ఏడో దారి

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇదేం బాగోలేదు. శ్రీకృష్ణ కమిటీ ఆరు ఉపాయాలు చెప్పింది కాబట్టి మనవాళ్లు ఎంతసేపూ వాటి చుట్టూనే గిరికీలు కొడుతున్నారు. రాజకీయ పండితులు, పార్టీల మేధావులు, టీవీ చానెళ్ల ఆస్థాన విద్వాంసులు హోరాహోరీగా వాదులాడే కొద్దీ అయోమయం పెరుగుతున్నది. సంక్షోభం ముదురుతున్నది. తగవులు తగ్గే దారీ తెన్నూ ఎవరికీ కానరావడం లేదు.
ఇది వృథా గందరగోళం. పరిష్కారం చాలా సింపుల్. ‘శ్రీకృష్ణ’ చెప్పిన ఆరింటినీ ఒగ్గేసి, ఆ కమిటీకి తట్టని ఏడోదారిని పట్టుకుంటే ఏ గొడవా ఉండదు.
అసలు సమస్య ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా, వద్దా అనా? కొంచెం ఔను; కొంచెం కాదు.
దేశానే్నలేవారికి తెలంగాణ పెద్ద తలనొప్పి అయిన మాట నిజం. తెలంగాణను విడగొడితే సీమాంధ్రలో కాంగ్రెసు మట్టికొట్టుకుపోతుంది. విడగొట్టకుంటే తెలంగాణలో ఆ పార్టీకి పుట్టగతులుండవు. చచ్చీ చెడీ విడగొట్టినా తెలంగాణ జనం తెరాసకూ, కెసిఆర్‌కూ వీరపూజ చేస్తారే తప్ప కాంగ్రెసును నెత్తినెత్తుకోరు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి! ఈ సంకటాన్ని ఎలా దాటాలా దేవుడా అని కాంగ్రెసు పెద్దలు జుట్టు పీక్కుంటున్న సంగతి యథార్థం.
కాని ఈ తలనొప్పిని తలదన్నిన గుండెనొప్పి ఏలినవారికి వేరే ఉంది.
పూర్వం కొంగలమల్లయ్య అనే భయంకర మానవుడు ఊరి బయట గట్టుమీద శాలువ కప్పుకొని, కత్తి చేతపట్టుకుని కూర్చునేవాడట. దారినపోతూ పరదేశి ఎవరైనా కనపడగానే లేస్తే మనిషిని కాను. నీ దగ్గరున్న, నగానట్రా మర్యాదగా ఇక్కడ పెట్టి వెళ్లమనేవాడు. అతడి భీకరాకారాన్నీ, తళతళలాడే కత్తినీ చూడగానే హడలిపోయి ప్రతివాడూ జేబులో ఉన్నదంతా సమర్పించుకుని ప్రాణభయంతో పారిపోయేవాడు. కొన్నాళ్లిలా సాగాక ఎవడో కొక్కిరాయి అటుకేసి వచ్చి, అదిలింపుకు భయపడక ‘లే చూద్దాం’ అన్నాడు. గజదొంగ గతుక్కుమని ‘సరే పో’ అన్నాడు. ఎందుకంటే వాడికి కాళ్లు లేవు. లేవలేడు.
కాంగ్రెసు హైకమాండుదీ అదే బాపతు. ఇంతకాలమూ లేస్తే మనిషిని కానని పార్టీవాళ్లందరినీ హడలగొట్టింది. చివరికి వై.ఎస్. జగన్ అనే కుర్రకుంక అడ్డం తిరిగి ‘లే చూద్దాం’ అనేసరికి అధిష్ఠానపు అవిటి బండారం బయటపడింది.
ప్రస్తుతం కాంగ్రెసు సర్కారుకు ముంచుకొచ్చిన తక్షణ ప్రమాదమైతే ఏమీ లేదనుకోండి. జూనియర్ వై.ఎస్. ఎన్ని ఎరలు వేసి, ఎంతమంది ఎమ్మెల్యేలను తన వైపు గుంజుకున్నా ఏమీ కాదు. ‘కాపూ రెడ్డీ నా పక్కనుంటే, ఎట్లాకొడతావో కొట్టర మగడా’ అన్న గడసరి మగనాలిలాగా ‘బాబూ, చిరూ నా కొమ్ముకాస్తే ఎట్లా పడగొడతావో కొట్టర జగనూ’ అని ముఖ్యమంత్రి సవాలు చేయగలడన్నది నిస్సందేహం.
తనకు గిట్టని కిరణ్‌కుమార్ మీద స్పీకర్‌గా ఉన్నప్పుడే అక్కసుకొద్దీ అవిశ్వాస తీర్మానం పెట్టిన చంద్రబాబు సదరు బద్ధవిరోధిని కూలదోయడానికి సువర్ణావకాశం ఒళ్లో వాలితే మామూలుగానైతే క్షణం ఆలస్యం చెయ్యడు. కాని ప్రభుత్వం కూలి మధ్యంతర ఎన్నికలొస్తే తనకు మొదటికే మోసం వస్తుందన్న భయంచేత నాయుడుగారు అందుకు సాహసించలేకపోతున్నాడు. అదే ఇప్పుడు సర్కారుకు పెద్ద ఊరట. కాని ఇలా ఎంతకాలమో తెలియదు. తనకు కలిసి వస్తుందన్న భరోసా కలగాలేకాని చంద్రబాబు ఎప్పుడైనా అవిశ్వాసం తెచ్చి గవర్నమెంటును పడగొట్టగలడు. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెసు మనుగడ దినదినగండం!
ఇంకోవైపు తెరాస తంటా! తెలంగాణ ఇవ్వకుంటే సోనియాను బజారుకీడుస్తా, భూకంపం పుట్టిస్తానని దిక్కులదిరేలా రంకెలేసిన దొరవారు ‘శ్రీకృష్ణ’ కమిటీ మొండిచేయి చూపి, తెలంగాణ అంశాన్ని కేంద్రం అటకెక్కించిన తరవాత కూడా ఎందుకోకాని ‘వ్యూహాత్మక వౌనం’ పాటిస్తూ కాంగ్రెసు గుండెదడను తగ్గించాడు. కాని - ఈ భోగమెంత కాలమో! తనకు అవసరమనుకున్నప్పుడు కె.సి.ఆర్. మళ్లీ లొల్లి మొదలెట్టి తెలంగాణను రెచ్చగొడితే కాంగ్రెసుకు కష్టమే!
ఇదీ సమస్య! తెలంగాణ కొరివితో ఒక చేతిని, జగన్ వ్యవహారంలో మొత్తం ఒంటిని కాల్చుకుని దిక్కుతోచని అధిష్ఠానానికి తాను కోరి కొని తెచ్చుకున్న సంకటం నుంచి బయటపడటానికి ఒకటే దారి!
ఆపదలో ఆదుకున్నవాడే అసలైన మిత్రుడు. ఆవిధంగా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెసుకు చంద్రబాబును మించిన ఆప్తమిత్రుడు, ఆపద్బాంధవుడు మరొకడు లేడు. 24 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి జగన్ పంచన చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడ్డదని తెలిసినా... తన చేతిలోని 87 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం తెచ్చి, గవర్నమెంటును అవలీలగా పడగొట్టగలిగి కూడా... తన స్వార్థం కోసమే అయినా, అందుకు తొందరపడకుండా, బద్ధశత్రువు కిరణ్ సర్కారును కొనసాగనిస్తున్న చంద్రబాబు కంటే ఇప్పుడు కాంగ్రెసు హితైషి ఎవరు?
అందునా - చంద్రబాబు కాంగ్రెసుకు పరాయివాడా? తనలో 30 శాతం కాంగ్రెసు రక్తం ఉన్న సంగతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లోకానికి వెల్లడించిన అస్మదీయుడాయన. ఇప్పుడు కనుక బ్లడ్‌టెస్టు చేయిస్తే బహుశా ఆయన రక్తంలో కాంగ్రెస్ శాతం ఇంకా పెరిగి ఉండవచ్చు. ఏమైనా సొంత పార్టీవాళ్లే గవర్నమెంటును కూల్చటానికి ఉవ్విళ్లూరుతున్న సమయంలో ఎగస్పార్టీలో ఉండీ కాంగ్రెస్ సర్కారు కొమ్ముకాస్తున్న బాబే కాంగ్రెసుకు అసలైన ఆత్మబంధువు. ఈ సేవను గుర్తించి, ఆయన కాంగ్రెసు గతాన్ని గౌరవించి చంద్రబాబును కనుక ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం మళ్లీ ఎన్నికల దాకా స్థిరత్వం చేకూరుతుంది. తిరగబడ్డ కుర్రకుంక నోట మన్ను పడుతుంది.
పనిలోపనిగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సుబాగా ప్రకటించి, ఎంతోకొంత కాంగ్రెసు రక్తం ఉన్న కె.సి.ఆర్.ను దానికి సుబేదారుగానూ, రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగానూ ఉండమంటే తెలంగాణ లొల్లీ పోతుంది. ఒకప్పటి గురుశిష్యులైన ఇద్దరు చంద్రులూ మళ్లీ ఏకమై సర్కారును నడిపిస్తే రాష్ట్రం రేసుగుర్రంలా పరిగెత్తుతుంది. అలాగే కాంగ్రెసు సర్కారును కూలీ అడక్కుండా ఎగబడి కావలికాస్తున్న చిరుగారిని కూడా లోపలికి లాక్కుని ఏ సినిమాల శాఖకో మంత్రిని చేస్తే పాపం ఆయనకూ ఆయన కోరే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. ఇవాళ ప్రతిపక్షంలో ఉండీ కాంగ్రెసు సర్కారును కూలకుండా కష్టపడి కాపాడుతున్న ముగ్గురు మహానుభావులకూ కాంగ్రెసు దివాణం రుణం తీర్చుకున్నట్టవుతుంది.
ఇక సోనియాజీదే ఆలస్యం!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech