మట్టి సుగంధం మా నాన్న

                                                               -  శోభా రాజు

   

మన పిచ్చిగానీ నాన్న ఎక్కడికి వెళతాడు
ఆయన మన చుట్టూనే ఉంటాడు
మనల్ని చుట్టుకునే ఉంటాడు
మన మెతుకులో మెతుకై
అమ్మే తానై.. వాతాపి జీర్ణం అంటూ
ప్రేమగా కడుపు తడుముతూనే ఉంటాడు"


నాన్న గురించి చెప్పాలంటే, రాయాలంటే ఎన్ని పేజీలు, పుస్తకాలు నింపినా.. మళ్లీ మళ్లీ అవి నిండిపోతూనే ఉంటాయి. మనసు అనే ప్రవాహం నుంచీ జ్ఞాపకాలు అనే గట్లు తెగి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నప్పటినుంచీ అన్నీ తానై, ఒళ్లంతా కళ్లు చేసుకుని కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ, ఆ దేవుడికి మారు రూపమైన నాన్నల గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. 

నాన్న గురించి చెప్పాలంటే, రాయాలంటే ఎన్ని పేజీలు, పుస్తకాలు నింపినా.. మళ్లీ మళ్లీ అవి నిండిపోతూనే ఉంటాయి. మనసు అనే ప్రవాహం నుంచీ జ్ఞాపకాలు అనే గట్లు తెగి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నప్పటినుంచీ అన్నీ తానై, ఒళ్లంతా కళ్లు చేసుకుని కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ, ఆ దేవుడికి మారు రూపమైన నాన్నల గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే.

మా నాన్న మాకు దూరమై అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం రోజులు ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తూ ఉన్నా, తన ఆశీస్సులు మమ్మల్ని చల్లగా ఉంచుతాయన్న నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాం. సంవత్సరం క్రితందాకా మాతో ఉన్న ఆయన ఈరోజు మా ముందులేడన్న నిజం తల్చుకుంటే గుండె పిండేసినట్లవుతుంది. తను లేని లోటు, ఆయన తోడు లేకుండా మేము భారంగా వేసిన అడుగులు, గడిపిన రోజులు గుర్తొస్తే ఇంకా ఒక ఏడాదేగా గడిచింది... ఇంకెన్ని రోజులు ఇలా గడపాలో కదా.. అనుకోగానే గుండె కరిగి కన్నీటి వరదై చెంపలను తడిమేస్తుంది. అయితే, పసిపిల్లల అమాయకత్వం కలగలసిన మా నాన్న నవ్వు మాకు ధైర్యం చెబుతూ, నేనెక్కడున్నా మీతోనే ఉంటాననే ధీమాను కలిగిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది.

ఇక మా నాన్నగారి జీవిత విశేషాలను చెప్పాలంటే... రవాణా సౌకర్యాలు అంతగా లేని ఓ మారుమూల పల్లెటూళ్లో మా నాన్నగారు జన్మించారు. పేరు రాజన్న. ఆయనకు ఒక తమ్ముడు, చెల్లెలు. మా నాన్నగారి తల్లిదండ్రులు నిరుపేదలు. పేదరికాన్ని ఎదిరించలేని నిస్సహాయత కలిగిన వాళ్ల ముఖ్య వృత్తి పశువుల పెంపకం, పువ్వుల అమ్మకం. అప్పట్లో పల్లెటూళ్లలో నిరుపేద కుటుంబీకులు ఎలాంటి జీవనం గడిపేవారో, నా తండ్రి కూడా అలాంటి జీవితాన్నే గడిపారు. పశువులను మేతకు తీసుకెళ్లటం, వాటి బాగోగులు చూసుకోవటంతోనే ఆయన బాల్యం గడిచిపోయింది. పాఠశాల సౌకర్యం కూడా ఆ ఊర్లో లేదు కాబట్టి మా నాన్న చదువుకోలేదు. ఒకవేళ పాఠశాల ఉండివున్నా, చదువుకునేవారో లేదో తెలియదు.

అలా బాల్యం గడిచిన తరువాత మా అమ్మను పెళ్లి చేసుకున్నారు. నిరక్షరాస్యత, వెనుకబాటుతనంలో పెరిగి పెద్దవారైన నా తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులు మైనారిటీ తీరకుండానే వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాది తరువాత మా అమ్మ పుష్పవతి అయ్యిందంటే వారికి ఎంత చిన్న వయస్సులో వివాహమైందో అర్థం చేసుకోవచ్చు. మరో సంవత్సరానికి నేను తొలి సంతానంగా వారికి జన్మించాను. నేను పుట్టిన కొన్నాళ్లకే మా బాబాయికి, అత్తయ్యలకు వివాహం జరిగింది. మా నాయనమ్మకు మా బాబాయిపైనే ఎక్కువ ఉండేది. దాంతో ఆమె ఆయనను తన ఇంట్లోనే ఉంచుకుని, మా అమ్మానాన్నలను వేరు కాపురం పెట్టమని పురమాయించింది.

అలా అమ్మానాన్నా అదే ఊర్లో వేరు కాపురం పెట్టారు. వేరు కాపురం పెట్టిన తరువాత నాన్నకు రావాల్సిన వాటాలో కూడా నాయనమ్మవాళ్లు న్యాయంగా ప్రవర్తించలేదు. అలా చిన్నపాటి వస్తువులతో వేరుపడ్డ నాన్నకు ఆ రోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఓ బిడ్డకు తల్లి అయిన మా అమ్మకు ఇంకా పసితనం ఛాయలు కూడా వీడలేదంటే నమ్మాలి. కనీసం వంట కూడా చేయటం చేతగాని అమ్మను, నన్ను మా నాన్న కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజంతా కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తూ, వంటకు కావాల్సిన సరుకులు కొనుక్కుని వచ్చేవారు. ఆ తరువాత ఆయనే వంటచేసి అమ్మకూ, నాకూ తినిపించి పడుకునేవారు. మళ్లీ ఉదయాన్నే పనులకు పరుగుతీసేవారు.
.
కూలిపనులు లేని రోజున అడవికి వెళ్లి కట్టెలు కొట్టి, తనతోపాటు వచ్చిన జతగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క మోపు మాత్రమే తెస్తే, మా నాన్న రెండు మోపులను మోపుపై మోపు పెట్టుకుని పరుగుతీసేవారు. ఆ కట్టెల మోపులను తీసుకుని ఓ గంటసేపు కాలినడకనే పక్కనే ఉండే గ్రామానికి వెళ్లి అక్కడ షావుకార్లకు అమ్మి డబ్బులు తీసుకుని.. బియ్యం, ఉప్పూ, పప్పూ కొనుక్కుని వచ్చేవారు. (నాన్నగారి మొదటి వర్థంతి రోజు రాత్రి అమ్మ నాతో మాట్లాడుతూ.. వారి జీవితం ఎలా మొదలైందీ, ఇప్పుడు ఎలా ఉందీ.. భోరున విలపిస్తూ చెప్పింది.. ఆమె మాటలే ఈ రోజు ఇలా మీకు చెబుతున్నానని మనవి)

ఆ తరువాత అమ్మ మెల్లిగా ఇంటి పనులు, వంటపనులు నేర్చుకుంది. నేను కూడా పెరుగుతున్నాను. నాన్నకు చేదోడువాదోడుగా ఉండేందుకు అమ్మకూడా కూలిపనులకు వెళ్లేందుకు సిద్ధపడింది. అలా ఇద్దరూ జంటగా కూలిపనులకు వెళ్లేవాళ్లు. ఓ భుజంపైన నన్ను, మరో భుజంపైన చద్దిమూటను పెట్టుకుని.. అమ్మ తోడుగా నాన్న హుషారుగా కూలిపనులకు వెళ్లేవాడు. ఎంత కష్టమైనా సరే.. ముద్దుగా, బొద్దుగా ఉండే నన్ను చూడగానే ఇట్టే మరిచిపోయేవారమని అమ్మ ఇప్పటికీ చెబుతుంటుంది. కూలిపనుల కోసం ఒక్కోసారి వాళ్లు వేరే ఊర్లకు కూడా వెళ్లాల్సి వచ్చేది. నాన్నగారంటే అంతగా ఇష్టంలేని నాయనమ్మకు మాత్రం నేనంటే చాలా ఇష్టం. అందుకే ఆమె నన్ను తనదగ్గరే ఉంచుకుని, మా నాన్నవాళ్లను వేరే ఊర్లకు కూలిపనులకు వెళ్లమని చెప్పేది. అలా మా అమ్మానాన్నలు చాలా ఊర్లకు కూలి పనులకు వలస వెళ్లేవాళ్లు. ఆ సమయంలోనే మా పెద్ద తమ్ముడు పుట్టాడు.

నేనేమో నాయనమ్మ దగ్గర పెరుగుతున్నాను. ఆ సమయంలోనే మా ఊరికి రోడ్డు, పాఠశాల లాంటి సౌకర్యాలు వచ్చాయి. ఏమనుకుందో ఏమో మా నాయనమ్మ నన్ను ఓరోజు మా అయ్యవారి దగ్గరికి తీసుకెళ్లి నన్ను బడిలో చేర్చుకోమని అడిగింది. వెంటనే ఆయన సరే అన్నాడు. అలా నాకు చదువుకునే భాగ్యం దక్కింది. నేను ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చానంటే, ఆరోజు మా నాన్నమ్మ నాకు పెట్టిన బిక్షే అని గర్వంగా చెప్పగలను. ఇక కూలిపనులకు వెళ్లి కాసిన్ని డబ్బులు సంపాదించుకొచ్చిన నాన్న మా ఊర్లోనే ఓ చక్కటి పూరిల్లు కట్టాడు. గొర్రెలు, మేకలను కొనుగోలు చేసి, కూలిపనులకు స్వస్తి చెప్పి పశువుల పెంపకంపైనే స్థిరపడ్డారు. అమ్మ ఇంట్లో ఖాళీగా కూర్చోవటం ఎందుకని మెల్లిగా పువ్వుల వ్యాపారం మొదలుపెట్టింది. పువ్వులను తెచ్చి, మాలలుగా కట్టి మా ఊర్లోనూ, చుట్టుప్రక్కల ఊర్లలోనూ తిరిగి అమ్మసాగేది. అలా మా ఆర్థిక పరిస్థితి క్రమంగా కుదుటపడింది.

. ఈలోగా అమ్మకు మా చిన్న తమ్ముడు పుట్టాడు. వాడు పుట్టిన కొన్ని రోజులకే మావూరు లాంటి 30 పల్లెటూళ్లకు కేంద్రంగా ఉండే గ్రామపంచాయితీ అయిన చింతపర్తిలో మా నాన్న చిన్న స్థలం కొనుగోలు చేశారు. గొర్రెలు, మేకలను అమ్మి ఆ డబ్బులతో ఓ చిన్న ఇల్లు కట్టి, పల్లెటూరునుంచి చింతపర్తికి మకాం మార్చారు. అక్కడ బస్టాండులో ఓ చిన్న స్థలం చూసుకుని చిన్న పూలకొట్టును ప్రారంభించారు. తమలాగా చదువుసంధ్యలు లేని జీవితం పిల్లలకు వద్దని భావించిన వాళ్లు మమ్మల్ని ఎంత కష్టమైనా సరే, ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించాలని నిర్ణయించుకున్నారు.

ముగ్గుర్నీ స్కూల్లో చేర్పించారు. అలా మేం చదువుల్లోపడి, నేడు ముగ్గురం విద్యాధికులం అయ్యాం. నేను ఎం.ఏ. బీఈడీ, పెద్దవాడు ఎం.ఏ. బీఈడీ, చిన్నోడు ఎం.ఎఫ్.ఎం., ఎం.కాం, బీఈడీ చేశాడు. ప్రస్తుతం పెద్దవాడు ఓ స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాడు. చిన్నోడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. డిగ్రీ చదువుతుండగా ప్రేమ వివాహం చేసుకున్న నేను ఆ తరువాత దూర విద్యలో ఎం.ఏ. చేస్తున్నాను. ఈ మధ్యనే బీఈడీ కూడా పూర్తయ్యింది.

చిన్న పూలకొట్టుతో, చిన్నపాటి పూరిపాకతో జీవితం ప్రారంభించిన నా తల్లిదండ్రులు అదే ఊర్లో ఇప్పుడు మూడు ఇళ్లను కట్టారు. మా పేరుతో కొద్దిపాటి డబ్బును జమచేశారు. ఉన్నంతలో సంతృప్తికరమైన జీవితం.. ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో మా నాన్న అనారోగ్యం పెద్ద శాపంలా పరిణమించింది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆయన అనారోగ్యం కుదుటపడలేదు. ఈ క్రమంలోనే కామెర్ల వ్యాధి సోకింది. దానికి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోకుండా ఆయన ఎక్కువగా నాటుమందులపైనే ఆధారపడటంతో ఆయన లివర్ పూర్తిగా పాడయిపోయింది.

లివర్‌ను సరిచేసేందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశం. లివర్ ప్లాంటేషన్. అది మాబోటివాళ్ల వల్ల అయ్యేపని కాదు. అయితే లివర్‌కు ట్యూబులను అమర్చటంవల్ల పరిస్థితి మారేందుకు అవకాశం ఉందని చెప్పటంతో అలా చేయించాం. అయితే వాటిని ఆరునెలలకు ఒకసారి మార్పించాలని డాక్టర్లు చెప్పారు. సరేనని వేయించాం. అప్పటినుంచి ఆయన క్రమంగా ఆరోగ్యవంతుడయ్యారు. ఆయన ఆరోగ్యంలో వచ్చిన మార్పు చూసి అందరం ఆశ్చర్యపోయాం. అయితే ఇంకేం నాకు బాగయిపోయిందని అనుకున్న ఆయన జాగ్రత్తలను పాటించటం మర్చిపోయారు. దాంతో మొదటికే మోసం వచ్చింది.


మెల్లిగా నోటినుంచి, ముక్కునుంచి, మలమూత్రాలలోనూ రక్తం పడటం ప్రారంభించింది. మాకు చెబితే భయపడతాం అని ఆయన చెప్పకుండా దాచేశారు. అలా ఓ పదిరోజుల్లోనే ఆయనకు సీరియస్ అయ్యింది. ఆసుపత్రిలో మూడు రోజులుండి మాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆయన చివరిరోజంతా ఆసుపత్రిలోనే ఉన్నాం. బీపీ చాలా కిందికి పడిపోయింది. మెలకువగాలేరు. చాలా భారంగా శ్వాస తీసుకుంటున్నారు. ఆయన ఇంకో నాలుగు గంటల్లో చనిపోతారనగా.. కాస్త మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న అందరినీ కళ్లతోనే పలుకరించారు. నా వైపు మాత్రం పదే పదే చూస్తుండటంతో ఏంటి నాన్నా అని అడిగాను. "ఏంలేదమ్మా" అంటూ ఓపిక తెచ్చుకుని అన్నారు. అదే ఆయన చివరిమాట. ఆ తరువాత ఆయన మాకు ఇక లేరు.

జీవితమంతా కష్టాలతోనే సాగిపోయిన మా నాన్న.. పిల్లలు పెద్దవారై, ప్రయోజకులై సుఖపెట్టే సమయంలో ఈ లోకంనుంచే శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఈ విషయం తల్చుకున్నప్పుడల్లా గుండెనెవరో మెలిపెడుతున్నట్లుగా ఒకటే బాధగా ఉంటుంది. ఏ రోజు కూడా సుఖమంటే ఏంటో తెలియని నా తండ్రి, ఇక తాను పడ్డ కష్టం చాలునంటూ శాశ్వత విశ్రాంతి కోసం వెళ్లిపోయారు. తాను ఉన్నా, లేకున్నా పిల్లలు కష్టపడకూడదని.. తనకు చేతనైన అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఆయన ఎలాంటి కష్టం కలిగించకుండా కానరాని లోకాలకు తరలివెళ్లారు.

మా నాన్నను తల్చుకున్నప్పుడల్లా ముందుగా గుర్తొచ్చేది ఆయన రూపం. పసిపిల్లల అమాయకత్వంతో కూడిన ఆయన చిరునవ్వే. ఎలాంటి కల్మషం లేని ఆ చిరునవ్వును చూస్తే అప్పుడే పుట్టిన చిన్నారి నవ్వును జ్ఞాపకం తెప్పించక మానదు. జీవితమంతా పిల్లల కోసమే కష్టపడిన, తపించిన ఆయన నుంచి ఆయన పిల్లలమైన మేమే కాదు, ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి.

ఆకలితో ఉన్నవారు ఎవరైనా, ఎలాంటివారైనా ఆదరించాలని. మనకు లేకపోయినా వాళ్లకు మనకు ఉన్నంతలో పెట్టి పంపించాలని ఆయన పదే పదే చెబుతుండేవారు. ప్రతిరోజూ తను తినే తిండిని ఎవరో ఒకరితో పంచుకోకుండా ఆయన ఎప్పుడూ తిన్నది లేదు. ఒక్కోసారి తనకు లేకపోయినా ఎదుటివారి ఆకలిని గుర్తించి తీర్చేవారు. తాను ఒకపూట తింటూ, మాకు మూడుపూట్లా కడుపునిండా తిండిపెట్టిన ఆయనకు ఆకలి విలువ ఏంటో తెలుసు కాబట్టి అలా చేసేవారేమో. ఆయన నుంచి మేం నేర్చుకున్న గొప్ప విషయం ఇది. ఆయన పిల్లలుగా మేం ముగ్గురం ఆయన కట్టించిన, తిరుగాడిన ఆ ఇంటికి ఎవరు వచ్చినా ఆకలితో వెళ్లకుండా చూస్తున్నాము.


అదే విధంగా మోసపూరితమైన పనులకు ఎప్పుడూ పాల్పడవద్దనీ, అబద్ధాలు చెప్పవద్దని ఆయన మాకు పదే పదే చెప్పేవారు. మోసం చేయటం, అక్రమంగా, అన్యాయంగా సంపాదించటం అంటే ఆయనకు గిట్టదు. న్యాయంగా కష్టపడి సంపాదించుకోవాలని ఆయన చెప్పేవారు. రాజన్న పిల్లలు అంటే పదిమందీ మంచిగా చెప్పుకోవాలని ఆయన ఆశపడేవారు. నేను మీకు పెద్ద పెద్ద ఆస్తులను సంపాదించి ఇవ్వకపోయినా విద్యాబుధ్దులు, నీతి నిజాయితీలు నేర్పించాను. తండ్రిగా ఇంతకంటే ఇంకేం చేయలేనురా అని అప్పుడప్పుడూ ఆయన అంటుండేవారు.

అన్నింటికంటే ఆయననుంచి ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సినది ఒకటుంది. అదే క్షమాగుణం. ఎన్నోసార్లు తనను మానసికంగా, శారీరకంగా గాయపర్చిన వ్యక్తులను సైతం ఆయన చాలా సులభంగా క్షమించేసేవారు. "పోనీలే తల్లీ వారి పాపాన వాళ్లే పోతారు. మనకు వచ్చే నష్టం ఏమీ లేదు" అనేవారాయన. కన్నతల్లి ముగ్గురు పిల్లలను సమానంగా చూడకుండా, తనను వెలివేసినట్లుగా ప్రవర్తించినా సరే ఆమెను పల్లెత్తుమాట కూడా అనేవారు కాదు. అలాగే తన తమ్ముడు పూల వ్యాపారంలో పోటీ రీత్యా అనేకసార్లు ఇబ్బందిపెట్టినా నా తమ్ముడే కదా అంటూ ఊరకుండేవారు. ఇలా రక్త సంబంధీకులనే కాదు, బంధువులను, ఊర్లోవాళ్లను ఎవరినైనా సరే తన తప్పు ఏమీ లేకున్నా, తనను నిందిస్తూ ఇబ్బంది పెట్టినా సరే.. అలాంటి వాళ్లను కూడా చాలా సులభంగా క్షమించేసేవారు.

తన వ్యాధి తీవ్రమవుతోందనీ, ఇకపై ఎక్కువ రోజులు తాను బ్రతికి ఉండనని అర్థం చేసుకున్న మా నాన్న మాకు చెబితే భయపడతామని చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. బ్రతికి ఉన్న రోజులలో తనకు ఏవేవి ఇష్టమో అవన్నీ చేశారు. ఎవరెవరిని చూడాలని ఉందో, అందరినీ చూసి వచ్చారు. ఏమేమి తినాలో వాటన్నింటినీ తిన్నారు. తాను కట్టించిన ఇళ్లను, ఇంటి పరిసర ప్రాంతాలను తనివితీరా చూసుకున్నారు.

(ఇవన్నీ తాను చనిపోయిన తరువాత అందరూ చెబితే మాకు తెలిసాయి. ముఖ్యంగా మొదటి వర్థంతి రోజున మా ఊర్లో ఒకామె చెప్పిన విషయం మమ్నల్ని నిశ్చేష్టులను చేసింది. మరో మూడు రోజుల్లో ఆయన చనిపోతారనగా తనను పిలిచి, "ఏమ్మా నీకు 5 రూపాయలు బాకీ ఉన్నాను కదా, ఇదుగో తీసుకో" అని అన్నాడట. "ఏంటన్నా ఈ ఊర్లోనే కదా ఉన్నావు, ఇప్పుడెందుకు పిలిచి మరీ ఇస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావేంటి?" అని ఆమె అడిగితే, "ఎక్కడికీ వెళ్లటంలేదమ్మా, నీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఎవ్వరికీ బాకీ ఉండటం నాకు ఇష్టం లేదు" అని చెప్పారట. అది ఆమె చెబుతుంటే ఆయన రూపం మా కళ్లముందు నిలబడి చెబుతున్నట్లుగా అనిపించి పిచ్చిగా ఏడ్చేశాం.)

ఇవండీ మా నాన్నతో మాకున్న జ్ఞాపకాలు.. జ్ఞాపకాలు అనేకన్నా, మా నాన్నతో మేం గడిపిన అరుదైన క్షణాలు అనవచ్చు. ఓ మారుమూల పల్లెటూళ్లో పుట్టి, తాను నిరక్షరాస్యుడైనా, తన పిల్లలు తనలా ఉండకూడదని చదువులు చెప్పించి, తన పిల్లలు మరో పదిమందికి విద్యాదానం చేయగలిగే స్థాయికి మమ్మల్ని ప్రయోజకుల్ని చేసి.. కానరాని లోకాలకు తరలివెళ్లిన నా తండ్రికి ఇదే నా అక్షర సుమాంజలి.

నాన్నా...
నీవు ఎక్కడున్నా, నీ ఆత్మకు శాంతి చేకూరాలనీ...
నీ చల్లని చూపులు మా వెన్నంటే ఉండాలనీ
నీ జ్ఞాపకాలను...
నువ్వు పంచిన ఆత్మీయతానురాగాలను..
నీ చిరునవ్వులను పూమాలగా చేసి...
ఇదుగో నీకే సమర్పిస్తున్నాం...
ఆశీర్వదిస్తావు కదూ... ?!!
 

నాన్నగారిపై నా బ్లాగులో నేను రాసిన రెండు కవితలు కింద ఇస్తున్నా...

నువ్వు లేని ఊరు.. నీ మాటల్లేని ఇల్లు!!

పొద్దుట్నుంచీ వచ్చే ప్రతి బస్సునూ
అందులో రాబోయే తన మనిషినీ
రెండు కళ్లు వెతుకుతూనే ఉన్నాయి
నిమిషాలు, గంటలు గడుస్తున్నా
రావాల్సిన మనిషి రాలేదు
రెండు కళ్ల వెతుకులాట ఆగనూ లేదు

సూర్యుడు నడినెత్తికి వచ్చినా
మనిషి రాలేదు, చూపులు ఆగలేదు
ఎట్టకేలకు
రావాల్సిన మనిషి
అటువైపు పరుగులు తీశాయి
బస్సు దిగ్గానే..
రెండు కళ్లూ తృప్తిగా, సంతోషంగా
పొద్దుట్నుంచీ ఎదురు చూస్తున్నా..
ఇప్పుడా రావటం.?
ప్రశ్నించాయి ఆ కళ్లు

అదేంటీ.. నేను ముందే చెప్పానుగా
ఈ టైంకే వస్తానని
మరెందుకలా పొద్దుట్నుంచీ చూడటం
అవతలి కళ్ల ఎదురు ప్రశ్న..?

నీకేంటి అలాగే చెబుతావ్
మా ఆరాటం మాదీ..
నా రక్తంలో రక్తం నన్ను
చూసేందుకు వస్తుంటే
తొందరగా చూడాలని ఉండదా మరి..?

తిరిగి ఊరెళ్తుంటే
అప్పుడే వెళ్లాలా అంటూ
అవే కళ్లు మళ్లీ వేడుకోలు
తప్పదు మరి.. మళ్లీ వస్తాగా అంటే,
భారంగా వర్షిస్తూ ఆ కళ్ల వీడ్కోలు

చాలా సంవత్సరాలు ఇలాగే

కానీ ఈరోజు..
నా కోసం ఎదురుచూసే
ఆ రెండు కళ్ల కోసం
రోజుల తరబడీ ఎదురుచూస్తున్నా
ఆ కళ్ల జాడ కనిపించటం లేదు

ఎదురుచూపులు, వీడ్కోళ్లతోనే
అలసిపోయిన ఆ కళ్లు
శాశ్వత విశ్రాంతి కోసం
రక్తంలో రక్తాన్ని వదిలేసి
అందరాని దూరాలకు
ఆనందంగా వెళ్లిపోయాయి

ఇప్పుడు నా కోసం
వెతుకులాడే కళ్లు
ఎదురుచూసే ఆ మనిషి
వేడుకోల్లు, వీడ్కోళ్లు
ఏవీ ఏవీ లేనే లేవు

కనిపించకుండా పోయిన ఆ కళ్లు
ఎవ్వరికీ, ఎప్పటికీ కనిపించవు
అయినా
కనిపించే తన ప్రతిరూపమైన నాకు
ఎప్పుడూ చూపునిస్తూనే ఉంటాయి..!!
(నవంబర్ 7, 2009న అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించిన మా నాన్నగారికి కన్నీటితో..)
 

నువ్వులేవు.. నీ జ్ఞాపకాలున్నాయి..

కొందరు సుఖాల్లోనే తారసపడతారు
మరికొందరు కష్టాల్లోనూ చేయూతనిస్తారు
నువ్వు మాత్రం ఎప్పుడూ చెంతనే ఉంటావు
కళ్లు మూసినా, తెరచినా
నిద్రపోయినా, మేల్కొన్నా
నవ్వినా, ఏడ్చినా
ఎక్కడ ఉన్నా, ఏం చేసినా
నా ప్రతి కదలికలోనూ
చిరునవ్వుతో జీవిస్తుంటావు

కానీ.. నువ్వు దగ్గరున్నప్పుడు
నీకు ఏవంటే ఇష్టమో, నీకేం కావాలో
నీకంటూ ఇష్టాయిష్టాలున్నాయో, లేదో
ఏవీ.. ఏవీ..
తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు
ఇప్పుడు.. నువ్వు లేని ఈ జీవితంలో
ప్రతిరోజూ, ప్రతి పనిలోనూ
తనకు ఇదంటే ఇష్టమో కాదో
ఇవన్నీ తనకు కావాలనిపించేదో ఏంటో
ఎప్పుడూ అడిగినవన్నీ అమర్చటమేగానీ
నోరు తెరచి ఇది కావాలని అడగలేదే..?
ఆలోచనలు మది గట్లు తెంచుకుంటాయి

అంతే
నోటిదాకా వెళ్లింది, గొంతులో అడ్డుపడుతుంది
చెంపలపై వెచ్చని కన్నీరు
చేతిలో బొట్లుగా రాలుతుంటే
ఆ కన్నీటి బొట్లను
చిరునవ్వులు చిందించే నీ పలువరుసలో
ముత్యాలుగా మార్చి
నవ్వుతూ ముందుకు నడిపిస్తావు
నువ్వో జ్ఞాపకం అనుకున్నా..
నిజమై నాకు ఊపిరి పోస్తున్నావు

ఎప్పటికీ తిరిగిరాని నాన్న కోసం
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech