వైభవంగా జరిగిన రెండవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం

                                                               - జుర్రు చెన్నయ్య

 

మరొక స్వప్నం సాకారమైంది. సిలికానాంధ్ర మరొక అద్భుతాన్ని అతిలోక రమ్యంగా ఆవిష్కరించింది. తెలుగువారి రాజధాని హైదరాబాద్ నగరం వేదికగా రెండవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమేళనం అత్యంత వైభవంగా జరిగింది. 2010 డిసెంబర్ 24,25,26 తేదీల్లో ఎక్కడ చూసినా కూచిపూడి నాట్యకళా రామణీయకతే వెల్లివిరిసింది. కళాకారులు, పత్రికలు, ప్రసార సాధనాలు,కళాభిమానులు కూచిపూడి నర్తన కళకు బ్రహ్మరధం పట్టారు.బ్రహ్మోత్సవం జరిపారు.

హైటెక్స్ లో ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
రాష్ట్రానికే సాంకేతిక పరిజ్ఞానపు వన్నెవాసి సంతరించిన సైబరాబాద్ లో వున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్.ఐ.సి.సి)లో ప్రాచీన శిల్పకళా శైలి ఉట్టిపడే అద్భుతమైన వేదికపైన 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జ్యోతి వెలిగించి రెండవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని ప్రారంభించారు.నాట్య సమ్మేళనం గౌరవాధ్యక్షులు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి డా.దగ్గుబాటి పురంధరేశ్వరి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవంలో సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, సాంస్కృతిక మండలి అధ్యక్షుడు ఆర్.వి.రమణమూర్తి మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా.యం.కాంతారావు, సిలికానాంధ్ర హితవరులు పివిఆర్ కె ప్రసాద్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, తొండెపు హనుమంతరావు, యర్రమిల్లి వెంకట్రావు, అమెరికా నుంచి విచ్చేసిన వదాన్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి, లేపాక్షి నాలెడ్జి సిటీ మేనేజింగ్ డైరెక్టర్ బాలాజీ, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, నాట్య సమ్మేళన రూపకర్త కూచిభోట్ల ఆనంద్, అధ్యక్షులు రాజు చమర్తి ప్రారంభోత్రవంలో పాల్గొన్నారు. నాట్య సమ్మేళన నిర్వహణ రాష్ట్రానికే గర్వకారణమని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిలికానాంధ్ర తెలుగుజాతికే ఆదర్శమని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 25లక్షల సహాయాన్ని ప్రకటించారు. నాట్య సమ్మేళనం సందర్భంగా ప్రచురించిన ’సుజనరంజని-నాట్య మంజరి’ ప్రత్యేక సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించి సంపాదకత్వం వహించిన ఆచార్య జొన్నలగడ్డ అనూరాధను సత్కరించారు. 16 దేశాలకు చెందిన సుమారు 4500 మంది ప్రతినిధులు నాట్య సమ్మేళనంలో పాల్గొనడం అరుదైన విశేషం.

తొలి ప్రదర్శనలు

పసుమర్తి కేశవప్రసాద్ నిర్వహణలో కూచిపూడి నుంచి విచ్చేసిన కళాకారులు సంప్రదాయ బద్దంగా పూర్వరంగ విధులను అందించి ’అంబాపరాకు దేవీపరాకుతో’ నాట్య సమ్మేళనం తొలి ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. చెన్నై కూచిపాడి ఆర్ట్ అకాడమీ వెంపటి వెంకట్ పర్యవేక్షణలో ’జయము జయము’ అంశాన్ని ప్రదర్శించారు. పద్మశ్రీ డా.కె.శోభానాయుడు భామాకలాపంలోని సత్యభామా ప్రవేశదర్వును రమణీయంగా ప్రదర్శించారు. డా.అలేఖ్య పుంజాల ’దేవీస్తుతి’ అంశాన్ని రసజ్ఞమనోహరంగా నర్తించారు.
సిలికానాంధ్ర ప్రత్యేకంగా రూపొంచించిన జొన్నవిత్తుల రచన,రామాచారి స్వరకల్పన ’కూచిపూడి వైభవం’ అంశాన్ని మధురిమ నార్ల వారి బృందంతో అద్భుతంగా అందించారు. డా.శోభానాయుడు శిష్యబృందం అమెరికా నుంచి వచ్చి ’అంబాష్టకం’ అంశాన్ని ప్రదర్శించారు. జ్యోతి చింతలపూడి (అట్లాంటా) శ్రీలత సూరి (డాలస్), లక్ష్మీబాబు (వాషింగ్టంన్), నిత్య గొల్లపూడి ఈ బృందంలో వున్నారు. అనంతరం కూచిపూడికి చెందిన నాట్యగురువు నర్తకుడు వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో భక్తప్రహ్లాద కూచిపూడి యక్షగానాన్ని ప్రదర్శించి కరతాళధ్వనులందుకున్నారు.
మధ్యాహ్నం వివిధ విభాగాలుగా జరిగిన అభినయాత్మక ప్రసంగాల్లో శ్రీమతి బాలకొండలరావు, శ్రీమతి శ్రీదేవి,డా.హెచ్.అనితారావు, ఉమాదేవులపల్లి, డా.పద్మశ్రీ, డా.సునీల్ కొఠారీ, పసుమర్తి, శేషుబాబు, సీతానాగజ్యోతి, యేలేశ్వరపు చలపతిశాస్త్రి, కేశవ ప్రసాద్, డా.వాసుదేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం రాష్ట్రానికి చెందిన కళాకారులే గాకుండా కేరళ,కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన నాద్య గురువులు, నర్తకీ నర్తకులు తమ ప్రదర్శనలతో నాట్య సమ్మేళనానికి నిండుదనాన్ని తీసుకువచ్చారు. ప్రముఖ నర్తకి, నాట్య గురువు (సినీనటులు పద్మనాభం కుమార్తె) రాజేశ్వరి వారి శిష్య బృందం, విశాఖకు చెందిన నాట్యగురువు నర్తకి బాలకొండలరావు ప్రదర్శన, కూచిపూడి కళాక్షేత్రం వారి ప్రదర్శన, కుప్పా పద్మజ బృందం(వరంగల్), జిలాని బాషా శిష్య బృందం(బళ్ళారి), డా.కె ఉమారామారావు శిష్య బృందం ’తరిగొండ వెంగమాంబ చరితం’ భాగవతుల వెంకటరామశర్మ శిష్యబృందం(విజయవాడ), మధుసూధనన్ (క్యాలికట్-కేరళ) బృందం కూచిపూడి నాట్య వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలతో కనువిందు చేశారు.
25వ తేదీన అంటే నాట్య సమ్మేళనం రెండవ రోజు ఉదయం అభినయాత్మక ప్రసంగాలతో నాట్యకళలోని అరుదైన అంశాలను అందించి రక్తికట్టిన ప్రముఖ నర్తకీ నర్తకుల్లో పద్మభూషణ్ డా.రాజా రాధారెడ్డి గార్ల కుమార్తె యామినిరెడ్డి, డా.అలేఖ్య పుంజాల, స్మితశాస్త్రి ప్రభృతులను చెప్పుకోవచ్చు.

నాట్యరాజ్య సమితి ఒక సంచలనం
’యువత కూచిపూడి భవిత’ అన్న నినాదంతో జరిగిన రెండవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో దేశవిదేశాల నుంచి వచ్చిన యువ నర్తకీ నర్తకుల మెదళ్ళ మొదళ్ళను కదిలించే ప్రయత్నం సిలికానాంధ్ర చేసింది. పార్లమెంటులో దేశ ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు చర్చించినవిధంగా ఈ నాట్య రాజ్య సమితిలో ఈ తరం కూచిపూడి భవితపై ఎంతో గంభీరమైన చర్చ చేసింది. కూచిభొట్ల ఆనంద్ అనుసంధానం చేస్తూ చర్చకు వాడినీ వేడినీ ఫ్రోది చేశారు. కూచిపూడి నాట్యాన్ని అంతర్జాతీయమైన కళారూపంగా అభివృద్ధి పరచాలని చర్చలో పాల్గొన్న యువత అన్నారు. కూచిపూడి నాట్యానికి భాషాపరమైన అవరోధాలేమీ లేవని, పాశ్చాత్యులకు కూడా ఈ కళాంశాలు బాగా అర్ధమయ్యేలాగా ఆంగ్లంలో కూడా రూపొందించవచ్చునని అన్నారు. వేదికపై పెద్ద సంఖ్యలో కూర్చుని పాల్గొన్న యువతను చూసినవారికి భవిత పై ఆందోళన అవసరం లేదనిపించింది.
అనంతరం నర్తకీ నర్తకులు, నాట్య గురువులు, నాట్యకళా విమర్శకులు, పరిశోధకులతో ఒక చర్చా కార్యక్రమం జరిగింది.
సాయంత్రం నర్తక విభావరిలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నృయశాఖ విద్యార్థులు జొన్నలగడ్డ అనూరాధ పర్యవేక్షణలో రెండు అంశాలను పదర్శించారు. తర్వాత కువైట్ నుంచి వచ్చిన వేదవల్లి చల్లా వారి శిష్యబృందం, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నుంచి వచ్చిన నీరజాదేవి శిష్తబృందం, అమెరికాలోని న్యూజెర్సీ నుంచి వచ్చిన దివ్య ఏలూరి వారి శిష్యబృందం, స్వాతి గుండపనీడి వారి శిష్యబృందం,బెంగుళూరు నుంచి వచ్చిన వైజయంతీ కాశీ వారి శిష్యబృందం, పశ్చిమ బెంగాళ్ నుంచి వచ్చిన భారతీదేవి, శిష్యబృందం, నిజామాబాద్ నుంచి వచ్చిన దేవులపల్లి ప్రశాంత్ శిష్యబృందం, కేరళ రాష్ట్రం కొచ్చిన్ నుంచి వచ్చిన అనుపమా మోహన్ శిష్య బృందం, ఆదిలాబాద్ నుంచి వచ్చిన చుక్కా శివరాజ్ శిష్యబృందం నాట్య ప్రదర్శనలతో అలరించాయి.
కూచిపూడి నాట్యకళా సరోవరంలో అరవిరిసిన పద్మాలు డా.వెంపటి చినసత్యం, డా.యామినీ కృష్ణమూర్తి, డా.రాజా రాధారెడ్డి, పద్మశ్రీ కె.శోభానాయుడు, కూచిపూడి మట్టి పరిమళం వేదాంతం రాధేశ్యాం తదితర ప్రముఖులు, విదేశాల్లో కూచిపూడికి వ్యాప్తి చేకూరుస్తున్న జ్యోతి చింతలపూడి, దివ్య ఏలూరి, స్వాతి గుండపనీడి వంటివారు నాట్యోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరీ ముఖ్యంగా డా.వెంపటి చినసత్యం, డా.యామినీ కృష్ణమూర్తి, డా.శోభానాయుడుల సమక్షంలో ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని పొందినవారు, పాల్గొన్న వారు ముఖ్యంగా ఈ తరం కళాకారులు అపూర్వమైన అనుభూతికి లోనయ్యారు.

దగ్గుబాటి పురంధేశ్వరి నృత్యం ఆహా!
కేంద్రమంత్రిగా, మహాకళాకారులు డా.నందమూరి తారక రామారావు కుమార్తెగా మాత్రమే అందరికీ సుపరిచితులైన డా.దగ్గుబాటి పురంధేశ్వరి 25 నాటి సాయంకాలం వేదికపై నర్తించడం ఒక అరుదైన అనుభూతి. కళాకారులను సత్కరించడానికి వేదికకు డా.యామినీ కృష్ణమూర్తితో కలిసి పురంధేశ్వరి వచ్చారు. కూచిభొట్ల ఆనంద్ వినతికి స్వందిస్తూ యామినీ కృష్ణమూర్తి రారా స్వామిరారా, ’యదువంశ సుధాంబుధి చంద్ర’ అనే అంశంపై వెంపటి రవిశంకర్ నట్టువాంగంలో నర్తించడం చూసిన కళాభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. అంతటితో ఆగక యామిని మరొక కోరిక కోరారు. సాక్షాత్తు పురంధేశ్వరిని నర్తించమన్నారు. ఇలాంటి కోరిక కోరతారని ఊహించని పురంధేశ్వరి కొన్ని క్షణాలు ఆశ్చర్యానికి గురై తేరుకున్నారు. రవిశంకర్ చెప్పిన జతులపై నాట్యాన్ని ప్రదర్శించడంతో హాలు చప్పట్లు, కేరింతలతో మారు మోగింది. పురంధేశ్వరి ఆ రోజుల్లో నాన్న ఆదేశంపై డా.వెంపటి చిన సత్యం వద్ద నాట్యాన్ని అభ్యసించారు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నర్తించారు.

మరొక ప్రపంచ రికార్డు నెలకొల్పిన మహాబృంద నాట్యం

రెండవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో ముఖ్య ఘట్ట, సమాపనోత్సవమైన డిసెంబర్ 26న సాయంత్రం హైదరాబాద్ సమీపంలోని జి.ఎం.సి. బాలయోగి (గచ్చిబౌలి) స్టేడియంలో జరిగింది. రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్, ఆమె భర్త, డా.దేవీసింగ్ షెఖావత్, గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి రాధికారెడ్డి, మంత్రులు వట్టి వసంత్ కుమార్, డి.శ్రీధర్ బాబు, డి.కె అరుణ , నగర మేయర్ కార్తీకరెడ్డి, శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, కేంద్రమంత్రి పురంధేశ్వరి, మాజీవంత్రి మండలి బుద్ధప్రసాద్, నాట్య గురువులు డా.వెంపటి చినసత్యం, డా.యామినీ కృష్ణమూర్తి, డా.రాజారాధారెడ్డి, డా.కె.శోభానాయుడు, సిలికానాంధ్ర తరపున కూచిభొట్ల ఆనంద్, రాజు చబర్తి, దిలీప్ కొండిపర్తి, కొండుభట్ల దీనబాబు, విజయసారధి ప్రబృతుల సమక్షమంలో సాయంత్రం 5.30 గంటలకు మహా బృంద నాట్యం సాగింది. 40 సంవత్సరాల కిందట డా.వెంపటి చినసత్యం సిద్దేంద్రయోగిపై రచించి, నాట్యకల్పన చేసిన హిందోళ తిల్లానా 11నిముషాల 30 సెకన్లపాటు సాగింది. స్టేడియంలోని 2850 మంది నర్తకీ నర్తకులు (వీరిలో 80శాతం మంది 15 ఏళ్ళలోపు వారుండడం విశేషం) మహా బృంద నాట్యాన్ని ఎంతో లీనమై ప్రదర్శించారు. ప్రపంచ వేదికపై కూచిపూడి నాట్యకళకు అపూర్వమైన గౌరవాన్ని కల్పిస్తున్నామన్న భావంతో పాల్గొని తరించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి తారికవర మహాబృందనాట్యాన్ని ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు ప్రదర్శించిన నాట్యాంశంగా నమోదు చేస్తున్నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని వేదికను ఆసీనులైన రాష్ట్రపతి ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రభృతులకు అందించారు. నర్తకీ నర్తకులు, గురువులు, స్టేడియంలో వున్న సుమారు 25 వేలమంది కళాభిమానులు పెద్ద పెట్టున హర్షాతిరేకంతొ కరతాళ ధ్వనులు, కేరింతలు, ఈలలతో స్పందించారు. రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి ప్రసంగాలు నిర్ణయించిన కార్యక్రమంలో లేవు. కాని ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించి పరవశించిన అనుభూతితో సిలికానాంధ్రను పశంసల్లో ముంచెత్తుతూ పసంగాలు చేశారు. మీ ఈ కార్యక్రమం దేశానికే గర్వకారణమని రాష్ట్రపతి ప్రశంగించారు. గవర్నర్ నరసింహన్ మహాబృంద నాట్యం శ్రీకృష్ణుని విశ్వరూపమని అభివర్ణించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున 25 లక్షల చెక్కు అందించి సిలికానాంధ్ర విజయవంతంగా నిర్వహించిన సాంస్కృతిక యజ్ఞాన్ని కొనియాడారు. అనంతరం డా.రాజా రాధారెడ్డి గార్ల శిష్యబృందం స్టేడియంలోని ప్రత్యేక వేదికపైన ప్రదర్శించిన ’శుభసాంపతికం’ ప్రదర్శన ప్రాచీన, ఆధునిక ధోరణుల మేలవింపుగా సాగింది.
మూడు రోజుల నాట్య సమ్మేళనానికి సిలికానాంధ్ర(ఇండియా) ప్రధాన కార్యదర్శి డా.జె.చెన్నయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech