శీర్షికలు  
     'దేవుడున్నాడా?' ఓ చర్చా వేదిక - 2 - ముత్తేవి రవీంద్రనాథ్,  

'దేవుడున్నాడా?' అనే అంశంపై  మన చర్చ కొనసాగిద్దాం.

భగవంతుడు ఉన్నాడని మనం ఎలా తెలుసుకోగలం? లేడని ఎలా నిర్ధారించగలం?

భగవంతుడిని గురించిన జ్ఞానం మనం పొందేముందు - అసలు జ్ఞాన సముపార్జనకు మనకున్న సాధనాలేమిటో, అవి ఏమేరకు ఆధారపడదగినవో తెలుసుకోవాలి.భారతీయ తత్త్వశాస్త్రంలో ఆధారపడదగిన జ్ఞాన సముపార్జనా మార్గాలను 'ప్రమాణాలు' అంటారు.

మన ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా మనం ప్రత్యక్షానుభూతితో పొందగలిగే జ్ఞానం 'ప్రత్యక్ష'అంటాం.ఇది నికరమైన , దాదాపుగా లోపరహితమైన ప్రమాణమని భావిస్తారు.

కేవలం భగవంతుడు నా కళ్ళకు కనిపించడం లేదు కనుకనే నేను భగవంతుడిని నమ్మడం లేదు అంటున్నానని  అనుకోవద్దు.మనకు కనిపించనివి ఎన్నో వాస్తవాలు ఉన్నాయి.తియ్యదనం, ఉప్పదనం,పులుపు,చేదు,కారం,వగరు అనే షడ్రుచులు ఆరూ మనకు  కనిపించవు.కానీ మన రసనేంద్రియం(నాలుక) ద్వారా వాటిని మనం తెలుసుకోగలుగుతున్నాం.ధ్వని,  సంగీతం,గానం వగైరాలు మనకు  కంటికి కనిపించవు.వినిపిస్తాయి.వాటిని మన శ్రోత్రిన్ద్రియాల (చెవుల)ద్వారా విని తెలుసుకోగలుగుతున్నాం.వీచే చల్ల గాలిగానీ,వడగాలిగానీ మనకు కనపడవు.అలాగే మెత్తదనం,గట్టిదనం కూడా.వాటిని మన త్వగింద్రియం (చర్మం)ద్వారా తాకి తెలుసుకోగలం.సువాసనలూ, దుర్వాసనలూ కూడా మన కంటికి కనపడవు.వాటిని మన  ఘ్రాణ ఇంద్రియం  (ముక్కు) ద్వారా వాసనచూసి తెలుసుకుంటాం

ప్రత్యక్ష ప్రమాణం లౌకిక(Ordinary),అలౌకిక(Extraordinary) అని  రెండు  విధాలు. పంచేంద్రియాల,  ఇంద్రియార్థాల ప్రత్యక్ష సంబంధం కారణంగా లభించే జ్ఞానం లౌకికం.

అలౌకిక ప్రత్యక్ష ప్రమాణం మూడు విధాలుగా విభజించబడింది. మొదటిది 'సామాన్య  లక్షణ'. '.ప్రతి మానవుడూ మరణిస్తాడు' అని మనం చెప్పినప్పుడు మనం ప్రతి మానవుడూ చనిపోవడం చూశామా? చూడకపోయినా చాలామంది మరణించడం మనం చూశాం  కనుక సత్యాలను   సామాన్యీకరించి'మానవుడు మర్త్యుడు' అని మానవుల సామాన్య లక్షణం చెప్పగలుగుతున్నాం

మరో రకం అలౌకిక ప్రత్యక్ష ప్రమాణం 'జ్ఞాన లక్షణ'.' శిల చాలా కఠినంగా కనిపిస్తున్నది',లేక ' దిండు చాలా మెత్తగా కనిపిస్తుంది' అన మనం చెప్పేటప్పుడు, శిల యొక్క కాఠిన్యం  గురించి, దిండు యొక్క మెత్తదనాన్ని గురించీ మనకున్న పూర్వజ్ఞానమే అందుకు కారణం. చూడగానే శిలయొక్క కాఠిన్యం, దిండు యొక్క మెత్తదనం 'జ్ఞాన లక్షణ' కారణంగానే మనం చెప్పగలుగుతాం. చర్మం యొక్క పనిని (త్వగింద్రియం యొక్క పనిని)చక్షురింద్రియం (కళ్ళు) కూడా  చేయగలగడం తరహా జ్ఞాన సముపార్జనకు మూలం.

ఇక మూడవ రకం అలౌకిక ప్రత్యక్ష ప్రమాణాన్ని 'యోగజ' అంటారు. యోగాభ్యాసంలో ధ్యానం ద్వారా చేకూరే మానవాతీత శక్తులకారణంగా అంతర్ దృష్టితో యోగులు  భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అన్నింటిలో ఉండే అన్ని వస్తువులనూ-చివరికి తమలోని  అతి సూక్ష్మ కణాలను కూడా చూడగలుగుతారట! ఇది పూర్తిగా  యోగి వ్యక్తిగత  అనుభూతి ప్రధానమైనది.శాస్త్ర సత్యాలు  అవి కనుగొన్న వారికేకాక అందరికీ సత్యాలైనప్పుడే వాటికి విలువ,విశ్వసనీయత ఉంటాయి.ఆర్కిమెడీస్,న్యూటన్ మొదలగు శాస్త్రజ్ఞులు ఆవిష్కరించిన సత్యాలు కేవలం వారికే కాదు. విశ్వ మానవాళికి అంతటికీ సత్యాలే.అందుకే అవి శాస్త్రీయాలుగా గుర్తింపు పొందాయి. శాస్త్రాలయ్యాయి. 'నాకు కనపడుతున్నది; నాకు అర్థమయింది; మీకు కనపడడంలేదా?' అంటే శాస్త్రమూ అంగీకరించదు.శాస్త్ర సత్యాలు అందరికీజువు పరచబడాలి.లేకుంటే రామర్ పిళ్ళై' మూలికా  పెట్రోలు' లాగే బూటకం అనే భావిస్తారంతా.

ఇక చూసి తెలుసుకోగలిగేవి అన్నీ కూడా మన చక్షురింద్రియానికి (కంటికి) అందుబాటులో ఉండకపోవచ్చు. గోడ అవతలివైపున గాండ్రింపు విని అవతల పులి వుందని గ్రహిస్తాం. ఎందుకంటే లోగడ  పులిని చూసినప్పుడల్లా దాని గాండ్రింపు  విని ఉన్నాం. కనుక గోడ అవతల ఉన్నది పులేనని గ్రహిస్తాం. లోగడ మిరపకాయ కొరికినప్పుడల్లా కారంగా ఉండడంచేత మిరపకాయలో కారం ఉందని గ్రహిస్తాం. ఎక్కడయితే పొగవుందో అక్కడల్లా అగ్ని ఉండడం లోగడ మనకు తెలుసు.(యత్ర యత్ర దూమస్తత్రతత్రాగ్ని). దూరాన వున్న ఒక కొండలోనుంచి పొగ రావడం చూసి కొండలో అగ్ని ఉందనీ, అది అగ్ని పర్వతమనీ గ్రహించగలం.ప్రత్యక్షంగా మన ఇంద్రియాలనుంచి సేకరించిన సమాచారాన్ని ఇలా మనసులో విశ్లేషణ చేయడాన్ని' అనుమానం'   అంటారు.

మనకు కళ్ళముందు లేకపోయినా రైలు కూతవిని, దూరాన్నుంచి వచ్చే రైలును తెలుసుకోగలం.ఇది  ఇంద్రియాల నుంచి సేకరించే సమాచారాన్ని మనసు ద్వారా విశ్లేషణ  చేసుకోవడం ద్వారానే సాధ్యం.ముందుగా మెరుపు  రావడం చూసి కాసేపట్లో పిడుగు శబ్దం వినపడుతుందని గ్రహిస్తాం.చల్లటి నీటి తుంపరతో  కూడిన గాలి వీస్తుంది. గాలితోపాటు తడిసిన మట్టి వాసన కూడా వస్తుంది.దీన్ని బట్టి దగ్గరలో ఎక్కడో వాన పడుతున్నదనీ, కాసేపట్లో అక్కడ కూడా పడబోతున్నదనీ రాబోయే వర్షాన్ని గురించి ముందుగానే  గ్రహిస్తాం. ఆకాశం లో వేగంగా కదులుతున్న నల్లని వర్షుకాభ్రాల్ని(కారు మబ్బులను) చూసి కొద్ది సేపట్లో  వాన రానున్నదని గ్రహిస్తాం.ఇలా కారణాన్ని (Cause)ని బట్టి జరగనున్న కార్యాన్ని(Effect) అనుమానించడం 'పూర్వవత్' అంటాం.

ఒక్కోసారి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై బర్త్ లో పడుకుని గాఢ  నిద్రపోతాం.మెలకువ వచ్చే సరికి తెల్లారుతుంది.ట్రైను ఒక నదిపైనున్న బ్రిడ్జి మీదనుంచి పోతూ ఉంటుంది.కిటికీలోంచి చూస్తే నదిలో  మట్టితో కూడిన మురికి నీరు అతివేగంగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది.అదిచూసి అప్పుడు వాన పడుతూ ఉండక పోయినా  కొంతసేపటి క్రితం వర్షం కురిసిందని గ్రహిస్తాం- వాన పడిన వెంటనే నదులలోకి మురికి నీరు వచ్చి చేరి,సుడులు తిరుగుతూ వేగంగా ప్రవహిస్తుందని మనకి తెలుసు కాబట్టి.'కాసేపటి క్రితం వాన పడిందా?' అని మనం తోటి ప్రయాణీకులు ఎవరినీ  అడగం.ఇలా కార్యాన్ని(Effect)బట్టి కారణాన్ని(Cause )అనుమానించడం 'శేష వత్ 'అంటాం.

ఇదికాక  సామాన్యతోదృష్ట అనే మూడవ పద్ధతి అనుమానమూ ఉంది.దీనిలో కార్య కారణ సంబంధం ఆధారంగా కాక మన అనుభవంలో ఒకదానికొకటి  ఎడబాయని, ముడివడిన రెండు అంశాల ఆధారంగా అనుమానించి నిర్దారిస్తాం.కొమ్ములున్న జంతువులు ఎక్కడ చూసినా గిట్టలతోనే కనిపిస్తాయి.కాబట్టి జంతువు కొమ్ములు చూడగానే దాని కాళ్ళకు గిట్టలు ఉంటాయని అనుమానించి నిర్ధారణకు వస్తాం

అడవి ప్రాంతంలో వెళుతూ ఉంటాం. కేవలం అడవుల్లో మాత్రమే ఉండే 'గవయా'(నీల్ గాయ్) అనే జంతువును మనం అంతకు మునుపెన్నడూ చూడలేదు.అదీ ఆవులాగానే ఉంటుందనీ,కాకపోతే ఇంకా ఎత్తుగా, బలిష్టంగా ఉంటుందనీ మనం లోగడ ఎవరిద్వారానో  వినివున్నాం.అప్పుడు జంతువే మనకు  ఎదురైతే మనం లోగడ దాన్ని గురించి వినివున్న లక్షణాలను మన కట్టెదుట వున్న  జంతువు లక్షణాలతో సరిపోల్చి చూసుకుని అది' గవయా' అనే నిర్ధారణకు వస్తాం. జ్ఞాన సముపార్జనా మార్గాన్ని' ఉపమానం' అంటారు

ఇక చివరిది శబ్ద ప్రమాణం. సామాన్యులు, విశ్వసనీయులైన సంత్ మహాత్ములు, ప్రవక్తలు శాస్త్రజ్ఞులు  విశ్వాన్ని గురించి చెప్పినవీ, పుణ్య పాపాల గురించి మహాత్ములు చెప్పిన నీతి వాక్యాలు, భగవంతుడి గురించీ, మానవుడి స్వేచ్చ,చావు పుట్టుకలు, అమరత్వం మొదలైన విషయాల గురించి వైదిక సాహిత్యంలో చెప్పబడినవన్నీ శబ్ద ప్రమాణం కిందికే వస్తాయి. అయితే సమాచారం శాస్త్ర పరీక్షకు నిలబడేదిగా వుండాలి.మనం ఇందాకే చెప్పుకున్నట్లు శాస్త్రీయమైన సమాచారాన్నైనా అది గ్రంథంలో ఉన్నా దాన్ని మనం ప్రమాణంగా భావించి స్వీకరించవచ్చు. అంతే కాదు. ఆప్త వాక్యంగా మన శ్రేయస్సు కోరి ఎవరైనా వ్యక్తులు నోటిమాటగా మనకు చెప్పిన శాస్త్రీయ  విషయాలు కూడా  మనం ప్రమాణంగా స్వీకరించవచ్చు. అలా శాస్త్రీయమైన సమాచారమైనా శబ్ద ప్రమాణం కిందికే వస్తుంది.

మనకు తెలిసిన విషయమైనా శాస్త్ర సమ్మతమైనదీ, ఒక్కరికో మాత్రమేకాక సార్వజనీన సత్యం అయ్యేట్లైతే, దాన్ని మనం ప్రమాణంగా భావించి స్వీకరించవచ్చు.ఇప్పుడు చెప్పండి.ఎవరో చెబితేనో,ఎక్కడో రాసినవి చదివో దేవుడున్నాడనో,లేడనో అభిప్రాయం ఏర్పరచుకొనడం  సబబేనా? శాస్త్రీయమైన ఆధారాలతో ప్రామాణికమైన పునాదిపై ఆధారపడి మన విశ్వాసాలు ఏర్పరచుకున్నామా? లేక సంప్రదాయానికి తల ఒగ్గి ,' నలుగురితో పాటు నారాయణా; కులంతో గోవిందా' అన్నట్లు' శాస్త్ర విచారణ నాకెందుకులే , నలుగురూ నడిచేబాటనే నడుద్దాం'. అన్న రీతిలో ఏర్పరచుకున్నవా మన విశ్వాసాలు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనందరికీ  ఉంది. మన నమ్మకాలు  -ప్రత్యేకించి దేవునిపై మనమేర్పరచుకున్న విశ్వాసాల - పునాదుల్లోకి వెళ్ళండి. వాటిని శాస్త్ర పరీక్షకు లోనుచేయ్యండి. అశాస్త్రీయమనిజువైన నమ్మకాన్నైనా అది ఎంత సనాతనమైనదైనా కూకటి వేళ్ళతో సహా పెకిలించి పారేసే ధైర్యం చేయగలరా? అయితే విషయమై మీరు చాలా లోతైన పరిశీలన చెయ్యాల్సి ఉంటుంది. నాకు చేతనైన మేరకు ందుకు నేనూ సహకరిస్తాను.

 

శీర్షికలో గతమాసము వచ్చిన వ్యాసము పై స్పందనలు(http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan12/devudunnaada.html)

 

From: Krishna Kumar Pillalamarri

The kind of argument presented here is a regurgitated pseudo scientific methodology. Unfortunately, it even mixes up Christian and Hindu thought processes (witness the statement which says, 'God created the world for six days and rested on the seventh day', which is a Christian belief, followed at once by Hindu divine examples). The author starts off by saying he is a logical scientific person, but does not seem to follow any scientific process of argument. I give him the freedom to state what he wants to say about the existence of God - after all this is one of the oldest questions faced by mankind - but the correct method, as shown by our sages and western scientists - is to do a " Poorva Paksham ", a clear statement of both sides of the existing claims, facts and arguments before presenting his arguments one way or the other. Unfortunately, this is the most opinionated, and unscientific tirade I have ever read in these pages. I am willing to argue with this learned person any time.

Regards,

From: Muttevi Ravindranath

భగవంతుడిని గురించిన చర్చ వచ్చినప్పుడు అన్ని మతాల ప్రస్తావనలూ వస్తాయి. ఎంతకాలం నుండో మనం నమ్ముతూ వస్తున్న విషయాలపై జరిగే చర్చ ఇలాగే  ఉండగలదని నేను ముందే ఊహించాను. నా వ్యాసం ఉద్దేశం కేవలం ముక్కోటి హిందూ దేవతల ఉనికిని మాత్రమే ప్రశ్నించడం కాదని వారు గమనించ ప్రార్థన. అలాగే  చదువరుల స్పందనల లోని భాష మరి కొంత ఇంపుగా ఉంటే, అసలు విషయం పై  చర్చ మరింత ఆసక్తికరంగా ఉండగలదు. వారు ఎన్ని ప్రతివాదనలు  చేసినా ఒక  సత్యాన్వేషిగా వాటిలోని సత్యాలను స్వీకరించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధమే వాది-ప్రతివాదులకు సత్యాన్వేషణ మాత్రమే ప్రధానం అయినప్పుడు ఉద్రేక పడడం, తరహా భాష వాడడం కూడనివి.

'Regurgitate' అంటే వాంతి చేసుకొనడం. వారి ఆక్రోశం   వ్యక్తం చేయడానికి  వారికి ఇంతకు తక్కువ పదం దొరకలేదేమో! క్రైస్తవుల విశ్వాసాన్ని పేర్కొన్న  తరువాత వెంటనే  హిందూ దేవతల ప్రస్తావన తేవడం తప్పా? దాని పైనే ఆధారపడి  వారు నా వాదన అశాస్త్రీయమని రుజువు చేయబూనుకుంటారా? అన్ని మత విశ్వాసాల శాస్త్రీయతపైనా మున్ముందు వ్యాసాలలో చర్చ ఉంటుంది.ఎవరిది ఏమేరకు శాస్త్రీయ విధానమో కాలమే నిర్ణయిస్తుంది. పదాల వినియోగాన్నే చూడండి.'I give him the freedom  to state what he wants to say about the existence of god' అనే దానికి బదులు 'He is at liberty to state what he wants to say about the existence of god' అనడం ఇక్కడ సమంజసమూ, శాస్త్రీయమూనని చదువరులెవరైనా అంగీకరిస్తారు.కృష్ణ గారి వ్యాఖ్యలో 'Autocratic' పోకడ  ధ్వనించడం లేదూ? ప్రజాస్వామిక ధోరణే లేని తావులలో శాస్త్రీయత కోసం  వెదకడం వృథా అనుకుంటాను.ప్రభుత్వాలు,మతాలు చెప్పేవి కొన్ని అశాస్త్రీయాలని ఋజువు చేసిన ఎందఱో తాత్వికులు,శాస్త్రజ్ఞులను బలి గొన్నది ఈ ప్రపంచం. సౌర కుటుంబం లో సూర్యుడితో సహా గ్రహాలన్నీ భూమిచుట్టూ  తిరుగుతున్నాయని ప్రచారం చేసిన' మతం' భూమి, తదితర  గ్రహాలే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని రుజువుచేసి, సరికొత్త 'సౌర కేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించిన నికొలాస్ కోపెర్నికస్ ని  బతకనివ్వలేదు కదా ? కానీ ఎవరిది వాంతి చేసుకున్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతమో, ఎవరిది శాస్త్రీయమో ఈనాడు మనందరికీ తెలుసు

మొదటి పరిచయ వ్యాసంతోనే అంతగా కంగారు పడాల్సిన పనేమిటో నాకైతే అర్థం కావడం లేదు.ప్రపంచం లోని వివిధ దేశాల ఆధ్యాత్మిక వాదుల సిద్ధాంతాలు-హిందువుల సిద్ధాంతాలతో సహా- ఏమేరకు శాస్త్రీయాలో, ఎంతమేరకు విశ్వసనీయాలో మున్ముందు వ్యాసాలలో ప్రస్తావిస్తాను.  శీర్షికకు చర్చావేదిక అని పేరుపెట్టింది విషయమై విస్తృత చర్చకు  తెరదీయడానికే. చర్చ పత్రికాముఖంగా జరిగినా, కలిసినప్పుడు వ్యక్తుల మధ్య జరిగినా వాదన సిద్ధాంతాల పైనే లగ్నం చెయ్యాలి గానీ వ్యక్తిగత  ఆవేశ కావేశాలకు లోను కారాదు.అప్పుడే చర్చ సత్యాన్వేషణకు దారి తీస్తుంది.దానివల్ల సమాజానికీ ప్రయోజనం.మహర్షుల ప్రస్తావన ఎటుతిరిగీ తెచ్చారు కనుక చెపుతున్నాను.సత్యాన్వేషణలో వాది-ప్రతివాదులు విద్వేషరహిత వాతావరణంలో కేవలం సత్యాన్వేషణ లక్ష్యంగానే చర్చించేవారు.'కఠోపనిషత్' లోని క్రింది శాంతి పాఠం ఆర్ష సంప్రదాయంలో వాది- ప్రతివాదు లిరువురూ శిరోధార్యంగా భావించేవారు.

"ఓం సహనావవతు  | సహనౌ భునక్తు| సహ వీర్యం కరవావహై |

 తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై | "

అంటూ వారు సహిష్ణుతనే పాటించేవారు. విద్వేషం వలదన్నారు. ఏమైనా- కృష్ణ కుమార్ గారు ' I am willing to argue with this learned person any time' అన్నారు చివర్లో. సంతోషం. నేనూ అందుకోసం ఎదురు చూస్తాను.  నా స్పందననూ, చర్చకు నా సంసిద్ధతనూ వారికి తెలపండి. ఇలాంటి స్పందనలను ఎప్పటికప్పుడు నాకు తెలిపితే వారి వాదనలకు నా ప్రతిస్పందన నా తదుపరి వ్యాసాల్లో జోడించగలను.

మన స్పందన, ప్రతిస్పందనలు తెలుగులో సాగినప్పుడే అందరికీ ఆసక్తిదాయకమౌతాయి. ఉటంకింపులలో అవసరం అయితే తప్ప చర్చ తెలుగులో సాగితేనే అందరూ చక్కగా అర్థం చేసుకుంటారు. గమనించ గోర్తాను.


From: జయశంకర్

రవీంద్రనాథ్ గారికి నమస్కారములతో,

దేవుని పైన మీరు మొదలు పెట్టిన చర్చ చాలా బాగుంది. మీరు చెప్పిన విధముగా దేవుడు పాపులను పుట్టించి వారి చేత పాపములను చేయించి వారిని హింసించి ఆనందించు వాడు కాడని, మరియూ ప్రార్థనలతో ఉప్పొంగి పాపులను క్షమించు వాడు కూడా కాదు అని ఒప్పుకోక తప్పదు. హిందూ మరియు ఇతర మతముల ప్రకారం నాకు తెలిసినంత వరకూ దేవుడు సృష్టి కర్త మరియు సర్వ ప్రాణుల సంరక్షణాధికారి (అనగా దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయు వాని) వలె వర్ణింతురు. నా ఉద్దేశ్యములో దేవుడిని అర్థము చేసుకొనుటకు రెండు భాద్యతలను వేరు చేసి చూడవలెను. 

1) సృష్టి కర్త

2) సంరక్షణాధికారి: (రాజు లేదా పోలీస్ అనుకుందాం) 

సృష్టి కర్త: సృష్టిని ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా సృష్టించారనేది ఎవరికీ తెలియని చిక్కు ప్రశ్న. నాకు తెలిసీ అంతరిక్ష శాస్త్రవేత్తలూ నాసా (NASA) ఇంజనీర్లూ వారి అద్భుతమైన కంప్యూటర్లు అంతకన్నా తేజోవంతమైన వారి మేధస్సులతోనూ విషయాన్ని తెలుసుకునేన్దుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎప్పటికైన విశ్వ న్రిమాణం గురించి ఇదమిద్దంగా చెప్పగలవారు వారే నేమోనని నాకనిపిస్తుంది. 50 లేదా వంద ఏళ్ళు ఆగితే మనకు విషయంలో మంచి అవగాహన రావచ్చు. అంత వరకూ మనముంటే? సృష్టి నిర్మాణం ఎంత సంక్లిష్టమైనది అనేది, మనకు ఎంత తక్కువ తెలుసు అనేది సుజన రంజని గత సంచికలలో వేమూరి వారు వ్రాసిన విశ్వ స్వరూపం చదివితే మనకు తెలుస్తుంది.

సమ్రక్షణాధికారి: అంటే దేవుడు నిరంతరం ప్రతీ ప్రాణీ ఒప్పు తప్పులను మెగా స్ప్రెడ్ షీట్ లో వ్రాసి వరాలను శిక్షలనూ ఇచ్చుకుంటూ ఉండాలి. మీరు చెప్పినట్లు పాపులను సృష్టించి వారిచేత పాపాలను చేయించి చిట్టాలను వ్రాసుకుంటూ ఉండటంలో అర్థం మనకు అట్టే గోచరించదు. మనిషి సృష్టించిన దేవుడు ప్రతీ మనసులో (అంటే మెదడులోని భాగంలో) ఉంటాడని నా నమ్మకం.

దేవుడు అనేది మనసులోని ఒక emotion. ప్రేమ, భయము, కోపము లాగా. కాకపోతే కాస్త క్లిష్టమైన emotion.

మనోశాస్త్రవేత్తలు భయము, కోపము, నిరాశ మొదలగు emotions మెదడులో ఎక్కడ పుడుతున్నాయో కనుగొన్నారు. అలాగే emotions ను ఔషధములిచ్చి manipulate చెయ్యగలుగుతున్నారు కూడా. అలాగే రోజున దేవుడు అనే emotion ను గుర్తిస్తే మనము ఆశ్చర్య పోవలసిన అవసరము లేదు.

అది ఎక్కువైన మత చానదసులకు మాత్ర నిచ్చి control కూడా చెయ్యవచ్చునేమొ??. In summary, God is likely a complex emotion combining hope, reassurance, righteousness, పాపభీతి, love and some other feelings, yet to be mapped on the brain.

మరలాంటప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ కాలాలకు సంబంధించిన మనుషులు (నూటికి తొంభై మందికి పైగా) నమ్మిన, నమ్ముతున్న దేవుడు లేకపోవటమేమిటి అనే ప్రశ్న రావటం సహజం. ఒకప్పుడు ఉన్న knowledge అధారంగ అప్పుడు మహా మేధావులు దేవుడిలా ఉంటాడని వ్రాశారు. సిద్ధాన్తమైనా ఆనాటి knowledge base మీద అధారపడి ఉంటుంది. ఒకప్పుడు భూమి గోళాకారంలో ఉందంటే నవ్విపొయారు. ఇప్పుడు ఉన్న శాస్త్రీయ పరిఙ్ఞానము అధారంగ ఇది నా సిద్ధాంతం. ఇది నా అభిప్రాయము మాత్రమే అని పాఠకులు గమనించగలరు. తెలుగు భాషా పరిఙ్ఞానలోపము వలన కొన్ని ఆంగ్ల పదములు వాడినందుకు క్షమించగలరు.

ధన్యవాదములు


From: satyasree

The Article is good

ధన్యవాదములు

 

ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech