 |
 |

సత్యమేవ జయతే -
అమెరికాలమ్ -
2
సైబర్ తెలుగు
-
సత్యం
మందపాటి
|
|
ద్రావిడ భాష అయిన తెలుగు భాషా పరిణామం
చూస్తే, ఎన్నో రకాల అందాలను ఆపాదించుకుంటూ రెండు వేల సంవత్సరాలకు
పైగా ఎలా రూపాంతరం చెందిందో అర్థమవుతుంది.
క్రీస్తు పూర్వమే తెలుగులో ప్రప్రధమ కవియిత్రి రంగాజమ్మ సాహిత్యంలో
తెలుగు పదాలను వాడిన దగ్గరనించీ, ఇప్పటి దాకా పరిశీలనగా చూస్తే ఒక
పుస్తకం వ్రాయాలి. కనుక మనం ఇప్పుడా పని చేయటం లేదు. ఈ రోజుల్లో
విడిపోదామనే తెగులుతో కొట్టుకుచచ్చే మన తెలుగు వాళ్ళని కలుపుతున్న
ఒకే ఒకటి తెలుగు భాష కనుక, ఇప్పుడు ఆ తెలుగు భాష ఎలా వుందో చూద్దాం.
అదికూడా మళ్ళీ ఆంధ్రా తెలుగు, తెలంగాణా తెలుగు, రాయలసీమ తెలుగు,
హైద్రాబాద్ తెలుగు అని ఎన్నో రకాలుగా వుంటుంది కాబట్టి, మనం అటువేపు
కూడా వెళ్ళొద్దు. ఏ బాదుడూ, గొడవలూ లేని సైబర్ తెలుగు ఎలా వుందో
చూద్దాం.
నా కథలు, వ్యాసాలు, కవితలు ఇన్నాళ్ళూ రకరకాల తెలుగు సాఫ్ట్ వేర్లతో
వ్రాస్తున్నాను. రచన, పోతన, తిక్కన, మేఘన ఇలాటివి ఎన్నో వాడాను.
తర్వాత యూనికోడ్ వచ్చేసింది. దానితో ఈ మైల్, వార్తాపత్రికలు,
బ్లాగులు మొదలైనవి యూనికోడ్లో వచ్చేశాయి. చాల తెలుగు పదాలు డాలర్
ప్రభావంతో రూపాయాంతరం చేసుకుంటుంటే, తెలుగు భాష భాషాంతర విన్యాసం
చేస్తున్నది.
వాటిల్లో కొన్ని చదువుతుంటే మళ్ళీ మంచి తెలుగు వచ్చేస్తున్నది అని
ధైర్యం వస్తున్నది.
ఇంకొన్ని చదువుతుంటే 'హా! హతవిధీ! ఈ ముదనష్టపు సినిమా, టీవీ బాషలు
వినలేకుండా చస్తున్నాం మళ్లీ ఇదొకటా!' అనిపిస్తుంది.
మరికొన్ని చదువుతుంటే సైబర్ భాషలో ఎంతో హాస్యం కనిపించి, చదవటానికి
సరదాగా వుంటుంది.
సైబర్ తెలుగు ఈ మూడు కాళ్ళ మీద ఎలా నడుస్తున్నదో చూద్దాం.
నాకు బాగా నచ్చింది, ఇంటర్నెట్ అనే మాటకి చేసిన తెలుగు అనువాదం.
అంతర్జాలం. ఇంగ్లీష్ మాటకి అనువాదమైనా మన తెలుగు పదం.
హ్యూస్టన్ నించీ మా మిత్రులు ఈమైల్ పంపించినప్పుడు, క్రింద చీర్స్
అని వ్రాసే బదులు తెలుగులో కిలకిలలు అని వ్రాస్తారు.
ఇలాటి పదాలు వింటుంటే, ఆరుద్రగారు వ్రాసిన 'పందిట్లో
పెళ్ళవుతున్నాదీ, కనువిందవుతున్నాదీ' లాటి డబ్బింగ్ పాటల్లోని
చక్కటి తెలుగు గుర్తుకు వస్తుంది.
గూగుల్ వార్తలనీ, యాహూ తెలుగునీ చదువుతుంటే ఇంకా కొన్ని చక్కటి
తెలుగు పదాలు కనిపిస్తాయి. పత్రములు, గుంపులు, నా ఖాతా, నా ఇష్టాలు,
శోధించు, ఈ పేజీని సవరించు, ముఖ్య కథనాలు, అన్ని కథనాలు, మరిన్ని
కథనాలు, నిజ సమయం, నవీకరణలు, ఒక విభాగాన్ని జోడించండి, సహాయం,
ఉపయోగ నిబంధనలు, గోప్యత, సాధన పట్టీ, ఇంకా చదవండి, స్పందనలు...
ఇలాటివి ఎన్నో కనపడతాయి.
పంథొమ్మిది వందల అరవైలలో, నేను గుంటూరు నించీ హైద్రాబాద్ మొదటిసారి
వెళ్ళినప్పుడు 'నాస్తా తిని పోరా', 'నల్లా బంద్ అయింది’ లాటి కొన్ని
మాటలు గమ్మత్తుగా వుండేవి. ఇప్పుడలాటివి అంతర్జాలంలో కొన్ని
కనిపిస్తున్నాయి.
‘భగాయించి తీరుతాం అన్నాడు కేసీఆర్’
బేఫికర్ గా, బేఖరత్ చేస్తూ… లాటివి.
నిజం చెప్పొద్దూ, నాకు తెలుగు బాగా వచ్చు అని కించిత్తు గర్వంగా
వుండేది మొదటినించీ. ఈ మధ్య సైబర్ భాష, నా అభిప్రాయం తప్పని రోజూ
నిరూపిస్తూనే వుంది.
‘ఎరీపలతో సోనియా గాంధీ భేటీ’ అని గూగుల్ వార్తల్లో వచ్చింది. ఈ
ఎరీపలు ఎవరూ ఏమా కథ అని నా దగ్గర వున్న శంకరనారాయణ, బ్రౌను, వేమూరి
వెంకటేశ్వర్రావుగార్ల నిఘంటువులూ, శబ్దరత్నాకరం తిరగేశాను. కానీ ఈ
ఎరీపలు ఎరికపడలేదు. ఒకసారి కాదు, గూగుల్ వార్తల్లో ఎప్పుడూ
కనిపిస్తారీ ఎరీపలు. చివరికి అర్థమయింది. అది ఎంపీలు అన్నమాటకి
వచ్చిన సైబరాసుడి అప్పుతచ్చుల భాసుర భాష అని. నేను రెండు మూడు రకాల
అచ్చు తప్పులు చేసి చూశాను కానీ, ఆ ఎరీపలు మాత్రం రాలేదు.
మనం కొన్ని గుంపులకి ఈమైలు పంపిస్తే, స్పాం అనే అనుమానం వల్ల
అప్పుడప్పుడు వాటిని పక్కన బెడతాయి. అలాటి సందర్భంలో ఒకసారి నాకు
ఇలా వచ్చింది సైబర సందేశం.
'చెడు కారణంగా ఈ సందేశం నిషేదించబడి వున్నది. సమన్వయకర్త చివరి
నిర్ణయం రావలసి వుంది’
అలాగే సరదాగా వున్నవి ఇంకా కొన్ని:
‘జూ డాక్టర్లు సమ్మె విరమించాల్సిందే అని హైకోర్టు నిర్ణయం’-
పశువుల డాక్టర్లేమో అనుకున్నాను, తర్వాత అర్థమయింది జూనియర్
డాక్టర్లని.
'అప్పనంగా ఫ్యాన్సీ నెంబర్లు' - నాకు వచ్చిన తెలుగు, ఇంకా పూర్తిగా
రాలేదు అని నిరూపించిన అక్షర సత్యం ఇది.
'దీనికి రెండు బిడ్లు వచ్చాయి’ అని చదివాక నాకేమీ అర్థం కాలేదు.
బిడ్డలేమో అనుకున్నాను. తర్వాత అర్థమయింది. 'ఈ కాంట్రాక్ట్ కి రెండు
బిడ్స్ వచ్చాయి’ అని.
వరల్డ్ కప్ క్రికెట్ ఓడిపోయాక కేప్టెన్ ధోనీ అన్నాడుట - 'మేము
పిచ్చు చదవటంలో తప్పు చేశాం’ అని.
స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు తెలుగు వ్యాకరణం అంటే ఎంతో ఇష్టంగా
వుండేది. సంధులూ, సమాసాలూ, చంధస్సూ... ఇప్పుటికీ తీరిక
దొరికినప్పుడు, నేను భద్రంగా దాచుకున్న వ్యాకరణం పుస్తకాలని చదువుతూ
వుంటాను.
ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నానంటే, సైబర్ తెలుగులో కొత్తగా ఒక సంధి
వచ్చింది. దానికి నేను సైబర్ సంధి అని పేరు పెడుతున్నాను. రెండు
తెలుగు మాటలని యూనికోడ్ ప్రకారం పక్కపక్కనే టైప్ చేస్తే వచ్చేదే
సైబర్ సంధి.
'నితీశ్సవాలుని స్వీకరించిన కాంగ్రెస్’
శవాలని కాంగ్రెస్ స్వీకరించటం ఏమిటో నా చిన్నిబుర్రకి అర్థం కాలేదు.
తర్వాత అదే వార్తని ఇంగ్లీషులో చదివాక అర్థమయింది. నితీశ్ అనే
ఒకాయన కాంగ్రెస్‌కి ఏదో సవాల్ విసిరేస్తే, ఆ సవాల్‌ని కాంగ్రెస్
స్వీకరించిందిట. నితీశ్ + సవాల్ సంధి కుదిరితే నితీశ్సవాలయింది. ఇదీ
సైబర్ సంధి అంటే.
పై వాక్యంలో ఇంకో సైబర్ సంధి కూడా వుంది. కాంగ్రెస్ + కి,
కాంగ్రెస్‌కి అయింది. విస్కి తాగిన కాంగ్రెస్ ఏమో.
'సీమాంధ్రలో రైల్‌రోకోలు’.
ఏదో 'కోలుకోలోయన్న కోలోకోలు’ తెలుసు కానీ, ఈ కోలేమిటో కాసేపు బుర్ర
పగలకొట్టుకుంటే కానీ అర్థం కాలేదు.
' ఆలయ్బలంలో తెలంగాణా తిప్పలు’
తెలంగాణాలోనే కాదు, ఇదేమిటో అర్థం కాక నిద్రలో కూడా నన్ను ఈనాటికీ
తిప్పలు పెడుతున్నది.
సైబర్ సంధికి ఇంకొక ఉదాహరణ - 'జగనిష్యూతో.. ' అంటే జగన్+ఇష్యూ+తో.
'పాక్‌కి ముప్పు భారత్కాదు’ - పాకిస్తానుకి ముప్పు భారత్ నించీ
కాదుట.
‘ఎన్నెన్పిటిలో చేరమని భారత్‌ను అడగరాదు’
ఇదేమిటో, ఈ ఎన్నెన్నో సానుభూతు లేమిటో కనుక్కోవటానికి ఎంతో రీశెర్చి
చేయాల్సి వచ్చింది. మా ఆస్టిన్ నగరంలో నాతో పాటు తిరిగే సాటి ఆముదం
చెట్లని కూడా అడిగాను.
చివరికి తేలిందేమిటంటే NNPT అంటే Nuclear Non-Proliferation Treaty
ట!
వీటన్నిటినీ మించినది ఇంకొకటుంది. ఇండియాలో కామన్ వెల్త్ ఆటలు అయాక
వచ్చిన వార్త.
కామన్వెల్త్ గేంస్ ఘన తంతా మంత్రిదే!
ఈ ఘనమైన మంత్రిగారెవరో, ఆయన ఎవర్ని తంతా అంటున్నాడో ఈ సైబర్ రోడ్డు
మీదే ఎక్కడో ఎప్పుడో కనబడుతుందేమో!
|
|
|

సత్యం మందపాటి |
పుట్టింది
తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్
డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్
మేనేజర్ గా ఉద్యోగం.ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా
అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక
చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు,
నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల
ద్వారా ప్రయత్నం. |
|
|
నా
రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల
కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.
చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ
కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ
ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్
అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం,
అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా
బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా,
పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక,
ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి,
రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని
తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి,
తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా
రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి.
ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో
ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు
పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో
ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు,
ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను.
1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి
రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం |
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది
పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ
తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please
keep comments relevant.)
|
 |
Copyright ® 2001-2009 SiliconAndhra. All
Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|