|
ఆత్మవిశ్లేషణా, తాత్త్వికతలే
అంతస్సూత్రం డా|| పోరంకి ’చంద్రవంక’ కథానికలు
డా|| పోరంకి దక్షిణామూర్తిగారు అనగానే ’తెలుగు కథానిక స్వరూప
స్వభావాలు’ సిద్ధాంత గ్రంథం గుర్తుకొస్తుంది. కథానిక
పుట్టుపూర్వోత్తరాల గురించి సమగ్రమైన పరిశోధన గ్రంథం అది. అలాగే
పోరంకి వారనగానే ఒక విలక్షణమైన, విశిష్టమైన, అపూర్వమైన, ప్రయోగం
గుర్తుకొస్తుంది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జానపద మాండలికాల్లో
మూడు నవలలు ’వెలుగు వెన్నెలా గోదారీ, రంగవల్లి, ముత్యాల పందిరి’
వెలువరించారు. నిర్మాణపరంగా, పరిష్కారపరంగా వారు అనేక నిఘంటువులు,
పదకోశాలు కృషిలో చేయూతనిచ్చారు. చాలా విమర్శనాత్మకవ్యాసాలు, ముప్పయ్
పైచిలుకు అనువాదాలూ ప్రచురించారు.
కాగా,1956 నుంచీ ఐదు దశాబ్దాలకు పైబడి కథానికా రచన చేస్తున్నా
దక్షిణామూర్తిగారి మొదటి కథానికా సంపుటి ఇన్నేళ్ళకిన్నేళ్లకి
ఇప్పుడు ప్రచురితమైంది. అదే ’చంద్రవంక’ కథానికల సంపుటి.
కృష్ణానదికి ఉపనదులు నాగులూరూ, చంద్రవంకా. చంద్రవంక మాచెర్ల
పట్టణాన్ని చుడుతూ వంకెగా తిరుగుతుంది. 1964 చంద్రవంక పొంగి నానా
బీభత్సం చేసింది. అపారమైన ధననష్టం. కొంత జననష్టం సంభవించాయి. ఇదీ ఈ
కథానేపథ్యం, మంగయ్యశాస్త్రి కుటుంబం ఆ వరదల్లో చిక్కుకుంది. "పతనమైన
ఒకానొక వ్యవస్థ తాలూకు శిథిలావశేషం ఆ కుటుంబం" కుటుంబంలో ఒక్కొక్కరే
వరద ఉధృతుకి బలి అయిపోతారు. మంగయ్యశాస్త్రి కళ్ళ ముందే, ఇల్లూ,
పచ్చగా ఉండవలసిన వాళ్ళూ నీటికి కొట్టుకుపోయారు. కంటి తడిని
తుడుచుకోలేని పరిస్థితిలో మనవడు పసివాడిని భుజాల మీదికి చేర్చుకుని
మంగయ్యశాస్త్రి వెల్లువలో పూచికలా నిలిచివున్నాడు. నీరు ప్రవాహం
క్షణక్షణమూ మట్టం పెరిగిపోతోంది. అల్లకల్లోలంగా ఉంది. క్షణంలో ఆయన
గుండెల్లో ఒక మెరుపు మెరిసింది. తాళపత్రగ్రంథాల బుట్ట మిగిలింది.
అందులో వైద్యశాస్త్రం, దశోపనిషత్తులు, యోగశాస్త్రం, భగవద్గీత,
మేఘసందేశం, బ్రహ్మసూత్రాలు యజ్ఞోపవీతం తీసి ఒక వైపు పుస్తకాల
బుట్టకు చుట్టి, మనవణ్ణి బుట్టలో కూర్చోబెట్టి, రెండోవైపు కొస వాడి
భుజానికి తగిలించి, ప్రవాహంవైపు విడిచాడు. ఆ క్షణంలోనే ఆయన
’ఆత్మసన్యాసం’ స్వీకరించాడు. ప్రభూ ఇదంతా నీ సంకల్పం ఈ చిన్ని
మొలకను ఎక్కడికైనా సురక్షితంగా చేర్చి కాపాడు తండ్రీ అంటూ ఇంకా ఒక
శుభాకాంక్షని, ఆత్మనివేదనంగా భగవంతుడికి సమర్పిస్తాడు. ఇవిగో ఆ
అమూల్యమైన అక్షరపంక్తులు విశాలమైన ఈ ప్రపంచంలో ఎక్కడయినా సరే
ఎవరయినా సరే మనిషి మనిషిగా బతికేట్లు చూడు స్వామి ఇది నా జాతి, నా
మతం, నా రక్తం అన్న అహంభావం మనిషికి కలగనివ్వకు. ఆత్మవిశ్వాసం
మాత్రం రగుల్కొలుపు వ్యవస్థ ఏదయినా నాకు బెంగలేదు. వ్యక్తి నిటారుగా
నిలబడితే చాలు. జీవిత విధానం ఎలా మారినా నష్టం లేదు.విలువలు మాత్రం
నశించనీయకు స్వామీ. ఇంతే చాలు నాకు. ఇదొక్కటే నిన్ను కోరేది. అని
రెండు చేతులూ జోడించి రెప్పలు వాల్చి. లోచూపులు నిగుడ్చుకొన్నాడు.
చంద్రవంక ఇంకా పొంగుతూనే ఉన్నది. చంద్రవంక పొంగింది. అనే ఎత్తుగడ
వాక్యంతొ ఆరంభమైన కథానిక. ’చంద్రవంక ఇంకా పొంగుతూనే ఉంది’ అన్న
వాక్యంతో ముగిసింది.
ఆది మధ్యాంతాలు ఉండీ, ఉండనట్లు స్పురింపజేసేదే మంచి కథానిక. జీవితం
ధ్వనిస్తూ, జీవితపార్శ్వాన్ని తళతళలాడింపజేయాలి ఉత్తమ కథానిక. కాల
స్పృహ కాలప్రవాహం కదలాడాలి. కానీ,కాలస్తంభన ఉండకూడదు. ఎందువల్లనంటే
జీవితం ఒక ’ప్రాసెస్’ కనుక, దీనికి భారతీయాత్మ పునాది కనుక.
జీవనతాత్త్వికతని ప్రోదిచేస్తూ, మంగయ్యశాస్త్రి ఆత్మశోధన,
ఆత్మవిశ్లేషణ ఆత్మసన్యాసం, ఆత్మార్పణం అన్నీ జరిగిపోయినై కథానికలో.
రచయిత గుణనైశిత్యం మంగయ్యశాస్త్రి పాత్రచిత్రణలో అద్భుతమైన
వన్నెలీనింది. మేథోపరిణతికి దర్పణంగా నిలిచింది. సింధువులో
బిందువులా, అనంతంలో అంతంలా ఆ పాత్రని అజరామరం చేశారు
దక్షిణామూర్తిగారు. ఒక దయనీయమైన ఉత్పాతం మధ్య ఒక విశ్వప్రేమికుణ్ణీ,
ఒక విశ్వమానవుణ్ణీ సృష్టించి, సార్వకాలీనమూ, సార్వజనీనమూ అయిన ఒక
ఆదర్శాన్ని ఆయన శుభ్రకాంక్షగా పలికించారు. వేలాదిమంది రచయితలు
రాస్తూవుంటారు. అయితే, పాఠకుడిలో ఉత్తమ మానవతా విలువల్ని
ప్రేరేచి,బతుకు అర్థాన్ని విడమరిచి చెప్తూనే, జీవనౌత్యాన్ని జాగృతం
చేయగలగడం ’మనిషి’ పట్లా ’మానవత’ పట్లా నిబద్ధత కలిగిన గొప్ప రచయితలే
చేయగలరు. కచ్చితంగా అలాంటి నిఖార్సయిన గొప్ప రచయిత డా||పోరంకి వారు
’చంద్రవంక’ గొప్ప రచన, గొప్ప కథానిక. |
|