స్వర్ణ

                                                      - గోరంట్ల వెంకటేష్ బాబు

  ఇసుకలో కూర్చుని ఆడుకుంటున్న స్వర్ణకి వాళ్ళ నయిన తూలతా ఇంటికి వెళ్ళడం కనిపించింది. రోజూ ఆయన ఇలానే ఇంటికి రాడం ఆ అమ్మాయికి నచ్చడం లేదు. తనతో పాటు ఆడుకునేటోళ్ళు ‘మీ నాయినెందుకే ఆయిధంగా తూలుతున్నాడని అడగతాంటే కోపం వస్తోంది. వాళ్ళమ్మని నాయినెందుకు ఆయిధంగా తూలుతూ ఇంటికి వస్తున్నాదని అడుగితే సమాధానం చెప్పడం లేదు. ఈ రోజు ఎట్లాగైనా నాయినెందుకు ఆయిధంగా తూలతా ఇంటికొస్తున్నాడని తెలుసుకోవాలని చేతిలో ఉన్న ఇసుకను పక్కనాడేసి,దులుపు కుంటూ ఇంటికెళ్ళింది.

‘ఏయ్..దోశ కావాలి’ అంటూ స్వర్ణ నాయిన వాళ్ళమ్మ రేవతిని అడుగుతున్నాడు. లుంగీ ఎగ్గట్టుకుంటూ. ఆయనప్పటికే ఫూటుగా తాగేసున్నాడు. మాతమ్ముడి చొంగ కారతా ఆడి బట్టలు బాగా మాసిపోయున్నాయి. కాల్లకి సెప్పులు లేవు.

‘మద్దానం పూట దోశయాడ్నుంచి వస్తాది’ . అన్నం తిని గమ్మునుండు అంది రేవతి. యేయ్ ఉదయాన బైటకి పోయేటప్పుడు మద్దానం ఇంటికొచ్చే సరికి నాకు దోసెలు సిద్ధంగా ఉండాలని సెప్పినానా లేదా ఏం ఇంటి పెద్దా సెప్తే ఆ మాత్రం లెక్కే లేదా?

‘ఆ! ఇంటిపెద్ద..డబ్బులు నీయమ్మ మొగుడు దగ్గరున్నాయ్. దోసెలు వేయడానికి. పది రోజుల నుంచి పనికి పోయినావా అసలు నువ్వు రోజూ తాగడం, రాడం గొడవెట్టుకోవడం తప్పితే..

‘యేయ్ తోలుతీత్తా నాకెదురు మాట్లాడితే. నే తాగేదానికి మీ యమ్మాళ్ళింట్లో నించేమన్నా డబ్బులు తెస్తున్నావా ఏంది అన్నాడు రంగ’. పక్కగా గుంజకానుకుని తన అమ్మా, నాయినా మాట్లాడుకుంటున్నదంతా వింటున్న స్వర్ణని రంగా పిలిచి ‘నాయినా అగ్గిపెట్టి తేపో బీడీ కాల్చుకుంటా’ అన్నాడు.

స్వర్ణ ఇంట్లోకెళ్ళి పోయికాడా కిరసనాయలు డబ్బా పక్కనున్న అగ్గిపెట్టి తెచ్చిచ్చింది. అవునమ్మా నువ్వు మద్దానం పూట ఇంటికాడున్నావ్ ఏంది తల్లి? బడికిపోలేదా? అనడిగాడు.

రేవతి కలుగజేసుకుని ‘ఆ బాగా గుర్తొచ్చింది అయ్యకి. వారం రోజుల్నుంచి చెప్తానే ఉండా. బళ్ళో ఫీజు కట్టలేదని పిల్లని ఇంటికి పంపేశారని. ఇప్పటికీ నాలుగునెల్ల ఫీజు బాకీ ఉందంట. అది కడితేనే
గానీ రానిచ్చుకోనన్నారు మేడం. అని సెప్తా ఉంటే సిగ్గు లేకుండా బడికెళ్ళలేదమ్మా అని అడుగుతున్నావే’

నాకు సిగ్గులేదు సరేలే. ఉంగరం తాడో తాకట్టు పెట్టి బడి ఫీజు కట్టేద్దాం. పోయిన సారి ఇలాగే ఇంటికెప్పేపిస్తానని నా దండ తీసుకెళ్ళి తాకట్టుఎట్టినావ్. కానీ ఇంతవరకు కప్పెయించలా. ఇప్పుడు మళ్ళీ నీ మాటల్నమ్మి ఉంగరం ఎట్టా ఇస్తాననుకుంటున్నావ్. ఏం కాదు అదిప్పుడు బడికెళ్ళపోతే. అంతగా కాకపోతే నాతో పాటు పనికొస్తాది. అని ఇంట్లనేకెల్లిపోయింది రేవతి. అప్పటికీ బాగా తాగున్న కైపులో ఉన్న రంగా వాకిట్లో యేసున్న మంచం మీదకి సేరాడు.

స్వర్ణ మారు మాట్లాడకుండా ఆడుకొనేదానికి ఇసుక దగ్గరికొచ్చేసింది. ఆరు సంవత్సరాల తనకి ఊహవచ్చినప్పట్నుంచి రోజూ ఇంట్లో పరిస్థితి ఇలానే ఉంది. ఏదో గొడవ జరుగుతూనే ఉంది. ఒక్కోసారైతే అమ్మను కొడుతుంటాడు కూడా. నాయిన ఊగ్గుంటా ఇంటికి రావడం తనింతవరకు చూల్లేదు. పనికి సరిగా పోడు. అమ్మ రేవతే పచ్చల్లు తయారు చేసే కంపెనీలో పనికిపోతాది. తాత, నాన్నమ్మ యిద్దరు రంగా వేసే చాష్టలకు తట్టుకోలేక దూరంగా ఉంటున్నారు.

ఇంతలో ఎదురింటి కనకమ్మ ఇంట్లో గొడవ మొదలైంది. సుట్టు పక్కనోల్లందరు ఆడికి సేరుకున్నారు. స్వర్ణ కూడా ఎల్లింది.

‘మా ఐదొందలడిగితే ఇచ్చేదానికి రోగం నీకు’ అన్నాదు హరి.
నా దగ్గర దమ్మిడి లేదురా ఏం సేత్తావో చేయ్ అంది కనకమ్మ.
నా డబ్బులు నాకిచ్చేదానికేమా ని కంత బాథ.
యాడ్నుంచి వొమ్మినాయయ్య నీ డబ్బులు. మాలేసి మూణ్ణెల్లు పనికిపోతావ్. అప్పుడు సంపాయించిందంతా దాపెట్టుకుని మాల తీసిం తర్వాత ఇలా తాగి తిరగతావ్. అంతా తీసుకెళ్ళి ఆ బాందీ సాపోల్లకి తగలేస్తుంటావ్’. స్వర్ణకి ఏం అర్ధం కావట్లేదు. కానీ ఒక్క విషయం తెలుస్తోంది. వాల్ల నాయినా రంగ ఊగుతూ మాట్లాడినట్టు హరి ఉన్నాడని. ఇంటర్ మొదటి సంవత్సరం వరకు సదివించి ఆపేశాడు హరి. వాల్ల నాయినకి బాగాలేకొచ్చిందని. ఇంట్లో జరుగుబాటు లేదని హరి చేత సదువు మాన్పించి కరెంటు పనికి పంపుతున్నారు. అప్పట్నుంచి రోజూ పనికెల్లి ఇంట్లో వాల్లకి చేదోడు, వాదోడుగా ఉంటూ ఉన్నాడు హరి. అయితే, మద్దలో తాగుడుకు అలవాటుపడి బాగా మారిపోయాడు. పనికిబోవడం, సాయంత్రం వొచ్చిన డబ్బుల్తో పీకలదాగా తాకడం, దంతో బాగా యిసిగి పోయిన కనకమ్మ దేవుడి మాలేసుకొంటే తాగుడు మార్తాడని వేయించింది. మాల వేసుకొన్నన్ని రోజులు తాగ్గుండా. బాగా సంపాయించి ఆటిని దాపెట్టుకొని మాల తీసిం తర్వాత శివమెత్తతాడు హరి. రెండు, సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాడు. పెళ్ళి సేత్తే ఏమైనా మారతాడా అనుకొంటే పిల్లనిచ్చేదాంకి ఎవ్వరూ ముందుకు రాడం లేదు. అంతగా తాగుబోతు హరి పాపులరైపోయినాడు.

గొడవ అట్టానే సాగుతుండగా కాసేపటికి ‘నా దగ్గర్న ఈ వందే ఉంది సావు’పోరా దరిద్రుడా. ఏ లగ్గాన పుట్టావో గానీ యేపక తింటునావ్. నీ జీవాన పడి మేమంత యెంత బాధపడుతున్నామో తెలుసుకో లేకపోతే నాశనమైపోతావ్ అంటూ హరితో అంది.

సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటా వంద తిస్కొని బాందీ షాపు వైపుకి అడుగులేశాడు హరి. వొచ్చిన జనంలో సగం మంది ఇది రోజూ ఉండె గొడవేలే అని ముందుగానే యెల్లిపోయారు. మిగినోల్లు హరి యెల్లిపోయిం తర్వాత జరిగిందాని గురించి మాట్లాడుకుంటూ బైటికొచ్చారు. స్వర్ణ అక్కడ్నుంచి మల్ళీ ఇసుక దగ్గరకు చేరుకొంది. తనతో పాటు ఆడుకుంటున్న వాళ్ళందరికి కనకమ్మింట్లో ఏం జరిగిందో సెప్పింది. ఇంతలో ఆడికి పావని వచ్చింది. ఏడో క్లాసు సదువుతూ ఆ యీధిలో ఉండే స్వర్ణ ఈడు పిల్లలందరికీ లీడరుగా ఉంటోంది పావని. స్వర్ణ, మిగిలినోల్లు జరిగిందంతా సెప్పి ‘అసలెందుకు ఆల్లు అలా ఊగుతున్నారని’ పావనిని అడిగారు.

ఆళ్ళు తాగేది బాందీ. మా బడి పక్కన్నే, ఎదురుగా రెండు సాపులున్నాయి. రోజూ ఆడ చూసి చూసి నేను తెలుసున్నా అదేందో. ఉదయాన్నే ఎనిమిది గంటలకు మేం బడికెళ్తాం కదా. అప్పటికే తెరుసుంటాయి ఆ రెండు శాపులు. మా నాయిన కూడా అప్పుడప్పుడు ఆడ కనిపిస్తూ ఉంటాడు బాందీలో సీపు రేతుది అని రెండుంటాయంట అది తాగితే మత్తుగా యాడలేని బలం అంతా వచ్చేసుందంట. బళ్ళో పిల్లలు సెప్పుకుంటుంటే విన్నాను.

పావని మాటకు అడ్దుతగుల్తూ, అవునక్కా అది తాగితే మనిసి తొందరగా సచ్చిపోతాడంట నిజమేనా. మొన్న టీవీలో సూపించారు. అంది ఓయమ్మాయ్.

ఆ నిజమే మా ఫ్రెండు వాల్ల నాయినా అట్టాగే సచ్చిపోయినాడు. రోజూ తాగడం, పేకాడ్డం తప్తే ఆయనేం సేసేవాడు కాదు. అందుకే ఆల్ల ఆస్తితో పాటు ఆయన పోయాడు. ఇంకో విషయం ఏందంటే మొన్న మా బడి దగ్గరికి కొందరొచ్చి ధర్నా చేశారు. ఆ రెండు సాపులు కాకుండా ఇంకో సాపు పెడ్తున్నారని. అది పెడితే జనాలకి ఇంకా ఇబ్బందులు పెరుగుతాయని. దీని గురించి మా టీచరుని అడిగితే వివరంగా సెప్పింది. పావని మాటలు స్వర్ణ సెవికి యెక్కడం లేదు. ఇప్పుడామ్మాయి మనసులో తాగితే మనిషి తొందరగా చనిపోతాడు. మా నాయిన పరిస్థితి అంతే అని ఆలోచనలో ఉంది. నాయినకి తాగొద్దని సెప్పాలనుకుంది. ఇసుకలోంచి పైకి లేచి గబగబా ఇంటికి పెరిగెత్తింది.
రేవతి అంట్లు తోమతా ‘ఒసేయ్ ఏందా పరిగెత్తడం తిన్నగా రాలేవా? ఏం కొంపలు ముంచుకుపోతున్నాయిక్కడ’ అంది.
యమ్మో నాయినేడే?
ఇంకాడుంటాడు తాగడానికి పోయుంటాడు. ఇందాకే నన్ను పీడించుకుతిని యాభై రూపాయలు పట్టకపోయాడు. అవును ఆయనతో నీకేం పనే?
ఊరకనే,
సరేలే, ఈ తోమిన అంట్లు తీసికెళ్ళి ఇంట్లో పెట్టు
వాళ్ళ నాయన రంగా కోసం ఎదురు చూస్తు రేవతి సెప్పిన పని చేస్తోంది స్వర్ణ. చీకటిపడింది. రేవతి అన్నం తినమని బతిమలాడుతున్నా నాయినొచ్చింతర్వాతే తింటానే అంటోంది స్వర్ణ. కాసేపటికి రంగా వచ్చాడు. ఒంటి మీద లుంగీ సరిగా లేదనే స్పృహ లేనంతగా తాగేసున్నాడు. రాగానే ‘యేయ్ నాకు దోసె కావాలి’ అని మొదలెట్టాడు.
‘ఈ దొంగ సచ్చినోడు మల్ళీ మొదలెట్టాడబ్బా’ అనుకుంటూ బయటికొచ్చింది రేవతి.
అన్నం పెడ్తా తిని గమ్ముగా పొడుకో యిసిగించకుండా.
నే తిన్ను. నాకు దోసె కావాలంతే..
అయితే గమ్ముగుండు మేం తిని పొడుకుంటాం. అని స్వర్ణని ఇంట్లోకి లాక్కెల్లింది రేవతి యిసురుగా.
తూలుతూ రేవతి వెనక్నే ఇంట్లో కెల్లాడు రంగా. ఏమ్మే నా మాటంటే నీకంత లెక్కలేని తనం’ అంటూ అన్నం కుండ నేలకేసి కొట్టాడు. తాగితే తొందరగా సచ్చిపోతారు నాన్నా అని రంగాకి సెప్పాలని ఎదురుచూస్తున్న స్వర్ణ నివ్వెరపోయింది ఒక్కసారిగా.

మమ్మల్నైనా సంపు, లేకపోతే నువ్వైనా సావు అంది రంగతో రేవతి. గొడవ మొదలైంది. ఇది రోజూ ఉండేదేలేబ్బా అని సుట్టుపక్కనోళ్ళు ఎవ్వరూ రాలేదు. రేవతిని రంగా కొట్టడం స్వర్ణ చూస్తోంది. దెబ్బలకు తాళలేక రేవతి ఎదురుతిరిగింది. నా మీదే ఎదురుతిరుగుతావా అంటూ పక్కనే ఉన్నస్ కూరగాయలు కోసే కత్తిపీటని చేతికందుకుని రేవతి మెడమీద ఒక్క యేటు వేశాడు రంగ.

అమ్మా, అంటూ నేలకొరిగిపోయింది రేవతి. రక్తం ఆమె ఒంటికంతా తడిపేసింది. కొద్ది క్షణాల్లోనే...
రంగా వెంటనే తేరుకుని కుండలో ఉన్న నీళ్ళతో చేతులు కడుక్కుని గబగబా అక్కడ్నుంచీ బయటికెళ్ళిపోయాడు.

స్వర్ణ అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయింది. కాసేపటి తర్వాత కిరసనాయలు కావాలని రేవతిని అడిగేందుకు ఆడికొచ్చిన ఎదురింటి సుమతికి దారుణమైన దృశ్యం కనిపించింది. వెంటనే కేకలేస్తూ రోడ్డు మీదకొచ్చి అందరికీ సెప్పింది. జనం అంతా ఆడకి చేరుకున్నారు. పోలుసులకి కబురుచేశారు. విరికంటే ముందు మీడియా వాళ్ళక్కడికి చేరుకుని భార్యను చంపిన తాగుబోతు, మహిళ దారుణ హత్య, మధ్యం మిగిల్చిన విషాదం అని ఎవరికి నచ్చిన రీతిలో వారు స్క్రోలింగులు పెట్టినారు. పోలీసులు వచ్చారు. దర్యాప్తు మొదలుపెట్టారు. రంగా, రేవతి అమ్మా, నాయినలకి కబురు పెట్టారు. అయితే వారిలో రేవతి అమ్మా, నాయినే ముందుగా వచ్చారు. తమబిడ్డ రక్తపు మడుగులో పడుంటడం చూసి పెద్దగా ఏడుపు మొదలు పెట్టారు. అన్నాయంగా నా బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు యెదవ. ఇక స్వర్ణమ్మకి దిక్కెవరు తండ్రీ అంటూ..
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech