కథా భారతి  
    

          ప్రాయశ్చిత్తం

 రచన: లక్ష్మి మాధవ్

 

 

 

ఆటో ఇంటీ ముందాగింది. ప్రసాదు ఓ కిట్ బ్యాగు, ఓ పెద్ద సూట్కేసు తీసుకుని అందులోంచి దిగాడు. ఆటోకి డబ్బు చెల్లించి ఇంట్లోకొచ్చాడు. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. అతను బయల్దేరే ముందు పడ్డ హడావిడికి చిహ్నంగా వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి, వాటిని అలా చూస్తుంటే వద్దన్నా అతని మనస్సు ఊరెళ్ళేటప్పటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతోంది. ఇల్లు వదిలి పదిహేను రోజులు దాటడంతో అన్ని వస్తువుల మీదా దుమ్ము పేరుకుని ఉంది. ఫాన్ వేసుకుని అలసటగా వెనక్కి వాలాడు పడ్డక్కుర్చీలో.

- - -

తను ఆ రోజూ ఎప్పటి లాగే ఆఫీసుకి తెముల్తూ షేవింగ్ చేసుకుంటున్నాడు. ఫోన్ మ్రోగింది. తమ ఊరినించి తండ్రి....!. ఎప్పుడూ లేనిది ఈ టైంలోఎందుకు చేస్తున్నారా?? అనుకుంటూనే తీసాడు.

"ప్రసాదు బాబూ..." అంటూ రంగయ్య ఆదుర్దాగా ఒగరుస్తున్నాడు.

చెప్పు రంగయ్యా...ఎమి జరిగింది అన్నాడు అతను.

"బాబూ...రోజూ నేను పన్లోకి వచ్చేసరికి బాబుగారు తోటలో పనిచేస్తూనో, లేక పేపరు చదువుకుంటూనో వుంటారు, కాని ఈ రోజు నేను వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. ఎంత కొట్టినా తలుపులు తీయలేదు. కిటికీలోంచి సూత్తే ఇంకా పండుకొనే ఉన్నారు.ఎంత లేపినా లేవక పోయేసరికి పక్కింటి మేట్టార్ని పిలిసానండయ్యా...

"ఇద్దరం కలిసి తలుపులు బాదినా తియ్యకపోయేసరికి, బయమేసి తలుపులు బద్దలకొట్టుకుని లోనికెళ్ళాం . అయినా ఉలుకూ పలుకూ లేకపొయ్యేసరికి డాటర్బాబుకు కబురంపామండయ్యా...."అనాడు రొప్పుతూ.

మళ్ళీ అందుకుని"బాబూ నాకు ఎందుకో బయంగా ఉంది, నువ్వు ఎంటనే బయల్దేరి వచ్చై" అంటూ బావురుమన్నాడు.

"సరే రంగయ్యా... నేనూ వెంటనే బయల్దేరుతాను, హైదరాబాదు నుంచి ఇందిరమ్మ గార్ని కూడా వెంటనే రమ్మంటాను. నువ్వు డాక్టరు రాగానే నాకు పరిస్థితి చెప్పు" అన్నాడు ప్రసాదు.

హడావిడిగా నాల్గు బట్టలు కిట్ బ్యాగులో కుక్కుకుంటూనే ఇందిరకి ఫోన్ చేసి, ఓ వారం రోజులు సెలవు పెట్టి రమ్మని చెప్పాడు. బుస్టాండుకి వచ్చి దొరికిన మొదటి బస్సులో పడ్డాడు

బస్సులో టిక్కట్టు కొని సీట్లో కూర్చున్నాడే గాని మనస్సు ఆదుర్దాగా పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. అలా ఉండగానే మళ్ళీ రంగయ్య ఫోను చేసాడు. డాక్టరు వచ్చి చూసి నిద్రలోనే హార్టు ఫైలయి ప్రాణం పోయిందని తెలిపారని చెప్పాడు. దుఖంతో పూడుకు పోతున్న గొంతుతో. ప్రసాదును సాధ్యమైనంత త్వరగా ఊరుకి చేరుకోమని చెప్పి, ఈలోగా తను జరగవలసిన వాటికి ప్రయత్నాలు చేస్తానని చెప్పాడు. జరిగినది తల్చుకుంటే ప్రసాదుకు నమ్మశక్యంగా లేదు. మనస్సంతా భారంగా అయిపోయింది.

'ఎంత పని జరిగింది.... తన తల్లి పోయాక తనకంటూ ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు....ఇప్పుడు ఆయన కూడా తనని వదిలి వెళ్ళిపోయారు...! ఇప్పుడెలా?' అంటూ మనస్సు భోరుమంది .

అయినా జీర్ణించుకోక తప్పలేదు. కొంత సేపట్లో తన తక్షణ కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుని సెల్లు నుంచే తండ్రికి సంబంధించిన చుట్టాలకూ బంధువులకు ఫోన్లు చేసి వార్త తెలియపరిచాడు. చుట్టుపక్కల ఊళ్ళలోని కొంత మందిని తప్పించి, పెద్దగా రావలసిన వాళ్ళు కూడా అంతగా తోచలేదతనికి. తండ్రి స్నేహితులలో చాలా మంది అప్పటికే స్వర్గస్థులవ్వటంతో పొరుగూరి నించి వచ్చే ఆప్తులు కూడా అంతంత మాత్రమే.

ఆయన భార్య పోయినప్పటి నుంచీ రంగయ్య కుటుంబం సాయంతో కాస్తంత ఉడకేసుకుని తింటూ పల్లెటూరిలో కాలక్షేపం చేస్తున్నారాయన. ప్రసాదు తన దగ్గరకొచ్చేయ్యమని ఎంతగా చెప్పినా ఆయన పట్టించుకునేవారు కారు.

"అసలే నీకు కోడలికీ వేరే వేరే ఊళ్ళలో ఉద్యోగాలు, మీరిద్దరూ ఆ ఊళ్ళ మధ్య తిరగటం ఒక వంతైతే , అవి కాక వచ్చే బదిలీల తిప్పట మరికొంత.....ఈ మార్పులకి నేను అలవాటు పడలేను లేవయ్యా! ఏదో నాకు అలవాటైన ఊళ్ళో నాకు కాలక్షేపానికి ఏ కొదవా ఉండదు, కాబట్టి ఏదో భరతుకి సెలవలు వచ్చినప్పుడు మీరు ముగ్గురూ ఓ పదిరోజులు వచ్చి వెళితే అదే నాకు పండగ" అనేవారు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు.

"అయినా నాకు కాలో చెయ్యో మూల పడితే, దేవుడు అంతదాకా ఉంచి శిక్షిస్తే...,అపుడు ఇంక ఎలాగూ మిమల్ని ఇబ్బంది పెట్టి మీ పంచకు చేరక తప్పదు... అప్పుడు అక్కడికే వచ్చి వుంటానులేరా...బాబూ..."అనేవారు మరీ బలవంత పెట్టినప్పుడు.

ప్రసాదుకు ప్రతీ ౩ సంవత్సరాలకీ ట్రాన్సుఫర్లయ్యే ఉద్యోగం. ఇందిరకి బ్యాంకులో ఉద్యోగం. ఇద్దరికీ మంచి ఉద్యోగాలే, కాని వేరే వేరే ఊళ్ళలో కావటంతో ఎలాగైనా ఒకే ఊరుకి మార్పిడీ చేయించుకునే ప్రయత్నాలు నిరంతరం చేస్తూండేవారు వాళ్ళు.

ప్రతీ ఏటా వేసవి సెలవల్లో భారత్ ని తీసుకుని వచ్చి ముగ్గురూ ఆయన వద్ద ఓ నెల్లాళ్ళు గడిపేవారు. దానికే ఆయన ఎంతగానో సంబరపడేవారు. పొలం నుంచి తేగలు, ముంజిలూ, మామిడి పళ్ళూ... ఇలా వాళ్ళు ఉన్న నాలుగు రోజుల్లోనే తనకి తోచినవన్నీ తెచ్చి అబ్బరం చెసేవారాయన.

భరత్ కు ప్రసాదు చిన్నపప్పటి విషయాలు ఎవేవో పూసగుచ్చినట్లు చెప్పేవారు. అప్పటికే ఆ విషయాల్ని ప్రసాదూ ఇందిరా ఎన్నోసార్లు విని వుండటంతో కంఠస్తం వచ్చేసిన ఆ విషయాల సందర్భం రాగానే ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని గుంభనంగా నవ్వుకునేవారు. భరత్ కి అవి కొత్త విషయాలు కావటంతో అతను వాటిని ఎంతో ఆసక్తిగా వినేవాడు.

కొన్ని విషయాలు విన్నవే అయినా పూర్వకాలపు రోజులతో ముడిపడిన విషయాలు అతనికి వినోదంగానూ, వింతగానూ అంపించేవి. ఆయన కూడా అప్పటి ధరలూ, అప్పటి రివాజులూ, పధ్ధతులూ వల్లె వేస్తూ మానసికంగా ఆ రోజులలో విహరిస్తూ మనవడికి కూడా చెప్పి పొంగిపోయేవారు.

చాలా కుటుంబాలలో తాతా, బామ్మ, అమ్మమ్మ మనవల స్నేహం చాలా గొప్పగా ఉండటానికి కారణం ఒకరికి తెలీయని విషయాలని మరొకరు ఆసక్తిగా వివరించటమేనేమో....!తల్లి తండ్రులకీ, పిల్లలికీ సంబంధించిన బాల్య విశేషాలు కొన్ని ఉన్నప్పటికీ అవి ఇంచుమించుగా ఇద్దరికీ ఎరుకైన విషయాలే కావటంతో పెద్దగా రక్తి కట్టవు. అదే మనవల విషయంలో వారికి పూర్తిగా అపరిచితమైన సంఘటనల్ని, దేశ కాల పరిస్థితుల్నీ విపులంగా చెప్పటం ద్వారా ఆసక్తిగా వినే శ్రోతలు వృధ్ధులకి లభించటంతో వారు మనవలకి, మనవలు వారికీ సన్నిహితులవుతారు.

కొడుకు, కోడలు, మనవడి సామీప్యం ఆయనకి ఎంతగానో తృప్తి, భద్రతా సంతోషాల్నిచ్చేదిగా ఉన్నప్పటికీ , దాన్ని చిరంగా మార్చుకోవటానికి ఆశ పడి వారిని అక్కడే ఉండి పోమని గాని, వారితో తను ఉండటానికి అనుకూలంగా వారి ఉద్యోగాలలో మార్పులు చెసుకోమన్న ప్రమేయం గాని, తీసుకొచ్చేవారు కాదాయన. వారిని తన ధొరణితో తనకు అనుకూలంగా మారమని, వారిచే దూషింపబడే స్థితి రప్పించుకోకుండా, తను స్వతంత్రంగా ఉంటూ వారి భావాల్ని కూడా మన్నించేవారు.

భార్య పోయిన కొత్తలో ఊళ్లోవాళ్ళు ఆయన ఒంటరిగా ఉండటం చూసి చెవ్వులు కొరుక్కునేవారు. ఇల్లు, పొలం పుట్రా అన్నీ ఉండి, ఒక్కడే కొడుకై ఉండి కూడా తండ్రిని తనతో తీసుకుని వెళ్లక పోవటాన్ని గురించి తమకు తోచిన కధలల్లి మాట్లాడుకునేవారు. కాని ఆయన వాటిని ఖాతరు చేయక తన పని తానూ చేసుకుంటూ, కుదిరినంత మరొకరికి సహాయం చేయటాన్ని గమనించిన ఊరివాళ్ళు క్రమేపీ నోళ్ళు మూసుకున్నారు. మితభాషిగా ఉంటూనే అందరికీ మేలుచేసి అందరికీ తలలో నాలుకయ్యారు.

అందరి గౌరవాభిమానాలని చూరగొన్న వ్యక్తి అంతిమ దర్శనం కోసం ఊళ్లోవాళ్ళు చాలా మంది వచ్చారు. తమ సంతాపాన్ని వ్యక్తపరిచి ఆయన్ని సాగనంపే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .

ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో బ్రతికిన ఆయన మళ్ళీ సజీవంగా ఆ ఇంట్లో ఇక నడయాడరన్న ఆలోచన రాగానే రంగయ్య బెంగతో భోరున ఏడ్చేసాడు. అతన్ని చూడగానే అంతవరకూ ఏ భావోద్వేగానికి తావివ్వక జరగవలసినవాటిపై అజమాయిషీ చేస్తూ తన విధులను తాను చేస్తున్న ప్రసాదుకు కూడా ఏడుపు ఆగలేదు. వచ్చినప్పుడల్లా తననే అంటిపెట్టుకుని ఉంటూ, ఆప్యాయత కురిపించే తాతగారి దేహాన్ని ఇంటినుంచి తరలించటాన్ని చూడలేనట్లు మనవడు భరత్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా, ఎంతో డిసిప్లీనుతో తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండే ఆయన, ఆఖరు వరకు తన దినచర్య నెరవేర్చుకొని మరీ, సుదీర్ఘ విశ్రాంతిలోకి జారుకొని, తన అధ్యాయాన్ని సమాప్తి చేసుకున్న తీరుని తల్చుకుని ఇందిర కూడా కన్నీరు మున్నీరు అయింది.

వారందరూ ఆ ఇంట్లో లోపిస్తున్న ఆయన ఉనికికి బాధ పడినా, ఏ లోటూ రాకుండా నలుగురికీ మేలు చేస్తూ సంతృప్తిగా సంతోషంగా జీవించిన నిండయిన జీవితం, ఎవ్వరికీ భారం కాకుండా ఆయన కోరినట్లే లభించిన సునాయాస మరణం, వీటితో ఆయన ఆత్మకి శాంతి కలగాలని వేడుకున్నారు ఆయన జ్ఞాపకాలతోనూ, కర్మకాండలతోనూ. దినవారాలతోనూ పది రోజులు గడిచాయి.

ప్రస్తుతానికి పొలం, ఇల్లు, అన్ని విషయాలు రంగయ్య మీద వదిలి తను ఇటు వచ్చాడు ప్రసాదు. ఇందిర, భరత్ హైదరాబాదు వెళ్లి పోయారు. తండ్రి ముఖ్యమైన కాయితాలు, బట్టలు దాచుకునే సూటుకేసు మాత్రం తనతో తీసుకుని వచ్చాడు ప్రసాదు. తీరికగా అందులోని కాయితాలని తీసి భద్ర పరచవచ్చని అనుకున్నాడు. ఆయన బట్టల్ని ఎదైనా వృధ్ధాశ్రమంలో ఇవ్వాలని అతను ఊరినించి వచ్చే ముందే నిర్ణయించుకున్నాడు.

పదిహేను రోజులకి పైగా లీవు తీసుకోవటంతో ఆఫీసులో తను చక్క పెట్టవలసిన పనుల మీద దృష్టి మళ్ళించాడు. ఆ విధంగా తండ్రి ఆలోచనల నుండి మనస్సుకి కూడా మార్పు, ఊరటా చేకూరాయి.

ఓ వారం తర్వాత ఓ ఆదివారం నాడు వ్రుధ్ధాశ్రమం పని గుర్తుకు వచ్చి మళ్ళి సూటుకేసు తీసాడు. అప్పటికే ఆయన పోయి దరిదాపులుగా నెలవుతోంది. అంటే ఆయన ఆలోచనలతో తన ఆలోచనలని మేళవించి, సంభాషించి అన్ని రోజులవుతోందన్న మాట. సూటుకేసు తేరవగానే ఆయన సమక్షంలో తనకు దొరికే ఆప్యాయత, ప్రీమలను మళ్ళీ చవి చూస్తున్నట్లొక అనుభూతి. ఆయన రోజూ వాడే సామాన్లని తను స్పృశిస్తుంటే అదో రకం బెంగతో భారంతో చేతులు తడబడ్డాయి, కళ్ళంట గిర్రున నీళ్ళు తిరిగాయి.

తనూ, శ్రీమతి ఊరెళ్ళినప్పుడు ఆయన కొరకు తీసుకుని వెళ్లిన చొక్కాలు భద్రంగా వాడి మళ్లీ మడిచి కొన్నప్పటి ప్యాక్లోనే పదిలంగా దాచుకున్నారాయన. బట్టల అడుగున పదిలంగా దాచుకున్న పాత ఉత్తరాలు, దస్తావేజులు, ఎవేవో ఫైల్సు. ఓ కవరునిండా పాత ఫొటోలు. తను పాకడం మొదలు పెట్టినప్పటివి, తను స్కూల్లో తీసుకున్న సెర్టిఫికేటులు. భార్యా తను కలిసి ప్రసాదును ఎత్తుకొని తీయించుకొన్న ఫోటోలు, ఇలా ఆయన జీవితపు మధురస్ముతులు.... వాటిని స్మృతిపథంలో అపురూపంగా చిరకాలం దాచుకోవాలన్న ప్రయత్నం. వాటి మధ్య ఓ ఎర్ర ఫైలు కనిపించింది. అది మిగతావాటిలా పదే పదే స్పృశించి పాతబడ్డట్టు కాక, కొత్తగా ఉంది. ఆయనకి సాహిత్యం, పురాణాలు, సంస్కృతి వంటి విషయాలంటే కూడా ఆసక్తి ఉండటంతో, అటువంటివి తారస పడినప్పుడల్లా పత్రికలలో సేకరించి ఉంచటం అలవాటే. అలాగే ఎదో ఒకటై ఉంటుందని తీసి పక్కకు పెట్టాడు. ఐనా మళ్ళీ అది ఎమై ఉంటుందా అన్న కుతూహలంతో ఫైలును అప్రయత్నంగానే తిరగ వెయ్యటం మొదలు పెట్టాడు. దాంట్లోని పేపరు కట్టింగ్లను చూసి కంగు తినకుండా ఉందలేకపోయాడు!!!... ఎందుకంటే అప్పుడుగాని అతనికి ఆయన ఊరెళ్ళినప్పుడు కోరిన కోరిక జ్ఞాపకం రాలేదు...... ఎంత పని చేసాడు తను...????

అంత వృధ్ధాప్యంలో కూడా తన కోరికను తీర్చుకోవటానికి అవసరమయిన అన్ని విషయాలను ఆయనే సేకరించి, ఫైలులో పెట్టుకుని తను వచ్చినప్పుడు నొక్కి నొక్కి చెప్పారాయె!.. . తన మీద పెట్టిన అ చిన్న చివరి బాధ్యతని తను మరుపువల్ల విస్మరించాడు....!!! పోనీలే... అని మళ్ళీ సరిదిద్దుకునేలాంటి తప్పు కూడా కాదు. రెండు నిండు జీవాలను కారుమబ్బుల్లోంచి, బయటకు లాగి, జీవన పర్యంతం ఆవరించిన అంధకార బంధురంలోంచి ప్రకాశం వైపుకు తీసుకుని పోగల ఆ వరాల్ని,... తన తండ్రి ప్రకాశరావు గారి రెండు నయనాల్ని తను కట్టెలతో కాల్చేసాడు. కడుపు మెలి పెడ్తున్నట్లు వస్తున్న బాధ..!

తండ్రి నుంచి దూరమైన భావోద్వేగంలో పడి సమయానికి గుర్తురాక తను ఇద్దరి అంధుల ఎడ చేసిన అపారధం క్షమించరానిదిగా తోచిందతనికి. తన మరుపు అప్రమత్తత వల్ల ఆయన నేత్ర వీక్షణాలలో జీవితాంతం తను, తన కుటుంబం గడపగల్గిన సుఅవకాశాన్ని...అంటే ఆయన కను సన్నలలో తాము ఇంకా మసలుతున్నామన్న తృప్తిని చవి చూడగల అవకాశాన్ని కూడా కోల్పోవటమే కాక, ఇద్దరికి చూపును ప్రసాదించగల ఆ సదవకశాన్ని త్రుంచి వేసి, ప్రసాదన్న తన పేరుకే కళంకం తెచ్చేటువంటి తప్పును చేసేసాడు.

తన పాపానికి పరిహారం.....? చాలా సేపు మదన పడ్డాడు .....ఇక తను చయ్యగలిగిందల్లా ఒక్కటే. తను కూడా నేత్ర దానం చెయ్యాలి, ఇంకా పలువురి చేత చేయించాలి.... అంతే అప్పుడే ఆ ఇద్దరి అంధుల పాలిట చేసిన అపకారం నుంచి బయట పడగలడు. సమాజంలో పలువురికి ఈ విషయాలను గూర్చి జ్ఞానోదయం కలిగేలా ప్రచారం చెయ్యాలి. పట్టణాల్లలోనే కాక పల్లెటూర్లలో కూడా వ్యక్తి మరణించినప్పుడు తన తండ్రి విషయంలోలా కాక ఆ నిమిషంలో తక్షణ కర్తవ్యంగా ఆసుపత్రి వారికి తెలపటానికి జనంలో ఈ దిశగా ప్రచారం జరిగేలా చెయ్యాలి అనుకొన్నాడు.....తను చేసిన తప్పుకు పరిహారంగా తను చేపట్టి చేయగల అనేక ప్రాయశ్చిత్తాలతో అతని మనస్సు నిండి పోయింది.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech