కథా భారతి  
     

    అసిధారావ్రతం


 - రచన: గన్నవరపు
 
 

సంద్యాసమయం కాబోతోంది! హేమంతం కావడంతో అప్పటికే మంచు కురవడం ప్రారంభమైంది; నేను బస్టాండ్ లో బస్సు దిగి రమణరజు ఇంటికి ఆటోలో బయలుదేరాను. అతను ఊరికి దూరంగా ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. నేను అక్కడికి చేరుకునేసరికి అతను ఇంటి ముందర మొక్కలకు నీళ్ళు పెడుతూ కనిపించాడు, నేను ఆటో దిగుతూనేనమస్కారం అనడంతో అతను ఆపైపుని అక్కడే వదిలేసి గేటు తెరిచాడు.

నా పేరు ఇంద్రనీల్! నేనునవజ్యోతి పత్రిక సబ్ ఎడిటర్ని. ఆర్నెల్ల క్రితం చింతపల్లి ప్రాంతంలో జరిగిన నర్స్ హత్యోదంతం గురించి మీతో మాట్లాడాలనివచ్చాను’. అని నేను చెబుతుండగానే, రండి లాన్ లో కూర్చుని మాట్లాడుకుందాం. అంటూ ప్రక్కనే ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఉన్న ఉయ్యాల దగ్గరకు తీసుకెళ్ళాడు రమణరాజు.

ేను అతని వెంట నడుస్తూ ఇంటి పరిసరాల్ని గమనించాను. పచ్చని కొండల మధ్య పర్ణశాలలా ఉందాఇల్లు. ఇద్దరం ఉయ్యాలలో కూర్చుని మాట్లాడుతున్న సమయంలో అతని భార్య ఇద్దరికీ కాఫీలు తెచ్చింది. కాపీ త్రాగుతూ రమణరాజు చెప్పడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు చెప్పండి? అయినా ఇప్పుడు నేను నా ఎస్సై పదవికి రాజీనామా ఇచ్చేశాను. ప్రశాంతంగా ఉంటుందనీ మా స్వంత ఊర్లో ఇలా దూరంగా ఇల్లు కట్టుకుని ఉంటున్నాను. అదీగాక నర్స్ వెంకటలక్ష్మి హత్య జరిగి అప్పుడే సంవత్సరం కాబోతోంది. బహుశా ప్రజలందరూ విషయాన్ని మరచిపోయినట్లున్నారు; ఇప్పుడు మళ్ళీ ఆవిడ కేసు గురించి ఇంతదూరం రావడానికి కారణం? కాఫీ కప్పు క్రిందపెడుతూ అన్నాడు రమణరాజు.

మీరు చెప్పింది నిజమే, కానీ హత్యకేసులో ప్రథమ ముద్దాయి ఒక మాజీ మంత్రి కొడుకు. త్వరలో వాళ్ళ తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నవాడు, అప్పట్లో కేసుని చాలా ధైర్యంతో పరిశోధించి అతని మీద ఎఫ్..ఆర్. నమోదు చేశారు మీరు. తరువాత అతని అరెస్ట్, మళ్ళీ బెయిల్ మీద విడుదలవడం. ఇలా చాలా జరిగిపోయాయి. ఇప్పుడా కేసు సెషన్స్ కి రాబోతోంది. మా పరిశీలనలో మీ పోలీస్ శాఖ అతని మీద ఛార్జిషీటు దాఖలు చెయ్యడానికి చాలారోజులు సమయం తీసుకుందనీ, అదీగాక కావాలనే సరియైన ఆధారాలు సమర్పించలేదనీ అందువల్ల కోర్టులో కేసు వీగిపోయి అతడు నిర్దోషిగా బయటపడటం ఖాయం అనీ తేలింది. ఒకవేళ అదే నిజం అయితే అంతకన్నా ఘోరమైన విషయం ఇంకొకటుండదు. కామాంధకారంలో అధికార దర్పంతో ఒక అమాయకురాలైన గిరిజన యువతిని మానభంగం చేసి హత్య చేసిన ప్రభుద్దుడికి శిక్ష పడకపోతే ఇంక చట్టాలూ, ప్రభుత్వాలూ దేనికి చెప్పండి. ఒకవేళ అతను నిర్దోషిగా బయటపడితే వాడు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రికావడం ఖాయం? అదే జరిగితే మన ప్రజా స్వామ్యానికి మంచిదంటారా చెప్పండి? అందుకే కేసుని మళ్ళీ తిరగదోడి ప్రజలకు నిజం చెప్పాలనీ మా పత్రిక యాజమాన్యం నిర్ణయించింది. సమయంలో మీరే ఆ కేసుని పరిశోధించిన ఎస్సై కాబట్టి మీదగ్గరకు వచ్చాను. మీ కభ్యంతరం లేకపోతే రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పండి? మీరు చెప్పినట్టు ఎక్కడా వ్రాయంలెండి? అన్నాను సుదీర్ఘంగా వివరణ ఇస్తూ...

నా మాటలు రమణరాజు మీద చాలా ప్రభావం చూపినట్లున్నాయి. కాసేపటి దాకా అతనేం మాట్లాడలేదు. తరువాత మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఇంద్రనీల్ గారు నిజానికి నేను పోలీస్ శాఖలో చేరకపోయి ఉటే బహుశా పాత్రికేయ వృత్తిలో స్థిరపడే ఉండేవాణ్ణేమో! ఎందుకంటే చిన్నప్పట్నుంచి నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. అప్పట్లో మా ఊరి గ్రంధాలయంలో పత్రికనూ, పేపరును వదిలిపెట్టకుండా చదివేవాణ్ణి. కాకపోతే అప్పట్లో దినపత్రికలు వాస్తవాలు వ్రాసేవి. ఇప్పుడు తమ అభిప్రాయాలను రుద్దుతున్నాయి. అవన్నీ సరే, రోజు ఏం జరిగిందో చెప్పమన్నారు. చెబుతాను.. అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.

* * *

నాలుగేళ్ళ క్రితం ఏజెన్సీ ప్రాంతంలో నేను ఎస్సైగా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడుకు నవజీత్ తన అనుచరులతో వచ్చి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో దిగాడు. అతని తండ్రికి ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉండటంతో అతనికి సహాయం కావాలన్నా చెయ్యాలనీ మా పై అధికారుల నుండీ మాకు ఆదేశాలు రావడంతో ఇద్దరు కానిస్టేబుల్స్ ని రెస్ట్ హౌస్ కి పంపాను.

ఉదయం వారు అడవికి వేటకు వెళ్ళి సాయత్రం అవుతుండగా మళ్ళీ వచ్చారు. రాత్రి భోజనాలకు ముందు నవజీత్ కి విదేశీ మద్యం కావాలంటే మా వాళ్ళు తెచ్చిపెట్టారు. అలా అతను స్నేహితులతో రాత్రి పదకొండు గంటల దాకా మద్యం తాగుతూ ఉండిపోయాడు. అప్పటికే అతను పూర్తిగా మత్తులోకి జారిపోయాడు. కళ్ళు ఎర్రగా మారిపోయి మాటలు తడబడుతున్నాయి. తరువాత భోజనానికి వచ్చాడు. కానీ భోజనం చేస్తుండగా అతని స్నేహితుడొకరికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఎవర్నైనా డాక్టర్ ని తీసుకురమ్మని మా కానిస్టేబుల్స్ ని పంపించారు. కానీ ఇక్కడి పి.హెచ్.సి.లో ఆర్నెల్లనుంచీ డాక్టర్లెవరూ లేరు. కేవలం నర్స్ వెంకటలక్ష్మి దాన్ని నడుపుతోంది. వెంటనే మావాళ్ళు ఆమెను తీసుకువచ్చి అతనికి మందులిప్పించారు. అప్పటికే రాత్రి పన్నెండు గంటలైంది. ఆమెని మా వాళ్ళు కొద్ది దూరం వరకు దిగబెట్టి వెనక్కు వచ్చేసారు. కానీ తెల్లవారేసరికి ఆమె రెస్ట్ హౌస్ ప్రాంతంలో ఘోరంగా మానభంగం చేయబడి హత్యకు గురైంది. నా పరిశోధనలో మా కానిస్టేబుల్స్ ఆమెని వదిలిరాగానే నవజీత్ బృందం వెనుక నుంచి ఆమెని వెంబడించి రెస్ట్ హౌస్ కి బలవంతంగా తీసుకొచ్చి మానభంగం చేసి ఆమె ప్రతిఘటించడం వల్ల హత్య చేశారు. మొదట్లో నా మీద రాజకీయ వత్తిళ్ళు వచ్చినా ఆధారాలన్నీ సేకరించి నవజీత్ బృందాన్ని అరెస్ట్ చేశాను.

కాకపోతే తరువాత మా శాఖ నన్ను చాలా వేధించింది. సరిగ్గా పరిశోధించలేదనీ ఛార్జిషీటిచ్చి సస్పెండ్ చేసింది. తరువాత డ్యూటీలోకి తీసుకుని చాలా దూరంగా ట్రాన్శ్ఫర్ చేసింది. అందుకే నేను విసిగిపోయి వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాను. ఇది మా శాఖలోమామూలే సార్. మేము మా విధిని సక్రమంగా నిర్వహించక తప్పదు. ఒకవేళ సరిగ్గా నిర్వహించినా రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉంటూనే ఉంటాయి. ఉద్యోగం అసిధారావ్రతం. చాలా కష్టంతో కూడినది. ఇక వాడికి బెయిల్, నేర నిరూపణ సాక్ష్యాలూ ఇవన్నీ ఒక ప్రహసనం. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ కావడం వల్లనూ, మధ్యలో ఎందరో ఆఫీసర్స్ మారిపోతుండడం వల్లనూ న్యాయం సరిగ్గా జరగదు. బహుశా అతని విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. అయినా డబ్బుకి ప్రలోభపడి చాలామంది సాక్ష్యం చెప్పడానికి రారు అదికూడా కేసు బలహీనపడటానికి ఒక కారణం. .. సుదీర్ఘంగా చెప్పుకుపోసాగాడు రమణ.

* * *

నేను రమణ రాజు దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పాతకేసు వివరాలు రోజు ప్రచురించడం మొదలు పెట్టాము. మాజీ మంత్రి గారి కొడుక్కి క్లీన్ చిట్ .. పోలీసుల నిష్క్రియా పరత..అంటూ ఎన్నో వార్తలు, ఒక గిరిజన మహిళకి అందని న్యాయం అంటూ సంపాదకీయాలు వ్రాసింది మా పత్రిక.

దాంతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ కదలిక. ముందుగా చిన్న కుదుపు. తరువాత నిరసనలు ప్రారంభమయ్యాయి. తరువాత ప్రభుత్వం కళ్ళు తెరిచి సభా సంఘాన్ని నియమించింది.

* * *

ఇదీ జరిగిన కథ. నేను వ్రాసిన పరిశోధనాత్మక కథనం సమాజంలో చాలా సంచలనం రేపింది. ఒక జర్నలిస్ట్ గా నాకు పని పూర్తి సంతృప్తినిచ్చింది. నేను చెబుతుంటే అతను శ్రద్ధగా వింటున్నాడు. నేను కూర్చున్నది ప్రముఖ పత్రికజాగరణ సంపాదకుడు రఘువీర్ రూమ్ లోచాలా సేపట్నుంచి అతను నేను చెప్పిన కథ శ్రద్ధగా వింటున్నాడు.

కొద్దిసేపటికి అతను నోరు తెరిచి, ఇంద్రనీల్, నీ వల్ల పేపర్ కి అంతటి మంచిపేరు వస్తే నువ్వెందుకు పత్రిక నుంచి బయటకు వచ్చేశావ్? అని అడిగాడు.

నేను వ్రాసిన కథనం పేపరులో వచ్చిన పది రోజుల తర్వాత పత్రిక యజమాన్యపు వైఖరిలోమార్పిని గమనించాను. మొట్టమొదటి సారిగా ఛీఫ్ ఎడిటర్ గారు నన్ను తన గదికి పిలిపించి సరైన ఆధారాలు లేకుండా ఎందుకు అటువంటి కథనాలు వ్రాసావు. ఇంకెప్పుడూ అటువంటి కథనాల జోలికి పోవద్దనీ నా మీద కోప్పడ్డాడు. మరో వారం రోజులకు నన్ను హెచ్. ఆర్. సెక్షన్ కి బదిలీ చేశారు. అక్కడ పనిచెయ్యడం ఇష్టం లేక నేను పత్రికకి రాజీనామా చేసి బయటకొచ్చేశాను.

అదిసరే, మొదట తమకిష్టమై ప్రచురించిన కథనాల విషయంలో యాజమాన్యం వైఖరి ఎందుకుమారింది? నేను పనిచేసిన పత్రిక కూడా అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖుడిది; బహుశా అతని మీద పైనుండి వత్తిడి ఉండవచ్చు.

ఎప్పుడైతే నేను వ్రాసిన ప్రభుత్వ వ్యతిరేక కథనాలు సంచలనం కలిగించాయో వెంటనే ప్రభుత్వంలోని కొందరు కీలక పెద్దలు నష్టనివారణ చర్యలు చేపట్టడానికి రంగంలోకి దిగారు. మా పత్రిక ఛైర్మెన్ ముఖ్యమంత్రికి దగ్గరివాడు కావడంతో అటువంటి వార్తలు ఇంక ప్రచురించవద్దని ఆదేశించడంతో యాజమాన్యం వెనక్కి తగ్గక తప్పలేదు. నిజానికి నవజీత్ అంటే మా ఛైర్మెన్ కి మొదట్నుంచీ పడదు. అందుకే అతని మీద ఎన్నో వ్యతిరేక కథనాలు వ్రాసింది. కానీ ఎప్పుడైతే అవి తమ పార్టీ ఉనికికే ముప్పు తేబోతున్నాయని తెలియగానే ఇక శతృత్వాన్ని వెనక్కి పెట్టి అతనికి అండగా నిల్చింది. నేను చెబుతుంటే రఘువీర్ నిశ్శబ్దంగా వినసాగేడు.

జర్నలిస్ట్ వృత్తి పట్ల ఎంతో గౌరవంతో ఆపేపర్లో చేరాను. ప్రెస్ అంటే ఫోర్త్ ఎస్టేట్ అనీ జర్నలిజం చదువుతున్నప్పుడు తెలుసుకున్నాను. వృత్తి చాలా నిజాయితీతో కూడుకున్నదనీ, దీనితో అవినీతిని రూపుమాపవచ్చనీ, నిజాల్ని బయటకు తీసుకురావచ్చనీ ఎన్నో కలలు కనీ వృత్తిలోకి ప్రవేశించిన నాకు అతి కొద్ది కాలంలోనే చేదు అనుభవాలు ఎదురవడం నాకు చాలా బాధగా ఉంది సార్!. చెబుతూ మధ్యలో ఆగాను.

నువ్వు చెప్పిన విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను మిస్టర్ ఇంద్రనీల్. మొదట్లో నాకు కూడా నీలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఎప్పుడైతే పత్రికలు రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తున్నాయో అప్పట్నుంచీ పత్రికల్లో విలువల పతనం ప్రారంభమైంది. ఇప్పటి పత్రికలకు నిజాలు అక్కర్లేదు. వాళ్ళకు సంచలనాలు కావాలి. వాటితో రాజకీయనాయకుల్ని పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు గడుస్తున్నాయి. కళ్ళజోడుని తీసి టేబుల్ మీద పెడుతూ అన్నాడాయన. ఒకప్పుడు ఆయన రాష్ట్రం లోనే ప్రముఖ సంపాదకుడాయన. అతని పేరు చెబితేనే అవినీతి అధికారులు భయపడేవారు. అతను రాసే విశ్లేషణాత్మక వ్యాసాలకోసం మేథావులు ఎదురు చూసేవారు. కానీ వ్యవస్థలో రాను రాను అవినీతి పెరిగిపోవడంతో ఇప్పుడు మౌనం దాల్చేడు. మేథావుల మౌనం దేశానికీ మంచిది కాదన్న విషయం అతన్ని చూస్తే అర్ధమౌతోంది.

మీ వేదన నాకర్ధం అయ్యింది రఘువీర్ గారు. కానీ నాకు చిన్నప్పట్నుంచీ జర్నలిస్ట్ నవ్వాలనీ నాకు చాలా కోరికగా ఉండేది. అందుకే నాకు ఇంజనీరింగ్ లో మెరిట్ లో సీటు వచ్చినా ఏరికోరి జర్నలిజంలో జాయినయ్యాను. దేశాన్ని శాసించే నాలుగు ప్రధాన వ్యవస్థల్లో ఒకటైన ఫోర్త్ ఎస్ట్ ట్ రాజకీయ నాయకుల చేతుల్లో నలిగిపోతుండడం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి వృత్తిలో చేరితే సమాజంలోని అన్యాయాల్ని ఎత్తిచూపి ప్రజలకు మంచి చెయ్యచ్చనిపించేది. కానీ అదెంత కాష్టమో ఇప్పుడు తెలుస్తోంది. మీలాంటి మేథావులు చాలా రోజుల్నుంచీ నిర్లిప్తంగా ఉండడం చూసి బాధపడేవాణ్ణి. కానీ స్వీయ అనుభవం వల్ల నిర్లిప్తతకి కారణం తెలుసుకుని విచారిస్తున్నాను. అయినా సరే మీలాంటి గొప్పవారున్న చోట కొంతైనా విలువలు ఉంటాయనీ అందుకే మీరు సంపాదకులుగా ఉన్న పత్రికలో చేరుదామనీ వచ్చాను.’ అన్నాను చాలా ఆవేశంగా.

నీలోని ఆవేశం నాకర్ధమయ్యింది. కాకపోతే నీలాంటి నిబద్ధత ఉన్న యువ పాత్రికేయులు నిజాలు వ్రాసే పత్రికలకు కావాలి. కానీ నువ్వనుకుంటున్నట్లు మా పత్రిక కూడా నిజాలు వ్రాయటం లేదు. ఇది నువ్వు పనిచేసిన పత్రికకు ఏమాత్రం తీసిపోదు. ఇది కూడా అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి గారిది. కాబట్టి ఇందులో పనిచెయ్యడం నువ్వనుకుంటున్నంత సులభం కాదు. దీనిలోనే కాదు పత్రికలోనైనా రోజుల్లో జర్నలిస్ట్ వృత్తి అసిధారావ్రతం లాంటిది. కాబట్టి విషయాన్ని గుర్తుంచుకుని నీ నిర్ణయం చెప్పు అన్నాడతను కుర్చీలో వెనక్కు వాలుతూ...

అతను చెప్పిన విషయాలు విన్న తరువాత నాలో అంతర్మధనం మొదలైంది. మళ్ళీ నేను పనిచేసిన పాత పత్రికల లాంటి దాన్లో చేరితే మళ్ళీ పాత అనుభవాలు పునరావృత్తమవుతాయనిపించింది. అయినా ఇవాళ అన్ని పత్రికలు ఇలాగే ఉన్నాయి. వీటిలో తనలాంటి వాడు ఇమడలేడు.

మీరు చెప్పింది నిజమే సార్! అందుకే నాకు ఒక వారం రోజులు సమయం కావాలి. తరువాత నా నిర్ణయాన్ని చెబుతాను అంటూ ఆయన దగ్గర శలవు తీసుకుని బయటకొచ్చాను.

బయటకొచ్చిన తర్వాత నా జేబులోని పెన్నుని తీసి రోడ్డు మీదకు విసిరేసి గబగబానడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech