- రావు తల్లాప్రగడ
 
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ
తాటిపాముల మృత్యుంజయుడు

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.

తనికెళ్ళ దశభరణి  

 

సీ.|| కఠిననటనలకు కథనపటిమలకు - కవితపదములకు నవత సవిత!

మెరుపువిరుపులకు తెరుపుమరుపులకు - వచనసరళులకు వరద వలను!

కంచుకవచముతొ కంపమై అడుగిడి - శివయను సినిమాన సివమె నటన!

నందివిందులుయెన్ని పొందినా ముందుగా – వెండిపండగయేను వేడుకంటే!

ఆ.వె.|| సాక్షమయ్యి నిలిచు నక్షత్ర దర్శనం,

చలనచిత్రమిత్రచరిత తెలిపి!

చిన్న చలనచిత్ర చీనమే చూపించె,

భరణి చేస్తె దాన్ని ధరణె మెచ్చు!

తే.గీ.|| పాలకొల్లట ఆ పిల్ల వాడి నేల,

ఆ తెలంగాణులదెటుల యాస నప్పె?

నోట శంకరా అంటాడు పాట పాడి,

లహరిగానిచ్చె హరభక్తి రామచంద్ర!

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తెలుగు చలనచిత్ర ప్రపంచంలో తనికెళ్ళ భరణి అంటే తెలియనివారుండరు. నటనాకౌశలంలో పట్టాను పొందకముందే నాటకరంగంలో పలు విజయాలు సాధించి, కంచుకవచం సినిమాకు సంభాషణలతో సినిమారంగంలో అడుగిడి , తరువాత కనకమహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్‌తో మొదలు పెట్టి 300వందలకు పైగా చిత్రాలలో నటించి, నంది పురస్కారాన్ని అందుకొని, పలుచిత్రాలకు దర్శకత్వం వహించి, పలు సినిమాపాటలు వ్రాసిన ఈ మహాహస్తి, మన అందరికీ సుపరిచితుడు, ముఖ్యంగా మన ఆప్తుడు, మన భరణి.

 

ఈ మద్యనే తన వెండిపండుగ చేసుకుని,ఎందరో మహానుభావుల మద్య అందరి వందనములు అందుకున్న ఈ తరణి;

ఆంధ్రభాషాచమత్కార మనోవనమోహనహరిణి;

అనితరసాధ్యవైవిధ్యరస సంభరితసంభారధోరణి;

నిష్కపటవాత్సల్యపూరితాకలితపుష్కరిణి;

మృధుమధురసుమనోహర ప్రీతివచనామిళితవాక్సరణి;

ఆంధ్రకవితావైభవాలంకృత భువనవిజయపునఃప్రతిస్థాపనాసంకల్పిత మహోత్తమకరణి;

సమగ్రకవిపండితపరిష్టంభ సభాలోకాలోకమహాగ్రణి

రసజ్ఞమనోజ్ఞజ్ఞానానంద జిజ్ఞాసితాసమన్వితవైతరణి

కవితాగాననటనాభావ సమ్మిళితసమ్మోహనాచాతుర్యసరణి;

నేత్రభ్రూశీర్షగ్రీవవిన్యాసకరణ భూయిష్టమహాపేరిణి

ఔత్సాహికరచనాప్రయోగపథులపాలిటిప్రేరణి

సకలకళావారుణీరసోమృత కౌశలాసంసిక్తభరణి

కవికులకరుణాస్రవణ వరవరుణాసంకీర్ణసంజీవకరణి

ఆ స్నేహభావసంకలిత వినయసంభాషణాభరణధారి – ఈ సకలకుసుమధారిణీ-ద్విరదమధురచారిణీధరణిపై

- ఒక్కతే తారిణి - ఒక్కడే భరణి

చలనచిత్ర పరిశ్రమలో గత పాతిక సంవత్సరాలుగా శ్రమించి తెలుగువారందరకీ సుపరిచితులైన తనికెళ్ళ భరణి గారి "ఎందరో మహానుభావులు" శీర్షికను ఈ నెల నుంచీ ధారావాహికంగా సుజనరంజని పాఠకులకు అందజేయడానికి ఎంతో అనందంగా వుంది. భరణిగారు ఇటివల అమెరికాలో సిలికానాంధ్ర వేదికపైన ప్రదర్శించిన సాహితీ పంచామృతం వారి రచనా నైపుణ్యానికి, కవితా సామర్ధ్యానికి ఒక చిన్న ఆనవాలు. వీరు రచించిన అనేక పుస్తకాలు అమితంగా పాఠకులను ఆకట్టుకుంటాయి. ఒక కొత్త ధోరణి, వినూత్న వైఖరి, సామాజిక ఒరవడి వీటిలో కనిపిస్తాయి. వీరి ఈ శీర్షికను కూడా మీరందరూ చదివి ఆనందిస్తారని ఆశించి, మీ ముందుకు తేవడం జరుగుతోంది.

--- --- ---

సుజనరంజనిలో పుస్తకపరిచయం శీర్షికను నిర్వహిస్తూ మనందరికీ పరిచయం అయిన, ప్రముఖ సాహితీ వేత్త  శైలజమిత్రకు ఇటీవల మినీ కవిత ప్రతిభా పురస్కారం లభించడం మన అందరికీ సంతోషకరమైన వార్త.  ప్రతి ఏడాది, మచిలీపట్నం సాహితీ మిత్రులు సంస్థ ఇచ్చే మినీ కవితా ప్రతిభా పురస్కారాన్ని, 2010 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శైలజామిత్ర గారికి అందజేస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డా. రావిరంగారావు ఒక ప్రకటనలో తెలియజేసారు.

జనవరి 30 వ తీదీన ఉదయం మచిలీపట్నం టౌన్ హాల్లో జరిగే సంస్థ 30 వ వార్షికోత్సవంలో ఈ పురస్కారం అందించనున్నట్లు డా.రావి రంగారావుగారు  తెలియజేసారు. అదే సభలో శైలజామిత్ర రచించిన ''అగ్నిపూలు'' మినీ కవితా సంకలనం ప్రముఖ సాహితీవేత్తల సమక్షంలో ఆవిష్కరింపబడుతుందని కూడా తెలియజేసారు. ఈ సందర్భంగా సుజనరంజని సైలజామిత్ర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది.

--- --- ---

సిలికానాంధ్ర నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం సాధించిన ఘనవిజయం గురించి గతమాసం సుజనరంజని ప్రస్తావించింది. ఈ సమ్మేళనంలో జరిగిన మరిన్ని విశేషాలను ఈ మాసం జుర్రు చెన్నయ్యగారి వ్యాసం ద్వారా తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాము. జుర్రు చెన్నయ్య గారు సిలికానాంధ్ర (భారత దేశం) ప్రధాన కార్యదర్శిగా సుపరిచితులు. వీరి కలం నుండి జాలువారిన వాక్యాలకు అందమేకాదు, ఒక ఆధికారిక ప్రధాన్యం కూడా వుంటుంది కనుక, వింటే అది వారి ద్వారానే వినాలి.

 

ఈ సమ్మేళనం జరిగిన తరువాత సన్నీవేల్ లో సిలికానాంధ్ర కార్యలయంలో ఘనంగా విజయోత్సవాలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా కూచిభట్ల ఆనంద్ గారి కృషిని ప్రశంసిస్తూ పలువురు కార్యకర్తలు ప్రసంగించగా సిలికానాంధ్రులు ఆయనకు ఘనసన్మానం చేసి సభను ముగించారు.

గత నాలుగు సంవత్సరాలుగా సిలికానాంధ్ర నిర్వహిస్తున్న మనబడి పాఠశాలలు మంచి పేరును సంపాదించుకోవడం కూడా అందరూ ఎరిగిన విషయమే. జనవరు 29, 30 వ తారీఖులలో రెండు రోజుల పాటూ మనబడి విద్యార్థులు జరుపుకున్న వార్షికోత్సవ సభ - మనబడి సాంస్కృతికోత్సవం మరొక విజయసంకేతం! సాధారణంగా ఒక రోజులో జరగాల్సిన ఈ వార్షికోత్సవాన్ని రెండు రోజులు జరుపుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఎంత మంది విద్యార్థులున్నారో అన్న విషయం ఈ పాటికి మీరు గ్రహించేవుంటారు. ఎందరో చిన్నారుల ఆటపాటలతో, నాటక కాలక్షేపాలతో, ప్రసంగాలతో ఉట్టిపడిన ఈ సభకు విచ్చేసి జయప్రదం చేసిన వారందరికీ మరొక్క సారి మా వందనాలు.

ఇలా మరెన్నో సభలు జరుపుకోవాలనీ, మరెన్నో విజయాలను సాధించలనీ కోరుకుంటూ,

మీ

రావు తల్లాప్రగడ

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech