సారస్వతం  
     గోవిందం భజ మూఢమతే - 8 - రచన : యర్రమిల్లి హేమారత్నం  
భజగోవింద శ్లోకాల అర్ధాలు:

శత్రౌమిత్రే పుత్రౌబంధౌ
మాకురు యత్నం విగ్రహసన్దౌ
సర్వస్మిన్నసి పశ్యాత్మానం
సర్వత్రో త్తృజ భౌధజ్ఞానమ్


శత్రువుతో, మిత్రునితో, పుత్రునితో, బంధువుతో శతృత్వం కానీ, మితృత్వం కానీ చేయాలని చూడరాదు. అందరిలో అంతటా పరమాత్మని దర్శించి అభేద బుద్ధిని వదలాలి.

మితృత్వం వల్ల దగ్గరితనం, శతృత్వం వల్ల అగాధం మనుషుల మధ్య ఏర్పడతాయి. ఈ రెండూ కూడా మోక్షసాధనకు ప్రతిబంధకాలు. చీకటి వెలుగుల్లా, జ్ఞానం - అజ్ఞానం జంటగానే ఉంటాయి. అజ్ఞానం వల్ల మాయకు లోబడితే అంతటా బేధ దృష్టే. సముద్రం, అల వేరు వేరు కానట్లే ఆత్మ, పరమాత్మ వేరు కాదను అభేద దృష్టి మోక్షకారకం. అండ పిండ బ్రహ్మాండమంతా పరమాత్మ చైతన్య శక్తిచే ఆవరించబడి ఉంటుందనే నిజాన్ని గ్రహించిన నాడు, ఆలోచనలు అదుపులో కొచ్చి, సర్వం సమం అనే సమదృష్టి ఏర్పడుతుంది. అంతటా, అన్నిట్లో పరమాత్మే గోచరిస్తాడు. అప్పుడు అనుభవించే ఆత్మానందానికి అవధులు ఉండవు.

 

కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం పశ్యతి సోహం
ఆత్మజ్ఞాన విహీనా మూఢా
స్తేపచ్యన్తే నరక నిగూఢా


కామ, క్రోధ, లోభ, మోహ గుణాలను విసర్జించి, పరమాత్మే నాలోని ఆత్మ అనే సమభావం కలిగితే ఆత్మదర్శనం సులభ సాధ్యం. అజ్ఞానులు మూఢులై, ఆత్మజ్ఞానం లేక నరకంలో పడి బాధలు అనుభవిస్తారు.

అరిషడ్వర్గాలు ఆరు. కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు మనిషికి శతృవులు. ఈ ఆరింటికి మూలం మనస్సు. మనస్సును సత్యమార్గంలో పెడితే పొందే ఫలితం అమోఘం. అంతఃశ్శతృవులైన అరిషడ్వర్గాలలో మనస్సుతో కామాన్ని, బుద్ధితో క్రోధాన్ని, చిత్తంతో లోభాన్ని, సోహం భావనతో మోహాన్ని అణచివేయాలి. అప్పుడు మధ, మాత్సర్యాలు మాయమై సమదర్శకత్వం సమకూరుతుంది. జన్మతః జీవుడు నిర్మలుడే. ప్రారబ్ధ కర్మ ఫలితంగా కర్మల నాచరించి, మాయావరణలో చిక్కుకుని, సంసార లంపటంలో బంధింపబడుతున్నాడు. ఏ కొంచెం వివేకంతో ఆలోచించగలిగినా మాయావరణను ఛేదించి, ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి సాధన చేసి, సాధించి, ముక్తి పొందాలి.

గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపసమజస్తం
నేయం సజ్జనసంగే చిత్తం
దేయం దీనజనాయచ విత్తం

భగవద్గీతా నామ సహస్రం గానం చెయ్యాలి. ఎల్లప్పుడు నారాయణుని ధ్యానం చెయ్యలి. మనస్సును సదా సత్సంగత్యంలో నడిపించాలి. దానం చేయాలి.
సర్పోపనిషత్సారమైన గీతాగానం పుష్టిని, తుష్టిని ఇస్తుంది.  అట్లాగే నారాయణుని రూపధ్యానం జీవాత్మను, పరమాత్మగా రూపాంతరం చెందిస్తుంది. సజ్జన సాంగత్యం మనిషిలో మాన్వత్వాన్ని ద్విగుణికృతం చేసి దైవత్వానికి దగ్గరగా తీసుకెళుతుంది. దీనికి తోడుగా దీనజన సేవ చేసిన మరింత అద్వైత భావన ప్రబలమై, ముక్తిమార్గం సులభమౌతుంది.

కలియుగంలో మోక్షసాధనకి సులభమార్గంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు ప్రసాదించిన అద్భుతవరం గీతాశాస్త్రం. సాధకునికి అవసరమైన సూచనలన్నీ, ఈ గ్రంథంలో సూక్ష్మీకరించబడి, సులభంగా వివరించబడ్డాయి. అందుకే గీతని నిత్యం పారాయణ చేయడం వల్ల, మనోచిత్తాలు శుద్ధమై, నిస్సంకల్ప మౌతాయి. మనసంతా నారాయణుని రూపం నిండి, నిరంతరం అసంకల్పిత ధ్యానం కొనసాగుతుంది. ఆ స్థితిలో మనసెప్పుడూ, మంచి వారితో స్నేహం చేయాలని, మంచి మాటలు వినాలని మంచి పనులు చేయాలని పరుగులు తీస్తుంటుంది. ఎప్పుడైతే సజ్జనమైత్రి లభిస్తుందో, అప్పుడే మనలోని మానవత్వం జాగృతమై, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, దీనులపై దయచూపించాలని, ఆర్తులను ఆదుకోవాలని, దీనులపై దయచూపించాలని, ఆర్తులను ఆదరించాలనే సత్సంకల్పం కలిగి మనల్ని దైవత్వం వైపు నడిపిస్తుంది.
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech