aaa

విజయం ఎదురుచూస్తూంది..!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చచ్చి సాధించేవాళ్ళుంటారని కథల్లో చదువుకున్నాను కానీ నిజ జీవితంలో నిజంగా అలాంటివాళ్ళున్నారని నా విషయంలో రుజువైంది. అంటూ వచ్చి కూర్చున్నాడు ఓ నలభై ఏళ్ళ వ్యక్తి. తైల సంస్కారం లేని జుట్టు, నలిగిన బట్టలు, చూడటానికి వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన మనిషిలా కనబడ్డాడు.
ఇంతకూ మీ సమస్య ఏమిటి? అని అడిగాను సూటిగా కళ్ళలోకి చూస్తూ.
నాకో తండ్రి వున్నాడు. ఏనాడూ నన్ను కొడుకులా చూడలేదు. చిన్నతనంలో అల్లారుముద్దుగా పెంచి నా జీవితం నాశనం చేశాడు. ఏదో చిన్నతనంలో చదువుకోనని మారాం చేస్తే, నన్ను మందలించలేదు, కొట్టలేదు. నీ ఇష్టం అని వదిలేశాడు. కానీ నా తమ్ముళ్ళిద్దరినీ బాగా కొట్టి, చదివించాడు. వాళ్లిద్దరూ ఇంజనీర్లు, ఒకడు అమెరికాలో వున్నాడు. అంటూంటే మధ్యలో అడ్డుతగిలాను.
అంటే, మిమ్మల్ని చదవమని బెదిరించకపోవడం నేరమంటారు, అవునా?
అక్షరాలా దానివల్ల నా జీవితం ఇప్పుడు సర్వనాశనమైంది. కనీసం పదవతరగతి క్వాలిఫికేషన్ కూడా లేదు. ఏదో బయటివాళ్లకు బి.ఎ చదివానని చెప్పి నెట్టుకొస్తున్నాను. ఈనాటి వరకూ సరైన ఉద్యోగం కూడా లేదు, ఇంతవరకూ పాతిక ఉద్యోగాలైనా మారాను. హొటళ్లలో, బట్టల షాపుల్లో, కిరాణాకొట్లలో ఇలా చెయ్యని జాబ్ లేదు. చివరికి ఒక అపార్టుమెంటులో సెక్యూరిటీ గార్డుగా కూడా చేశాను.
తమ్ముళ్ళిద్దరూ కోటీశ్వరులకు అల్లుళ్ళు, నా మామగారు ఒక లాయరు దగ్గర గుమాస్తా, నా జీవితం ఇంత నాశనం చేసిన తండ్రిని మీరైతే ఏం చేస్తారు?
మీ జీవితం ఆయన నాశనం చేశాడని ఎందుకనుకుంటున్నారు? చిన్నతనంలో మీ ప్రవర్తనతో విసుగుచెంది, మీ తమ్ముళ్లిద్దరి విషయంలో కఠినంగా ప్రవర్తించి వుండొచ్చు.
ఓకే ఓకే అదే కఠినవైఖరి నా పట్ల కూడా ఎందుకు చూపలేదు దానికి సమాధానం చెప్పండి.
మీ పట్ల కఠినవైఖరి చూపించే స్థితి మీరు దాటిపోయారు, మీకు చేసిన అతిగారాబం వల్ల మిమ్మల్ని అదుపుచేయగల పరిస్థితి లేకపోయింది.
సరే అదలా వుంచండి, ఇప్పుడు మాకు కొంత ఆస్తి వుంది. మా తమ్ముళ్లిద్దరికీ ఆ ఆస్తి మీద ఏ మాత్రం ఆశ లేదు. మిగిలింది నేనొక్కడినే, ఆ ఆస్తి అమ్మి ఏదైనా వ్యాపారం చేస్తానని ఎన్నోసార్లు మా నాన్నను అడిగాను. ససేమిరా అన్నాడు. ఈ మధ్యే ఆయన పోయాడు. పోతూపోతూ నా కొడుకును ఆ ఆస్తికి వారసుడుగా విల్లు రాసి పోయాడు. వాడు మైనరు ఇదేమన్నా మీకు న్యాయమనిపిస్తుందా? అని అడిగాడు ఆవేశంగా.
కానీ అదికూడా మీ మంచికోరే చేశారేమో ఈ ఆస్తిని అమ్మేసి వ్యాపారం చేస్తే అది దివాలా తీస్తే అందుకని అలా చేశాడు.
ఈ రోజు మాయింట్లో వాళ్లంతా దరిద్రం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటే, రేపు ఆ ఆస్తి ఎవరికి పనికొస్తుంది. అవసరమైనప్పుడు ఆదుకోని ఆస్తులెందుకు?
మీరు ఆవేశం తగ్గించుకుంటే, నేనో చిన్న సంఘటన చెప్తాను. ఒక స్పోర్ట్స్ క్లబ్ లో పిల్లలు టేబుల్ టెన్నిస్ ఆడుతుండేవారు. ప్రతిరోజూ ఒక అబ్బాయి. తండ్రితో వచ్చి ఆడేవాడు. తండ్రి దూరంగా కూర్చుని చూసేవాడు. ఆ అబ్బాయి ఎంతబాగా ఆడినా, కోచ్ అతనికి ఫైనల్స్ ఆడనిచ్చేవాడు కాడట. కొంతకాలం తర్వాత ఒకనాడు ఆ అబ్బాయి కోచ్ తో తనకు ఫైనల్స్ ఆడటానికి ఛాన్సివ్వమని బతిమలాడాడు. సారీ, ఇప్పటికే మన టీమ్ చాలా డల్ గా వుంది. నీకిస్తే ఉన్న పరువుకూడా పోతుంది. అన్నాడు కోచ్. అయినా ఆ అబ్బాయి పట్టువిడవక కోచ్ ను ప్రాథేయపడితే, చివరికి కోచ్ అంగీకరించి ఫైనల్స్ ఆడించాడు. ఆశ్చర్యమేమంటే ఆ అబ్బాయి అత్యంత చాకచక్యంగా, అద్భుతంగా ఆడి టీమ్ పరువు నిలబెట్టాడు. ఆనందం పట్టలేని కోచ్ ’ఆశ్చర్యం’ నువ్వు ఈవేళ ఇంతబాగా ఎలా ఆడావ్? అని అడిగాడు. ఈ ఆట మా నాన్నగారు ప్రత్యక్షంగా చూశారు కనుక అన్నాడా అబ్బాయి. దాంతో కోచ్ వాళ్ల నాన్నగారు కూర్చునే ప్రదేశం వైపు చూశాడు. ఆయనక్కడ లేరు. ఏరీ మీ నాన్నగారు అని అడిగాడు. మా నాన్నగారు గుడ్డివారు. ఇన్నాళ్లూ అక్కడ కూర్చుని శబ్దాలు మాత్రమే వినేవారు. ఆయన మరణించి వారం రోజులైంది. పైనుంచి నా ఆట ప్రత్యక్షంగా చూశారు. నన్ను ఆడించారు. అందుకే నెగ్గాను చెమర్చిన కళ్లతో చెప్పాడా అబ్బాయి. అది విన్న కోచ్, ఆ పిల్లవాణ్ని కౌగిలించుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ సంఘటన వింటే మీకేమనిపిస్తూంది అని అడిగాను. అతని కళ్లలో కూడా నీళ్లు తిరగటం గమనించాను.
అది సరే, నిజమేననుకోండి మొన్న సచిన్ టెండుల్కర్ కూడా తండ్రి పోయిన వారంలోగా ఇంగ్లాండ్ లో అద్భుతంగా ఆడి తన తండ్రి ఆశీస్సులతో ఆడానని ప్రకటించాడు. మా నాన్న కూడా నన్నలా ఆశీర్వదిస్తాడంటారా?
తప్పకుండా, మీ నాన్నగారు చాలా మంచివారు. అందుకే మిగతా మీ ఇద్దరు సోదరులూ ఒప్పించి ఆస్తి మొత్తం మీకే ఇచ్చారు. మీరుకూడా ఆత్మవిశ్వాసంతో నిలబడి కష్టపడి పని చేయండి. ఆ ఆస్తి గురించి ఆలోచించకండి. ఏదో ఒక ఉద్యోగంలో చేరి నిలకడగా పనిచేయండి. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవండి. పట్టుదలా , పరిశ్రమా ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధించిన మహనీయులందరూ కోటీశ్వరుల పిల్లలు కాదు. కష్టపడితే విజయం మీ కోసం ఎదురుచూస్తుంటుందని మరిచిపోకండి. అంటూ ముగించాను.
నిజమే, నేను చాలా పొరపాటుగా ఆలోచించాను, నా తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటాను అంటూ లేచాడు.
వెరీ గుడ్ మీ నాన్నగారు చచ్చి, తాననుకున్నది ఇప్పటికైనా సాధించగలుగుతున్నారు అన్నాను.
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech