s  
సారస్వతం  
     అన్నమయ్య కీర్తనలు రచన : జి.బి.శంకర్ రావు  

ఎండగాని నీడగాని

ఎండగాని నీడగాని యేమైనాగాని
కొండలరాయుడే మా కులదైవము

తేలుగాని పాముగాని దేవ పట్టయినగాని
గాలిగాని ధూళిగాని కాని యేవైనా
కాలకూట విషమైన గక్కున మింగిననాటి
నీలవర్ణుడే మా నిజదైవము

చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కాని యేమైనా
పాముల నిన్నిటి మింగే బలుతేజిపై నున్న
ధూమకేతువే మా దొరదైవము

పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనగాని
కల్లగాని పొల్లగాని కాని యేమైనా
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడే మ
మ్మెల్లకాలమును నేలే యింటి దైవము

అన్నమయ్య పామరులలో విష్ణుభక్తి ప్రచారానికి జానపద సంకీర్తన శైలిని ఎన్నుకున్నాడు. అచ్చ తెలుగులో లయాత్మకంగా సాగుతూ వినేవారికి శ్రవణానందం కలిగిస్తూ భక్తి భోధకంగా ఉన్న జానపద సంకీర్తనలు అన్నమయ్య సాహిత్యంలో కొల్లలు. అట్టి సంకీర్తన యిది. ఏది ఏమైనా గాని మమ్మల్ని ఏలే మా యింటి దైవము ఏడుకొండలసామే! అని అంటున్నాడు అన్నమయ్య! సుఖమైనా, దుఃఖమైనా, నష్టమైనా, లాభమైనా అన్నిటా అన్నివేళలా భగవంతుణ్ణి దర్శించడమే, భగవదనుభూతిని పొందడమే ఈ పాటలోని ఆంతర్యం!

దేవపట్టు = యక్షరాక్షసాది దేవయోనులు ఉండుచోటు
గాము = సూర్యుడు;
నాము = జొన్నలోనగువాని కొయ్య కాలున చిగిరించిన మొలక; దీన్ని పశువులు తిన్నచో మరణించును.
ధూమకేతువు = కల్కి; బల్లిదుడు = బలవంతుడు; తేజి = గుఱ్ఱము

 


 

ఎంత కాలమో కదా
 

ఎంత కాలమో కదా యీదేహధారణము
చింతా పరంపరల చిక్కువడ వలసె

వడిగొన్న మోహంబు వలల తగులైకదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమి సుఖములచేత ననుపుసేయక కదా
తొడరి హేయపు దిడ్డి దూరాడ వలసె

పాపపుంజరములచే పట్టువడగా కదా
ఆపదలతోడి దేహము మోవవలసె
చూపులకు లోనైన సుఖము కానక కదా
దీపన భ్రాంతిచే తిరిగాడ వలసె

హితుడైన తిరువేంకటేశు కొలువక కదా
ప్రతిలేని నరక కూపమున బడవలసె
అతని కరుణారసంబబకుండక కదా
బతిమాలి నలుగడల పారాడవలసె

 

వాసాంసి జీర్ణాని యధావిహాయ’ అంటోంది భగవద్గీత! అంటే జీవుడు మాసిన లేదా చినిగిన బట్టలను విడిచి ఏ విధంగా కొత్త బట్టలను కట్టుకుంటాడో, అలాగీ ఈ జీవాత్మ కూడా శిధిలమైన దేహాన్ని వీడి కొత్త దేహాన్ని ధరిస్తుంది.! ఇది కర్మఫలాలనుసరించి ఆవృతంగా (చక్రంవలే) నిరంతరం జరుగుతుంది! ఈ క్రమంలో పుట్టుకలు, బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యాలు, ఈ దిశలో పలు బాధలు చివరికి చావు మరలా ఈ క్రమం పునరావృతం! ఆది శంకరులు ‘భజగోవిందం’ లో చెప్పినట్ట్లు పునరపి జననం, పునరపి మరణం! ఈ క్రమమంతా చివరకు దుఃఖాన్నే అందిస్తుంది. అయితే దుఃఖరహిత స్థితి ఏది అంటే, ఈ భౌతిక జన్మలను, దేహం తోడి సంబంధాలను వీడి పరమాత్మునిలో లయం కావటమే! ఈ పాటలో అన్నమయ్య అరిషడ్వర్గాల మాయలో పడిన జీవుడు ఎలా వివిధ జన్మలలో దుఃఖాలను అనుభవిస్తాడో తెలియజేస్తాడు!


తగులు - సంబంధము;
నడిమి = మధ్యలో వచ్చే
తొడరి = కలుగు (?)

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech