సారస్వతం  
     గగనతలము-27  రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు  

మతాంతరాలు - పాఠాంతరాలు

         
ప్రకృతిలో అందరికన్నా తెలివైన వాడు మనిషి. జరిగే ప్రతి పనీ వాని గొప్పదనం వల్లనే అవుతోంది కానీ మరి ఏమిటీ కాదు అన్న పూర్తి విశ్వాసం మనిషికి ఉంది. కానీ జ్యోతిషం మాత్రము గ్రహాధీనం జగత్సర్వం అంటోంది. పరాశర మహర్షి తన బృహత్పరాశరహోరాశాస్త్రంలో

భాస్కరాద్యాః ఖగాః పూర్వం యే మయా నవ వర్ణితాః

ప్రభావితం జగదిదం సమస్తమపి తైస్సదా

అని చెప్పి యున్నారు. సంక్షేపంగా చెప్పుకుంటే సమస్తజగత్తూ గ్రహములచే ప్రభావితమైనది అని దాని అర్థము.

          ప్రస్తుతము ప్రపంచంలోని చాలా రాజ్యములలో ప్రభుత్వములు ప్రజల ఆగ్రహావేశలకు గురి అయిన సన్నివేశములు అందరికీ తెలిసినవే. తులారాశిలో ఉన్న శని భవిష్యత్తులో వక్రించినపుడు జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనిశ్చితమైన ఫలితమును సూచిస్తోంది. ఈ సందర్భములో శనిచారమును బట్టి రాజకీయములను (ఎన్నికల ఫలితాలను) విశ్లేషించే ప్రయత్నమే ఇది.

ఎలా

          వ్యక్తిగతంగా అందరూ గ్రహముల ప్రభావానికి లోనవుతారు. ఏ జాతకునిదైనా భవిష్యత్తు తెలుసుకోవాలంటే అతని జాతకమునుండి ఈ విషయాలను తెలుసుకోవచ్చును. జాతక భాగములో అనేక ప్రకారములైన రాజయోగములు వర్ణింపబడి ఉన్నాయి. వానిని బట్టి చిన్న చిన్న యోగములనుండి పెద్ద పెద్ద రాజయోగములవరకు చెప్పగలిగే అవకాశముంటుంది. కానీ ఏదైనా ఒక ప్రదేశము, రాజ్యము లేక దేశము యొక్క రాజకీయ భవిష్యత్తు, పాలకుల మార్పు, పార్టీల భవితవ్యం వంటివి తెలుసుకోవాలంటే  యోగములు సరిపోవు. సంహితాస్కంధములో చెప్పబడిన అనేక విషయములతో బాటు స్వరశాస్త్రములో చెప్పబడిన విషయములను కూలంకషముగ పరిశీలిస్తే అవి ఇటువంటి విషయముల లోతును వాటి గాంభీర్యతను తెలిపే ప్రయత్నము చేస్తాయి. శని యొక్క స్థితి మరియు అన్యగ్రహముల ప్రభావములు అవి సంచరించుచున్న రాశులు లేక నక్షత్రముల ఆధారముగ విభిన్న ప్రదేశములయందు విభిన్నములుగ ఉంటాయి. అనగ ఒక నిశ్చితస్థానమునందు ఉన్న శని ఒక ప్రదేశమునకు అరిష్టకారకుడు, మరియు విపత్తులను సంభవింపజేసేవాడు అయితే అదే శని అదే స్థానములో ఉంటూ మరికొన్ని స్థానములకు శుభకరుడు వృద్ధకరుడు అయ్యే అవకాశములు కూడ లేకపోలేదని అర్థము. కొన్ని చోట్ల రాజకీయ అనిశ్చితస్థి కలిపిస్తే మరి కొన్న చోట్ల సుస్థిర ప్రభుత్వములకు కారకుడు కావచ్చును. ప్రస్తుతము ఇక్కడ ఇటువంటి లోతైన విషయమును అతి సంక్షేపముగ చర్చించ ప్రయత్నిద్దాము.

ఎక్కడ ప్రారంభించాలి?

          అన్ని గ్రహముల మరియు అన్ని స్థానముల విషయములను ఒక చోట సంక్షేపముగ చర్చించడము సాధ్యము కాదు. కావున ప్రస్తుతానికి ఈ విషయమును శని మరియు ఉత్తరప్రదేశ్ నందు జరుగబోవు విధానసభ ఎన్నికలపై గ్రహముల ప్రభావమును గూర్చి చర్చించ ప్రయత్నిద్దాము.  ఇది కేవలము గ్రహముల స్థితిని ఆధారముగ చేయుచున్న విశ్లేషణ మరియు పరిశోధనాత్మకమైన అధ్యయనము మాత్రమే. శనియొక్క సంచారము, కూర్మచక్రములో శని, శనికి వక్రత్వము మొదలగు విషయములు ఈ విశ్లేషణకు ఆధారములు. ఈ పూర్తి విషయము సంహితాస్కంధమునకు సంబంధించినది.

శనిచారము

          గోచరమునందు సంహితాపరములైన శని ప్రభావము ముఖ్యముగ కూర్మచక్రమునుండి తెలుస్తుంది. భూమిపై గల భూభాగపు ఆకారమును రేఖాత్మకముగ చిత్రించి దానిపై తూర్పుదిశగ కూర్మమును చిత్రించాలి. దాని మధ్యభాగములో కృత్తికాది మూడు మూడు నక్షత్రములను ఉంచాలి. ఆ విధముగ నక్షత్రములను వ్రాసిన పిదప ఏ నక్షత్ర భాగములో భూమికి సంబంధించిన ఏ ప్రదేశము వచ్చినదో గుర్తించి ఆ ప్రాంతములో దానికి సంబంధించిన ఫలములు ఉండునని గ్రహించాలి.

          ఆచార్య వరాహమిహిరుని ప్రకారము కృత్తికాది మూ మూడు నక్షత్రములలో ఏ నక్షత్రముపై క్రూరగ్రహములు ఉంటాయో ఆయా ప్రాంతములు పీడించబడతాయి మరియు ఆ ప్రాంతములయందు ప్రభుత్వమునకు విపరీత పరిస్థితులు ఏర్పడతాయి

వర్గైరాగ్నేయాద్యైః క్రూరగ్రహపీడితైః క్రమేణ నృపాః

పాంచాల్యో మాగధికః కలింగాశ్చ క్ష.యం యాన్తి

          ఆచార్య నరపతి ప్రకారము కూర్మచక్రమునందు ఏ ఏ నక్షత్రమైతే శని గ్రహముచే ప్రభావితము అవుతుందో వానిని ఆధారముగ చేసుకుని ఫలములను చెప్పాలి.

తారాత్రయాంకితే తస్మిన్ సౌరిం యత్నేన చింతయేత్

          ప్రస్తుతము మనము ప్రపంచమునకు సంబంధిన విషయములను కాక భారతదేశమునకు సంబంధించిన విషయములను గూర్చి తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నాము. అందునా మనము స్పష్టముగ తెలుసుకొనదలచిన ప్రదేశము ఉత్తరప్రదేశ్. ఈ ప్రదేశము భారతమునకు ఉత్తర మరియ ఈశాన్య భాగములందు వ్యాపించి యున్నది. కాబట్టి ఇక్కడ కూర్మమును భారతదేశముపై మాత్రము ఉంచి ఫలితమును తెలుసుకొన ప్రయత్నించాలి. కూర్మమును పూర్వాభిముఖముగ ఉంచిన మనము చర్చించు భాగము వామపార్శ్వమునందు మరికొంత భాగము కొద్దిగ ముందరి కాలియందు వచ్చును.

           ఇక్కడ భారతదేశమునకు మనము నిర్మించు కూర్మమును దేశకూర్మము అంటారు. దేశకూర్మమునందు నక్షత్రములను కృత్తికాది నక్షత్రముల ఆధారముగ కాకుండ దేశనామము యొక్క నక్షత్రమునుండి ప్రారంభిచాలి. భారత దేశముయొక్క నామనక్షత్రము మూల నక్షత్రము. మూల మొదలగు మూడు నక్షత్రములను మధ్యభాగములో ఉంచిన ముఖమునందు శ్రవణం మొదలుకుని మూడ నక్షత్రములు, కుడి కాలియందు పూర్వాభాద్ర మొదలగు మూడు, ఉత్తరమునందు అశ్వని మొదలగు మూడు నక్షత్రములు వస్తాయి. మనము ప్రస్తుతము చర్చిస్తున్న భాగము కొద్దిగ ఈశాన్యమునందు మరియు ఉత్తరభాగమునందు వచ్చుచున్నందున రేవతి అశ్వని భరణులను ఆధారముగ చేసుకుని మనము ఫలితములను చెప్ప ప్రయత్నించవచ్చు. ప్రస్తుతము చిత్రా నక్షత్రమునందున్న శని కూర్మమునకు దక్షిణభాగమునందు ఉన్నాడు.

          ఇక్కడ గ్రహవేధను పరిశీలించినట్లయితే దక్షిణపార్శ్వమునందున్న శని వేధ ఉత్తరపార్శ్వమునకు కలుగుతున్నది. అనగ రేవతి నుండి భరణి వరకు గల నక్షత్రములు మరియు వానికి సంబంధిచిన ప్రదేశములు శని వేధకు గురి అగుచున్నవి.

పూర్వాపరం లిఖేద్వేధం వేధం చోత్తరదక్షిణే

ఈశానరాక్షసే వేధం వేధమాగ్నేయమారుతే

          శని ఏ స్థానమునందైతే ఉంటాడో, ఏ స్థానమునకు శని వేధ కలుగుతుందో ఆ స్థానమునకు పీడాకారకుడు అగును మరియు ఆ స్థానమునందు చక్రభంగము (ప్రభుత్వ పతనము) జరుగు అవకాశము ఎక్కువగా ఉంటుంది.

యత్రస్థః పీడయేత్తత్ర వేధస్థానే తథైవ చ

దేశనామర్క్షగః సౌరిః భంగదాతా న సంశయః

          మనము దేశకూర్మము ప్రకారము కాకుండ విశ్వకూర్మము ప్రకారము మాత్రమే దీనిని చూచిననూ అదే ఫలితము కనబడుతున్నది. శని చిత్రా నక్షత్రమునందున్నాడు. విశ్వకూర్మములో చిత్రానక్షత్రము ఉత్తరభాగమును సూచిస్తున్నది. విశ్వకూర్మములో ఉత్తరాఫల్గునీ, హస్త, చిత్ర, ఈ మూడు నక్షత్రములు ఉన్నవి. ఈ విధంగా చూస్తే ఉత్తరభాగంలో ఉన్న శని ఉత్తరభాగంలో చక్రభంగము చేసే అవకాశములు కనిపిస్తున్నాయి.

ప్రభావము ఏ విధముగ ఉంటుంది?

          నరపతి జయచర్య అను గ్రంధము ప్రకారము వేధ వనల 7 రకముల కష్టములు ఉద్భవిస్తాయి. అవి అతివృష్టి, అనావృష్టి, శలభములు, మూషకములు, శుకములు, స్వచక్రము, పరచక్రము.

అతివృష్టిరనావృష్టిః శలభా మూషకాః శుకాః

స్వచక్రం పరచక్రం చ సప్తైతే ఈతయః స్మృతాః

          వీనిలో మనము చర్చిస్తున్న విషయము రాజకీయములు మరియు ప్రభుత్వము. వీనిలో చివరది శాసకులను లేద పాలకులను నిర్ణ.యించేది. కావున ఈ విషయముల ద్వారా ఉత్తరప్రదేశములో శాసకులయందు మార్పు కనిపిస్తున్నది.

వక్రించిన శని

          శని సామాన్య జనులకు ప్రాతినిధ్యము వహించే గ్రహము. శనిని శాస్త్రములో సేవకుడు ని అన్నారు. ఇక్కడ సేవకుడు అనే దానికి అర్థము పాలక మరియు అధికారవర్గమును విడిచి మిగిలిన జనులందరూ అని గ్రహించాలి. ఆ శని వక్రించినపుడు సామాన్యజనుల ఆగ్రహావేశములకు పాలకులు గురి అవ్వవలసి వస్తుంది. దానికి ముఖ్య కారణమము వారి బాధలు మరియు నైరాశ్యము. 2007 లో జరిగిన విధానసభ ఎన్నికల సమయంలో కూడ సగం ఎన్నికలు జరిగేంతవరకు శని వక్రించే ఉన్నాడు. ఆ సమయంలో సామాన్యజనుల నిర్ణయము అందరినీ ఆశ్చర్యపరచింది కూడ.

          ప్రస్తుతము కూడ ఎన్నకలకు ఒకరోజు ముందు శని వక్రించుచున్నాడు. ఈ సారి ఈ శని ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ వక్రించే ఉంటాడు. కావున పరిస్థితులు క్రింతం వలె ఊహలకు అతీతంగా ఉండే అవకాశం ఉన్నది

ముగింపు

          భారతదేశములో అతి పురాతనమైవ రాజకీయ పార్టీ తన ప్రభుత్వమును ఉత్తరప్రదేశ్ లో కోల్పోయి సుమారు 30 సంవత్సరములకు పైగా అయ్యింది. ఈ మధ్యకాలములో అక్కడ ఎన్నికలు 10 మార్లకు పైగా జరిగాయి. ప్రస్తుతము జరుగుతున్న ఎన్నికలు చాలా మహత్త్వమును కలిగి ఉన్నాయి. ఎందుకంటే చిత్రనుండు ఎదరికి జరిగే శని ఫ్రభావము క్రమముగ దేశ రాజధానిపై రానున్న మూడ సంవత్సరములలో కేంద్రీకృతము కానున్నది. అనగ నేడు జరగబోయే పరిణామములు భవిష్యత్తునకు అద్దం పట్టనున్నాయి.

          ఎటువంటి వ్యక్తిగతమైన పక్షపాతములకు లోనవకుండ స్పష్టముగ శాస్త్రీయములైన ఫలములను గూర్చి ఆలోచిస్తే భారతములో అత్యంత ప్రాచీనమైన రాజకీయదలమునకు (పార్టీ) శాసనావకాశము లేక దానికి అత్యంత సమీపములో చేరుకునే అవకాశములు ఈ ఎన్నికలలో కనిపిస్తున్నాయి.

          ఈ విశ్లేషణ కేవలము శాస్త్రీయ ప్రమాణమములను ఆధారముగ చేసుకుని చేసినది మాత్రమే. ఇది అనుసంధానాత్మకము మరియు పూర్తిగ పక్షపాతరహితము.   

సశేషము ........


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech