇంటి ఖర్చులు ఎంత పొదుపుగా చేస్తున్నదీ, బంగారంతో ఏ ఏ వస్తువు చేయించుకున్నదీ ఆయనకు జవాబు రాస్తూ చెప్పడమేనట.  అదో ఆనందం.  

సెలవు దొరికితే వస్తున్నారు, వెళ్తున్నారు.  వస్తే రెండు, మూడు నెలలు ఫ్యామిలీతో గడపడం జరుగుతుంది.  నాకో అన్నయ్య పుట్టాడు - తరువాత నేను.  

నేనూ ఎదుగుతున్నాను అన్నీ తెలుస్తున్నాయి.  చెల్లి పుట్టింది. అన్నయ్యా, చిట్టి చెల్లెలితో ఆటలు.

మా నాన్న గురించి కబుర్లు మా అమ్మ నోటి వెంట వినడమే.  మా నాన్న వస్తున్నట్టు మా అమ్మకు ఉత్తరం వచ్చింది. ఇక మా అమ్మ ఆనందానికి లోటు లేదు.  ఫలానా తేదీనాడు మీ నాన్న వస్తున్నారట, సింగపూర్ నుండి మద్రాస్ లో ఓడ దిగుతారట, ఏదీ గోడ మీద ఆ తేదీ వెయ్యి, అని మా అమ్మ నా చేతిలో పెన్సిల్ ముక్క పెట్టి నేను గోడ మీద ఎగుడు దిగుడుగా అంకెలు వేస్తోంటే ఆనందించడమే.  అయితే అందులో సగం నాకు అంకెలు నేర్పడం - మా నాన్న వస్తున్నాడని నాతో తాను ఆనందం పంచుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం.

 

నాన్నగారి మరణాంతరం గవర్నమెంట్ వారు 2 ప్రపంచ యుద్దంలో పాల్గొన్నందుకు పంపిన మెడల్స్

యుద్దం అయిపోయింది.  దాని తాలుకా గొడవలూ జనం మర్చిపోతున్నారు.

సింగపూర్ లో మా నాన్న దగ్గర నుండి చివరిగా వుత్తరం వచ్చింది.  ఇండియా, నీలగిరి (ఉదగమండలం)లో తమ పటాలాన్ని పంపుతున్నారని,  శాశ్వతంగా ఇక్కడే ఉంటున్నామని, భార్యా పిల్లలతో ఉండమని ఆర్డర్స్ వచ్చాయని తనకు ఎలాట్ చేసిన క్వార్టర్స్ ను చూసుకుని ఈ నెలాఖరుకు వస్తానని ఈ లోపు ఇక్కడి సామాను సర్దివుంచమని ఉత్తరం వచ్చింది.  మా అమ్మ ఆనందానికి లెఖ్ఖే లేదు.  

మా నాన్న వచ్చే లోపు మా అమ్మ సామాను సర్దింది.  మా నాన్న వచ్చారు - మరో నాలుగు రోజుల్లో బయలుదేరాం.

ఒంటెద్దు బండీని పద్మనాభం అనే ముసలి వ్యక్తి మాకు వాడుకుగా కట్టడం అలవాటు.  సామాను సర్దుకుని మా బందువులకు వీడ్కోలు చెప్పి అందులో కూర్చున్నాం.  బండిలో అమ్మ వడిలో చెల్లెలు, మా అమ్మకు చేరబడి నేను వెనక సామాన్లు .  మరచెంబులో పాలు పోయించేసుకుని బండి వెనక నడుస్తూ మా నాన్న.(ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది) 

రైలు వచ్చింది ఎక్కాం.  నీలగిరికే ప్రయాణం.  ఆ రైలు చిత్తూరు మీదుగా వెళుతుందట.  అయితే "కాట్టాడి" స్టేషన్ లో బండి మారాలట. మా నాన్న మంచి నీళ్ళకోసం చిత్తూరు స్తేషన్ లో దిగి, మరచెంబు నిండా నీళ్ళు పట్టి రైలు కదులుతోందన్న కంగారులో మరచెంబు మూత కొళాయి గట్టు మీదే మరచిపోయి రైలు ఎక్కారు.

చివరకు ఆ మరచెంబుకు మూత లేనే లేదు.  

ఆ తరువాత మరో మరచెంబు కొన్నా, అది చిత్తూరు మరచెంబు అన్న పేరుతో స్థిరపడిపోయింది.

కాట్టాడి స్టేషన్ బండి మారాలని దిగిపోయాం.  మేం ఎక్కవలసిన రైలింకా రాలేదు.  మా నాన్న మాకో పిల్లల/బొమ్మల పత్రిక కొన్నాడు.  అది ఇంగ్లీషులో ఉంది.  అందులోని ఒక కథ చదివి చెప్పారు.  కథ బాగుంది.  దానికి బొమ్మను ఎవరో వేశారు.  ఆకుపచ్చరంగులో ఆ బొమ్మ ఉంది. ఆ బొమ్మలోని బాబు ఇడ్లీ దొంగతనం చేయడంవల్ల అతని ముక్కుకు బోల్డు ఇడ్లీలు వరుసగా అంటుకు పోయాయి - అప్పటికే వాళ్ళ అమ్మ అన్నది మంత్రం వేశాను ఇడ్లీలు దొంగతనం చేయకు - కావాలిస్తే నేనే వడ్డిస్తానని.  వాళ్ళమ్మ వచ్చి మరో మంత్రం వేసి ఆ ఇడ్లీలన్ని తీసేసింది.  ఆ కుర్రవానికి బుద్ది వచ్చింది.  నీతి ఏమంటే - పెద్దవాళ్ళు చెప్పింది వినాలి - దొంగతనాలు చేయరాదు అని.  

నాకు బొమ్మ నచ్చింది - ఆ కథ నచ్చింది.  బొమ్మలు అలా వేయాలన్నది ఆనాడే నా బుర్రలో ముద్ర పడింది. 

ఆరేడు నెలలు ఆ ఊటీలో మా నాన్నతో హాయిగా ఉండి ఉంటాం!  మా క్వార్టర్ చివరనున్న తెలుగు, తమిళం తెలుసున్న వ్యక్తి దగ్గరకు ట్యూషన్ కు వెళుతున్నాను. తమిళంలో "ఒన్ను, రెన్ను, మూను, నాలు, అంజి..." అని లెఖ్ఖలు నేర్చుకొంటూనే ఉన్నాను.  

అయితే మా కుటుంబంలో విధి నర్తనం మరోలా వుంది.  అది మా నాన్నగారిలో అపెండిసైటిస్ రూపంలో వచ్చింది.  ఇప్పటిలా, అప్పట్లో మందులూ, చికిత్సల్లో కొత్త పద్దతులూ లేవు.  కూనూరు మిలటరీ హాస్పిటల్ లో ఉన్నా, ఆపరేషన్ సెప్టిక్ అయి ఆయన చనిపోయారు.

నా తండ్రితో నా అనుభవం అంతే!  

ఇవన్నీ ఆ లేత వయస్సులోని చిన్న చిన్న జ్ఞాపకాలు.  మా అమ్మ చెప్పే గురుతులలో, ఆ జ్ఞాపకాలను ముడివేసుకోవడమే.

 

నాన్నగారు మిలటరీ డ్రస్ లో

తిరిగి అనకాపల్లిలో ఉన్న మా మేనమామ పంచన చేరాం.  మా అమ్మ దు:ఖంలో కనీసం పది పన్నెండు సంవత్సరాలు మాతో వెంట తెచ్చుకున్న నాన్నకు సంబంధించిన మిలటరీ పెట్టెలను తెరవలేదు.  అవి రెండు తోలు పెట్టెలు. చాలాపెద్దవి.  వాటిని ఆ తరువాతెప్పుడో తెరిచింది నేనే.  

అందులో ఆయన పుస్తకాలు, సగం సగం రాసిన డైరీలు, బ్రిటిష్ చక్రవర్తి ముద్రలో ఉన్న కొంత కరెన్సీ, విడిగా రుపాయి నాణేలూ, బట్టలూ, పెన్నులూ, వెంట్రుకలూ ఉన్న బ్రష్ లు, రంగులు కలుపుకునే పింగాణీ కప్పులూ, చైనా డ్రై రంగు కేకులూ - ఈ రంగుల్ని అరగదీసుకొనేందుకై గాజు బల్ల, చుట్ట చుట్టిన కాగితాల కట్టా - అందులో గీసిన ఒకటి రెండూ అసంపూర్తి బొమ్మలూ - పూర్తి చేసిన చిమ్మెట్లు కొట్టిన ఒక పెయింటింగ్, చెట్ల మధ్య నుండి సైకిల్ తొక్కుతూ వెళుతున్న వ్యక్తి - ఇవన్నీ అందులో ఉన్నాయి.  

తీరిక వేళలో ఈ బొమ్మలు సరదాగా గీసుకొనేవారట మా నాన్న, మా అమ్మ చెప్పింది.  ఇన్నాళ్ళు పెట్టె తెరవకపోవడం వల్ల అవన్నీ పరమ చెత్తనిపించి, వాటి విలువ తెలియక చింపి అవతల పారేశాను.  ఇపుడు అనిపిస్తోంది- ఎంత పని చేశానా అని !!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

  Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.                    సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                                                                                                            Site Design: Krishna, Hyd, Agnatech