me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

ఈ రాశివారికి ఇది పూర్తిగా అనుకూలముగా ఉన్న సమయము. పూర్వార్ధములో లాభాలాభములు సమానముగా ఉన్నప్పటికీ ఉత్తరార్ధము చాలా రంగములయందు వీరికి లాభములను మరియు కార్యసిద్ధిని కలిగించు అవకాశములున్నవి. పనిచేయు స్థానములయందు చికాకులు ఇంకనూ కొంతకాలము ఉండగలవు. కానీ ఈ మాసములో ఉన్న గ్రహముల అనుకూలత కారణముగా ఈ చికాకుల ప్రభావము ప్రస్తుతము ఇబ్బందికరముగా ఉండదు.
నూతన గృహములు కొనుటకు, వివాదములయందు సంప్రదింపులకు ఇది అనువైన సమయము. లావాదేవీలు లాభించగలవు. కొత్త ఒప్పందములు ఉత్తరార్ధములో చేసిన లాభకరముగ ఉండగలవు. విద్యార్ధులకు ఒత్తిడి ఎక్కువగా ఉండే సమయము.

 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

కార్యములయందు విఘ్నములు తరచు వీరిని ఇబ్బందిపెట్టు అవకాశమున్నది. తలచింది ఒకటైతే ఫలితము మరొకలా ఉంటుంది. విద్యార్ధులకు ఇది అనువైన సమయము. వ్యాపార లావాదేవీలకు అనువైన సమయము కాదు. నూతన కార్యములను ప్రారంభించకుండుట మంచిది. పూర్వార్ధములో దీనత్వము మరియు కష్టములు ఎక్కువగా వీరిపై ప్రభావమును చూపు అవకాశమున్నది.

          ఉత్తరార్ధములో కొంత ఊరట లభించే అవకాశములున్నవి. కొన్ని సాహసకార్యములకు పూనుకొను అవకాశమున్నది. వీరిలో వచ్చే కొంత సాహసప్రవృత్తి వీరికి పనులయందు సాఫల్యతను తెచ్చి పెట్టగలవు. నిర్ణయములు తీసుకొనుటలో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొను అవకాశమున్నది. మానసికముగా అంతుపట్టని ఆందోళన శారీరకముగ మరియు మానసికముగ వీరిని ప్రభావితము చేయు అవకాశమున్నది.

 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ఈ మాసమునందు ఇంచుమించు అన్ని గ్రహములు ప్రతికూల పరిస్ధితులలో ఉండుటచే ఈ రాశివారికి ఈ మాసమునందు ప్రత్యేకముగా ఆశించుటకు ఏమియునూ లేదు. పూర్వార్ధములో అధిక ప్రభావము ఆరోగ్యముపై కనిపించు అవకాశముండుచే పూర్తి శ్రద్ధ ఆరోగ్యముపై చూపాలి. పిత్తవికారము, గుప్తజ్వరములు మిగిలిన పనులయందు విఘ్నములను కలిగించే అవకాశమున్నది. తొందరపాటు పనిచేయదు.

ధనాగమము మరియు ఆలోచనలు రెండింటియందూ కాలసంబంధములు  మరియు వ్యక్తి సంబంధములు అయిన అడ్డంకులు ఎదురయ్యే అవకాశములు పూర్తిగా ఉన్నవి. నిరాశ నిస్పృహలకు ఇది సమయము కాదు. పరిస్థితులు పూర్తిగా ప్రతికూలముగా ఉన్న కారణముగ ఫలితములను ఆశించకుండ ప్రయత్నములను కొనసాగించవలెను.

 

http://www.jagjituppal.com/images/2canc.gif

ర్కాటక రాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

పూర్వార్ధము ఉదర సంబంధమయిన వికారములు, వాయు వికారము వీరిని ఇబ్బంది కలిగించు అవకాశములున్నవి. భార్యా భర్తల నడుమ మనస్పర్ధలు మరియు కలహములు చికాకులకు పెద్ద కారణము కావచ్చును. వాగ్యుద్ధములనుండి దూరముగా ఉండుటకు ప్రయత్నించాలి. నిరుత్సాహము, కాంతిహీనత వీరిని కార్య విముఖలను చేయు అవకాశమున్నది. కలహములు అన్నిరంగములయందు తమ ప్రభావమును చూపు అవకాశమున్నది.

          ఉత్తరార్ధములో పెద్ద మార్పులేమీ ఉండవు. గ్రహముల మార్పు రోగభయమును మరియు జ్వరపీడను పెంచు అవకాశమున్నది. పెద్దగా సాధించగలిగినది ఏమియునూ లేదు. ప్రత్యేకమయిన శ్రద్ధ ఆరోగ్యముపై చూపవలెను. ఆరోగ్యము ప్రభావితమయ్యే అవకాశములున్న కారణముగ కార్యసాధనకు ఎటువంటి వ్యూహరచనలు చేయకుండుట మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శరీరముపై తగు శ్రద్ధను కనబరచవలెను.

 

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

ధనవ్యయము మరియు హీనభావన ఈ రాశివారిని ఈ మాసపు పూర్వర్థములో మానసికముగ ఇబ్బందిపెట్టు అవకాశములున్నవి. దీనికి తోడు గత కొంత కాలముగా నడచుచున్న ఏలినాటి శని మరియు ఇప్పుడే ప్రారంభమయిన అష్టమగురుల కారణముగా ఈ పూర్వార్ధము వీరిని శారీరకముగ మరియు మానసికముగ ఒత్తిడికి గురి చేయగలవు. కానీ ఈ విపత్కర పరిస్థితి కొంత కాలమునకు మాత్రమే పరిమితమయినది.
ఉత్తరార్థము వీరికి పూర్తి అనుకూలముగా ఉండగలదు. శని గురుల దుష్ప్రభావము వీడకున్ననూ మిగిలిన గ్రహముల శుభత్వము కారణముగ వీరికి విశేష శుభములనివ్వగలదు. ఉత్తరార్ధములో విరోధుల ప్రాబల్యము పూర్తిగా తగ్గగలదు. ధనాగమమునకు అనేక మార్గములు సుగమమవ్వగలవు. సుఖము మరియు లాభము వీరికై వేచియుండు సమయమిది. కావున ఈ రాశివారు ఈ అవకాశమును సద్వినియోగపరచుకోగలరు.
ప్రస్తుతసమయములో వీరికి ఎక్కువ ఇబ్బంది శని గురుల వల్ల కలుగుచున్న కారణముగ వీరు ప్రతి నిత్యము శివారాధన చేయుట మంచిది.

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

పూర్వార్ధములో చెప్పుకోదగ్గ మార్పులు ఏమియునూ కనిపించుటలేదు.  కాలము మునుపటివలె గడుచును. ఉత్తరార్ధములో పరిస్థితులలో చాలా వరకు సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు అన్ని రంగములలో వారిని ప్రభావితము చేయు  అవకాశమున్నది. ఈ మార్పుల కారణముగ పనులు           ఒక్కసారి వేగవంతమయ్యే అవకాశములు కనిపిస్తున్నాయి.

ఆధికారికములు, వ్యాపార నిమిత్తములు అయిన కార్యములపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచిన ఆశించిన దానికన్న అధికముగ లాభములు వచ్చు అవకాశములు కనిపిస్తున్నాయి. స్ధిరాస్ధులకు సంబంధించిన లావాదేవీలు జరుపుకొనుటకు ఇది అనువైన సమయము. భూసంబంధిత వివాదములు మరియు కోర్టు వాజ్యములపై శ్రద్ధ కనబరచిన అనుకూల ఫలితములు లభించగలవు.

 

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

స్వజనులు మరియు కుటుంబసభ్యులతో కాలమును గడపగలరు. వారి విషయములో ఆనందము కలిగించు సంఘటనలు కలుగు అవకాశమున్నది. ఆరోగ్యము చింతాజనకముగ మారు అవకాశములున్నవి. అంతు చిక్కని అనారోగ్యములు ఇబ్బందిని కలుగచేయు అవకాశమున్నది. మానసికాందోళనలు ఆరోగ్యమును ప్రభావితము చేయు అవకాశమున్నది. సాధ్యమయినంత వరకు ప్రయాణములను వాయిదా వేసుకోవలెను.

          ఉత్తరార్థములో పరిస్థితులలో పెద్ద మార్పులు లేకపోయిననూ ఆరోగ్యరీత్యా మార్పులు సంభవించు అవకాశములు ఉన్నవి కావున జాగ్రత్త అవసరము, ఆందోళనను కలిగించే రీతిలో అనారోగ్యము లేకపోయిననూ అన్ని పనులనూ బాధించు రీతిలో అవి కనబడుతున్న కారణముగ వాని నివారణోపాయములను  అన్వేషించుకోగలరు. శాస్త్రీయ వైద్యవిధానమును పూర్వార్ధములో అవలంబించుటద్వారా ఉత్తరార్ధములో ఊరటను పొందగలరు.
 

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

ఈ మాసపు పూర్వార్ధము ఈ రాశివారికి పూర్తిగ అనుకూలముగా ఉన్నది. పదోన్నతులను ఈ మాసపు పూర్వార్ధములో ఆశించవచ్చును. ధనమును కూడబెట్టు ప్రయత్నములు చేయగలరు. వ్యాపార లావాదేవీలయందు మిగిలిన అన్ని కార్యరంగములందునా వీరు ఆశించిన ఫలితములను పొందగలరు. స్నేహితులనుండి సహాయసహకారములు లభించగలవు.

          ప్రభుత్వపరముగ, ఆధికారులవలన ఇబ్బందులు కలుగవచ్చునన్న ఒక భయము వీరిని ఈ సమయములో వెంటాడే అవకాశమున్నది. ఈ భయములు వీరికి ఉత్తరార్ధములో అనారోగ్యములకు కారణములయ్యే అవకాశములున్నవి. ఉత్తరార్ధము వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులను కలుగచేయు అవకాశమున్నది. కావున ఉత్తరార్ధమునందు ఆరోగ్యముపై పూర్తి శ్రద్ధను కలిగిఉండవలెను.

 

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

ఈ మాసములో పూర్వార్ధము పూర్తిగా ప్రతికూలముగానూ మరియు ఉత్తరార్ధము పూర్తిగా అనుకూలముగానూ ఉండగలవు. పూర్వార్ధములో అవమానముల శాతము ఎక్కవ. కావున ఏ రంగమునందున లేక ఏ విషయమునందున గుర్తింపు పొందవలెనన్న ప్రయత్నము చేయరాదు. కానీ కర్తవ్యమును విడువరాదు. అధికారులతో వివాదములకు తావివ్వరాదు. ధననష్టము, కలహములు మరియు నేత్రపీడకు అవకాశములున్నవి.

          ఉత్తారార్ధము పూర్తిగా భిన్నముగా ఉండు అవకాశములున్నవి. ధనసంగ్రహము చేయగలరు. అధికారులతో స్నేహము ఏర్పడుతుంది. ఉన్నతస్థానములు పొందుటకు అవకాశములు మెరుగవుతాయి. ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ సమయమును అనుకూలముగా మార్చుకొనుటకు ప్రయత్నించాలి. కొద్దిపాటి వ్యతిరేకత సమయములో ఉన్ననూ, కొద్దిపాటి ఉపేక్షాభావము అధికారులలో కనిపించిననూ దానిని పెద్దగా పట్టించుకొనకుండ తమ పనులను పూర్తి చేసుకొనుటకు ప్రయత్నించుకోవాలి.

 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

మానసిక మరియు శారీరిక ఒత్తిడులతో సతమతమయ్యే ఈ రాశివారికి ప్రస్తుత సమయములో విపత్కర పరిస్థితులు తరచు ఎదురయ్యే అవకాశములున్నవి. ఈ పరిస్థితులు పూర్వార్ధము అంతయూ వీరిని అంటిపెట్టుకుని ఉండు అవకాశములున్నవి. ఈ మాసమంతయూ ధన విషయములోకూడ జాగ్రత్త వహించవలెను. దుష్టజనసహవాసము, కపటములైన మాటలు మరియు కలహముల కారణముగ ధననష్టము జరుగు అవకాశమున్నది.

          ఉత్తరార్ధమునందు కొన్ని పరిస్థితులు మారును. ఉపద్రవకాలము చాలావరకు ముగిసినట్లే. ఉత్తరార్ధములో సాధ్యమయినంత వరకు  నిర్ణయములు స్వంతముగా తీసుకొన ప్రయత్నించాలి. ఈ సమయములో వంచింపబడు అవకాశములున్నవి. పూర్తి నెలయంతా ధననష్టమును సూచిస్తున్న కారణముగ ఆర్ధిపరమైన అన్ని రకముల లావాదేవీలను వాయిదా వేసుకోగలరు. ఎవరికీ హామీ ఉండరాదు.
 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

ఈ రాశివారికి ఈ మాసమంతయూ ప్రతికూలముగా ఉన్నది. లోకకళ్యాణార్ధము చేయు పనులు మాత్రమే సఫలములయ్యే అవకాశములున్నవి. నానారకములయిన వ్యయములు ఈ రాశివారిని ఆర్ధికముగా సంక్షోభములోనికి నెట్టు పరిస్థితులు కనబడుతున్నవి. రోగములు మరియు విరోధులకు కూడ ఇది అనువైన కాలము. అందువలన వీరి బాధలకు చాలా వరకు వారుకూడ కారణము అని చెప్పవచ్చును.

          ఉత్తరార్ధము ఉద్రిక్తతలకు పెద్ద పీట వేయుచున్నది. ఈ సమయములో సంయమనమును పాటించాలి. అనవసరమైన ఆవేశములు వీరికి అనర్ధములను తెచ్చిపెట్టగలవు. సహనముతో మరియు జాగరూకతతో వ్యవహరిస్తూ భగవదనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుటే ఈ రాశివారికి ఎదురుగ ఉన్న మార్గము.
 

 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

అన్ని విధములుగను ధనలాభము మరియు లాభములు కలుగు అవకాశములు పూర్వార్ధములో కనిపిస్తున్నాయి. కావున వ్యాపారలావాదేవీలు, ప్రభుత్వపరమైన  ఒప్పందములు మరియు ఆధికారికములైన పనులను ఈ సమయములో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అన్ని రంగములయందు దృష్టి సారించుటకు ఇది అనువైన కాలము.

          ఉత్తరార్ధము రాకతో మెల్ల మెల్లగా అనూకూలప్రభావము తగ్గును. వ్యయములు పెరుగును. దానికారణముగ మానసిక ఒత్తిడి అధికమయ్యి అనారోగ్యమునకు కారణమయ్యే అవకాశమున్నది. పూర్తి మాసమంతయూ వ్యాపారపరమైన విషయములు మరియు బంధుజన విషయమునందు అనుకూలముగా ఉన్నది. ఈ రంగములనుండి ఈ రాశివారికి ప్రోత్సాహము మరియు సుఖము లభించగలదు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech