 |
 |

aaa

తాత్వికుడు,
బహుముఖ ప్రజ్ఞాశాలి -
సద్గురు శ్రీ కందుకూరి శివానంద మూర్తి |
|
సనాతన ధర్మం పట్ల ప్రగాడామైన మక్కువ
కలిగిన వారు, దేశ భక్తుడు, వక్తా, మేధావి, బహు ముఖ ప్రజ్ఞాశాలి -
శ్రీ కందుకూరి శివానంద మూర్తి గారు. హిందూ ధర్మ శాస్త్రం, భారతీయ
ఇతిహాసం, కళలు, సంగీత సాహిత్యంపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఒక్క
మాటలో చెప్పాలంటే ఆయన " వాకింగ్ ఎన్ సైక్లోపీడియా ". అనేక మందికి
దిశా మార్గం చూపిస్తున్నారు. తన శాయ శక్తులా సనాతన ధర్మ మూలాలు
పెంపొందిస్తున్నారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి, రాష్ట్ర చింతకుడు,
సాహిత్య, సంగీత కళా పరిరక్షకుడు లభించడం తెలుగు వారికి గర్వకారణం.
" భారతీయత రంగరించుకుని ఉన్నవారు శివానంద మూర్తి గారు.
ప్రభోదాత్మకమైన " భారతీయత " గ్రంధాన్ని వెలువడించారు. శివానంద
మూర్తి గారి జ్ఞాన సంపద అపారం. ఆయన మంచి చదువరి. 13,000 పుస్తకాలు
పైగా చదివారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం, కళలు, సాంప్రదాయం,
భారతీయత, ఇవన్నీ ప్రోత్సహించడం, పోషించడం ఒక్కడితో అయ్యే పనేనా అని
సందేహ పడనక్కర లేదు. ముమ్మూర్తులా ఇది శ్రీ కందుకూరి శివానంద
మూర్తి గారికి సాధ్య పడింది. వారి నిరంతర కృషి సత్ఫలితాలని
అందించింది, మరిన్ని ప్రయోజనాలు అందిస్తోంది.
శ్రీ శివానంద మూర్తి గారు డిసెంబర్ 21, 1928 లో ఆంధ్ర ప్రదేశ్ లోని
విజయనగరం జిల్లా లో శ్రీ వీర బశవరాజు, శ్రీమతి సర్వమంగళ దంపతులకు
జన్మించారు. చిన్న తనం నుండి వారికి తాత్విక భావాల పట్ల మక్కువ
ఉండేది. యోగ శాస్త్రాన్ని అభ్యసించారు. పదవ ఏట నుండి అనేక
పుస్తకాలను చదివారు. చాలా పుస్తకాలు ఇంట్లోనే ఉండడంతో సౌలభ్యానికి
లోటు రాలేదు. దాదాపు 13,000 పుస్తకాలను పైగా చదివారు. 1949 లో
విజయనగరం నుండి సైన్స్ లో డిగ్రీ సాధించి ఉద్యోగంలో చేరారు. కొంత
కాలం హనుమకొండలో పనిచేశారు. పోలీసు శాఖ నుండి విశ్రాంతి తీసుకుని,
సాహిత్య సాంప్రదాయాల, ధార్మిక పనులలో నిమగ్నమైపోయారు శివానంద
మూర్తి గారు.
సాంప్రదాయం, భారతీయత, వ్యక్తిత్వ వికాసం కోసం:
వీరికి దేశం పట్ల ప్రఘాడమైన ప్రేమ, భక్తి. సనాతన ధర్మం, విలువల
పట్ల వారి మక్కువ చెప్పనక్కర లేదు. చూసిన వారికి ఇట్టే
అర్ధమవుతుంది. శివానంద మూర్తి గారి ఆధ్వర్యాన 450 కు పైగా రుద్ర
యాగాలు జరిగాయి. హిందూ దేవాలయాల నిర్మాణంలో తన వంతు చేయూత
నిస్తున్నారు, చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు. ఆయన గొప్ప
మానవతావాది.
"ఓర్పు" ఓ సుగుణం. కానీ ఇదే రాజకీయాలలో, ఐహిక సంపాదనలో బలహీనత గా
మారింది " అని శివానంద మూర్తి గారి వాచ. ఇలా తన దృక్పథం
ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తారు.
శ్రీ శివానంద మూర్తి గారు, సనాతన ధార్మిక ట్రస్ట్ ద్వారా - సంగీత,
శాస్త్ర, సాహిత్య, ఆరోగ్య, పాత్రికేయ, మానవతా రంగాలలోని
నిష్ణాతులను ఏటా సంగీత ఉత్సవం, తదితర కార్యక్రమాలలో గుర్తించి
అభినందిస్తున్నారు.
విద్యుక్త ధర్మాలూ బోధించారు. వీరిని అనుసరించిన వారు లబ్ధి
పొందారు. ఉదాహరణకు నిత్య పూజలు చేయడానికి చాలా మందిని
ప్రొత్సహించారు. నిత్యం పూజ చేయడం ద్వారా క్రమశిక్షణతో పాటు, నడవడి
ఏర్పడుతుంది. దీనితో పాటు నిష్ట ఏర్పడుతుంది. తరువాత ఇదే ప్రేరణ
అవుతుంది. దైనందిన జీవితంలో పాటించేది సంస్కృతిలో అంతర్భాగం
అవుతుంది. పద్ధతులు అలా కొనసాగుతాయి. సనాతన ధర్మాచరణ ఈ రూపంలో
ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీ శివానంద మూర్తి గారు ఇలా చేస్తున్న
వారిని, మరిందరికి మార్గదర్శనం చూపేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా
ఆశయం ద్విగుళం, బహుళం అవుతోంది. ఇది నిస్వార్ధ ధోరణితో, సత్
చింతనతో, నిశితమైన దృష్టితో చేస్తున్నది కాబట్టి సత్ ఫలితాలని
అందిస్తోంది. వ్యక్తిత్వంలో క్రమశిక్షణ, దృక్పథం తెలియకుండానే
ఏర్పడుతాయి. మనిషి వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇవి నికర లాభాలు. ఒక
కోణం లో చూస్తే, ఇది భారతీయతే.
సంగీత సభల నిర్వహణ:
ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం భీమునిపట్నం " ఆనంద వనం " ఆశ్రమంలో
ఉంటున్నారు శ్రీ శివానంద మూర్తి గారు. వీరి ఆశ్రమంలో " మహాలక్ష్మి
" ఆలయాన్ని నిర్మించారు. సంగీతాన్ని పెంపొందించే దిశగా అనేక సంగీత
సభలు నిర్వహించారు, ఇంకా నిర్వహిస్తున్నారు శివానంద మూర్తి గారు.
ఏటా " ఆనంద వనం " లో సంగీతోత్సవాలు జరుపుతున్నారు. సంగీతంలో
శ్రష్టలని సత్కరించారు. వీరిలో మంగళంపల్లి బాలమురళి కృష్ణ,
నేదునూరు కృష్ణమూర్తి, కమలాకర రావు (మృదంగ విద్వాంశుడు), చంద్రమౌళి
గారు ఉన్నారు.
రచనలు:
తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలలో మంచి పట్టు ఉన్న వారు శ్రీ
కందుకూరి శివానంద మూర్తి గారు.
ఓ రచయితకి లోతైన భావాలు, తాత్విక చింతన, దేశ ఇతిహాశ పరిజ్ఞానం
అవసరం. వీటితో పాటు వాక్ శుద్ధి, సాహిత్య, సంగీత సంస్కృతి పట్ల
అవగాహన, భావ, నిక్షిప్త నిగూడార్ధాలు తెలియడం, మంచి భాషా పటుత్వం
ఉండాలి. ఇవన్నీ కూడగట్టుకున్న వారు శ్రీ కందుకూరి శివానంద మూర్తి
గారు. వీరు రూపొందించిన వ్యాసాలు అనేక పత్రికలలో వెలువడ్డాయి. ఈ
వ్యాసాలు ముఖ్యముగా సాంస్కృతిక, రాజకీయ, భారతీయ ఇతిహాసం, తాత్వికత
రంగరించుకుని ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని ముఖ్యమైనవి:
- కథా ఉపనిషత్ వ్యాఖ్యానం
- భారతీయత (రెండు సంపుటాలు)
- హిందూ వివాహ వ్యవస్థ - దాంపత్య జీవనము
- మహర్షుల చరిత్ర
- గౌతమ బుద్ధ
" భారతీయత " చాలా శ్లాఘనీయమైన గ్రంధం. అనేక అంశాలను కూలంకషముగా
వివరించారు. ఈ గ్రంధం చదివిన వారికి " భారతీయ " నాణ్యత ఏపాటిదో
ప్రస్పుటముగా గోచరిస్తుంది. ప్రజలందరూ ఇది అలవరచుకుంటే
వ్యక్తిగతంగా అటు వారికి, ఇటు దేశానికి ప్రయోజనకరం, అని శ్రీ
శివానంద మూర్తి గారి అభిమతం.
శ్రీ శివానంద మూర్తి గారు తెలుగు విశ్వవిద్యాలయం నుండి " గౌరవ
డాక్టరేట్ " అందుకున్నారు. 2000 లో, కీర్తి రాజ లక్ష్మి ఫౌండేషన్
వారి " రాజ లక్ష్మి " అవార్డు అందుకున్నారు.
బహుదా శ్రీ శివానంద మూర్తి గారు భీమునిపట్నం ఆనందవనం ఆశ్రమంలో
ఉంటున్నారు. సాధ్యమైనంత రీతిలో కళలని ఆదరిస్తున్నారు, కళాకారులని
పోషిస్తున్నారు, అద్వితీయ భారత సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. తన
సాయ శక్తులా వాటిని పెంపొందిస్తున్నారు. పది మందికి దిశా మార్గం
చూపిస్తున్నారు. ఇలాటి బహు ముఖ ప్రజ్ఞాశాలి, రాష్ట్ర చింతకుడు,
దేశభక్తుడు, కళా, సాహిత్య, సంగీత సంస్కృతి పరిరక్షకుడు లభించడం
తెలుగు వారికి గర్వకారణం. విలువలని పెంపొందించే మిషలో ఫలితాలు
సాధించారు. సాధిస్తున్నారు!. భారతీయ పరంపరలో వెలుగొందిన మహానుభావుల
కోవలో వీరు మరొకరు.
మరిందరు శివానంద మూర్తులు దేశానికి కావాలి. " విలువలకి "
విలువిచ్చే వారు, వాటిని పరిరక్షించి, పెంపొందించేవారు మరిందరు
కావాలి. ఇది నేటి అవసరం!.
|
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది
పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ
తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please
keep comments relevant.)
|
 |
Copyright ® 2001-2009 SiliconAndhra. All
Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|