కథా భారతి  
      కథా విహారం - రచన :  విహారి  
  సగటు స్త్రీ అంతరంగ చిత్రాలు శారదా అశోకవర్ధన్ కథానికలు  
 

శారదా అశోకవర్ధన్ ఆకాశవాణి శ్రోతలకూ, దూరదర్శన్ ప్రేక్షకులకూ తెలుగు సాహితీలోకానికి సుపరిచితమైన పేరు.అఆమె నాటకాలు, నాటికలు, సంగీత రూపకాలు, పాటలు రాశారు. నవలలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. బాలసాహిత్యంలోనూ ప్రశంసనీయమైన కృషి చేశారు. వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం పొందారు. వారికి నాలుగుసార్లు ఉత్తమ రచయిత్రి బహుమతూలు లభించాయి. ‘స్త్రీ’ టీవీ సీరియల్ కి నంది అవార్డు లభించింది. సన్మానాలు, సత్కారాలు కోకొల్లలు.

బహుముఖీనమైన ప్రతిభావ్యుత్పత్తులు కలిగిన విదిషీమణి - శారదా అశోకవర్ధన్. కథా రచయిత్రిగా తనదైన శైలిలో అద్భుతమైన కథానికల్ని రచించి లబ్ద ప్రతిష్టులైనారు.

శారదా అశోకవర్ధన్ కథాక్షేత్రం మధ్యతరగతి జనజీవన వైవిధ్యం. ‘గుండె పగిలిపోతున్నా పెదవిపై చిరునవ్వులు గుమ్మరించే శక్తి మధ్యతరగతికి శాపమా? వరమా? ఇదీ ఆమె అంతరమ్గ ఘోష. మధ్యతరగతి మహిళామణులు మూగజీవులు. పశువులు కాదు.

ఈ నాటికీ ఆరడి పెట్టే అత్తమామలు. అసూయతో కొంపలు కూల్చే ఆడపడుచులూ, చాలీచాలిన అర్తిక దుస్థితీ, అనారోగ్యం, ఆచారాలూ, ఆర్భాటాలూ, దురలవాట్లు - వీటి మధ్య నలిగిపోతున్న మధ్య తరగతి కుటుంబంలోకి, కొత్త పెళ్ళికూతురిలా, కొత్త ఆశలతో అడుగుపెట్టిన మహిళ తన మనసులోని భావాలని పెదవి విప్పి చెప్పలేకపోతోంది.

బండెడు కష్టాలనీ, గుండెడు కన్నీళ్ళనూ నింపుకోవడం కోసం, ఆశల్ని చంపుకుని గుండెనీ ఖాళీ చేసుకుంటోంది. కాలం మారిన మహిళల బ్రతుకులు మారలేదు. ఒక కథానాయిక - అఖిల - మాట్లాడిన ఈ మాటలే శారదా అశోకవర్ధన్ కథా వస్తువుల కేంద్రకం. ఆమె కథలన్నీ ఈ స్థితిగతుల దారుణ పరిస్థితుల్లోనుంచీ సాగి మధ్యతరగతి మహిళా జనజీవన పరిథిని స్పృశించిన బాధలూ, వ్యధలే! ఆమె ఎక్కడో చెప్పుకున్నట్లు ఆమె కథలు నాతి కథలూ, నీతికథలూ! సంక్లిష్టమయమైపోయిన ఆధునిక సమాజ జీవనంలో వనితల ఉనికీ, మనుగడల సంక్లిష్ట స్థితిని సునిశితంగా దర్శించి, విశ్లేషించి, వ్యాఖ్యానించి వాటిని కథాత్మకం చేయగలిగిన నేర్పరి శారదా అశోకవర్ధన్. ఆమె కథల్లో తనవారి సుఖం కోసం మగవాడు భార్య సంపాదనని ఆశిస్తే ఒప్పు. సంపాదనాపరురాలైన మహిళ అదే కోరిక కోరితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించే స్త్రీకి ఎదురుగానే కలెక్టరయి ఉండీ - అణుకువా, వినయం మూర్తీభవించిన లావణ్య ఉంటుంది. స్త్రీ హక్కుల పేరుతో మొగుడిమీద కక్ష తీర్చుకునే గాయిత్రీ, పసుపుతాడుని నమ్ముకుని మోసపోయిన వత్సల ఉంటారు. దుర్మార్గుడైన భర్త, అత్త బారినుంచీ రక్షించండి రక్షించండిజ్అని పరిగెత్తుతూ ఆక్రోశించే నీలూని పెద్దింటోళ్ళు..? ఎవ్వరూరక్షించకపోతే, ఆమె అపార్ట్ మెంట్ పైనుంచీ నేలపైకి దూకేస్తుంది. చనిపోతుంది. జరిగిన వాస్తవాన్ని ధైర్యంగా చెప్పి సాక్ష్యమీయటానికి పనిమనిషి లక్ష్మి ముందుకొస్తుందే గానీ, పెద్దింటోళ్ళు నోళ్ళు కుట్టేసుకుంటారు. ఇదీ మధ్యతరగతిఎస్కేపిజమ్’, శుష్క్రియాప్రియులూ, శూన్యహస్తాలూ!

ఈ తత్త్వం మీద రచయిత్రి నిరసనగళం చాలా బలంగా ధ్వనిస్తుందీ కథలో.

మీ తీర్పేమిటి?’ కథలో సునీతకీ రవికీ వివాహం జరిగింది. కానీ మనసులు కలవని సంసారం అయింది. సునీతీ డాక్టర్ ప్రహ్లాద్ ఒకట్టయ్యారు. రవీ విడాకులకి అడగలేదు. సునీతీ తీసుకోలేదు. రవి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఏళ్ళు గడిచినై, హఠాత్తుగా రవి నుంచీ లీగల్ నోటీస్. భార్యగా సునీతిని అంగీకరించడానికి తాను సిద్ధమేననీ, తామిద్దరూ చట్టబద్ధంగా విడిపోలేదనీ, సునీతికి దీనివెనుక కుట్ర అర్ధమైంది. తనను భయపెట్టి డబ్బు లాగడానికి పన్నిన పన్నాగం ఇది అని తెలిసింది. ‘స్త్రీకో న్యాయం, పురుషుడికో న్యాయం చేకూర్చినా దాన్ని గౌరవిస్తుందా? ఇదీ ప్రశ్న. ‘అసలు ఏది న్యాయం? ఏది ధర్మం? ‘తప్పెవరిది?’ అని తల పెట్టుకుని కూర్చుంది న్యాయవాది సునీతి! జరిగిన సంఘటనలకి కార్యచరణ సంబంధాలూ, హేతువులూ, విలువ వంటి చర్చలోకి దిగకుండా - స్త్రీ మనస్సు వేదనవరకూ పరిమితమై చూసినప్పుడు, కథలో సునీత అంతరంగ కల్లోలాన్ని చాలా శక్తివంతంగా ఆవిష్కరించారు రచయిత్రి.

పూరి గుడిసెల్లో నుంచీ పుట్టుకొచ్చిన సారా వ్యక్తిగత ఉద్యమం ఇంతవరకూ ఎదిగింది. ఎందరి పుస్తెలనో పుటుక్కు మనకుండా ఉండటానికి దోహదపడుతుంది. కానీ, మధ్యతరగతి కుటుంబాలుబ్రాందీ’, ‘రమ్రంగుల్లో కాలి మాడి మసయిపోతూ ఉంటే, నాగరికత ముసుగులో నలిగిపోవడం నోరు మెదపలేని నారీమణులకి ఎవరు, ఏ నినాదం ఇవ్వాలి? ఎలా పోరు సలపాలి? అనే విచికిత్స నుంచీ జనించిన కథ - ‘విప్పనిపెదవి’.

అఖిల భర్త ఇంజనీర్. తాగుడుకీ, ఇతర వ్యసనాలకీ బానిసైపోయాడు. పైగా శాడిస్ట్. ఆమెకు అతని నుంచీ లభించేది మానసిక, దైహిక హింస. దీనికి తోడు సాటి స్త్రీలు ఆమెకి గొడ్రాలనే బిరుదూ ఇచ్చి వేధించడం నేర్చుకున్నారు. స్వంత ఆడపడుచుమా వదిన ప్రవర్తన వల్ల అన్నయ్య ఇలా అయ్యాడనే ద్వందార్ధాల వక్రభాష్యం వల్లిస్తూ - మరింత క్షోభకి గురిచేస్తుంది. ఇదా మహిళాభ్యుదయం? స్త్రీ పురోగమనం?’ విప్పని పెదవి కథలో ఎంతో ఆర్తీ ఆవేదనా నిండి వున్నై. కథ పేరు కూడా శీర్షికాశిల్పంతో రాణించింది. ఎందువల్లనో కథలో అఖిల తన జీవిత భవితవ్యాన్ని గురించి ధృడమైన నిర్ణయాన్ని ప్రకటించదు. ఆమె మనస్తత్వంలో భర్త పట్ల పూర్తి కరుణారాహిత్యం లేదు. పురుషాధిక్యత పట్ల తీవ్రమైన నిరసన ఉన్నప్పటికీ దాంపత్యధర్మంలో సామరస్య ధోరణికే రచయిత్రి పట్టం కట్టగట్టడం గమనించదగ్గ అంశం. జీవితంలో స్త్రీ, పురుషుల మమత, అనురాగం, ఆనందం, గౌరవం ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలనేది ఆమె ఆశయం అని శారదా అశోకవర్ధన్ కథల మీద తమ అభిప్రాయం వెలుబుచ్చారు. సుప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం. కథానిక ద్వారా రచయిత వ్యక్తిత్వం, మనస్తత్వం, జీవనతాత్త్వికత అంచనా వేయవచ్చు కనుక, రాజారాంగారి అభిప్రాయం ఎంతో విలువైనదిగా భావిస్తాను నేను. శారద గారి భావధారలో సమన్వయ భావన జాలుగా ఉంది.

వైవాహిక జీవిత సమస్యల నుంచీ, సామాజిక అర్ధిక సమస్యల వరకూ వస్తువైవిధ్యాన్ని పుష్కలంగా సంతరించుకొని వున్న మంచి కథల్ని అధిక సంఖ్యలో చదువరులకు పంచారు అశోకవర్ధన్. వీటన్నిటా ఆమె అనుభవమూ, అధ్యయనశీలం, పరిశీలనా దృష్టీ సాంద్రంగా నిండి ఉండి, ఆ కథల్ని తేజోవంతం చేశాయి. ఆమె కథాకథనం సహజంగా సాగుతుంది. మీ తీర్పేమిటి? వంటి కథల్లో ఎక్కువ భాగం సంభాషణా విధానంలో సాగి శిల్పానికి వన్నె కూర్చింది. కళ్ళలోకి చూస్తూ ఆత్మీయంగా పలకరించే ఆప్తురాలిలా అక్షరాలు కూర్చగల శైలి ఆమె నైపుణ్యానికి తార్కాణం. కథారచన ఆమెకు ఆత్మీయం కావడం చదువరుల అదృష్టం.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 






సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech