 |
 |

మంచి మార్పు (మొదటి
భాగం)
-
తాడినాడ మీనాక్షి |
|
తెల్లవారుఝాము ఆరుగంటలు దాటింది. ఈ సమయంలో ఎటువంటి హడావిడి లేకుండా
స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, కాఫీ త్రాగుతూ బయట ప్రపంచాన్ని చూస్తే
ఎంత బాగుంటుందో కదా? ప్రస్తుతం నేను చేస్తున్న పని కాఫీ త్రాగుతూ
రోడ్డు మొదటికి చూసాను. కారు ఇంకా రావడం లేదు. మా వారి అక్కయ్య
కుటుంబం తిరుపతి నుండి వస్తున్నారు. వాళ్ళను రిసీవ్ చేసుకునేందుకు
మా వారు అబ్బాయి ఇద్దరూ స్టేషన్ కు వెళ్ళారు.
మా అపార్ట్ మెంట్ కు ముందు ఒక అపార్ట్ మెంట్ పక్కన ఒకటి ఉంది. ఇంక
మిగిలినవన్నీ ఇండిపెండెంట్ ఇళ్ళే. కాబట్టి ప్రొద్దున్నే ఇలా
బాల్కనీలో నిలబడి చూస్తే బోలెడు కాలక్షేపం. పేపర్ బోయ్స్, పాలవాళ్ళు,
ఒక ఇంటిలో నుండి వేరొక ఇంటిలోకి వెళ్ళే పనివాళ్ళూ, నెమ్మదిగా
మొదలయ్యే స్కూల్ ఆటోవాళ్ళ హడావిడి. ఇవన్నీ చూస్తూ ఉంటే సమయం తెలియదు.
నా ఆలోచనలో నేను వుండగానే కారు వచ్చేసింది. మా వారి అక్కయ్య కుటుంబం
బెంగుళూర్ లో వున్న వాళ్ళ పెద్దబ్బాయి దగ్గర వారం రోజులు వుండి,
తిరుపతికి వెళ్ళి ఇంకా చూడదగ్గ ప్రదేశాలు చూసుకుని ఇక్కడకు
వస్తున్నారు. నేను ఇవతలకి వచ్చేసరికి వాచ్ మెన్ సామాన్లు
తీసుకువచ్చి లోపల పెట్టాడు. మా అత్తగారు మొహం కడుక్కుని వాళ్ళ
రాకకోసం ఎదురుచూస్తూ వున్నారు.
ప్రయాణం బాగా జరిగిందా? అల్లుడు గిరిని, కూతురుని ప్రశ్నించారు
అత్తగారు.
ఆహా బాగానే జరిగింది చెప్పారు.
హాయ్ అమ్మమ్మ అంటూ పలకరించింది వీణ. వీణ మా వదినగారికి ఒక్కగానొక్క
ఆడపిల్ల. పెద్దబ్బాయి బెంగుళూర్ లో వుంటే, రెండవ వాడు చెన్నై లో
వుంటాడు. తరువాత ఆడపిల్ల వీణ. వంశీ రాలేదేమిటి అని అడిగాను. వాడి
లీవ్ అయిపోయింది. మళ్ళీ వీలు చేసుకుని వస్తానని చెప్పమన్నాడు. అని
అన్నారు.
ఇంతలో మా అమ్మాయి సంగీత ట్యూషన్ నుండి వచ్చింది . ఏంటీ సంగీత మేము
వస్తున్నామని తెలుసుకదా ఇంత లేటేమిటి? ప్రశ్నించారు వదినగారు.
మానేద్దామనుకున్నా గాని ఈ రోజు టెస్ట్ వుంది అత్తయ్యా అంటూ వీణతో
పాటు లోపలికి వెళ్ళింది.
కుశల ప్రశ్నలూ, కాఫీలు, ఫలహారాలు అయిన తరువాత నెమ్మదిగా వంట పని
మొదలుపెట్టాను. మా వదిన గారు కూడా మాకు సహాయం చేద్దామని అనుకున్నారు.
నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటాంలే అన్నారు అత్తగారు. రాత్రి
ట్రైన్ లో బాగానే నిద్ర పట్టింది, రెస్ట్ అవసరం లేదు అన్నారు.
ఏమిటి సంగతులు వీణకు సంబంధాలు ఎంత వరకు వచ్చాయి అడిగాను. ఏవో
వస్తున్నాయి ఇంత వరకు గట్టిగా నచ్చింది ఏదీ లేదు కదా. ఈ విషయంలో మీ
అన్నయ్యగారు కొంచెం సీరియస్ గానే వున్నారు. అంటూ చెప్పారు.
వీణ ఏమంటోంది. అడిగాను. సరేలే దానికే ఈ రంధి వుంటే ఈ గొడవ లేదు కదా
అన్నింటికీ మీ ఇష్టం అంటుంది అన్నారు.
మంచిదేగా ఏ గొడవలు లేకుండా అన్నాను.
సరేలే మనము త్వరపడితే అవుతుందా సమయం వచ్చినప్పుడే అవుతుంది సర్ది
చెప్పారు అత్తగారు.
ఇంతలో మా వారు వచ్చి టీ పెట్టలేదా అని అడిగారు. ఆయన ఇంట్లో వుంటే
ఇలా వంట మధ్యలో రెండు సార్లు అయినా అడుగుతారు. మీరు వెళ్ళి కూచోండి
వదినా నేను టీ చేసి తీసుకువస్తాను అని వాళ్లను అక్కడి నుండి పంపాను.
అంత మంది వంట గదిలో ఉంటే పని తెమలదు కదా.
భోజనాలు అయిన తరువాత టి.వి చూస్తూ కూర్చున్నాము. పిల్లలు లోపల గదిలో
కాలక్షేపం చేస్తున్నారు. సాయంత్రం కొంచెం బయటకు వెళ్ళాలి రవీంద్ర..
అని అన్నయ్యగారు అన్నారు. ఒక సంబంధం వచ్చింది ఒకసారి వెళ్ళి కనబడి
వద్దాం అంటూ పిల్లవాడి ఫోటో వివరాలు వున్న కవర్ ఇచ్చారు. దగ్గరేలే
వెళదాం వీణకు చూపించారు.. ఏమన్నది అన్నారు.
ఏమంటుంది మీ ఇష్టం అంటుంది. అయినా మన అమ్మాయి గురించి తెలిసిందే కదా.
ఎటువంటి వాడు అయితే మంచిదో చూసి అమ్మాయిని భరించగలిగే వాడు అవునో
కాదో చూసుకోవాలి కదా అని అసలు విషయాన్ని గుర్తుచేసుకుంటున్నట్టు
అన్నారు.
దానిదేముంది లేండి పెళ్లయితే అన్నీ చక్కబడతాయేమో, అర్థం చేసుకునే
వాళ్ళే దొరుకుతారేమో అన్నాను నేను.
ఏమో ఎవరి అదృష్టం ఎలా వుందో అన్నారు అత్తగారు.
వీణ అనాకారో, చదువురానిదో, తెలివిలేనిదో అనుకుంటే పొరబాటే. మంచి
చదువు వున్నది. మరో నెల రోజుల్లో ఉద్యోగంలో చేరబోతోంది. చూడగానే
ఎక్కువ అలంకారాలు వుండవు. ఉండవలసిన చోట పద్ధతిగానే వుంటుంది.
డ్రాయింగ్ అన్నా, ముగ్గులు అన్నా, ఫ్రెండ్స్ కు మెహిందీలు
పెట్టాలన్నా చాలా ఆసక్తి. ఇళ్ళల్లో ఏదన్నా శుభకార్యాలు వుంటే
అందరికీ వరసబెట్టి చేతికి గోరింటాకు పెట్టేస్తుంది. ఇవన్నీ కష్టబడి
నేర్చుకున్నవి కావు స్వతహాగా వచ్చినవే.
ఇన్ని విద్యలు తెలిసిన తనకు ఇంట్లో తల్లికి సహాయపడదాము అని
అనిపించదు. తల్లికి ఒంట్లో బాగోక పోయినా, పని మనిషి రాకపోయినా ఇంటి
పనులలో సహాయం చేద్దామని కనీసం అనిపించు ఎంతయినా బయట పనులు తిరిగి
చేస్తుంది, కబుర్ల మీద కబుర్లు చెబుతుంది. కాని ఒక చిన్న పని చెబితే
అమ్మో నా వల్ల కాదు ఓపిక లేదు. అంటుంది. అలా అని ఎవరినీ
పట్టించుకోదా అంటే అలాగూ కాదు, ఎవరి కయినా బాగోలేదు అంటే వారికి
సపర్యలు చేస్తుంది. వీటన్నింటికీ తోడు తాను కొంచెం బొద్దుగా
వుంటుంది. ఒళ్ళు తగ్గించుకోమంటే తగ్గించుకోవడానికి ప్రయత్నించదు.
పని చేయమంటే చేయదు. వినే వాళ్ళకు ఇది చిన్న సమస్య అయివుండవచ్చు.
కాని ఇలాంటివి చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయి.
ఇలాంటి అమ్మాయికి ఎలాంటి సంబంధం వస్తుందో అని బాధ. అంతకు మించి
పెళ్ళి అయిన తరువాత ఎలా వుంటుందో, ఏం చేస్తుందో అని బెంగ చాలా వుంది.
తల్లిదండ్రులు చెప్పి చెప్పి విసిగిపోయారు, మా అత్తగారు అన్నట్టు
ఎవరి అదృష్టం ఎలా వుందో ఎవరికి తెలుసు.
అనుకున్నట్టే మగవాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారు సాయంత్రం మా అత్తగారు
వదినగారు లోపల గదిలో ముందు కూర్చున్నారన్న మాటే గాని ఒక్క ఛానెల్
పట్టుమని పదినిమిషాలు చూడటం లేదు. మారుస్తూనే ఉన్నారు. అదేం సరదానో,
నాకు విసుగు వచ్చి పుస్తకం తీసుకున్నాను చదవడానికి ఇంతలో ప్రక్కన
పోర్షన్ లో వుండే రమ్య వచ్చింది. పనులయ్యాయా ఆంటీ అని పలకరించింది.
ఆహా ప్రస్తుతానికి అయినట్లే అని ఎలావుంది మీ అమ్మగారికి పూర్తిగా
తగ్గినట్లేనా అడిగాను.
తగ్గినట్లే ఆంటీ కాని నీరసంగా వుంటోంది. పనులు చేయడం మొదలు
పెట్టింది. వద్దన్నా వినడం లేదు. ఖాళీగా కూర్చోలేను అంటుంది అంటూ
చెప్పింది.
రమ్య తల్లి సరోజగారు, తండ్రి రామకృష్ణ గారు సెంట్రల్ గవర్నమెంట్
ఉద్యోగి. ఇద్దరే పిల్లలు. పెద్దవాడు రాకేష్. తరువాత రమ్య, రాకేష్
మంచి ఉద్యోగంలో వున్నాడు. పిల్లలు ఇద్దరు ఇంట్లో అన్ని విధాల సహాయం
చేస్తారు. తల్లికి జ్వరం వచ్చినప్పుడు మంచం దిగనీయలేదు. పూర్తిగా
వాళ్ళే చేసారు. మా ఇంట్లో నాకు బాగుండకపోతే చేస్తారు. కాని వాళ్ళు
చేసినట్లు కాదు. ఇద్దరూ మంచి పిల్లలు. వీణ కోసం సంబంధం అనగానే నాకు
మొదట రాకేష్ గుర్తుకు వచ్చాడు. కాని ఆ ఇంట్లో మనుషులకు, వీణకు ఏ
మాత్రం పొత్తు కుదరదని అనిపించింది. అలా అని అంత మంచి పిల్లాడిని
మన ఇంట్లో పిల్లకు అడగకుండా వుండబుద్ది కావడం లేదు. అందుకనే మా
వదిన గారికి ఈ విషయం చెప్పి నాలుగు రోజులు వుండేట్లుగా రమ్మని
చెప్పాను.
నేను లేచి లోపలకు వెళ్ళి తిరుపతి ప్రసాదం తీసుకుని వచ్చి రమ్యకు
కొంచెం ఇచ్చి నేనే వద్దామని అనుకున్నాను ప్రసాదం ఇవ్వడానికి ఇంతలో
నువ్వే వచ్చావు. నువ్వు కూచో నేను వెళ్ళి ప్రసాదం ఇచ్చి వస్తాను.
అని మా వదిన గారిని కూడా రమ్మని పిలిచాను వెళ్ళిరా బాగా తెలిసిన
వాళ్ళేలే అని అత్తగారు చెప్పారు.
ఇద్దరం కలిసి ప్రక్క పోర్షన్ లో వున్న రాకేష్ ఇంటికి వెళ్ళాం. సరోజ
వంటగదిలో వున్నట్లున్నారు. రామకృష్ణ గారు టి.వి చూస్తూ హాల్ లోనే
వున్నారు. మమ్మల్ని చూసి రండి, అని ఆహ్వానించి లోపలకు వెళ్ళి మేము
వచ్చినట్లు ఆవిడకు చెప్పారు. ఆవిడ వెంటనే బయటకు వచ్చారు.
పూర్తిగా తగ్గిందాండి అప్పుడే పనులు మొదలు పెట్టారు అంటూ పలకరించాను.
తగ్గినట్లే ఇంకా పడుకున్నామంటే ఇంకా నీరసపడతాము అందావిడ. మా వదిన
గారిని పరిచయం చేసాను. ఎందుకండి నీరసంగా వున్నప్పుడు పనులు
చేసుకోవడం చేసేవాళ్ళు వున్నప్పుడు చేయించుకోక, ఎవరూ లేకపోతే
చేసుకోవడం తప్పదు కదా అన్నారు వదినగారు ఏం చేయించుకోవడం లెండి
చేయించుకుని విసుగు వచ్చింది అన్నారు సరోజ.
నాకు నవ్వు వచ్చింది. ఎవరయినా చేసేవాళ్ళు వుంటే బాగుండునని మా వదిన
గారికి చేయించుకుని సరోజ గారికి విసుగు అనిపించడం నాకు నవ్వు
వచ్చింది.
బాగా జరిగిందా తిరుపతి దర్శనం అడిగారావిడ బాగా జరిగింది ఇదిగో
ప్రసాదం అని ఇచ్చారు. కాఫీలు అయిన తరువాత మా వదిన గారి దృష్టి
అక్కడే వున్న వాళ్ళ ఫ్యామిలి ఫోటో మీద పడింది.
మీ అబ్బాయా ఫోటోను చూస్తూ అడిగారు అవునండి అది మా అమ్మాయి ప్రస్తుతం
మీ ఇంట్లోనే వుంది కదా అందావిడ.
అవును చూసాను, అబ్బాయి కేమన్నా సంబంధాలు చూస్తున్నారా మా వదినగారు
అడిగారు. రావడానికేమీ చాలానే వస్తున్నాయి, కాని మనకు అనువైనవి
చూడాలి కదా అందావిడ.
అవును లెండి అదే ముఖ్యం వదినగారన్నారు. చదువుకున్న అమ్మాయి నిదానం
గల అమ్మాయి అయితే చాలు ఇంకేమీ అఖ్ఖరలేదు అందావిడ. అవి ఆవిడ కోరికలు,
నాకయితే ఆపై కొంచెం పనీపాట తెలిసినమ్మాయయితే ఇంకా బాగుంటుంది.
అవసరమయితే చేయడంలో తప్పు లేదు కదా అన్నారు రామకృష్ణ గారు.
అప్పటిదాకా బాగానే వున్న మా వదిన గారి మొహం ఆయన మాటలు వినేసరికి
బాధగా అయింది అవునులేండి ఎవరో ఒకరు చేతికి సహాయం లేకపోతే చాలాకష్టం
అనుభవం మీద అన్నారు వదినగారు. మరి కొంచెం సేపు కూర్చుని బయటకు వచ్చాం
రాత్రి వరకు రాకేష్ గురించి మాట్లాడడానికి కుదరలేదు.
రాత్రి భోజనాలు అయిన తరువాత పిల్లలు గదిలోకి వెళ్ళిన తరువాత మిగతా
వాళ్ళ ముందు నా ఉద్దేశ్యం చెప్పాను. మా వారికి ఈ విషయం ముందే
చెప్పాను కాబట్టి అంతగా రియాక్ట్ కాలేదు. మా అత్తగారు మటుకు కొంచెం
ఆశ్చర్యపోయారు నాకు ఇన్నాళ్ళు తట్టలేదు అడిగితే బాగానే ఉంటుంది
అన్నారు.
మనకు బాగానే వుంటుంది. కాని వాళ్ళకీ బాగుండదు, వాళ్ళ గురించి
తెలిసిన తరువాత తెలిసి తెలిసి మన అమ్మాయి అయినా అడగలేం కదా, అంతా
అయి పెళ్ళి అయిన తరువాత గొడవలు అయితే ఎంత అసహ్యంగా వుంటుంది. పనీ
పాట తెలియని అమ్మాయినిచ్చి కావాలని పెళ్ళిచేసారని తెలిస్తే ఎంత
బాధగా వుంటుంది. వాళ్ళకు ఎటువంటి అమ్మాయి కావాలో ముందే చెప్పారు.
మన అమ్మాయి గురించి తెలిసిందేగా అన్నారు అన్నయ్యగారు.
అదేం మాట, ఏమో అబ్బాయి నచ్చితే తనంతట తానే మారుతుందేమో, లేకపోతే
పెళ్ళి అయిన తరువాత అతనే మార్చుకుంటాడేమో ఎవరికి తెలుసు. మన
ప్రయత్నం మనం చేస్తే సరి నేను ఊరుకోకుండా అన్నాను.
పోనీ ఒకసారి అడిగితే సరి అన్నారు మావారు. అవును త్వరపడితే మంచిది
అతనికి కూడా సంబంధాలు చూస్తున్నారు. అంతా అయిన తరువాత విచారిస్తే
ఏం లాభం లేదు అన్నారు అత్తగారు.
సరే, మన పిల్ల అదృష్టం ఎలా వుందో దానిని చేసుకునే వాడి అదృష్టం ఎలా
వుందో చూద్దాం. మంచి రోజు చూసి అడిగితే సరి అన్నారు. ఏమో అబ్బాయి
బాగున్నాడు, కుటుంబం కూడా బాగానే వుంది. మన పిల్లకు బయట తిరగడం
తప్ప ఇంటిపని అసలు పట్టదు, నేను ఎలా వున్నా ఒక్క పనికూడ చేసి ఎరుగదు.
ఇప్పుడిప్పుడు కాఫి, టీ, చేయడం, అన్నం వండడం లాంటివి చేస్తోంది.
ఎవరయినా విన్నా ఎంతో అసహ్యంగా వుంటుంది. ఆ అబ్బాయి ఏమో అన్ని పనులూ
తెలిసినవాడు, తీరా అన్నీ కుదిరితే ఆపై ఏ మనఃస్పర్ధలు రాకుండావుంటే
చాలు, లేకపోతే తెలిసి తెలిసి ఒక కుటుంబంలో గొడవలు పెట్టిన
వాళ్ళమవుతాము. ఆపైన మీ ఇష్టం. ఇంతటి మంచి సంబంధం కుదిరితే అంతకన్నా
అదృష్టం ఏముంటుంది బాధగా అన్నారు వదినగారు. ఆవిడ బాధల్లా పెళ్ళయితే
పిల్ల అత్తవారింట్లో ఎలా నెట్టుకొస్తుందా అని.
ఈలోగా ఈయన మంచినీళ్ళు అడిగితే ఇవతలకు వచ్చా. అప్పుడే వీణ గదిలోకి
వెళ్ళడం చూసాను. అంటే వాళ్ళమ్మ మాట్లాడిన మాటలు అన్నీ వినివుంటుంది.
మరీ మంచిది. వింటే కనీసం మారడానికి అవకాశముంటుందేమో, మారి తీరాలి.
ఎందుకంటే ఇద్దరి మవుష్యుల మధ్య నిజమైన బంధం ఏర్పడితే కొన్ని
సర్దుబాటులు, మార్పులు జరగడానికి కొంచెం అవకాశం కలుగుతుంది.
నిజానికి మన వివాహ బంధంలో వున్నదీ అదికదా. ఏదో హడావిడిగా ప్రేమించి,
పెళ్ళి చేసుకునే వాళ్ల సంగతేమోగాని, నిజంగా ఇద్దరి మధ్య మంచి
అవగాహన గనుక ఏర్పడితే ఏదయినా సాధ్యం కావచ్చు. అసలు వీణకు ఇంతవరకు
ఇలాంటి అనుభవం ఎదురయి వుండదు. ఇప్పుడయినా ఎందుకుమారాలి అని వెర్రిగా
ఆలోచిస్తే ఎవరూ ఎవరినీ మార్చలేరు. అలా కాకుండా సవ్యంగా ఆలోచిస్తే
తనంత అదృష్టవంతురాలు ఎవరూ వుండరు.
మరునాడు ఆఫీస్ కు వెళుతూ ఇంటికి వచ్చాడు రాకేష్, ఆ సమయానికి వీణ
లోపల ఉన్నది. అతను వచ్చినట్లు వీణకు తెలియాలి కాబట్టి వీణను పిలిచి
రాకేష్ వచ్చాడు కొంచెం కాఫీ ఇవ్వవా నాకు కొంచెం వంట పని వుంది. అని
ట్రే ఇచ్చాను. మాట్లాడకుండా ఇచ్చింది. ఇచ్చి వచ్చావా అతనే రమ్య
అన్నయ్య. అని చెప్పాను. మామయ్య చెప్పారు అంది నేను ఇంకేమి
మాట్లాడలేదు. మాట్లాడడానికి ఏమి వుంటుంది జరిగేవి చూడటం తప్ప.
రాత్రి 7 గం||లు అవుతోంది. బాగా వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి.
పెందలాడే వంట కార్యక్రమం ముగిస్తే ఒక వేళ కరెంట్ పోయినా పర్వాలేదు.
లేకపోతే చాలా విసుగు అంతకు ముందే అన్నయ్యగారు బయటకు వెళ్ళి
వచ్చారు. పిల్లలు బయటకు వెళ్ళారు అబ్బాయి ఆడుకోవడానికి వెళ్ళాడు.
కాఫీ ఇవ్వమంటారా అడిగాను రవీంద్ర ఇంకా రాలేదు. ఇంకా టైం వుందా వాచ్
చూసుకుంటూ అడిగారు.
మామూలుగా అయితే లేటవుతుంది. ఇందాక ఫోన్ చేసారు. బయలుదేరినట్లు
చెప్పాను.
రానీ వచ్చాకే తాగుదాం అన్నారు అన్నట్టుగానే పది నిమిషాలలోపే
వచ్చేసారు. ఎప్పుడయినా కొంచెం పెందరాడే రమ్మనమన్న రోజు ఇంకాస్త
ఆలస్యం చేస్తారు. ఇటువంటప్పుడు మాత్రం ఎవరూ చెప్పకుండానే త్వరగా
వస్తారు. వెంటనే కాఫీలు ఇచ్చాను.
పిల్లలు ఎవరూ ఇంట్లో లేరా అడిగాడు సంగీత, వీణ బయటకు వెళ్ళారు.
పృథ్వి ఆడుకోవడానికి వెళ్ళాడు చెప్పాను.
ఎంత సేపని ఇంట్లో వుంటారు కొంచెం బయటకు వెళ్ళి తిరిగి వస్తే కాస్త
కాలక్షేపం అన్నారు. కాలక్షేపం సరే పెద్ద వాన వచ్చేలా వుంది అన్నారు
అత్తగారు.
ఎంతో దూరం వెళ్ళి వుండరు. వచ్చేస్తారు అన్నాను. ఇంతలోనే కరెంట్
పోయింది. పిల్లలు రాలేదు కరెంట్ పోయింది వెంటనే అత్తయ్యగారు
అన్నారు. క్రింద వున్నారు అంటూ లోపలికి వచ్చాడు పృథ్వి. వెనకా
రాకేష్ వున్నాడు. రా రాకేష్ అంటూ ఆహ్వానించి ఇతనే రమ్య వాళ్ల
అన్నయ్య రాకేష్ అంటూ పరిచయం చేసారు ఈయన.
రాకేష్ ను చూడగానే మా వదినగారు మొహం కరెంట్ లేకపోయినా వెలిగిపోవడం
గమనించాను. అతని ఆఫీస్ విషయాలు, మామూలు విషయాలు మాట్లాడుకున్న
తరువాత వెళ్ళడానికి లేచాడు. అతను వెళ్ళడం ఆడపిల్లలు లోపలికి రావడం
ఒకేసారి జరిగింది. ఎక్కడకు వెళ్ళారురా కరెంట్ పోతే వస్తుండగానే
అడిగారు అత్తయ్యగారు.
మేము వచ్చి చాలా సేపయింది. రమ్య వాళ్ళింట్లో కొంచెం సేపు కూర్చొని
వస్తున్నాం అన్నారు.
రాత్రి భోజనాలు అయిన తరువాత రేపు రాత్రికి బయలుదేరుదామని
అనుకుంటున్నాము మళ్ళీ ఎల్లుండి నుండి ఆఫీస్ కు వెళ్ళాలి కదా
అన్నారు వదినగారు.
రాకేష్ తల్లిదండ్రులతో మాట్లాడతామన్నారు కదా అడిగారు అత్తగారు.
దగ్గరలో మంచి రోజులు లేవు కదా. మంచి రోజయితే విషయం కదపండి మేము
వచ్చి మాట్లాడతాం అన్నయ్యగారు అన్నారు.
పోనీ వీణను నాలుగు రొజులుంచి వెళ్ళండి తను ఉద్యోగంలో చేరడానికి
ఇంకా టైం వుంది కదా అన్నాను. దానిష్టం అని పిలిచి అడిగారు. తను ఏదో
చెప్పేలోపే నాలుగు రోజులుండి వెళ్ళవే మళ్ళీ పెళ్లయితే కుదరదుగా
అన్నారు అత్తగారు. ఏమనుకుందో సరేనంది. మరునాడు వాళ్ళు
వెళ్ళిపోయారు.
(సశేషం)
|
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది
పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ
తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please
keep comments relevant.)
|
 |
Copyright ® 2001-2009 SiliconAndhra. All
Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|