"సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు ఫిబ్రవరి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ  మాసం సమస్యలు

కం.|| రాముని వధియించి సీత రావణు చేరెన్

.||  కర్ణుని పెండ్లియాడెనట కవ్వడి పంపగ ద్రోవదంతటన్

(యం.వి.సి. రావు గారిచ్చిన సమస్యలు)

 

క్రితమాసం సమస్యలు

తే.గీ.|| లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ

.వె.|| బేరమాడబోతె నేరమాయె

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ - గండికోట  విశ్వనాధంహైదరాబాద్ ,  

తే.గీ.||  భక్తి శూన్యుడౌ పాషండ పాంసనుండు

గాఢ నిశియందు గుడిచేరి  మూఢ మతిని

దోచ నెంచ, రక్షక భటోద్యోగి  శంభు

లింగ మడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవ.

(పాషండుడు దైవ ద్వేషి. పాంసనుండు కౄరుడు)

  

.వె.|| సంత కెళ్ళి ఉల్లి చవుక బేరము లాడ

ఉల్లి కొనగ లేవు, లొల్లి సేయ

కంచు, నాదు వాలకము చూసి చీకొట్టె,

బేరమాడ బోతె నేర మాయె.

 

రెండవ పూరణ వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం

తే.గీ.||  లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ  బోవ

గుడిని మ్రింగెడి వాడికి కొద్దిపాటి

లింగమొక లెక్కయా? అవలీలగాను

లింగమును గుడిని కలిపి  మ్రింగినాడు

 

.వె.||  స్వల్ప ధరకు అడిగి అక్కరలేనట్టి

బేరమాడబోతె నేరమాయె

అడిగినట్టి ధరకు ఆ వస్తువు నొసంగ

పైక మిచ్చి కొనగ వలసి వచ్చె

 

మూడవ పూరణ  జగన్నాథ  రావ్  కె ఎల్., బెంగళూరు

తే.గీ.|| చట్టము మన నాయకులకు చుట్టమయ్యె

            లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవ

            యెంచి చట్టములను సవరించగలరు

            ప్రేయసికి ముంగురులు సవరించినట్లు

 

.వె.|| అర్థ రాజ్యమైన అయిదూళ్ళ కొరకైన

            బేరమాడ బోతె నేరమాయె

            రాష్ట్రమొకటె కాదు రాజధానిని కూడ

            కోర నెవ్వడిచ్చు తేరగాను

 

నాలుగవ పూరణ- గోలి హనుమఛ్ఛాస్త్రి    గుంటూరు 

 ఆ.వె.|| తారలంటి దిరుగు ధరలుజూడ మనకు

        తిరుగుచుండె తలలు తినగ కొనగ

ఘోరకలిని నేడు,కూరగాయలుగూడ   

బేరమాడబోతె నేరమాయె.

                        

  తే.గీ.|| నగలు దోచంగ నంగడి నక్కి యొకడు

        సర్దబోవంగ చెయివేయ సైరనపుడె

        మ్రోగి దొరుకంగ గార్డుకు, మ్రోగె వీపు

       లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ

 

ఐదవ పూరణ- వాణీ బాల, హనుమాన్‌జంక్షన్ 

కవిత|| గుడి యందలి సిరిని గాంచి

యెటులైనను పొందెదనని

నిశివేళను గుడికి బోవ

శంభులింగము వచ్చి నడ్డి విరిచె

 

.వె.||కాయగూరలకు దుకాణమునకు బోవ

ధరలసిరులు చూసి నయనమదిరె

ఆకుకూరకొనగ బేరమాడగబోవ

చూడబోవనదియె నేరమాయె

 

ఆరవ  పూరణ- పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసె, కాలిఫోర్నియా

.వె.|| కోమలాంగి ఒకతె కూరలమ్ముచుఁనుండ

బేరమాడబోవ నేరమాయె

ఎపుడు సరుకు కొనగ ఎరుగని వానికీ

యట్టి శ్రద్ధ దేల నడిగె భార్య

 

.వె.|| ఉల్లిపాయకొనగ, ఇల్లుతాకట్టాయె

బేరమాడబోవ నేరమాయె

ఉల్లి దోశె లేదు, ఉల్లి పచ్చడి లేదు

తల్లడిల్లె జిహ్వ, ఉల్లి  లేక

(ఇండియాలో మధ్య ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటిన సందర్భంగా)

 

తే.గీ.|| లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవ

నీతిమాలిన అధికార్లు నిధులు దోచి

లింగమందురతని పేరు లింగరాజు

లింగరాజుండ గుడికిక బెంగ లేదు

 

ఏడవ  పూరణ - - ఎఱ్ఱా విశ్వనాధం, శాన్ హోసే, కాలిఫోర్నియా

తే.గీ.|| గుడిని మ్రింగను యాపైన గుడిన యున్న

లింగమును జంగమును కూడా మ్రింగబోవు

వాన్కి  జనచేతనమ్మనే వాడియైన

లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ  బోవ

 

.వె.|| పళ్లనమ్ము వాని పెళ్ళాముతో మోటు

బేరమాడి వాడు పారిపోయె

వాడివెనుక బేరమాదగ నను తిట్టె

బేర మాడబోతె నేరమాయె

 

.వె.||చెప్పె చాటువొకటి శ్రీనాధ కవిరాజు

యంచు దలచి పండ్ల యామె తోడ

మాట మీరి బేరమాడగ తిట్టెను

బేరమాడబోతె నేరమాయె

 

శ్రీనాధుని చాటువు అవగాహన కోసం

తొలకరి మించు తీవగతి తోప దుఖాణము మీదనున్న నా

య్యలికుల వేణితో తమలపాకుల బేరములాడ బోయ్ నే

వలచుట కేమి! శంకరుని వంటి మహాత్ముడు లింగ రూపియై

కులికెడు దాని గబ్బి చును గుబ్బల సందున నాట్యమాడగన్ 

 

ఎనిమిదవ పూరణ - - సతీష్ కుమార్

.వె.|| గీత దాటితినని నీతి మంతుడు యైన

భటుడు మేటి నీతి పరుడని దెలి

యక పొగరుతొ వెళ్ళి అతని మాటలతోటి

బేరమాడ బోతె నేరమాయె!

తొమ్మిదవ - నేదునూరి రాజేశ్వరి . U.S.

.వె.|| కూర కొనగ బోవ గగన  మం టె  ధరలు

యేర నీరు   మంచి   యెంచి జూడ

చచ్చు పుచ్చు లంచు సఖియ తిట్టగలదు

బేర మాడ బోతె  నేర మాయే

 

తే.గీ.|| జంగ మయ్య దలచెను   రంగ మునకు   బోవ

రంగ మందున గాంచెను  రంగు  కలలు

నింగి నంటిన  నా లు   నిలువ  నీక 

లింగ మడ్డు వచ్చే గుడిని మ్రింగ  బోవ  !

పదవ పూరణ -టి. వెంకటప్పయ్య

తే.గీ.|| లక్ష కోట్లకు ఎదిగేటి లక్ష్య ముంచి

పధక మేసెను వెధవలు పదవి కొరకు

రాష్త్ర విభజన గొడవలు రాగ నేడు

లింగ మడ్డు వచ్చె గుడిని మ్రింగబోవ.

 

.వె.||కూరగాయలన్న కొనుటకు భయమేసి

తోటకూరె దనకు తోడు దలచి

వెలను అడుగగ జూసెను వెర్రి చూపు

బేర మాడ బోతె నేర మాయె.

పదకొండవ పూరణ -యం.వి.సి. రావు, బెంగళూరు

తే.గీ.|| గుప్త నిధులను త్రవ్వంగ గోడగూల్ప

లింగ మడ్డు వచ్చె గుడిని, మ్రింగ బోవ

గుడియు లేదాయె మరియును బడియు లేదు

కోట్లు బడయుట యొక్కటే కోర్కె తక్క

 

.వె.||కూరగాయ ధరలు కొండనెక్కగ జూచి

సంత కేగి బేర మాడ బోతె

నేర మాయెనిచట నెవ్వరు వలదంచు

బందు చేసినారు బాధ పడగ

పన్నెండవ పూరణ -సుమలత మాజేటి

తే.గీ.||అంగడిగ మార్చి ఆధ్యాత్మికతను అమ్ము

దొంగ సాముల దోపిడీ దోవ తప్ప

(స్త్రీ)లింగ మడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవ

వ్యంగ పరచు భంగిమలచె భంగ మాయె!

 [ స్వామి నిత్యానంద కేసు ]

 

.వె.||ఊరగాయ నంజి ఊరట చెందుచు

వుల్లి కొనగ లేక ఊర కుంటి

కూరలమ్ము కొనెడి కుర్రాడి గదురుచు

బేర మాడ బోతె నేర మాయె! 

 పదమూడవ పూరణ- రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా

తే.గీ.|| కొండలే మ్రింగగలవాడు కొండొకండు

గుడది యెంత దనుచు గొప్పజెప్ప!

అగ్ని రగిలి ప్రమాదము అయ్యి, విస్పు

లింగమడ్డువచ్చె గుడిని మ్రింగ బోవ!

 

.వె.|| ఆటనాడమన్న ఆడవలెను గాని

డబ్బు యన్న యట్టి జబ్బు ఏల?

మాచిఫిక్సు చేసి మాచి నోడ దలచి,

బేరమాడబోతె నేరమాయె!

 

పాఠకులనుంచీ మరిన్ని పద్యాలు

 

గోలి హనుమత్ శాస్త్రి గారి పద్యాలు

 

ఫిబ్రవరి 11 ఘంటసాల వర్ధంతి సందర్భముగా

తెలుగు పాటశాల - ఘంటసాల

సీ.||  జానపదమొకండు - జనులు మెచ్చగపాడు

                  పద్యంబెయొక్కడు - పాడగలుగు

      లలితగీతమొకడు - లయబద్ధముగబాడు

                  శ్లోకంబుకొక్కడు - శోభదెచ్చు

      శాస్త్రీయమొక్కడు - శ్రావ్యంబుగాపాడు

                 కీర్తనతొ యొకండు - కీర్తిబొందు

      భక్తి గీతమొకడు - రక్తిగా పాడును

                పాశ్చాత్యమొక్కడు - పలుక గలుగు

 

.వె.||    ఎట్టిపాటలైన యే శ్లోకములుయైన

           పద్యమైన మరియు గద్యమైన

           నవరసంబులొలుకు నాయాసమేలేక

           ఘంటసాలవారి గళమునందు.

 

 

జగన్నాథ  రావ్  కె ఎల్. గారి పద్యం

శా.||తల్లీ! నిన్ను దలంచి వంటకము చేతన్ బూనితిన్ గాని నీ

రుల్లీ! నీ ధరలంటె నాకసము నీవున్నా వనే ధైర్యముల్

ముల్లోకాలలొ కల్లలయ్యె గదనీ మూలంబుగా పట్టణాల్

పల్లెలోపల నీవు లేక ఇక సాంబారెట్లు సాంబారగున్

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech