కవితా స్రవంతి  
      శివమానస పూజా రాగరత్న సీసమాలిక - రచన : వేదుల బాలకృష్ణమూర్తి  
 
 

సీ || నాటరాగముపాడి నటరాజమూర్తిని
ఆవాహనముసేతు ఆదరమున
గౌళరాగముతోడ గౌరీపతికి రత్న
సింహాసనమునిత్తు చెలువుమీర
ఆరభిపాడి కేదారేశు భజియించి
అర్ఘ్హ్యము అర్పింతు అమితభక్తి
ఘనవరాళినిపాడి గంగోదకముతెచ్చి
పార్గ్యమర్పించెదపశుపతికిని
శ్రీరాగమును పాడి శ్రీశైలవిభునకు
ఆచమనంబిత్తు అమలమతిని
పంతువరాళినిపాడి పంచామృత
స్నానముగావింతు శంకరునకు
శంకరాభరణాన స్వరరాగయుతభక్తి
సాంబశివునకు వస్త్రంబులిత్తు
హంసధ్వనిని పాడిహరునకు అర్పింతు
యజ్ఞోపవీతంబు అమలమతిని
సారంగపాడుచు చంద్రకళాధరు
నకు నిత్తుదివ్య చందనము ప్రీతి
హిందోళపాడుచు హిమగిరీశునకిత్తు
కుంకుమాక్షతలను కూర్మితోడ
కళ్యాణిపాడుచు కైలాసపతికి స
మర్పింతు స్వర్ణసుమాల మాల
కంభోజిరాగాన శంభోయంచు పాడి
అగరు ధూపములిత్తు అంబపతికి
శివరంజని పాది శివునకు అర్పింతు
దేదీప్యమానమౌ దీపకళిక
ఆనందభైరవి ఆలపించి మహేశ
నర్చింతు నైవేద్యమారగింప
బిలహరి పాడుచు భీమేశ్వరస్వామి
కర్పింతు తాంబూలమలఘమతిని
నీలాంబరిని పాడి నీరాజనంబిత్తు
నీలకంఠునకు వరాలనొసగ
మధ్యమావతి పాడిమంత్ర పుష్పమునిత్తు
పార్వతీపతికి ఉపాయనముగ
ధన్యాసిపాడి ప్రదక్షిణమొనరింతు
ఫాలనేత్రునకు ప్రపత్తి తోడ
సురటిరాగము పాడి సుందరేశ్వరునకు
సాష్టాంగముగ నమస్కారమిడుచు

తే||గీ|| షోడశోపచారములవిశుద్ధమతిని
వివిధ దైవోపచారముల్ విహితమైన
వివిధ రాజోపచారముల్ నేడ్కనెరపి
నృత్యగీత వాద్యంబుల నిత్యవిధుల
పురహరుని మానసంబున పూజచేసి
త్ర్యంబకుని సస్కృపాకటాక్షంబువలన
అఖిలజనులకు శాంతి సౌఖ్యములు కలుగ
ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగ
రసమయంబుగ బుధజనరంజకముగ
రాగమాలికా సీసము రచన చేసి
శివుని పాదములమీదను శిరసునుంచి
రాజమౌళికి కృతి సమర్పణమొనర్చె
భవుని కృపకోరి వేదుల బాలకృష్ణ

   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech