శీర్షికలు  
     ఎందరో మహానుభావులు  - రచన : తనికెళ్ళ భరణి  

 నిమ్మళంగా రసానుభూతిని పంచిన వాసా అప్పయ్య గారి సంగీతం!!

                               

రెండు వందల సంవత్సరాల్నించీ వంశపారంపర్యంగా సంగీతం నేర్చుకుంటున్న కుటుంబం ఎల్లా ఉంటుందో ఊహించండి!

భూపాలం వచ్చి ఆ గుమ్మం ముందు కళ్ళాపి జల్లి ముగ్గు వేస్తుంది.

మలయ మారుతం వొచ్చి తోరణాలు కట్టి మంగళ వాయిద్యాలు వాయిస్తుంది.

ఆ ఇంట్లో ముత్తయిదువ దువ్వెన్నతో కురులు దువ్వుకుంటూంటే వాయులీనం మీద కమాను సంచారం చేస్తుంది.

ఊయల మంచం మీద కన్నెపిల్ల బోర్లా పడుకునీ ఉంటే ఊగుతోన్న ‘వీణ’

పెద్దాయన కచ్చికతో దంతధావణం చేస్తోంటే..మోర్సింగ్ ధ్వని..

కుర్రాడు పందుం పుల్లతో పళ్ళు తోమితే వేణువు..

ఆడంగులు కుండలో నీళ్లు పడ్తోంటే .. టకటకా..ఘటం.

గాడి పొయ్యి మీద అత్తెసరు పడేస్తే.. కుతకుత మృదంగం.

సరళీ స్వరలు వాళ్ళ పసిపాపల నోళ్ళల్లో పాలపీకలైతే జంట స్వరాలు గిలకలౌతాయ్..

వాళ్ళ బంధాలు, అనుబంధాలూ..ఆనందాలు, అలకలు.. అల్లర్లూ అన్నీ సంగీతానుబంధాలే..

వాళ్ళింట్లోంచి ‘శివరంజని’ వినిపిస్తోంటే..అంతా ఏదో బెంగతో ఉన్నారన్నమాట..

వారే.. సంగీతంలో పేరెన్నికగన్న గావు ‘వాసా’ వారు..

వాసా వారి కుంటుమ్బంలో చాలామంది బొబ్బిలి ఆస్థాన విద్వాంసులుగా గాత్ర విద్వాంసులుగా, వైణికులుగా ఉండేవారు.

వాసా వెంకటరావు విజయనగరం మహారాజా ఆహ్వానం మేరకు విజయనగరం వెళ్ళి అక్కడ రాజావారి కుమార్తెలకు వీణ నేర్పించారు.

వాసా సాంబయ్య గారు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలనిస్ వరపరచి కీర్తనలు పాడేవారు..

వాసా జగన్నాథంగారు స్వర పల్లవులు..

వాసా కృష్ణమూర్తిగారు గీతాలూ అవీ రాసేవారు.

ఇలాగ ఒక్కొక్కళ్ళదీ ఒక్కొక్క ప్రత్యేకత.

వీళ్ళలో వాసా అప్పయ్యగారికి..సంగీతమే కాకుండా నృత్యం కూడా వొచ్చు.

గొప్ప వైణికుడు.. ఆయన జీవితంలోని ఓ సంఘటన.

అవి సంక్రాంతి పండుగ రోజులు. ఓ రోజు వాసా అప్పయ్యగారు..తెల్లారగట్టే.. స్నానం సంధ్యా ముగించుకుని..గుమ్మంలో కూర్చునీ..వీణశ్రుతి చేసుకుంటున్నారు.

ఈలోగా .. హరిలోరంగ హరీ..అంటూ ఓ హరిదాసొచ్చి.. గుమ్మం ముందు కాసేపు ‘కృష్ణం కలయ సఖీ సుందరం..బాలకృష్ణం కలయ సఖి సుందరం" అంటూ నారాయణతీర్ధుల వారి తరంగాల్ని..మృదుమధురంగా పాడుగూ చిన్న చిందు కూడా వేశాడు..

ఇంట్లో..ఆడవాళ్ళొచ్చీ..దోసిళ్ళతో బియ్యం వేసారు.

హరిదాసు ...ఒడుపుగా వొంగీ..బియ్యం తీసుకునీ..

మరో తరంగం అందుకునీ ..వెళ్ళిపోయాడు!!!

అప్పయ్యగారి దృష్టి హరిదాసు నెత్తిమీది...రాగి గిన్నె మీద పడింది.

పాట పాడుతూనే.. ఒంగి..ఎంత ఒడుపుగా బియ్యం వేయించుకుంటున్నాడు?!!! ఏదైనా సాధన అనిపించింది.

అవును మరి.. నీళ్ళకెళ్ళే ఆడవాళ్ళు కూడా కుండ మీద కుండెట్టుకుణి నీళ్ళు పట్టుకురారూ..అనుకున్నాడు..

వెంటనే ఓ ఆలోచన వచ్చింది.

వీణ వాయించడాం.. వైణికులంతా చేసే పనే..

అందులో ఏదన్నా తమాషా చెస్తే..

ఏం చేద్దాం?

తను కూడా నెత్తిమీద ఓ గిన్నో చెంబో పెట్టుకుని.దాన్ని కింద పడకుండా వాయించగలిగితే....కష్టం.. ఏంచేతంటే..

వీణ వాయిస్తూంటే.. వింటున్నవాళ్ళే...కాళ్ళు..చేతులు..తలలు ఊపేస్తూ ఉంటారు.

ఇక వాయించేవాడు ఊపకుండా...కాస్సేపు వాయించి చూశాడు.

అబ్బే వల్ల కాలేదు.

తరువాత హరిదాసుని గుర్తు తెచ్చుకునీ..నెత్తిమీద మెత్తటి తలగడ పెట్టుకునీ ప్రయత్నం చేశాడు..

పరవాలేదు..

మళ్ళీ ఈ సారి.. హరిదాసు గిన్నెని పోలిన గుమ్మడిపండు పెట్టుకునీ సాధన చేశాడు.

రెండు మూడుసార్లు ..తొడమీద పడింది..

ఫర్వాలేదు.. దార్లో పడ్డాం అనుకున్నాడు.

కానీ ఇంత పెద్ద పండు పెట్టుకుని వాయిస్తే.. అదేం పెద్ద విశేషం..!

ఒకళ్ళు చెయ్యలేనిది..మనం చేస్తేనే కదా...

కీర్తి-ప్రతిష్ఠా...ఆత్మ తృప్తీనీ౧

మళ్ళీ మనసులో ఏదో మెరుపు మెరిసింది.

* * *

విజయనగరం మహారాజా వారికి వాసా అప్పయ్యగారంటే గౌరవం. ఆయన సంగీతం అంటే ఇష్టం.

ఆయన కచేరీలు అవీ పెట్టించడం కాకుండా.. ఏదైనా శుభ సందర్భంలో కేవలం కుటుంబ సభ్యుల్నీ..అందులోనూ సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళని పిలిచీ.. వాసా అప్పయ్య గార్ని కబురు పెట్టేవారు.

సరే అప్పయ్యగారు రావడం.

కోరిన కీర్తనలు విని..కమ్మగా కరువుతీరా వాయించడం!!

రాజా వారిచ్చిన బహుమానాల్నీ పట్టుకుని..దణ్ణాలెట్టుకుని వెళ్ళీపోవడం ఆనవాయితీ!

ఒక్కొక్కసారి రాత్రి తెల్లవార్లూ వీణావాదనం సాగేది!!

సూర్యకిరణాలు మీద పడ్తుండగా స్పృహలోకొచ్చీ సంగీత సభ చాలించే వారు!

అదీ రసికత్వం.!!!

అలాంటి సందర్భమే మళ్ళీ వచ్చింది. వెంటనే అప్పయ్యగారికి కబురు..

అప్పయ్యగారూ, వీణా సిద్ధం!

రాజా వారు మందహాసం చేసి, అప్పయ్యగారూ ఇవాళ ఘనరాగ పంచకాన్ని వినాలని ఉంది..తేనె పానకాన్ని అందించండీ!!

చిత్తం ప్రభూ, అయితే తేనే పానకంలో కొంచెం నిమ్మ రుచి తగిలిద్దామనుకుంటున్నా..

నిమ్మరసం కలిపిన తేనెపాకం మరి మధురంగా ఉంటుండి.. అంటే ఏం చేస్తారూ..

అప్పుడు అప్పయ్యగారు పచ్చటి నిమ్మ పండొకటి తీసి చేత్తో పట్టుకున్నాడు..

మెరిసిపోతోంది..కనక పుష్యరాగం లాగా..

ప్రభూ మీరు అనుమతిస్తే..దీన్ని నెత్తిమీద పెట్టుకుణి..పడెయ్యకుండా వాయిస్తాను.. రాగాలన్నింటినీ...

ఛా..

ఆశ్చర్యపోయి కనుబొమలెగరేశాడు రాజావారు.

ఇది మరీ అద్భుతం కానివ్వండి! సంగీతం ఇంతవరకు శ్రావ్య మేననుకున్నాను. దీన్లో దృశ్యం కూడా చేర్చారూ..

మెచ్చుకోలుగా మరో మారు కళ్ళెగరేశారు రాజావారు..

వీణ ఠంగున మ్రోగింది..

మొదలైంది ఘన రాగంగా పంచకం.

మొదటిది నాట రాగం..

వీణ మెట్లుమీద వేళ్ళు..పైకి కిందికీ పరిగెడ్తున్నాయ్..

నెత్తిమీద నిమ్మపండు..‘జగదానందకారకారక్షించు తండ్రీ అనుకుంది..

రెండో రాగం...గౌళ.. వీణమీద తర్జని హోయలు పోతోంది..

నిమ్మపండు ఉండబట్టలేక..తన చుట్టూ తాను తిరిగింది..దుడుకు గల కొడుకు..లా

మూడవ రాగం..ఆరభి..

రాజా వారితో సహా బంధువులంతా తలలూపేస్తున్నారు వీణా వాద్యానికి,...ఒక్క వాయిస్తున్న అప్పయ్య తప్ప...! అప్పుడనుకుంది నిమ్మపండు సాధించెనే ఓ మనసాఅని..

నాలుగోరాగం... నాలుగో ఝాము.. వరాళి రాగం...

సరిగ్గా నిద్రా దేవత.. అందర్నీ కావులించుకునే సమయం..

వీణ తీగల మీద వేళ్ళు నాట్యం చేస్తున్నాయ్!

అంతా ఊపిరి బిగించి చూస్తునారు.. అప్పయ్య గారి వీణనీ.. ఆయన నెత్తిమీదున్న నిమ్మపండునీ..

ఊహూ..

నిమ్మపండు.... నిమ్మకు నీరెత్తినట్టుంది..!

ఆఖరి రాగం.. శ్రీరాగం..

నిర్భీతిగా ఉన్నాడు అప్పయ్య...

రాజావారిలో కొద్ది ఆందోళన..ఇంతదాకా లాక్కొచ్చాడు... చివరికేం చేస్తాడో అని

నిమ్మపండు మాత్రం...ఎందరో మహానుభావులూ..అందరికీ వందనాలు.. అంది..

అయిపోయాయ్ అయిదు రాగాలు..

రాజా వారు గబగబా వచ్చి కావలించుకున్నాడు..!

ఇప్పుడు కింద పడింది నిమ్మపండు!

ఇద్దరి కాళ్ళ మధ్య!

ఇద్దరి స్నేహానికీ, పరస్పర గౌరవానికీ..రసజ్ఞతకీ సాక్షిగా..

నెత్తిమీద నిమ్మపండు పెట్టుకుని...రాత్రి తెల్లవార్లూ వాయించిన మహా విద్వాంసుడు వాసా అప్పయ్య.

రాజా వారు బహుమతుల్ని ఇచ్చి..శలువాలు కప్ప్..

మర్నాదు ఓ బండెడు నిమ్మపళ్ళు కూడా పంపాడు.

భర్త శక్తి సామర్ధ్యాలకి మురిసిపోయి..

ఓ నిమ్మపండు ఆయన చుట్టూ తిప్పీ దిష్టి తీసి పారేసింది..

వాసా అప్పయ్య గారి శ్రీమతి.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech